ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పు ఈ సారి విలక్షణం సూచిస్తున్నది. ఎందుకంటే ఇద్దరు ముఖ్య మంత్రులు ఓటమి చెందడం. ఆయా రాష్ట్రాల్లో వారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పిన సర్వేలు తారుమారు కావడం విశేషం. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో దాదాపు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి. కేరళలో వామపక్షాలు తమ చివరి రాష్ట్రంలో అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ కు(యూ.డీ.ఎఫ్.) కేరళ గెలుపు ఊపిరి పోసింది.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మాత్రం ప్రజాతీర్పు విలక్షణంగా ఉంది. అధికార పార్టీల కంచుకోటలు బద్దలయినాయి. తమిళనాడులో సినీ నటుడు, దళపతి జోసఫ్ విజయ్ పార్టీ టీవీకే(తమిళగ వెట్రి కళగం) సంచలనాలు సృష్టించింది. కొళత్తూరు నియోజకవర్గంలో డీఎంకె అధినేత స్టాలిన్ ని వీఎంకె. పార్టీ అభ్యర్థి, మాజీ డీఎంకే సభ్యుడు వి.ఎస్. బాబు ఓడించాడు. టీవీకే పార్టీ 107 స్థానాలు సాధించి మ్యాజిక్ ఫిగర్ కు 11 సీట్ల దూరంలో నిలిచింది. విజయ్ రెండు స్థానాల్లో గెలిచారు. అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీగా టీవీకే నిలిచింది. పార్టీ స్థాపించి రెండేళ్ళయినా, రాజకీయాలకు 17 ఏళ్ళ క్రితమే విజయ్ శ్రీకారం చుట్టారు. తన అభిమాన సంఘాలను ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పేర 2011లో అన్నాడీఎంకేకు మద్దతు ప్రకటించారు. ప్రజానాడి ఎలా ఉంటుందో పరీక్షించారు. దాని ఫలితమే 2021 నాటి స్థానిక ఎన్నికల్లో మక్కల్ ఇయక్కమ్ సభ్యులు పాల్గొని విజయఢంకా మోగించారు. ఆ తర్వాతే రాజకీయ పార్టీ ప్రకటించారు. అలాగే కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మందికీ విజయ్ కోటి రూపాయలు, అలాగే, క్షతగాత్రులకూ ఆర్థిక సహాయం చేయడంతో వారు అండగా నిలిచారు. అధికార పార్టీ డీఎంకే ఎన్ని అవాంతరాలు కల్పించినా, కరూర్ సభ విషాదాన్ని తట్టుకుని విజయ్ ధైర్యంగా ప్రజలలోకి వెళ్ళగలిగారు. కాని ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చెయ్యలేక పోయారు. 234 నియోజకవర్గాలున్న తమిళనాడులో కేవలం 36 నియోజకవర్గాలలోనే ప్రచారం చెయ్యగలిగారు. అదే సమయంలో భార్య విడాకుల నోటీస్ ఇచ్చింది. అయినా ప్రజలు విజయ్ ని నమ్మి, ఆయన ఇచ్చిన హామీలను నమ్మి గెలిపించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికీ ఆరు గ్యాస్ సిలిండర్లు, నిరుపేద యువతి పెళ్ళికి ఎనిమిది గ్రాముల బంగారం, ఆడబిడ్డ భద్రతకు ఖాతాలో రూ.2500 తదితరాలను ప్రజలు నమ్మారు. రెండు ద్రవిడ పార్టీలపై విపరీతమైన అవినీతి, కుటుంబ పాలన ఆరోపణలు ఉన్నా, ప్రత్యామ్నాయం లేక గత 60 ఏళ్ళుగా ప్రజలు వాటినే ఎన్నుకుంటున్నారు. విజయ్ ప్రత్యామ్నాయం చూపడంతో ఆకర్షితులైనారు. నేటి ప్రతిపక్ష అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు పంచిన డబ్బులు తీసుకుని విజయ్ ను ప్రజలు గెలిపించారు. విజయ్ పార్టీ అభ్యర్థులు కేవలం వారి పార్టీ గుర్తు విజిల్స్ పంచారు. ప్రచారం కూడా అభ్యర్థులు విజయ్ కట్ అవుట్ లతో సాదాసీదాగా ఇంటింటి ప్రచారం చేసారు. విజయ్ మొదటే తన ప్రధాన ప్రత్యర్థి డిఎంకే అని, సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీ అని ప్రకటించారు. ఎంజీఆర్ మినహా సినీనటులు టి.రాజేందర్, విజయకాంత్, కార్తీక్, కమల్ హసన్ రాజకీయ పార్టీలు స్థాపించినా అధికారానికి ఆమడదూరంలోనే ఉన్నారు. ప్రజాభిమానం సాధించలేక పోయారు. ఎంజీఆర్ పార్టీ పెట్టి 33.5 శాతం ఓట్లు సాధించిన రికార్డ్ ను విజయ్ 36 శాతం సాధించి అధిగమించడం విశేషం. విజయ్ కు జెన్ జీ యూత్ పూర్తి మద్దతు ఇవ్వడం కూడా ప్రధానం. తెలుగు, తమిళనాట విజయ్ ని మావాడు అని కొందరు కులోన్మాదులు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. విజయ్ దళితుడు కాదు. తండ్రి చంద్రశేఖర్ క్యాథలిక్ క్రైస్తవుడు. తల్లి హిందువు. అసలు వారి వంశం, కులం వెల్లలార్. వీరిది తమిళనాడు, కేరళ, శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతంలో ఉన్న పురాతన భూస్వామ్య, వ్యవసాయ కులం. వీరు చోళ, పాండ్య, పల్లవుల కాలంలో యోధులుగా, పరిపాలనాధికారులుగా పేరు పొందారు. వీరి కులంలో అనేక ఉప కులాలు ఉన్నాయి. ఈ కులం వారు తమ పేర చివర పిళ్లై, మొదిలియార్, గౌండర్ పదాలు ఉపయోగిస్తారు. ఈ కులం వారు రాష్ట్ర జనాభాలో గణనీయంగా 33 శాతం ఉండడం విశేషం.

ఇంతకీ గెలిచిన ఆనందం నాయకులకు, కార్యకర్తలకీ లేకుండా గవర్నర్ అడ్డుపడడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తాత్సారం చేయడం విమర్శలకు తావిచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసింది. డీఎంకే నేత స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీ పాచికలను పారనీయకుండా టీవీకే పార్టీ మద్దతు కోసం తమ కూటమిలోని చిన్న పార్టీలను పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీలు విజయ్ కు ఏమైనా షరతులు పెట్టాయా అనేది తెలియలేదు. గవర్నర్ రాజ్యాంగం ప్రకారం అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీని ఆహ్వానించాలి. మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం, గడువు ఇవ్వాలి. కాని తమిళనాడు గవర్నర్ టీవీకే మెజార్టీ 118 సభ్యుల జాబితాతో రావాలని ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. టీవీకే పార్టీ అభిమానులు కార్యకర్తలు వెంటనే గవర్నర్ విజయ్ ను ఆహ్వానించాలని లోక్ భవన్ వద్ద ఆందోళనతో పాటు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఏఐఏడీఎంకే నేత అన్బళగన్ వంటి నాయకుల ప్రకటనలతో మరింత గందరగోళం ఏర్పడింది.

డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ పార్టీలు కలిస్తే టీవీకే సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని విజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అప్పటికే టీవీకేకు 5 సీట్లతో మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలోని వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ విజయ్ కు మద్దతు ప్రకటించాయి. చివరికి 120 మంది ఎమ్మేల్యేల మద్దతు లేఖలు విజయ్ గవర్నర్ కు సమర్పించడంతో ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చారు. ఆదివారం విజయ్ మరో తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణం చేశారు. విజయ్ మంత్రివర్గంలో ఒకప్పుడు జయలలిత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సెంగొట్టయ్యన్, స్టాలిన్ ఒకప్పటి అనుచరుడు ఆదర్శ అర్జున తప్ప సీనియర్లు లేరు. అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ ప్రజాధనం వృధా చేయను, దోచుకోను, ఇకపై మా ప్రభుత్వంలో పవర్ సెంటర్లు ఉండవన్నారు. డ్రగ్ రహిత రాష్ట్రంగా చేస్తానన్నారు. అలాగే అసాధ్యమైన హామీలు ఇవ్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు. ఇది అన్నివర్గాల, మతాల, కులాల సమ్మిళితమైన లౌకిక ప్రభుత్వంగా అభివర్ణించారు. మైనార్టీలకు, విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. అందరి విశ్వాసాలు కాపాడబడతాయన్నారు. ఇది కొత్త ఆరంభమన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళాభద్రత ఫైళ్లపై సంతకం చేయడం విశేషం. మహిళా భద్రతకు ‘షీ టీం’ తరహా వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. 60 ఏళ్ళ ద్రవిడ జెండా దిగి స్వతంత్ర జెండా ఎగరడం విశేషం. విజయ్ రాకతో తమిళనాట కొత్తయుగం ప్రారంభమైందని ప్రజలు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. తెలుగునాట ఎన్టీఆర్ గెలుపు సందర్భంగా ఏర్పడిన పరిస్థితి పాత తరం వారికి గుర్తుకు వచ్చినట్లయింది. మక్కల్ ఇయ్యక్కమ్ నేత ఆనంద్, సెంగొట్టయ్యన్, అర్జున, మాజీ ఐ.ఆర్.ఎస్. అధికారి తదితరులు విజయ్ వెనుక ఉండి విజయబాటలో నడిపించారు. ఫలితంగా వారు మంత్రులైనారు.

ఇక బెంగాల్ పరిస్థితి పరిశీలిస్తే ప్రజలు తిరస్కరించినా తాను సీఎం పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ పట్టుబట్టడం ప్రజాస్వామ్యంలో గర్హనీయం. ఎన్నికల కమిషన్ “సర్” ప్రక్రియ వల్ల బెంగాల్ లో 90 లక్షల ఓట్లు తొలగించారని మమత ఆరోపించారు. వారిలో మృతులు, ఆచూకి లేనివారు 63 లక్షల మంది ఉన్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మిగిలిన 27 లక్షలమంది అనుమానాస్పదంగా(చొరబాటుదారులు) ఉన్నారని ప్రకటించింది. మొత్తం 7.6 కోట్ల మందిలో 90 లక్షల మందిని తొలగించడంతో దాదాపు 90 నియోజకవర్గాలలో దాని ప్రభావం పడిందని, అందుకే తాము ఓడిపోయామని మమత ఆరోపించారు. రాజీనామా చేయకపోవడంతో అసెంబ్లీ రద్దు చేయడంతో ఆమెకు గౌరవ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి కూడా దక్కలేదు. ఎన్నికల ఫలితాలు బీజేపీ, దీదీ పార్టీ మధ్య హోరాహోరిగా ఉంటాయని సర్వేలు చెప్పినా బీజేపి ఆది నుంచి ఆధిక్యత చాటి బంపర్ మెజార్టీ సాధించింది. 200 సంఖ్యను దాటి తిరుగులేని మెజార్టీ సాధించింది. నందిగ్రాంలో 2021లో, భవానీపూర్ లో 2026లో మమతను రెండుసార్లు ఓడించాడు సువేందు అధికారి. ఈ సారి మమత 15 వేల ఓట్ల తేడాతో ఘోరపరాభవం పొందారు. 2021-26 మధ్య సువేందు అధికారి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా అసెంబ్లీ ఫలితాలకు సూచన అని భావించారు. రెండుసార్లు మమతను ఓడించడం సువేందు ముఖ్యమంత్రి పదవికి ప్రధాన అర్హతగా మారింది. సువేందు కృషితోనే బీజేపీ పార్టీ అంతింతై మహా ఇంతై అన్నట్లు నేడు అధికార పీఠం ఎక్కింది. నందిగ్రాం అల్లర్ల నుంచే దీదీ పార్టీ (టీఎంసీ) తృణమూల్ కాంగ్రెస్ పతనం ప్రారంభం అయింది. దీనికితోడు ఆర్జీకార్ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని హత్యాచారం కూడా ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఈ అత్యాచార నిందితులకు టీఎంసీ నాయకులు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆర్జీకార్ సంఘటన తనకు బాగా ఉపయోగపడేలా బీజేపీ బాధితురాలు తల్లికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అలాగే సందేశ్ ఖాలీ బాధితురాలు రేఖాపాత్రాను బరిలో నిలిపింది. మహిళా భద్రతపై బీజేపీ ప్రచారం తీవ్రం చేసింది. దక్షిణ బెంగాల్ లో టీఎంసీ కంచుకోటలోనూ బీజేపీ చొచ్చుకుపోయింది. బీజేపీ తన ప్రచారంలో చొరబాటులు, వలసలు, నిరుద్యోగం, అవినీతి తదితర అంశాలను ప్రజల ముందుకు బాగా తీసుకు వెళ్ళగలిగింది. 30 ఏళ్ళు అప్రతిహతంగా పాలించిన సీపీఎం పార్టీని ఓడించి రికార్డ్ సృష్టించిన మమత వారు చేసిన తప్పులే తాను చేసింది. బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఓటమి తరువాత తిరిగి లేవలేకపోయారు. టీఎంసీ పరిస్థితి అలానే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మమత 70 ఏళ్ళ వయస్సులో మళ్ళీ ఐదేళ్ళలో పార్టీని పునరుజ్జీవనం చేయడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ బెంగాల్ అసెంబ్లీకి 1982 నుంచి పోటీ చేస్తున్నది. 2021లో 77 స్థానాలు సాధించిన ప్రధాన ప్రతిపక్షం, 2026లో 293 స్థానాలున్న అసెంబ్లీలో 206 సీట్లతో అధికారం చేపట్టింది. లోక్ సభ ఎన్నికల్లో 1998లో తొలిసారి గెలిచింది. 1999, 2004 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీతో జతకట్టింది. 2019లో 18 లోక్ సభ స్థానాలు బెంగాల్ నుంచి గెలవడం విశేషం. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్ కు చెందినవాడే. ఆర్ ఎస్ ఎస్ నాయకుడు హెగ్డే వార్ కలకత్తాలో చదువుకున్నాడు. అయినా బెంగాల్లో బీజేపీ బలపడడానికి సుదీర్ఘకాలం పట్టింది. బెంగాల్ విజయంతో బీజేపీ ఖాతాలో దేశంలోని 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రంగా చేరింది. 17 చోట్ల సొంత ప్రభుత్వాలు బీజేపీకి ఉన్నాయి. మమతా బెనర్జీ ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీ స్థాపించి సీపీఎం పార్టీపై యుద్ధం ప్రకటించారు. చివరికి సాధించారు. కాని 15 ఏళ్ళ వరుస పాలనతో ఆమె కూడా అదే తరహాలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆమె చుట్టూ ఉన్నవారు అవినీతిపరులు కావడం, రౌడీయిజం పెరిగిపోవడంతో ఆమె సంక్షేమ పథకాలు ఏమాత్రం ఫలితమివ్వలేదు. చివరికి ఆమె వ్యక్తిగత ఓటమి అవమానభారంతో నిష్కమించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆమెను భరించలేక ముస్లింలు సైతం బీజేపీకీ ఓటు వేశారని వార్తలు వచ్చాయి. అలాగే ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన కమ్యూనిస్టులు కూడా మమతను ఓడించాలని బీజేపికి మద్దతు ఇచ్చారని తెలుస్తున్నది. ‘నేను బెంగాలీని, స్థానికురాలిని’, ‘బీజేపీ ఢిల్లీ పార్టీ’ అని ఆమె ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. మార్పువైపే మొగ్గు చూపారు.

తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఫలితాలు చూసైనా నాయకులు ఇకనైనా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. తాము ప్రజా సేవకులని మర్చిపోతే పతనం తప్పదని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ప్రజలు అమాయకులు కారు. అవకాశం ఇచ్చి చూస్తారు. కాని సద్వినియోగం చేసుకోకపోతే పతనం అంచున నిలబెడతారనే ఆలోచన నాయకులకు ఉంటే ప్రజాస్వామ్యం పదికాలాలపాటు పరిఢవిల్లుతుంది.