సుబ్బారావుకి పన్నుపోటు వచ్చింది. మనిషన్నాకా పన్ను ఉండదా? దానికి నొప్పి రాకుండా ఉండదా అని అనుకుంటున్నారా? అక్కడే తప్పులో సారీ పప్పులో కాలేశారు. దానికో కారణం ఉంది. సుబ్బారావు సగటు ప్రైవేట్ ఉద్యోగి… నాలుగంకెల జీతంతో సంసారాన్ని గూడ్స్ బండిలా లాక్కొస్తున్నాడు. ఏ నెల అయినా బడ్జెట్ కు మించి ఖర్చు వస్తే సునామీయే. అంత కంగారు పడిపోతాడు. అందుకు అనారోగ్యానికి కూడా మినహాయింపు లేదు. దగ్గు, జలుబు లాంటివి అసలు పట్టించుకోడు. వాటంతటవి వచ్చిపోతుంటాయి. జ్వరం కూడా నాలుగు రోజులు చూస్తాడు. అంతకీ తగ్గకపోతే మెడికల్ షాపుకు వెళ్ళి తక్కువ ధరకు టాబ్లెట్ కొని వేసుకుంటాడు. అంతేకానీ తొందరపడి ఆస్పత్రి గుమ్మం తొక్కడు. అంత జాగ్రత్తమంతుడు.
ఏడాది క్రితం బావమరిది కూతురి పెళ్ళి జరిగింది. ప్రయాణ ఖర్చులు, గిఫ్ట్ ఖర్చు తగ్గించుకునేందుకు పెళ్ళికి డుమ్మా కొడదామని చూశాడు. అయితే బావగారి పిసినారితనాన్ని కాచి వడబోసిన బావమరిది అక్కకి, బావకి, మేనకోడలు, మేనల్లుడికి రానుపోను రైలు టికెట్లు కొని మరీ ఇరికించేశాడు. ఇక పెళ్ళికి వెళ్ళక తప్పకపోవడంతో భార్య సతాయింపు భరించలేక కానుక కొనుక్కొచ్చాడు. బంగారం దుకాణం కవరు చేతికిచ్చేసరికి భార్య ఆశతో లోపల చేయి పెట్టగా గిన్నెలాంటిది తగిలింది. బయటకు తీసి చూసి అవాక్కయింది. అది ఉగ్గుగిన్నెలాంటి గంధం గిన్నె. అందులో మూడేళ్ల చిన్నారి వేలు కూడా పట్టదు. దటీజ్ సుబ్బారావు.
ఇక అసలు విషయానికి వస్తే సుబ్బారావుకి పన్నుపోటు భయంకరంగా వచ్చింది. అదే తగ్గుతుందిలే అని వదిలేశాడు. ‘‘బొమ్మాలి నిన్ను వదలా’’ అంటూ నొప్పి అతనిని ఒక ఊపు ఊపింది. ఎప్పటిలాగే మందుల దుకాణం వైద్యం చేశాడు. పన్ను ఉహు అంది. తప్పదని ఆఫీసుకు అరపూట సెలవు పెట్టి సర్కారు దవాఖానాకు పదింటికల్లా వెళ్ళాడు. అప్పటికే పెద్ద క్యూ ఉంది. బెంచీలు ఖాళీ లేక దగ్గరలో ఒక నాపరాయి బండ ఉంటే దానిమీద కూర్చున్నాడు. ఇంతలో వార్డుబాయ్ అనుకుంటా హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు.
సుబ్బారావు అతనిని కేకేసి ‘‘బాబు! డాక్టర్ గారు లోపల ఉన్నారా’’ అని అడిగాడు. అతను సుబ్బారావు సాదాసీదా ప్యాంట్, షర్ట్ చూసి ‘‘ఇంకా రాలేదు’’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ‘‘ఎప్పుడు వస్తారు’’ అడిగాడు ఆత్రంగా, ‘‘ఏం నీకు చెప్పాలా, వచ్చినప్పుడు చూపించుకో’’ విసురుగా అని వెళ్ళిపోయాడు. చిన్నబుచ్చుకున్న సుబ్బారావు మళ్ళీ బండమీదకి వచ్చి కూర్చున్నాడు. అతని దీనావస్థను గమనించిన పక్కనున్న పేషెంట్ పలకరింపుగా నవ్వాడు. ‘‘ఏమిటి ఇవాళేనా మీరు రావడం’’ అని అడిగాడు జాలిగా. ‘‘అవునండీ! పన్నుబాధ భరించలేక వచ్చాను. అదేమిటండీ అతను అంత విసురుగా మాట్లాడుతున్నాడు. నేను ఏమన్నానని’’ అన్నాడు . ‘‘వాడు అంతేలేండి. మీకు కొత్త కనుక ఇలా బాధపడుతున్నారు. మేము చాలా రోజులనుంచి వస్తున్నాం కాబట్టి అలవాటై పోయింది. డాక్టర్ గారు ఆస్పత్రికి వచ్చి మూడు రోజులైంది. ఆయన లేనప్పుడు ఇతనే డాక్టర్ లా బిల్డప్ ఇస్తాడు. మీరు వంద రూపాయలు ఇస్తే అడుగులకు మడుగులొత్తేవాడు. ఆమ్యామ్యాలు బాగా మరిగాడు’ అన్నాడు అక్కసు అంతా వెళ్లగక్కుతూ.
‘‘అయ్యో! ఇప్పుడెలాగా, ఆఫీసుకు వెళ్ళాలి. ఆలస్యమైతే బాస్ దగ్గర చివాట్లు తినాలి’’ సుబ్బారావు గొణుక్కున్నాడు.
ఇంతలో డాక్టర్ గారు వచ్చారు అనే మాటలు వినిపించాయి. తెల్లకోటు వేసుకున్న ఒక పెద్దాయన హడావుడిగా లోపలికి వెళ్ళాడు. అయన వెనుక హనుమంతుడిలా అతి వినయంగా వంగి వంగి దండాలు పెడుతూ అనుసరించాడు ఆమ్యామ్యా కాంపౌండర్. డాక్టర్ చకచకా అయిదు నిమిషాలకొక పేషెంట్ ని చూసేస్తున్నారు. మంచి నైపుణ్యం ఉన్న వైద్యుడు అనుకుంటా, అందుకే అంత తొందరగా చూసేస్తున్నారు అనుకున్నాడు సుబ్బారావు. అదే మాటా పక్క పేషెంట్ తో అంటే అదోరకంగా నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం లోపలికి వెళ్ళాకా కానీ తెలియలేదు.
చివరికి సుబ్బారావు వంతు వచ్చింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ ఫోన్ మాట్లాడుతూ కూచోమని సైగ చేశాడు.
అయిదు నిమిషాలు మాట్లాడిన తర్వాత ‘‘ఏమిటి ప్రాబ్లం’’ అడిగాడు. ‘‘పన్నునొప్పి బాగా ఎక్కువగా ఉంది’’ అని చెప్పాడు సుబ్బారావు.
రెప్పపాటు టెస్ట్ చేసిన ఆయన ‘‘మీ దంతాలు ఏ పొజిషన్లో ఉన్నాయో సరిగ్గా తెలియడం లేదు. ఎక్స్ రే తీయాలి. ఇక్కడ ఆ మిషన్ పనిచేయడం లేదు. అందుకని మిగతా వివరాలు మా కాంపౌడర్ ని అడగండి, అతను చెప్తాడు’’ అని సెలవిచ్చాడు.
ఇంకా ఏదో అడగపోతే విసుగ్గా మొహం పెట్టి వెళ్ళండి అన్నట్లు డోర్ వైపుకి చేయి చూపించాడు.
సుబ్బారావు నెమ్మదిగా కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి అడిగితే డాక్టర్ గారి ప్రైవేటు ప్రాక్టీసు గురించి తెలిసింది. ఆయన ఆసుపత్రి, అక్కడ ఫీజుల వివరాలు, ఆధునిక వైద్యం గురించి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పాడు. ఏతావాతా పన్ను బాధ తగ్గడానికి సుమారు రూ. 20 వేలు అవుతుందని తానే అంచనా వేసేశాడు. కావాలంటే సాయంత్రానికే అపాయింట్ ఇప్పిస్తానన్నాడు. సుబ్బారావు గుండె గుబేలుమంది. వెంటనే అక్కడ నుంచి బయటపడ్డాడు.
మొహం వేలాడేసుకుని వచ్చిన భర్తను చూసి అతని భార్య రాధ కంగారుపడింది. ఏమైందని అడిగిన ఆమెకు జరిగినదంతా చెప్పాడు. భర్తకు మంచినీళ్ళు ఇచ్చి కొంతసేపు మౌనంగా ఉండిపోయిన ఆమెకు సుబ్బారావు స్నేహితుడు గోపాలం పళ్లు కట్టించుకున్న విషయం గుర్తుకు వచ్చింది.
‘‘ఏమండి! ఈ మధ్య గోపాలం అన్నయ్య పళ్లు కట్టించుకున్నారుగా. ఆయనను కలిస్తే ఏమైనా తెలుస్తుందేమో’’ అని సలహా ఇచ్చింది. సుబ్బారావు భార్య బుర్ర పాదరసంలా పనిచేసినందుకు సంతోషించి, సమయానికి సలహా ఇచ్చినందుకు అభినందించాడు. లంచ్ టైం కావడంతో ఆఫీసుకి పూర్తి రోజు సెలవు చెప్పి సాయంత్రం నాలుగింటికి గోపాలం ఇంటికి బయలుదేరాడు.
గోపాలం సుబ్బారావు బాల్య స్నేహితులు. ఎవరికి ఏ కష్టమొచ్చినా పంచుకోవడం అలవాటు. రెండు కుటుంబాలు కలసిమెలసి ఉంటాయి. గోపాలం గవర్నమెంట్ ఉద్యోగి. ఎంతమంది స్నేహితులు ఉన్నా సుబ్బారావంటే వల్లమాలిన అభిమానం. అతనికి ఏ చిన్న కష్టమొచ్చినా విలవిలలాడిపోతాడు.
ఇక అసలు కథకు వద్దాం. సుబ్బారావు వెళ్ళేసరికి గోపాలం గేట్ దగ్గరే కనిపించాడు. 'ఏమిట్రా ఇలా వచ్చావు. అంతా కులాశాయేనా? అంటూ స్నేహితుని భుజంపై ఆప్యాయంగా చేయివేసి లోపలికి తీసుకెళ్ళాడు.
‘‘ఏమోయ్ ఎవరొచ్చారో చూడు’’’ అంటూ భార్య విజయని కేకేశాడు.
‘‘'చాల్లేండి. అన్నయ్య గొంతు నేను గుర్తుపట్టలేనా’’ అంటూ బయటికి వచ్చి కుశలప్రశ్నలు వేసింది విజయ.
‘‘ప్రశ్నలు తర్వాత, ముందు మంచినీళ్ళు ఇవ్వు’’ అన్నాడు గోపాలం స్నేహితుడి మొహంలో ఆందోళన గమనించి.
అలాగే అంటూ లోపలికి వెళ్ళిన ఆమె ఒక చేతిలో నీళ్ళ గ్లాసు, ఇంకో చేతిలో ప్లేట్ తో వచ్చింది. అందులో సుబ్బారావుకి ఇష్టమైన బెల్లం గవ్వలు, జంతికలు ఉన్నాయి. అవి చూసి సుబ్బారావు బావురు మన్నాడు. గోపాలం దంపతులు కంగారుపడ్డారు. ఏమైందని అడిగిన వారికి జరిగినదంతా చెప్పాడు.
‘‘నాకు ఇంక ఇవి తినే యోగం లేదురా’’’ అంటూ చిన్నపిల్లాడిలా బాధపడ్డాడు.
‘‘ఊరుకోండి అన్నయ్యగారు’’ అని విజయ కాఫీ తెచ్చి ఇచ్చింది. వాళ్ళిద్దరూ కాఫీ తాగాకా ముగ్గురు ఆలోచనలో పడ్డారు.
'అవునురా, నువ్వు హెల్త్ పాలసీ కడుతున్నాను" అని చెప్పావుగా, ఆ కార్డుతో వైద్యం చేయించుకోవచ్చుగా’’ అని గుర్తు చేశాడు గోపాలం.
సుబ్బారావు తాను పనిచేసే కంపెనీ తరపున హెల్త్ కార్డు కడుతున్నాడు. దాని ద్వారా ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని చెప్పినందునే సంవత్సరానికి రూ. 1300 చొప్పున భారమైనా కడుతున్నాడు.
‘‘ఆ… ఆ… దాని సంగతే మర్చిపోయాను. ఏమిటో ఈ పన్నునొప్పితో ఏమి పాలుపోవడం లేదు. హమ్మయ్యా! నా బెంగ తీరిందిరా. ఇప్పుడే ఇంటికి వెళ్ళి కార్డు తీసుకుని హాస్పిటల్ కు వెళతాను’’ అన్నాడు సుబ్బారావు.
‘‘ఉండు నేనూ వస్తాను’’ అంటూ గోపాలం అనుసరించాడు.
ఇద్దరూ సుబ్బారావు ఇంటికి వెళ్ళారు. అక్కడ రాధ భర్త కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఆమెకు ఈ విషయం చెప్పి, కార్డు తీసుకుని దగ్గరలో ఉన్న పంటి ఆసుపత్రికి వెళ్ళారు. క్లినిక్ కిటకిట లాడిపోతోంది. సుబ్బారావు రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్న అమ్మాయికి వివరాలు చెప్పాడు. ఆమె 500 రూపాయలు కట్టమంది. సుబ్బారావు గొప్పగా కార్డు తీసి ఇచ్చాడు. అది ఆమె తిరిగి ఇచ్చేసి, అది కుదరదని, కన్సల్టేషన్ కి కట్టవలసిందేనని అంది. సుబ్బారావు వాదించబోతుంటే గోపాలం వారించి డబ్బు కట్టేశాడు.
ఆమె ఇచ్చిన టోకెన్ తీసుకుని ఖాళీగా ఉన్న సీట్లు చూసుకుని కూర్చున్నారు. సుబ్బారావు 'వంతు రావడంతో డాక్టర్ రూములోకి వెళ్ళారు. డాక్టర్ ఎక్స్ రే తీసి కొన్ని పళ్ళు పాడయ్యాయని, అవి పీకి కొత్తవి కట్టడానికి 20 వేలు అవుతుందని కూల్ గా చెప్పాడు. అప్పుడు హెల్త్ కార్డు చూపించారు. కార్డు ఇన్ పేషెంట్లకే వర్తిస్తుందని, పన్ను కట్టించుకోవడానికి డబ్బులు కట్టాలని చెప్పడంతో మన సుబ్బారావు చతికిలపడిపోయాడు.
సీన్ అర్థమైన గోపాలం వెంటనే అతనిని తన ఇంటికి లాక్కొచ్చాడు. వీరి కోసమే ఎదురుచూస్తున్న విజయ ఏమైందని ఆత్రంగా అడిగింది.
‘‘ఏమి చెప్పమంటావు చెల్లెమ్మా. 20 వేలు అవుతుందిట. ఎక్కడనుంచి తీసుకురావాలి’’ డీలాపడిపోయాడు సుబ్బారావు.
‘‘మరీ అంత బాధ పడకురా. నేను ఇస్తాను. పళ్ళు కట్టించుకో’’ అని గోపాలం ఇవ్వబోగా అభిమానధనుడైన సుబ్బారావు వద్దంటూ వెళ్ళి పోయాడు.
నెల తర్వాత సుబ్బారావు ఆఫీసుకు వెళుతుంటే కారు గుద్దింది. గాయపడిన అతనిని హాస్పిటల్లో చేర్చారు. సృహ కోల్పోయిన మన సుబ్బారావు మూడు రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు. రాధ, పిల్లలు కార్తీక్, ప్రియ, స్నేహితుడు గోపాలం, విజయ అందరూ బెడ్ చుట్టూ నిలుచుని ఉన్నారు. ఏం జరిగిందో సుబ్బారావుకి అర్థం కాలేదు.
ఇంతలో రాధ ‘‘ఎలా ఉందండీ?’’ అడిగింది ఆదుర్దాగా. ‘‘నాకు ఏమైంది. నేను ఎక్కడ ఉన్నాను?'’’ అంటూ లేవబోయాడు. ‘‘'ఆగండి. ఆగండి. మీరు లేవకూడదు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు’’. ‘‘డాక్టరేంటి?, రెస్ట్ ఏమిటి? నేను వెళ్ళాలి. ఆఫీసుకి టైమ్ అవుతోంది’’ అని లేవబోయాడు. ఇంక లాభం లేదని గోపాలం దగ్గరికి వచ్చి, యాక్సిడెంట్ అయిన విషయం నెమ్మదిగా చెప్పాడు. ‘‘ఆ!..నిజమా! అయ్యో! ఏం ఫ్రాక్చర్ అయింది?’’ అని కంగారు పడ్డాడు. ‘‘చిన్న దెబ్బలే లేరా. డాక్టర్ గారు వచ్చి అన్ని విషయాలు చెప్తారు.’’ అని గోపాలం పడుకోబెట్టాడు. ఇంతలో డాక్టర్ సురేష్ రౌండ్స్ కి వచ్చారు. ‘‘హలో సుబ్బారావు గారు! ఎలా ఉన్నారు. రెండు రోజులు మీ వాళ్ళందరినీ కంగారు పెట్టేశారు’’ అన్నారు నవ్వుతూ. ‘‘అవునా డాక్టర్! కారు మీదకి రావడం వరకు గుర్తుంది. నాకు ప్రమాదం ఏమి లేదుగా. మా వాళ్ళని ఏమి అడిగినా చెప్పకుండా భయపెట్టేస్తున్నారు’’ అన్నాడు.
‘‘డోంట్ వర్రీ. దెబ్బలు పెద్దగా తగలలేదు. పాదం దగ్గర చిన్న ఫ్రాక్చర్. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని, చిన్నపాటి ఎక్సర్ సైజ్ చేస్తే చాలు. అయితే కారు గుద్దినపుడు క్రింద పడడం వల్ల ముఖం రోడ్డుకి కొట్టుకుని పళ్ళు ఊడిపోయాయి’’ అన్నాడు డాక్టర్ సానుభూతితో. ‘‘యాహూ!’’ అని అరిచాడు సుబ్బారావు. ‘‘నాకు 20 వేల రూపాయలు మిగిలాయి’’ అని గట్టిగా అరుస్తూ డ్యాన్స్ చేసినంత పనిచేశాడు సుబ్బారావు. అందరూ కంగారు పడ్డారు మతి చలించిందా అని. ‘‘20 వేలు మిగలడం ఏమిటండి’’ రాధ ఆందోళనగా అడిగింది. ‘‘పళ్ళు ఊడిపోయాయి కదా. ఇంక పళ్ళు పీకించుకోనవసరం లేదుగా. అంటే 20 వేలు మిగిలినట్టే కదా’’ అన్నాడు ఆనందంగా.
‘‘సుబ్బారావు గారు మరీ అంత ఎక్సైట్ అవకండి. సారీ! మీకో బ్యాడ్ న్యూస్, మీకు ఊడినవన్నీ మంచి పళ్ళే. పిప్పి పళ్ళు అలాగే ఉన్నాయి.’ అని డాక్టర్ కూల్ గా చెప్పేసరికి షాక్ తినడం సుబ్బారావు వంతు అయింది. ఇదండీ మన బక్కప్రాణి సుబ్బారావు పన్నుగోల.

