ప్రపంచానికి వేల సంవత్సరాల పూర్వమే జ్ఞానం పంచిన నేల ఇది. భారతదేశం జ్ఞాన సంపన్నుల నిలయం. మేథో సంఘర్షణలలో మేటి. వర్తమానంలోనూ వారి వారసులను మనం నేడు గుర్తించవచ్చు. ప్రపంచంలోని అత్యధిక కంపెనీల సీఈవోలు భారతీయులే. వారి సారథ్యంలోనే ఆయా సంస్థలు లాభదాయకంగా నడుస్తున్నాయి.

ఎందరో మహానుభావులు. అందులో ఒకరి ముందుచూపు, చక్కటి ప్రణాళిక నేటి విజయానికి పునాది. ఆయన వారసత్వం కొనసాగిస్తూ, కలలను నిజం చేసిన శాస్త్రవేత్తల కథనమే ఇది.

మన దేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టులను సాగు, తాగునీటితో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి ధ్యేయంగా నిర్మించారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన వనరుగా బొగ్గు వాడేవారు. చాలామందికి ఒక విషయం తెలుసు. అదేంటంటే ఒకప్పుడు రైళ్లు కూడా బొగ్గుతో నడిచేవి. బస్సులూను. కాలక్రమంలో వచ్చిన సాంకేతిక విప్లవంతో విద్యుత్ కోసం అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సూర్యశక్తి, పవన మొదలగు పర్యావరణహితమైన ఇంధన వనరులు, హరిత శక్తి, క్లీన్ ఎనర్జీ వంటి వాటి ద్వారా కాలుష్య నివారణే లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ప్రధానంగా అణు కేంద్రాలపై ఆధారపడ్డాం.

అయితే అగ్రరాజ్యాలు విఫలమైన చోట, మనం పంథా మార్చి విభిన్న పద్ధతి ద్వారా విజయం సాధించాం. ఇది ఈ దేశ శాస్త్రవేత్తల అవిరళ కృషి ఫలితం. 70 సంవత్సరాలు అంటే ఏడు దశాబ్దాల క్రితం ఓ మహానుభావుడు కన్న కల నిజమైన తీరే ఈ కథనం. ఓర్పు, నేర్పు, భిన్న ఆలోచనలు దానికి తోడ్పడ్డాయి. ఇది భారతదేశానికే ప్రత్యేకం.

ఈ ఏడాది ఏప్రిల్ నెల 6వ తేదీ చాలా ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే అణశాస్త్ర పితామహుడు డాక్టర్ హోమి జహంగీర్ బాబా ముందు చూపుతో వేసిన పథక రచన నెరవేరిన రోజు ఇది.

పైన అణు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడ్డాం అని చెప్పుకున్నాం కదా! అవి నడవాలంటే ‘యురేనియం’ అనే ఇంధనం అవసరం. ఇక్కడే ఒక సమస్య ఉంది. మనదేశంలో సహజమైన యురేనియం నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. బహుశా 1% మాత్రమే.

అందుకే మనకు కావలసిన యురేనియం 70 శాతానికి పైగా విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిందే. అసలు యురేనియం అంటే…

  1. యురేనియం:- ఇది అపారమైన శక్తిని ఇచ్చే వనరు. దీనిని ‘U’ చిహ్నంతో సూచిస్తాం. ఇది ఒక రేడియో ధార్మిక భారలోహం. ఇది భూమిలో ఖనిజాల రూపంలో ఉంటుంది. ఇది వెండి- బూడిద రంగులో ఉండే సహజ సిద్ధమైన బలమైన లోహం. దీనిని వైద్యం - ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో వాడతారు. అణు విద్యుత్ కేంద్రాలలో, పారిశ్రామిక రంగాలలో విస్తృతంగా వాడతారు. అలాగే అణుబాంబుల తయారీ, రక్షణ రంగంలో వాడతారు.

ఒక చిన్న పరిమాణంలోని యురేనియం చాలా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. ఈ యురేనియం ఎక్కువగా కజకిస్తాన్‌లో ఉంది. అందుకే భారతదేశం ఇటీవల యురేనియం దిగుమతి కోసం దీనితో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. కెనడాలో 15 శాతం; ఆస్ట్రేలియాలో 12 శాతం; రష్యాలో 5 శాతం; అమెరికాలో 3 శాతం లభిస్తోంది.

ఒకవేళ విదేశాలతో మన సంబంధాలు దెబ్బతిన్నా లేదా అంతర్జాతీయ ఘర్షణల వల్ల లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల (ప్రస్తుతం మధ్య ప్రాచ్య దేశాల పరిస్థితులు చూస్తున్నాం) యురేనియం పంపడం ఆపేస్తే మనదేశంలో 50 శాతం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పైన పేర్కొన్న సమస్య ఇదే.

ఈ సమస్యను 1954 సంవత్సరంలోనే భారత అణుపితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గుర్తించారు. ఇక్కడే ఆయన ఆలోచన మరో ప్రత్యామ్నాయం గుర్తించింది.

మన దగ్గర లేని యురేనియం కోసం వేరే దేశాల మీద ఎందుకు ఆధారపడాలి? మన దగ్గర పుష్కలంగా ఉన్న ‘థోరియం’తో విద్యుత్ ఎందుకు తయారు చేయకూడదు? అని ఆ దిశగా ఆలోచనల తీవ్రత పెంచారు.

ప్రపంచంలోని మొత్తం థోరియంలో 1/4 వంతు అంటే 25% మన దగ్గరే లభ్యమవుతోంది. కేరళ, ఒడిస్సా సముద్ర తీరాలలో ఉన్న ఇసుక మామూలు ఇసుక కాదు! దాదాపు 700 సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే బహుశా వేల సంవత్సరాలకు పైగా విద్యుత్ ఇచ్చే అద్భుతమైన ఇంధనం అది!

ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ‘థోరియం’ను నేరుగా వాడి మనం విద్యుత్తు ఉత్పత్తి చేయలేం. దాన్ని మనకు విద్యుత్ ఇచ్చే ఇంధనంగా అంటే ద్రవ రూపంలోని ఇంధనంగా మార్చుకోవాలి. దానికోసం డాక్టర్ హోమీబాబా అప్పట్లోనే 3 దశల అణు ప్రణాళికని రూపకల్పన చేశారు.

70 సంవత్సరాల క్రితం ఆయన రూపొందించిన ఆ ప్రణాళికని, మన శాస్త్రవేత్తలు ఇప్పుడు అక్షరాల అమలు చేస్తున్నారు. వారికి మన అబ్దుల్ కలాం గారి మాటలు స్ఫూర్తి ఇచ్చి ఉంటాయి. ‘‘పెద్ద పెద్ద కలలు కనండి. వాటిని నెరవేర్చుకోండి- అప్పటివరకు విశ్రమించవద్దు’’ అని యువతరానికి ఇచ్చిన సందేశం ఎలా మర్చిపోగలం! ఆ ప్లాన్ వివరాలు తెలుసుకునే ముందు ‘థోరియం’ అంటే ఏమిటో తెలుసుకుందాం!

థోరియం:- యురేనియం కంటే సురక్షితమైనది. ఇది ప్రకృతిలో లభించే ఒక రేడియో ధార్మిక మూలకం లేదా లోహం. దీన్ని ‘Th’ చిహ్నంతో సూచిస్తాం. ‘నార్స’ ఉరుముల దేవుడైన ‘థోర’ పేరు మీద థోరియంకు ఆ పేరు వచ్చింది.ఇది గాలి తగిలితే నల్లగా మారుతుంది. వెండిలా మెరిసే మకిలి స్వభావం ఉన్న రేడియో ధార్మిక లోహం. ముఖ్యంగా అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగించగల సామర్థ్యం ఉన్న తెల్లటి లోహం. అంతేగాక విమానాల భాగాలు, కెమెరా లెన్స్ లలో వాడతారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికాలో లభిస్తుంది. యురేనియం కంటే నాలుగు రెట్లు అధికంగా శక్తిని ఇస్తుంది. ఇది తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది.

మొదటి దశ

ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న యురేనియంతో విద్యుత్ ని ఉత్పత్తి చేయడం, ఇది ఎప్పటినుంచో చేస్తున్నాం. కానీ ఇందులో యురేనియం మండిన తర్వాత ‘ఫ్లూటోనియం’ అనే ఒక వ్యర్థ పదార్థం (బై ప్రొడక్ట్) గా వస్తుంది. ఇక్కడ అసలైన కీలక దశ మొదలవుతుంది. ఇది ఒక మ్యాజిక్. ఇప్పుడు అసలు, ‘ఫ్లూటోనియం’ అంటే ఏమిటో తెలుసుకుందాం …

ప్లూటోనియం:- అత్యంత రేడియో ధార్మికత కలిగిన రసాయన మూలకం లేదా లోహం. దీన్ని ‘Ph’ చిహ్నంతో సూచిస్తాం. అణు ఇంధనం మరియు అంతరిక్ష నౌకలలో శక్తి వనరుగా వాడతారు. ఇది వెండి- బూడిద రంగులో ఉంటుంది. ఇది ప్రమాదకరమైన పదార్థం.

రెండవ దశ

మొదటి దశలో వచ్చిన ‘ప్లూటోనియం’ను ఇంధనంగా వాడి ఒక ప్రత్యేకమైన ‘రియాక్టరు’ను నడపాలి. అదే ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’. ఇది తాను వాడిన ఇంధనం కన్నా ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే దీన్ని ‘ బ్రీడర్’ అంటారు. ఈ ప్రత్యేక రియాక్టరులో థోరియంను పెడితే అది దాన్ని శక్తివంతమైన ‘యురేనియం-233’ అనే కొత్త అణు ఇంధనంగా మారుస్తుంది. అంటే థోరియంను ‘అన్ లాక్’ చేసే తాళం చెవిగా దీన్ని చెప్పవచ్చు.

ఇప్పుడు ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ అంటే ఏమిటో తెలుసుకుందాం.

ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్:- అంటే తెలుగులో వేగవంతమైన ఇంధన ఉత్పాదక పరికరం లేదా వేగవంతమైన ఉత్పాదక పరికరం. అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే, కొత్త అణు ఇంధనాన్ని (ప్లూటోనియం) పుట్టిస్తుంది. ముఖ్యంగా ‘థోరియం’ నిల్వలను ఉపయోగించుకొని అణు విద్యుత్‌ను తయారు చేయడంలో ఈ పరికరం చాలా కీలకం. అణు వ్యర్థాలను తగ్గించి ఇంధన సామర్థ్యాన్ని పెంచుతాయి.

అలాగే రియాక్టర్ అంటే కూడా తెలుసుకుందాం. రియాక్టర్ అంటే ప్రతిచర్య పాత్ర. అణు విద్యుత్ ఉత్పత్తిలో వాడతారు. అణుశక్తి కేంద్రం లేదా నియంత్రిత విచ్ఛితి పరికరం అంటారు. అణుశక్తి (న్యూక్లియర్ ఎనర్జీ)ని ఉత్పత్తి చేయడానికి లేదా రసాయన చర్యలను నియంత్రించడానికి ఉపయోగించే ఒక పెద్ద యంత్రం లేదా పరికరం.

రెండవ దశలో మనకు కావాల్సినంత యురేనియం- 233 తయారవుతుంది. తదుపరి మూడవ దశ ప్రారంభం అవుతుంది.

మూడవ దశ

ఈ మూడవ దశలో పూర్తిగా ‘థోరియం’ ఆధారిత రియాక్టర్లను నడుపుతారు. థోరియంను రియాక్టర్లలో వేస్తారు. అది విద్యుత్‌ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ ఇంధనాన్ని తయారు చేస్తుంది. ఇది ఒక అంతులేని చక్రం.

ఈ సంవత్సరము ఈ నెల అంటే ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడమే కాకుండా ఎప్పటికీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.

ఆ రోజు తమిళనాడులోని కల్పకంలో ఉన్న మన ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర’ మొదటిసారిగా క్రిటికాలిటీని సాధించింది. అంటే ఆ రియాక్టర్ ప్రాణం పోసుకుని తనంత తానుగా ‘శక్తి’ని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. దీంతో డాక్టర్ హోమీ బాబా కన్న కలలలో అత్యంత క్లిష్టమైన రెండవ దశ అధికారికంగా ప్రారంభమైనది. ఇప్పుడు మనం ‘ప్రోటోటైప్’ అంటే ఏమిటో చూద్దాం.

ప్రోటోటైప్:- అంటే మాతృక, నమూనా. మొదటి రూపం. ‘ప్రయోగ నమూనా’ అని కూడా అనవచ్చు. నిజ ప్రపంచంలో నిర్మించడానికి (అంటే ఒక స్థలంపై) ముందు మీకు చూపించడానికి ఆర్కిటెక్ట్ తయారు చేసిన సాధారణ నమూనానే ‘ప్రోటోటైప్’ అంటారు. ఈ నమూనాలు ప్రాజెక్టుల సమయంలో అనవసర ఖర్చును తగ్గించడానికి చాలా సహాయపడతాయి. అలాగే ఆలోచనలను సమీక్షించడం, లోపాలను గుర్తించడం మరియు డిజైన్ మెరుగుపరచడం కోసం చేసేది ప్రోటోటైప్.

ఇంక రెండవది క్రిటికాలిటీ అంటే…

క్రిటికాలిటీ:- ఒక అణు రియాక్టరు స్వీయ నిలకడ గల శృంఖల చర్యలను సాధించే స్థితిని ‘క్రిటికాలిటీ’ అంటారు. అత్యంత ప్రాముఖ్యత, కీలక, క్లిష్టత అని అర్థం. ఈ రియాక్టర్ నిరంతర విచ్ఛితి విశృంఖల చర్యలను నియంత్రిస్తోందని అర్థం.

ఈ విజయం ఎందుకంత గొప్పదో తెలుసా! ఎందుకంటే ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ ఈ సాంకేతిక ప్రగతి విషయంలో ఘోరంగా విఫలమయ్యాయి. అమెరికా ఈ టెక్నాలజీ కోసం 15 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి చివరకు చేతులెత్తేసింది. జపాన్ వాళ్ళ బ్రీడర్ రియాక్టర్ 1995లో సోడియం విడుదలై కాలిపోయింది. 15 సంవత్సరాలు తాత్కాలికంగా మూతబడింది. తర్వాత శాశ్వతంగా మూసివేశారు. ఫ్రాన్స్, జర్మనీ, యు.కె., ఇటలీ వీళ్ళందరూ ప్రయత్నించారు. కానీ ఇది చాలా ఖరీదైనదని, చాలా కష్టమైనదని, సాధ్యం కానిదని తమ ప్రయత్నాలు ఆపేశారు. కానీ భారతదేశం పట్టు వదలలేదు. “సాధన చేయుమురా నరుడా… సాధ్యం కానిది లేదురా” అన్న కవి వాక్యాలు గుర్తుంచుకొని భారత్ దృఢదీక్షను, శక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి కంకణం కట్టుకొని ప్రయత్నం కొనసాగించారు. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నట్లు మన వారి కృషి చివరికి ఫలించింది. అందుకే ఈ విజయం అంత గొప్పదైంది. “అపజయాలే జయాలకు నాంది” అన్నది నిజమైంది. మనం గెలిచి చూపించాం.

అమెరికా ఖర్చుపెట్టిన దాంట్లో 15వ వంతు కన్నా తక్కువ ఖర్చుతో అంటే కేవలం 8 వేల కోట్ల రూపాయలతో ఈ అద్భుతాన్ని సాధించాం. ఇతరులు అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేశాం. ఈ విజయంతో రష్యా తర్వాత ఈ సాంకేతికత కలిగి ఉన్న ప్రపంచంలోని రెండవ దేశంగా భారతదేశం అవతరించింది. ఇప్పుడు చెప్పండి. డాక్టర్ జహంగీర్ హోమీ బాబా ఏడు దశాబ్దాల క్రితం వేసిన ఒక ప్రణాళిక ఈరోజు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చిందో!

ఇప్పుడు కేరళ తీరంలోని ఇసుక కేవలం ఇసుక కాదు. అది రాబోయే 700 సంవత్సరాలకు పైగా బహుశా వేల సంవత్సరాలకు సరిపడా విద్యుత్‌ను ఇచ్చే అద్భుత ఇంధనం ఇది. ఇకపై ‘యురేనియం’ కోసం ఏ దేశం ముందు చెయ్యి చాపనవసరం లేదు. విదేశీ ద్రవ్యం అనవసరంగా ఖర్చు చేయనవసరం లేదు. దిగుమతులకై ఎదురుచూపులు అసలే అక్కర్లేదు. మన ఇంధన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే మన లక్ష్యానికి ఇది పునాది. మన శాస్త్రవేత్తల మేధస్సుకు, పట్టుదలకు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా లాంటి మహానుభావుల దూరదృష్టికి, మన కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి వందనం.

ఈ సందర్భంగా గుర్తొస్తోంది ఠాగూర్ హృదయాంతరాల నుండి వెలువడిన ఒక ప్రార్థన. మాతృభూమిపై ఆయన కన్న కలను ఆవిష్కరిస్తోంది. …

ఎక్కడైతే మనస్సు నిర్భయంగా ఉండి, తల గర్వంగా ఎత్తబడుతుందో…

జ్ఞానం ఉచితంగా లభించే చోట…

సత్యపు అగాధం నుండి మాటలు వెలువడే చోట;

అలుపెరుగని కృషి పరిపూర్ణత వైపు తన బాహువులను చాచే చోట;

ఎక్కడైతే మనస్సు నీ చేత నిరంతరం విస్తృతమైన ఆలోచన మరియు కార్యాచరణకి నడిపించబడుతుందో,

“ఓ నా తండ్రి, నా దేశం ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి మేల్కొనును గాక”…ఇలా సాగుతుంది ఆయన కవిత.

ఇంతకన్నా మనం ఘనంగా ఏం కలలు కనగలం? ఆ తరం వారు ఎందరో కలలు కన్న భారత్‌ను మనం ప్రస్తుత మారుతున్న ప్రపంచంలో తదనుగుణంగా నిర్మించడం తప్ప! అందులో భాగమే నేటి కథనం. బహుశా శాస్త్రవేత్తలు కలలకు మూలం, స్పూర్తి ఇదేనేమో…

అట్టి ప్రాతఃస్మరణీయులకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను.

"లోకా సమస్త సుఖినోభవంతు”