అందాల నటుడు శోభన్ బాబు జీవితాన్ని మలుపు తిప్పిన చలనచిత్రం ‘తాసిల్దారుగారి అమ్మాయి’. అంతకు ముందు పెద్ద హీరోల పక్కన చిన్న పాత్రలు పోషించిన ఆయన ఈ చిత్రంతో పూర్తి స్థాయిలో కథానాయకుడిగా నటించి విజయం సాధించారు. అటు పిమ్మట ఆయన వరుస విజయాలతో మహిళల కలల రాకుమారుడు అయ్యారు. ఎంతంటే కుర్రకారు అంతా ఆయన హెయిర్ స్టైల్, నడక తీరును అనుకరించేంతగా. ఆయన 1959 లో ‘దైవబలం’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు. 1971లో వచ్చిన ఈ తాసిల్దారు గారి అమ్మాయి ఘన విజయంతో ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం లేకపోయింది. అందులో శోభన్ బాబు తండ్రి, కొడుకులు పాత్రలో ఒదిగిపోయారు. అంతకు ముందు పద్మనాభం స్వంత సినిమా ‘పొట్టి ప్లీడర్’ లో ద్విపాత్రాభినయం చేసినా చివరలో కొద్దిసేపు మాత్రమే.
సుప్రసిద్ధ నవలా రచయిత్రి కావిలిపాటి విజయలక్ష్మి రచించిన ‘విధి విన్యాసాలు’ నవల చాలా జనాదరణ పొందింది. ఇది ఆంధ్రప్రభ వార పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఈ కథ ఆధారంగా తీసినందున చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వం ప్రతిభ కూడా తోడైంది. ‘సత్యచిత్ర’ బ్యానర్ పై దీనిని నిర్మించారు.
కథ
తాసిల్దారు (నాగభూషణం) కూతురు మధుమతి (జమున). ఆమెకి రాజశేఖరం, గోపాలం (రావి కొండలరావు, సాక్షి రంగారావు) ఇద్దరు అన్నయ్యలు. తండ్రి ఆఫీసులో పనిచేసే ప్రసాదరావు (శోభన్ బాబు)ని మధుమతి ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంది. అయితే, కొంతకాలం తర్వాత అన్నయ్యల చెప్పుడు మాటలు విని ఆమె భర్తను అనుమానిస్తుంది. తాసిల్దారు కూడా అల్లుడిని అవమానిస్తాడు. దానితో ఉద్యోగం పొగొట్టుకున్న ప్రసాదరావు బస్సు కండక్టర్ గా చేరతాడు. మధుమతికి కొడుకు పుడతాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి ప్రసాదరావు, మధుమతి విడి పోతారు. మధుమతి పుట్టింటి లోనే ఉండిపోతుంది. అనేక అవమానాలు ఎదుర్కొంటుంది. కాలక్రమేణా ప్రసాదరావు పట్టుదలతో కష్టపడి పనిచేసి లక్షాధికారి అవుతాడు. ఎంతోమంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ ఉంటాడు.
మధుమతి కొడుకు వాసు (శోభన్ బాబు) చదువుకి డబ్బు ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు మధుమతి కొడుకుని తన చిన్న అన్నయ్య గోపాలం దగ్గరికి పంపుతుంది. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అతనికి వాసు తండ్రి ప్రసాదరావు లక్షాధికారి అయిన సంగతి తెలిసి, మేనల్లుడిని ఆర్థిక సహాయం నిమిత్తం బావగారి దగ్గరికి పంపిస్తాడు. వాసు తనని పరిచయం చేసుకుని చదువు చెప్పించవలసిందిగా తండ్రిని కోరతాడు. కొడుకుపై మమకారంతో ప్రసాదరావు ఒప్పుకుని కలెక్టర్ ని చేస్తాడు.
మధుమతి అన్నయ్యలకు ఇద్దరు కూతుళ్లు. వారు తమ కూతురిని వాసుకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అయితే తల్లిదండ్రుల వ్యవహారంతో వాసుకి పెళ్ళి అంటేనే విరక్తి కలిగి, ఎవరినీ చేసుకోనని చెప్పేస్తాడు. గోపాలం కూతురు పద్మజ (చంద్రకళ) బావని గాఢంగా ప్రేమిస్తుంది. గోపాలమే కొడుకుని చదివి స్తున్నాడు అనుకుంటుంది మధుమతి. కాని చివరలో భర్త మంచితనం అన్నయ్య గోపాలం ద్వారా తెలుసుకుని పశ్చాత్తాప పడి భర్తను చేరుకుంటుంది. వాసు మరదలు పద్మజ ప్రేమని అర్థం చేసుకుని వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
తారాగణం
- శోభన్ బాబు:- శోభన్ బాబు తండ్రి, కొడుకుల పాత్రలను (ప్రసాదరావు, వాసు) పోషించారు. అటు తండ్రిగా పెద్దమనిషి తరహాలో, ఇటు కొడుకుగా యువకుని పాత్రలో చాలా వ్యత్యాసాన్ని చూపిం చారు. అప్పటికి 34 సంవత్సరాల వయస్సున్న శోభన్ బాబు ఆ రెండు పాత్రలను పోషించగలడా అన్న సందేహాన్ని పటాపంచలు చేశారు.
- జమున:- హీరోయిన్ మధుమతి తాసిల్దారు గారి కూతురు పాత్రలో జమున నటన కాలంతో పాటు మారే పాత్ర. బలమైన సంకల్పం ఉన్నపాత్ర ఇది. యవ్వనం నుంచి మధ్య వయస్కురాలిగా మారే పాత్రను అద్భుత భావోద్వేగాలతో పోషించారు.
- నాగభూషణం:- తాసిల్దారు పాత్రను నాగభూషణం చక్కగా పోషించారు.
- సాక్షి రంగారావు, రావికొండలరావు:- జమున అన్నయ్యలు రాజశేఖరం, గోపాలం పాత్రలను పోషించారు. వీరు హేళనగా అన్న డైలాగ్ ‘కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా’ బాగా ఫేమస్ అయింది.
- చంద్రకళ:- గోపాలం కూతురు పద్మజ పాత్రను చంద్రకళ పోషించారు. బావని ఆటపట్టించే అల్లరి పిల్లగా చలాకీగా నటించారు.
పాటలు
చిత్రంలో పాటలను ఆచార్య ఆత్రేయ రాయగా, కె.వి. మహదేవన్ సంగీతం అందించారు.
- కనపడని చెయ్యియేదో నడుపుతోంది నాటకం…ఈ పాటని కె.బి.కె. మోహనరాజు పాడారు.
- నీకున్నది నేనని, నాకున్నది నీవని….ఘంటసాల, సుశీల
- అల్లరి చేసే వయసుండాలి, ఆశలు రేపే మనసుండాలి… జె.వి. రాఘవులు, సుశీల
- జాజిరి జాజిరి జాజిరి మామా గాజుల గలగల వింటావా…సుశీల
- పాడమన్నావు పాడుతున్నాను…సుశీల
పాటలు చాలా జనాదరణ పొందాయి.
విశేషాలు
- ‘సత్యచిత్ర’ పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మించిన తొలిచిత్రం. వీరిద్దరూ అదే బ్యానర్ మీద 4 సంవత్సరాల తర్వాత శోభన్ బాబుతో ‘ప్రేమబంధం’ అనే సినిమాను కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తీశారు.
- దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు తాసిల్దారు గారి అమ్మాయి సినిమాలో కొన్ని సన్నివేశాలను తన కుమారుడు, అసోసియేట్ డైరక్టర్ కె. రాఘవేంద్రరావుకు అప్పగించారు.
- కొత్తగా చేపట్టిన నిర్మాణ సంస్థ కావడంతో నిర్మాతలకు ఎక్కువ ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు బ్లాక్ అండ్ వైట్ లో చిత్రం నిర్మించాలని అనుకున్నారు ప్రకాశరావు. ఇందుకు నిర్మాతలను ఒప్పించారు. 1971 నాటికే కలర్ సినిమాలు రాజ్యమేలు తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు ఆదరణ తగ్గుతోంది. 1971 లోనే ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ వంటి భారీ తారాగణంతో నిర్మిస్తున్న కలర్ చిత్రం ‘ప్రేమ్ నగర్’. విశేషమేమిటంటే, ఈ చిత్రానికీ దర్శకుడు కె. ఎస్. ప్రకాశరావే.
కాగా, అటువంటి పోటీని కూడా తట్టుకుని తాసిల్దారు గారి అమ్మాయి సినిమా నిలబడటమే కాకుండా శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. రాజమండ్రిలో నవభారతి గురుకులంలో జరిగిన శతదినోత్సవ కార్య క్రమానికి సినిహీరో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన “He is the future hope of the film industry” అని శోభన్ బాబుపై ప్రశంసలు కురిపించారు.
ఏదిఏమైనా ‘తాసిల్దారు గారి అమ్మాయి’ కథ, కుటుంబ బంధాలు, నటీనటుల అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కె.వి. మహదేవన్ వీనులవిందైన సంగీతం అలరించింది. ఈ సినిమాను సినీ అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.
కొసమెరుపు
ఇంతటి మంచి సినిమా తర్వాతి కాలంలో విడుదల కావడం కానీ, ఏ టీవీ చానెల్ ప్రసారం కాని చేయకపోవడం ఆశ్చర్య కరమైన విషయం. అయితే, సినిమా తాలూకూ ఫిలిం బాక్స్ లను జాగ్రత్త పరచలేక పోయారని సమాచారం. ఈ సినిమా ఇప్పుడు విడుదలైనా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.