స్వరతరంగం… ‘వాసంత సమీరం లా’

స్వరతరంగం… ‘వాసంత సమీరం లా’

30 ఏళ్ళ క్రితం టీవీ ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన ‘ఋతురాగం’….

వాసంత సమీరంలా…
నునువెచ్చని గ్రీష్మంలా…
సారంగ సరాగంలా…
అరవిచ్చిన లాస్యంలా…

ఒక శ్రావణ మేఘంలా…
ఒక శ్రావణ మేఘంలా…
శరచ్చంద్రికల కలలా…

హేమంత తుషారంలా…
నవశిశిర తరంగంలా…
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…
కాలం…జాలం. లయలో…కలల అలల సవ్వడిలో…

సాగే జీవనగానం…అణువణువున ఋతురాగం…
సాగే జీవనగానం…
అణువణువున ఋతురాగం…
వాసంత సమీరంలా…
నునువెచ్చని గ్రీష్మంలా…
సారంగ సరాగంలా…
అరవిచ్చిన లాస్యంలా….

నేపథ్యం:

1990ల చివరలో… సరిగ్గా 1997 – 2000 మధ్య కాలంలో బుల్లితెరపై ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ సీరియల్ టైటిల్ సాంగ్ వస్తోందంటే చాలు, ఇళ్లన్నీ నిశ్శబ్దమైపోయేవి. దూరదర్శన్ వేదికగా ప్రసారమైన ఆ కుటుంబ కథా ఇతివృత్తం, కోట్లాదిమంది హృదయాలను హత్తుకుంది. ముఖ్యంగా, “వాసంత సమీరంలా…” అనే ఆ నేపథ్య గీతం ఇప్పటికీ… అప్పుడు విన్నవారినే కాక, నేటి తరం వారిని సైతం తన్మయులను చేస్తూ, ఒక అలౌకిక ఆనంద లోకంలో విహరింపజేస్తోందన్నది అతిశయోక్తి కానే కాదు.

అసాధారణమైన కథాబలం, పాత్రధారుల అత్యంత సహజమైన నటన ఈ ధారావాహికకు అసలైన సంపద. ఒకటా, రెండా… ఏకంగా నాలుగు సంవత్సరాలపాటు ప్రేక్షకులను తన కథాగమనంతో మంత్రముగ్ధులను చేసిందీ కార్యక్రమం. దూరదర్శన్ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి, ఆనాటి వీక్షకుల మనసుల్లో చెరిపేయలేని ముద్ర వేసిన అద్భుతమైన సీరియల్స్ లో ‘ఋతురాగాలు’ ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది.

నిర్మాణం - దర్శకత్వం:

ఈ మెగా సీరియల్‌కు కర్త, కర్మ, క్రియగా నిలిచి, దీనిని నిర్మించి, దర్శకత్వం వహించారు మంజుల నాయుడు, సుధాకర్ పల్లమాల.

కథాంశం:

ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కలం నుండి జాలువారిన అద్భుత నవల ‘మౌనరాగాలు’ ఈ సీరియల్‌కు మూలాధారం. వయసు , అనుభవం రీత్యా చిన్నవారైన ఈ జంటను సీరియల్ తీయమని ప్రోత్సహించి తమ నవల ఇచ్చి పంపారట యద్దనపూడి సులోచనారాణి.

విశ్లేషణ:

ఈ దర్శకుల తొలి విజయం ఒక చక్కటి కుటుంబ నేపథ్యం ఉన్న కథను ఎన్నుకోవడంలోనే ఉంది. పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలను వారు తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. కథలోని పాత్రలు పండేలా, ఆయా నటుల నుండి అత్యుత్తమ నటనను వారు రాబట్టుకున్న తీరు ప్రశంసనీయం.

దీనిలో పనిచేసిన నటులు, సాంకేతిక సిబ్బంది అనంతర కాలంలో వారి వారి రంగాలలో ఎంతగానో రాణించారు.

ఇంతమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను సమన్వయం చేసుకుంటూ, ఆర్థికపరమైన విషయాలను చూసుకుంటూ, తమ దర్శకత్వ ప్రతిభతో బుల్లితెరపై దీనిని ఒక మధురకావ్యంగా మలిచారు మంజులా నాయుడు, సుధాకర్ గారులు. వీక్షకుల గుండెల్లో ఒక అపురూప జ్ఞాపకంగా, ఆపాతమధురంగా ఈ సీరియల్‌ను నిలిపిన వీరు ఇద్దరూ ఎంతో అభినందనీయులు.

తరువాత వారు ఎన్నో మంచి సీరియల్స్ ని అందించారు. అన్నీ ప్రేక్షకాదరణ పొందటం విశేషం.

శీర్షికా గీతం:

582 భాగాల ఈ ధారావాహిక దూరదర్శన్ ఛానెల్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం ప్రతిరోజు 4:30కు ప్రసారమయ్యేది. ఒక 17–20 నిమిషాలు నడిచిన ఆ సీరియల్ శీర్షికా గీతంతో ప్రారంభమయ్యేది. ప్రారంభపు సంగీతమే శ్రోతలను సమ్మోహితులను చేసేది.

ఝం…తన నం…తననం
ఝం…తన నం…తననం
అ…ఆ…ఆ…
అ…అ. అ అ అ…అ

అంటూ ప్రారంభమైన ఈ పాట ఆలాపనే ఒక రసానుభూతిని కలిగించేది. వీక్షకుల భౌతిక దృష్టిని నిలువరించి, ఒళ్ళంతా చెవులు చేసుకునేటట్టు చేసి, ఓ ఆనందాంబుధిలో ఓలలాడించేది…

తరువాత సాగే….

వాసంత సమీరంలా…
నును వెచ్చని గ్రీష్మంలా….

ఆనంద తరంగాలమీద పయనింప చేస్తుంది. ఆ పాట సాహిత్యం చాలా మందికి ధారణ అయిపోయింది. అందరూ పాడుకునే వారు.

స్వర కర్త: బంటి, రమేశ్

అంతటి విశేష ప్రాచుర్యం పొందిన గీతానికి స్వర కర్త …శ్రీ బంటి. సంగీతం బాగా నేర్చుకున్నారు.

ఆయనకు తల్లి ప్రాథమిక గురువు. ఆవిడ చెల్లెలు…అంటే బంటి గారి పిన్ని మనోరమ గారు…ఈ ఇరువురి ప్రభావం బంటి గారిపై ఎంతో ఉంది. ఈ ఋతురాగాలు సీరియల్ కి సంగీతం సమకూర్చే అవకాశం కోసం శ్రీమతి మంజులా నాయుడు నుంచి కబురు రాగానే, తన మార్గదర్శి శ్రీ బలభద్ర పాత్రుని మధు గారు రాసిన ఈ వాసంత సమీరం లా…అన్న గీతానికి, బాణి కట్టి, ఆవిడను కలిసి వినిపించారు.

ఆవిడకు వెంటనే నచ్చింది. అయితే….చాలా మందికి నచ్చలేదు. కారణం…శాస్త్రీయ సంగీతంలా ఉందనే భావన. అయితే మంజుల గారు వెనుకంజ వెయ్యలేదు. ఈ పాట బాణి వైపే మొగ్గారు. అన్ని పురిటి నొప్పులు పడిన తరువాతే ఆ గీతం ఊపిరి తీసుకుంది. ఆపాతమధురమైంది.

ఈ గీతాన్ని శ్రీ బంటి శుద్ధ సావేరి… రాగంలో బాణి కట్టారు. చెయ్యటానికి వీరికి అరగంట కూడా పట్టలేదట. బంటి గారి ప్రథమ శ్రోత వారి తల్లి. ఆవిడకు నచ్చటంతో, పిన్ని డి. మనోరమ గారి దగ్గరకు వెళ్లారట. ఆవిడ సంగీత విదుషీమణి. ఆవిడకూ బాగా నచ్చింది. అంతే అది సీరియల్ కు ఎంపికై ఒక గొప్ప పాటగా నిలిచి పోయింది.

ఈ అద్భుత గీతావిష్కరణలో శ్రీ ఆశీర్వాద్ కీబోర్డ్ ప్లేయర్‌గా పోషించిన పాత్ర కూడా విశేషమైనది. హిందూస్థానీ సంగీత మూలాలతో సాగే ఈ గీతం ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. దీనికి నిరంతరం పెరుగుతున్న వీక్షణలు, లైక్స్ రూపంలో శ్రోతలు వ్యక్తం చేస్తున్న ఆదరణ—ఈ గేయం చిరంజీవత్వానికి ప్రబల నిదర్శనం.

Hats off to the great duo…Sri Banti and Madhu.

ఆ తరువాత ఇద్దరూ కలసి, విడివిడిగానూ ఎన్నో టి.వి. సీరియళ్ళ కి అద్భుత సంగీతాన్ని, గీతాన్ని అందించారు.

గానం:

శ్రీ బంటి తన చెల్లెలు అలకనందతో పాడిద్దామని అనుకున్నారట. కానీ, ఆమెకు వివాహమై వేరొక చోటుకి వెళ్ళిపోవటంతో, ఆ అవకాశం సునీత గారికి దక్కింది.

సీరియల్ లో మనం విన్నది ఆమె పాడిందే. సుమారు వంద ఎపిసోడ్ల వరకు, సునీత గారి పాటే ఉంటుంది. ఆ తరువాత, బంటి గారు పాడింది కూడా కలిపారు.

ఋతురాగాలు శీర్షికా గీతం

సాహిత్యం:

మానవ ఆవిర్భావానికి ముందే ఎంతో సృష్టి ఉంది. ఎన్నో జీవులు ఉన్నాయి. మానవుడు తన ఆలోచనా శక్తి అనే వజ్రాయుధం వల్ల, భాషను కనుగొన్నాడు. ప్రకృతి మార్పులకు ముందు భయ పడినా, అర్థం చేసుకున్నాడు. ఆలోచన, భాష భావుకతను పెంచాయి. ప్రకృతి అందచందాలను ఆనందిస్తూ, ఋతువుల మార్పును, మానవ జీవితంలోని సుఖ దుఃఖాలకు అన్వయిస్తూ సాహిత్యం సృష్టి చేస్తున్నాడు. వ్యాస, వాల్మీ కాదులు, కాళిదాసు…ఇలా ఎందరెందరో…!

శ్రీ బల భద్ర పాత్రుని మధు ఈ గీతంలో చెప్పింది అదే.

గీత రచయిత చిరు పరిచయం:

శ్రీ బలభద్రపాత్రుని మధుసూదన గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, చినగాదెలవర్రు గ్రామంలో జన్మించారు. హైదరాబాద్ లోని వివేకవర్ధని కాలేజీలో బి.ఎస్.సి. చదివారు. వారి సాహిత్యాభిరుచి, అభినివేశం ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ ఇంగ్లీషు లిటరేచర్ చేయించింది.

చక్కని, చిక్కని కవిత్వం రాస్తారు. వందకు పైగా సీరియల్స్ కి పాటలు రాసారు.

‘బుతురాగాలు’ టి.వి. సీరియల్ టైటిల్ సాంగ్‌కు 2000 సంవత్సరంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం లభించింది.

పత్రికలు, రేడియో, టి.వి. ఛానళ్ళు, సినిమాల ద్వారా సంగీత ప్రపంచానికి పరిచితులు. ప్రణతి సంకలనం తొలిరచన, ప్రత్యూష సంపుటి వీరి మలి రచన.

ఈ వాసంత సమీరంలా…. అన్న గీతంలో ఋతువుల మార్పును, ఆ వాతావరణాన్ని, మనిషి జీవితంతో పోలుస్తూ ఎంత భావుకతతో అందంగా ఎలా చెప్పారో చూడండి.

గొప్ప సమన్వయం:

వాసంత సమీరంలా… నును వెచ్చని గ్రీష్మంలా…” అంటూ ఆరంభమయ్యే ఈ గేయం, జీవితాన్ని ప్రకృతి ఋతువుల రూపకాల ద్వారా అనుభూతి పరంగా ఆవిష్కరించిన సున్నితమైన కవితాత్మక స్వరరాగం. ఇందులో కవి కేవలం కాలచక్రాన్ని మాత్రమే చిత్రించలేదు; మనిషి అంతర్ముఖ అనుభవాల్ని, భావోద్వేగాల్ని, జీవనయానంలోని మృదుత్వాన్నీ, మార్పులనూ ఋతువుల రూపంలో దర్శింపజేశాడు.

“వాసంత సమీరంలా” అనే ఉపమానం జీవితం యొక్క సరికొత్త ఆరంభాలను, ఉల్లాసాన్ని, సుకుమారమైన ఆశలని సూచిస్తుంది. వసంతపు గాలి ఎలా మనసును మృదువుగా తాకుతుందో, జీవితం కూడా కొన్ని సందర్భాల్లో అంతే సాంత్వనకరంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

వెంటనే వచ్చే “నును వెచ్చని గ్రీష్మంలా” అన్న పాదం, వేడి ఉన్నప్పటికీ దానిలోని మృదుత్వాన్ని గుర్తు చేస్తుంది. గ్రీష్మం అంటే కేవలం దహనం కాదు; అది పరిపక్వతకు, అనుభవానికి, జీవనసత్యాలని అంగీకరించే అంతరబలానికి కూడా ప్రతీక.

“సారంగ సరాగంలా… అరవిచ్చిన లాస్యంలా…” అనే పాదాలలో సంగీతం, నృత్యం, సౌందర్యం— అన్నీ కలిసిపోతూ ఒక కవితాత్మక అనుభూతిగా మారిపోతాయి.”

“సారంగ” అనే పదం సంగీత వాయిద్య స్వరానుభూతిని జ్ఞాపకం చేస్తూ, గేయమంతటా విస్తరించిన రాగాత్మక భావ ప్రవాహానికి ప్రతీకగా నిలుస్తుంది. “లాస్యం” అనే పదం స్త్రీ సౌందర్యభరిత నాట్యాన్ని గుర్తు చేస్తూ, జీవితంలోని కోమలత్వాన్నీ, సృజనాత్మక చైతన్యాన్నీ ప్రతిబింబిస్తుంది. ఈ రెండు కలిపి జీవితం ఒక కళాత్మక ప్రవాహమని కవి సూచించాడు.

“ఒక శ్రావణ మేఘంలా… ఒక శ్రావణ మేఘంలా…” అన్న పాదాలలో శబ్ద సామ్యంతో అద్భుతమైన భావ సూక్ష్మత కనిపిస్తుంది. “శ్రావణ మేఘం” వర్షానందాన్ని అనుభూతులను, హృదయాన్ని తడిపే స్వరాలను సూచిస్తుంది. “శరశ్చంద్రికల కలలా” అనే ఉపమానం మనసులో వెన్నెలలా పరచుకునే ప్రశాంతతను, నిర్మలమైన స్వప్నసౌందర్యాన్ని సూచిస్తుంది.

“హేమంత తుషారంలా… నవశిశిర తరంగంలా…” అన్న పాదాల్లో చల్లదనం, నిర్మలత్వం, నిశ్శబ్ద సౌందర్యం వ్యక్తమవుతాయి. జీవితం ఎప్పుడూ ఉత్సాహభరితమే కాదు; కొన్నిసార్లు అది నిశ్శబ్ద ధ్యానంలా, అంతర్ముఖ పరిశీలనలా కూడా మారుతుంది. ఈ పాదాల్లోని మౌన సౌందర్యం మనిషి అనుభవ జీవితంలోని లోతైన ప్రశాంతతను సూచిస్తుంది.

చివరగా “కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం…” అనే పంక్తులు ఈ గేయానికి హృదయం వంటివి. కాలం తన సహజ లయలో సాగుతుంటే, మన కలలు అలల్లా ఉప్పొంగుతాయి. ఆ ప్రయాణమే జీవితం. ప్రతి అణువులోనూ ఒక ఋతువు ఉంది; ప్రతి అనుభవంలోనూ ఒక రాగం ఉంది అనే తాత్త్విక భావన ఈ గేయంలో సున్నితంగా ప్రతిధ్వనిస్తుంది.

అంతేకాదు, ఈ గేయంలోని ప్రతి రూపకం కేవలం అలంకారప్రాయమైన పదచిత్రణగా నిలవకుండా, జీవన తత్త్వాన్ని అనుభూతి స్థాయికి చేర్చే ఆధ్యాత్మిక స్పర్శను కూడా కలిగి వుంది. ఋతువులు ప్రకృతిలో ఎలా పరస్పర విరుద్ధ స్వభావాలను సమన్వయ పరుస్తాయో, మనిషి జీవితం కూడా ఆనంద–విషాదాలు, ఆశ–నిరాశలు, ఉత్సాహ–నిశ్శబ్దాల మధ్య అటువంటి సమన్వయ యాత్రగానే పరిణమిస్తుందని కవి సూచించాడు. ముఖ్యంగా గేయంలోని పద సౌందర్యం, శబ్ద మాధుర్యం, లయాత్మక ప్రవాహం పాఠకుని మనస్సులో ఒక సంగీతానుభూతిని కలిగిస్తాయి. ప్రతి పాదం ఒక స్వరతరంగంలా హృదయాన్ని తాకుతూ, చదివిన తరువాత కూడా చాలాసేపు అంతరంగంలో ప్రతిధ్వనిస్తుంది.

ప్రకృతి, సంగీతం, నాట్యం, కాలం—ఈ నాలుగింటినీ సమన్వయ పరుస్తూ జీవితం అనే అనంత అనుభూతిని మధురమైన కవిత్వంగా మలిచిన అరుదైన సాహిత్య సృష్టిగా ఇది నిలుస్తుంది. అందుకే, ఈ గేయం సాధారణ గేయరచన స్థాయిని దాటింది.

జీవనానుభూతుల్ని ఋతురాగాల రూపంలో ఆవిష్కరించిన ఒక సౌందర్యాత్మక తాత్త్విక కావ్యఖండికగా పాఠక హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఈ ‘మధుగీతం ’ ఒక అపరంజి ముద్ద. దాన్ని కరిగించి, పుటం పెట్టి, సన్నని స్వర్ణతీగలుగా మలిచారు శ్రీ బంటి. ఆ తీగలలో అక్షరాలను, సాహిత్యాన్ని వజ్రవైడూర్యాల్లా పొదిగి, ఆ గీతాన్ని ధగధగ మెరిసే అపూర్వ స్వరాభరణంగా తీర్చిదిద్దారు.”

ఇది ఆయన సంగీత ప్రస్థానానికి చిరునామాగా నిలిచిన గీతం.

బొడ్డపాటి చంద్రశేఖర్