గొప్ప వ్యక్తులు గొప్ప పనులే చేస్తారు. అలాంటివారిని కారణజన్ములు అంటారు. వారిలో ఒకరు మన
రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్యగారు. ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు. క్రమశిక్షణకు మారుపేరు.
సేవాభావం బాగా ఉన్న వ్యక్తి. వీరి జీవితచరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం.
ఒక డిగ్రీ చదివి, జాబ్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు నేడు యువకులు. ఏదో
సాధించేశామనుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తి మూడు విభిన్న రంగాల్లో డిగ్రీ సంపాదించి, 4, 5 భాషలను
అవలీలగా మాట్లాడడం మామూలు విషయం కాదు కదా! అందుకు ఎంత శ్రమ పడి ఉండాలి. ఎన్ని కష్టాలు
ఎదుర్కొని ఉండాలి. అయినా వెనకడుగు వేయకపోవడం గ్రేట్ కాదంటారా? అదే పింగళిగారి గొప్పతనం.
పింగళి గారికి కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. ఏ పని అప్పచెప్పినా ధైర్యంగా చేపట్టేవారు.
చొరవ కూడా ఎక్కువే. ఇది వంశపారంపర్యంగా వచ్చిందంటే నమ్ముతారా? అవును ఇది నిజం. ఎందుకంటే
ఆ ధైర్యసాహసాలు ఝాన్సీలక్ష్మీబాయి నుంచి వచ్చినవి. ఆవిడ ప్రస్తావన ఏమిటి అనుకుంటున్నారా? ఇప్పుడే
వివరిస్తాను.
వీరి పూర్వీకులు మహరాష్ట్రకు చెందినవారు. ఆ రోజుల్లో వలసలు జరుగుతుండేవి కదా! అలా కారణం
ఏమైతే ఏమిటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారు. వీరు పింగళి మోరోపంత్ వంశీయులు. ఝాన్సీలక్ష్మీబాయి
పింగళి వారింటి ఆడపడుచు. మరొకరు పింగళి మాదన్న గారు కూడా వీరి వంశీకులే. ఈ మాదన్న గారు
గోల్కొండ నవాబు దగ్గర మహాసేనాని. అడవి వెంకటాచలపతి గారు పింగళి వెంకయ్యగారి తాతగారు.
ఆయన చల్లపల్లి సంస్థానంలో ఠాణేదారు.
పింగళి వెంకయ్య గారు 1878 ఆగస్టు 2న పుట్టారు. మచిలీపట్నంలోని దివితాలుకా పెదకళ్ళేపల్లిలో
అమ్మమ్మ గారింట్లో జన్మించారు. అమ్మమ్మ గారి పేరు సీతమ్మ. తాతగారి పేరు అడివి వెంకటాచలపతి.
వెంకయ్య గారి తండ్రి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నం. హనుమంతరాయుడు కృష్ణాజిల్లా చల్లపల్లి
మండలం యార్లగడ్డ గ్రామ కరణం.
ఇక చదువు విషయానికి వస్తే… వీరి తాతగారికి భట్లపెనుమర్రు బదిలీ అయింది. అందువల్ల వీరి
ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా! అలా వీరికి చిన్నప్పుడే స్వతంత్ర
భావాలు ఎక్కువ. పెద్ద చదువులు చదవాలనే కోర్కెతో బందరు వచ్చేశారు. అక్కడ హిందూ హైస్కూల్లో
చదివారు.
ఈయన బహుభాషా కోవిదుడు. దాదాపు 10, 12 భాషలు మాట్లాడేవారని వారి మనవడి భార్య
సుశీల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఆసక్తి, స్పష్టత, ఉన్నత భావవ్యక్తీకరణ ఉండాలనుకునేవారు.
అందుకు ఎక్కువ భాషలు నేర్చుకోవాలనుకున్నారు. ఆ కోరిక ఎక్కువగా ఉండేది. అందుకే జపాను భాష నేర్చుకున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ శాస్త్రంలో పరిశోధనలు చేసి
డిప్లొమో పొందారు. శ్రీలంకలోని కొలంబోలో పాలిటిక్స్, ఎకనామిక్స్ మరియు వ్యవసాయ శాస్త్రం చదివారు.
ఉద్యోగ జీవితానికి వస్తే… ఆ రోజుల్లో పిల్లలని సంపదగా భావించేవారు. అందుకే ఒక్కొక్క ఇంట్లో
10కి మించి సంతానం ఉండేది. (సాంప్రదాయ ఆచార కుటుంబాల్లో ఇది మరీను…!) తర్వాత ఆ నెంబర్
క్రమేపీ తగ్గుతూ వచ్చింది. దానికితోడు ప్రభుత్వం కూడా మీరు ఇద్దరు, మీకు ఇద్దరు చాలు అని ఊదరగొట్టింది
కదండి. ఇప్పుడు ఒకరు చాలనుకుంటున్నారు. భవిష్యత్తులో అసలు వద్దు అనుకున్నా ఆశ్చర్యం లేదు. సరే అది
పక్కనపెడదాం. వీరిది కూడా పెద్ద కుటుంబం. వెంకయ్య గారే పెద్ద కొడుకు. అందుకే బాధ్యత బాగా
తెలిసినవారు. కుటుంబ పరిస్థితి కూడా బాగా అర్థం చేసుకున్నారు. అందుకని చిన్న వయసులోనే జాబ్
వెతుక్కోవడం ప్రారంభించారు. 19 ఏళ్ళ వయస్సులోనే సైన్యంలో చేరారు. శిక్షణ పొందారు.
వెంకయ్య గారి సైనిక ఉద్యోగం… దీని గురించి చెప్పేముందు, అప్పటి యుద్ధ వాతావరణాన్ని
పరిశీలిద్దాం. ఆధిపత్యం కోసం రవి అస్తమించని బ్రిటిష్వారు వివిధ దేశాలతో యుద్ధం చేసేవారు. అలా చేసిన
యుద్ధమే బోయర్ యుద్ధం. ఇది ఎవరెవరికి జరిగిందంటే… దక్షిణాఫ్రికాలోని డచ్చి వారికి బ్రిటిష్ వారికి.
ఎంతకాలం అనుకుంటున్నారు? సుమారు నాలుగు సంవత్సరాలు. అప్పుడు భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో
ఉంది. అందుకని బ్రిటిష్ వారు తాము చేసే యుద్ధాలకు భారత సైనికులను కూడా పంపేవారు. అలా రెండో
బోయర్ యుద్ధంలో పాల్గొనడానికి పంపిన సైనికులలో వెంకయ్య గారు ఒకరు. ఈ యుద్ధంలో ఆయన చాలా
ప్రతిభ చూపారుట. ఆయన అందుకు గాను మెడల్ పొందారు.
ఇక్కడే వెంకయ్య గారి జీవితాన్ని మలుపుతిప్పే సంఘటన జరిగింది. యుద్ధమన్నాకా సైనికులు
చనిపోవడం, గాయపడడం జరుగుతుంది కదా! అలా గాయపడిన వారికి గాంధీగారు తన సేవాదళ్ సేవలు
అందించారు. అక్కడే గాంధీగారితో వెంకయ్య గారికి పరిచయం కలిగింది. అది క్రమేపీ స్నేహంగా మారింది.
ఒకరి భావాలు ఒకరికి ఎంతగా నచ్చకపోతే… వీరి సన్నిహిత సంబంధం 50 ఏళ్ళు పైన కొనసాగుతుంది.
అందుకే అంటారు స్నేహబంధాన్ని మించినది ఉండదని. సరే యుద్ధం తర్వాత స్వదేశానికి తిరిగి బయలుదేరారు
వెంకయ్య గారు. అయితే వస్తూ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్లలో కొన్ని నెలలు ఉన్నారు.
మద్రాసు వెళ్ళి ప్లేగు ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ పొంది ప్రథములుగా నిలిచారు. ప్లేగ్ ఇన్స్పెక్టర్గా
బళ్ళారిలో కొంతకాలం పనిచేశారు. అనంతరం బెంగుళూరు, మద్రాసు రైల్వేలైనులో రైలుగార్డుగా పనిచేశారు.
ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండేది కాదు. అదీగాక వెంకయ్య గారు సైన్యంలో కూడా
పనిచేసి ఉన్నారు కదా! దానికితోడు ప్రతిభ కూడా ఉంది. ఇంకేం అడ్డు ఉంది ఉద్యోగం ఈజీగా దొరకడానికి.
అప్పట్లో ఎంప్లాయిస్ తమకి నచ్చిన ఉద్యోగాన్ని వెతుక్కునే అవకాశం ఉండేది. అంతేకాక పరిస్థితులను బట్టి
తరచు ఉద్యోగాలు మారుతుండేవారు. విద్యావేత్తగా బందరులో వెంకయ్యగారు విద్యాసంస్థను స్థాపించారు.
కొంతకాలం ఆంధ్ర జాతీయ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేశారు.
విద్యార్థులకు పాఠాలతో పాటు వ్యాయామం, గుర్రపు స్వారీ నేర్పించేవారు. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని సైనిక శిక్షణ ఇచ్చారు. ఈనాటి ఎన్.సి.సి.కి అప్పుడే బీజం పడింది. దీనివల్ల శారీరక దృఢత్వంతోపాటు
ఆరోగ్యానికి ప్రయోజనకరమని ఆనాడే గుర్తించారు ఆయన. అంత ముందుచూపు ఉన్నవారు వెంకయ్య గారు.
వీరికి అనేక భాషలు వచ్చు అని చెప్పుకున్నాం కదా! అవేంటో చూద్దాం. అవి తెలుగు, సంస్కృతం,
ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, జపాన్ మొదలైనవి. వీటిల్లో ప్రావీణ్యం స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపన్యాసాలకు బాగా
ఉపయోగపడింది. ఇది ఈ రోజు పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఒకటికి రెండు భాషలు వచ్చి ఉంటే
అవకాశాలు ఎక్కువ వస్తాయి. అందులో ముఖ్యంగా ఇంతటి పోటీ ప్రపంచంలో. విద్య లేనివాడు వింత పశు
వు అనే సామెత తెలుసు కదా! నేటి ప్రపంచం ఒకటిగా మారుతున్న పరిస్థితులలో ఎక్కువ భాషలు తెలిసి
ఉండడం అవసరమే కదా! అంతేకాదు ఉదర పోషణార్థం ఉద్యోగః అన్నారు పెద్దలు.
వివాహం-కుటుంబం:- తుర్లపాటి వెంకటాచలం గారు కృష్ణాజిల్లాలోని పామర్రు కరణం. వీరి రెండవ కుమార్తె
రుక్మిణమ్మ. పింగళి వెంకయ్య గారి వివాహం రుక్మిణమ్మతో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
పెద్దకొడుకు పేరు పరశురామయ్య. వీరు తండ్రి వద్ద శిక్షణ పొందిన ప్రముఖ జియాలజిస్టు. తండ్రితో పాటు
ఖనిజాల విజ్ఞానం సంపాదించారు. తండ్రితో పాటే పరిశోధనలకు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. తన అనుభవం
ద్వారా తెలుసుకున్న పరిశోధనల విషయాలను ఆర్టికల్స్ రాసేవారు. పత్రికలకు పంపేవారు. దానితో
జర్నలిస్టుగా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్లో పనిచేశారు.
చిన్న కుమారుడి పేరు చలపతిరావు. వీరు వెంకయ్య గారి లాగా మిలటరీలో పనిచేశారు. వీరి
కుమారుడే ప్రముఖ జర్నలిస్టు, ఎన్ కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్. కాని చలపతిరావుగారు
చిన్న వయస్సులోనే మరణించారు. అందుకని దశరథ్ రామ్గారు తాతగారి దగ్గర పెరిగారు. పింగళి వెంకయ్యగారి
ఏకైక కుమార్తె సీతామహాలక్ష్మి.
పింగళి వెంకయ్యగారిని పత్తి వెంకయ్య, జపాన్ వెంకయ్య, వజ్రపు వెంకయ్య, జెండా వెంకయ్య అని
పిలిచేవారు. ఆ పేర్లు ఎందుకు వచ్చాయో మీకు తెలుసా? తెలీదా. అదే చెప్పబోతున్నాను.
వెంకయ్య గారు పెళ్ళి తర్వాత కాపురం బందరులో పెట్టారు. అధ్యాపకులుగా ఆంధ్ర జాతీయ కళాశాలలో
పనిచేశారు.
పత్తి వెంకయ్య:- మనదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమేకాదండోయ్. అదే ప్రధాన వృత్తి కూడా.
వెంకయ్య గారు వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారని చెప్పాను కదా. దానిని సార్థకం చేసుకునేందుకు
పొలంలో పరిశోధనలు, ప్రయోగాలు కూడా చేశారు. అప్పట్లో ముతక వస్త్రాలు ఉండేవి. అవి యువతకు
నచ్చవు కదా! వారిని విదేశీ వస్త్రాలు ఆకర్షించేవి. వారు వాటినే బాగా ఇష్టపడేవారు. ఇది వెంకయ్య గారు
గమనించారు. దీనికి చెక్ పెట్టాలనుకున్నారు. సన్నని నూలు అయితే బాగుంటుందని వారు వాణిజ్య పంట
అయిన పత్తిని పరిశోధనకు ఎంచుకున్నారు. ఇందులో ఆయనకున్న పరిజ్ఞానం శ్రీ రాజా నాయన వెంకట
రంగారావు బహద్దూర్కు బాగా తెలుసు. అందుకని మునగాలలో ఒక వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని
ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడి భూమి పత్తి పంటకు అనుకూలంగా ఉంటుంది. యువత వేసుకోవడానికి
4
వీలుగా ఉండే వస్త్రాలను తయారు చేయాలి. ఆ విధంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి. స్వదేశీ వస్త్రాలకు
ప్రయోజనం చేకూర్చాలి. ఇవి వెంకయ్యగారి ధ్యేయం. చూశారా అప్పటి వారికి దేశీయ వస్తువులపై ఎంత
మమకారం ఉండేదో. అమెరికా నుండి అనేక మేలైన పత్తి విత్తనాలను తెప్పించారు. ప్రయోగాలు చేసి
కాంబోడియా పత్తి రకం వీరి వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తి చేశారు. కాబట్టి ఇది కాంబోడియా పత్తిగా ప్రసిద్ధి
చెందింది. అంతటితో ఆగక వెంకయ్య గారు చెరుకు, పొగాకు పంటలపై కూడా ప్రయోగాలు చేశారు.
ఏలూరు వ్యవసాయ ప్రదర్శనల్లో వీరి పరిశోధనా ఫలితాలను వెల్లడి చేశారు. తద్వారా వెంకయ్యగారి విజయాలకు
ఆ రంగంలో గోల్డ్ మెడల్ పొందారు. వ్యవసాయ శాస్త్రంపై ఒక గ్రంథాన్ని కూడా రాశారు. అందుకే ఆయన
పత్తి వెంకయ్య పేరు గాంచారు.
బందరు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు అని చెప్పాను కదా! అప్పుడు కళాశాల ప్రాంగణంలో
రెండు ఎకరాలను వ్యవసాయ క్షేత్రంగా మార్చారు. పలు ప్రయోగాలు చేశారు. ఆ రోజుల్లో కాశ్మీర్లో పండే
కుంకుమ పువ్వు, ఆపిల్ పండ్లు నేడు చాలామంది పెంచుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు అయితే
ఏమిటి, టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల నైతేనేమి, విజ్ఞాన ఫలాల వల్ల గానీ ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో
ఆపిల్, కుంకుమ పువ్వు కంటైనర్లలలో కూడా పెంచేస్తున్నారు! కానీ ఆ రోజుల్లోనే కుంకుమపువ్వు సాగుపై
వెంకయ్య గారు ప్రయోగం చేశారు. ఆయన ముందుచూపుకు, ప్రజ్ఞా పాటవాలకు సెల్యూట్. ఈ విషయంలో
అవి విఫలమైనప్పటికీ ప్రయోగాలు, పరిశోధనలు నేటి సైంటిస్టులు, శాస్త్ర విద్యాభ్యాసకులు గమనించాలి.
జపాన్ వెంకయ్య:- బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదె అన్నది సుమతీ శతకం నీతి. అది
ఇక్కడ గుర్తుకు వస్తున్నది. ఎందుకంటే రష్యా పెద్దదే కాకుండా బలమైన దేశమని అందరికీ తెలిసిందే. అలాగే
జపాన్ తరచు భూకంపాల వలన ఎక్కువ నష్టపోయే ఒక చిన్న దేశం. అంతేకాకుండా వారికి ఇతర సమస్యలు
కూడా ఎక్కువే. అప్పట్లో రష్యాకు, జపాన్కు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రష్యాపై జపాన్
విజయం సాధించింది. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. స్వాతంత్ర్య కాంక్ష ఉన్న వెంకయ్య గారిని కూడా
ఆకర్షించింది. సైన్యంలో గడించిన జ్ఞానం, వ్యూహంగల అనుభవంతో, ముందుచూపుతో ఆయన జపాన్ భాష
నేర్చుకోవాలనుకున్నారు. ప్రొఫెసర్ గోటే గారి వద్ద అతి తక్కువ కాలంలోనే భాషను నేర్చుకున్నారు. బాగా
మాట్లాడే స్థాయికి చేరారు. ఈ క్రమంలో గురుదక్షిణగా వెంకయ్యగారు గోటే గారికి సంస్కృతం నేర్పారు. గోటే
గారికి సంస్కృతం వస్తే తనకి జపాన్ భాష ఇంకా సులభంగా నేర్పిస్తారని కూడా వెంకయ్య గారు ఆలోచించారేమో!
బాపట్లలో ఒక సందర్భంలో జపాన్ భాషలో ఉపన్యసించారు. గంభీరమైన కంఠంతో ఉపన్యాసం కొనసాగింది.
పింగళిగారిని అందరు ప్రశంసించారు. దీనితో వీరు జపాన్ వెంకయ్యగా పేరుపొందారు.
వజ్రపు వెంకయ్య:- భారతదేశాన్ని రత్నగర్భ అనడం మీకు తెలుసుకదా! నేటికీ మనదేశం అది నిలబెట్టుకునే
ఉంటోందనడానికి ఇటీవల వస్తున్న వార్తలే నిదర్శనం. ఆధునిక పరికరాలలో వినియోగించే ఒక రాయి
రాయలసీమ ప్రాంతంలో ఉన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మిక్సిలో వాడే చిన్న పరికరం చిప్
నుంచి సెల్ఫోన్ వరకు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తు తయారీకి ఇది అవసరం. సోలార్ తో ప్యానల్స్ నుంచి వైద్య రంగంలో వాడే ఎంఆర్ఐ స్కాన్ వరకు ఈ రాయే వాడతారు. ఆ రాయి పేరే పాలీసిలికాన్ మెటల్. ఈ
పాలిసిలికాను రా మెటీరియల్ గా చైనా తమ తయారీ ఫ్యాక్టరీలో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు తయారీలో
వాడి అనేక రెట్లు అధిక ధరకు అమ్ముతున్నది. ఈ పాలిసిలికాన్ మెటల్ మన రాష్ట్రంలో కూడా లభ్యమవుతున్నది.
ఒక తయారీ ఫ్యాక్టరీ ఇక్కడ కూడా పెడితే అది మన రాష్ట్ర ముఖచిత్రాన్నే మర్చేస్తుంది. అంతేకాక
ఎంప్లాయిమెంట్ను కల్పిస్తుంది. విదేశీ మారకద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుంది. కాబట్టి మెటల్ సిటీ ఏర్పాటుపై
ప్రభుత్వం దృష్టి సారించాలి.
ఇంక వెంకయ్య గారి విషయానికి వస్తే… 19వ శతాబ్దంలోనే వజ్రాల లభ్యతపై పరిశోధన జరిగింది.
హెూవార్డ్ అనే భూగర్భ శాస్త్రజ్ఞుడు దక్షిణ భారతంలో వజ్రాలు లభించే ప్రదేశాలపై పరిశోధన చేశారు. ఒక
రిపోర్టు కూడా తయారు చేసి ముద్రించాడు. అందులో ప్రధానంగా మన రాయలసీమ ప్రాంతంలోని ప్రదేశాలను
పేర్కొన్నాడు. వెంకయ్యగారు వజ్రాలు లభించే ప్రాంతాల అన్వేషణ కోసం నెల్లూరుకు మకాం మార్చారు. అవి
ఏర్పడే విధానంలో పరిశోధన కూడా ఆయన ఆలోచన. ఆయన జియాలజీలో పట్టభద్రులని చెప్పాను కదా!
తర్వాత నెల్లూరులో ఉండి నవరత్నాల మీద పరిశోధన చేసి వ్యాసాలు రాశారు. అంతేకాదండి, వజ్రాల
తవ్వకాలలో రికార్డు కూడా సృష్టించారు. నెల్లూరులో మైకా (అభ్రకం) పై కూడా పరిశోధన చేశారు. అనంతపురం
జిల్లాలోని వజ్రకరూర్ (రత్నగర్భ), హంపీలలో ప్రత్యేక పరిశోధనలు చేసి వజ్రపు తల్లిరాయిని కనుక్కున్నారు.
తల్లిరాయి నుండి వజ్రం ఏ విధంగా ఏర్పడుతుందో వివరిస్తూ ఒక పరిశోధన వ్యాసం రాశారు. కర్నూలులోని
కొన్ని ప్రాంతాల్లో కూడా పరిశోధన చేశారు. భారత ప్రభుత్వం వీరి 20 యేళ్ళ పరిశోధన విజ్ఞానాన్ని గుర్తించి,
గనులు, ఖనిజాల శాఖకు సలహాదారుగా నియమించింది. ఆయన గనులకు సంబంధించి మన దేశంలో
లభించే ఖనిజాలపై ఒక గ్రంథాన్ని రచించారు. అంతేకాదు నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరు గడించారు.
దాంతో వజ్రాల వెంకయ్య పేరు కూడా లభించింది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు
వెంకయ్యగారిని, వారి అబ్బాయిని నల్ల వజ్రాలుగా వర్ణించేవారు.
జెండా వెంకయ్య:- సైనికుడిగా బ్రిటిష్ జెండాకు వందనం చేస్తున్నప్పుడల్లా, మన దేశానికి ఒక పతాకం
అవసరమనిపించేది వెంకయ్యగారికి. ఇందుకు గాను విదేశాల నుండి అనేక జెండా నమూనాలను సేకరించారు.
పరిశీలించారు. మనకు జాతీయ జెండా అవసరమనే విషయాన్ని అనేక సందర్భాలలో వివిధ వేదికలపై
ప్రముఖులకు ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. దాని ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించేవారు.
జెండా రూపకల్పన:- ఎట్టకేలకు ఆయన ఆశ తన రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడలో తీరింది. గాంధీగారికి
వెంకయ్యగారికి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలలో జెండా విషయం ప్రస్తావించేవారు. అంతటితో ఊరుకోక
పట్టువదలని విక్రమార్కుడిలా గాంధీగారిని కలిసినప్పుడల్లా ఈ విషయమై మాట్లాడేవారు. గాంధీగారు ఆంధ్ర
ప్రాంతాలలో నాలుగుసార్లు పర్యటించారు. వారిని వెంకయ్యగారు తప్పకుండా కలిసేవారు. ఒకసారి అఖిల
భారత కాంగ్రెస్ మహాసభలు విజయవాడలో జరిగాయి. అప్పుడు గాంధీగారు వెంకయ్యగారిని పిలిపించారు.
మూడు గంటల్లో జెండా నమూనా తయారు చేయమన్నారు. అంతకుముందే వెంకయ్యగారు భారతదేశానికి
6
ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రాశారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో తన సహ అధ్యాపకుడు
అయిన చిత్రకారులు శ్రీ ఈరంకి వెంకటశాస్త్రి సహాయంతో నమూనాను రూపొందించి గాంధీజీకి అందజేశారు.
స్వరాజ్య సాధనకు, జాతీయ భావాలు ప్రజలలో పెంచడానికి, వారిలో చైతన్యం కోసం జెండా రూపకల్పన
అవసరమని వెంకయ్య అభిప్రాయం. ధ్యేయం కూడా. దాదాపు 30 నమూనాలను ఇందుకోసం పరిశీలించారు.
అంతకుముందే కొందరు ప్రముఖులు కూడా రకరకాల నమూనాలతో జెండాను రూపొందించారు. కానీ
గాంధీగారు పింగళి వారిని కోరడంతో వీరి కల నెరవేరింది. అయినప్పటికీ వెంకయ్య గారి జెండాలో కూడా
అనేక మార్పులు చేర్పులు జరిగాయి. చర్చోపచర్చలూ జరిగాయి. మొదట్లో ఈ త్రివర్ణ పతాకంలో రాట్నం
చిహ్నంగా ఉండేది. చివరికి లాహెూర్కి చెందిన ఉద్యమకారుడు లాలా హంసరాజ్ ధర్మచక్రాన్ని సూచించారు.
అశోకుని ధర్మచక్రం త్రివర్ణ పతాకం మధ్యలో పెట్టారు. దాంతో మన దేశానికి త్రివర్ణ పతాకం రూపొందింది.
స్వాతంత్ర్యానంతరం దేశ చిహ్నంగానే కాక దేశదేశాల్లోనూ జెండా మన ప్రతిష్టను చాటుతోంది. ఇంతటి
ఘనతను సాధించబట్టే ఆయనను జెండా వెంకయ్యగా పిలిచేవారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఈ జెండాకే
వందనం చేస్తుంటాం. జెండా విషయమై అప్పుడే పెద్దలు మాట్లాడేవారు. కాని ఎందరికి దానిని రూపొందించింది
ఎవరనేది తెలుసు? నేను ఈ ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఇప్పటి జనరేషన్లో చాలామందికి తెలియదనే విషయం
గమనించాను. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. జెండా కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన వ్యక్తికి
గుర్తింపు ఇంతేనా అనిపించింది. ఏదిఏమైనా జెండా రూపకర్తగా పింగళి వారు తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు.
ముగింపు:- సమరయోధుల జీవన సమరంలో ప్రజాసేవలో సమిధులుగా మారి, అష్టకష్టాలు పడి ఎందరో
స్వాతంత్ర్య యోధులు అశువులు బాశారు. పింగళి వెంకయ్య గారు కూడా ఇందుకు అతీతులు కాదు.
మితభాషత్వం, స్వాభిమానం వెంకయ్య గారికి విలువైన ఆభరణాలు. నిస్వార్థ సేవకుడిగా, ఎప్పుడూ
ఏ పదవులూ ఆశించలేదు. అయితే తన రాజకీయ గురువు బాల గంగాధర్ తిలక్ (స్వాతంత్య్రం నా జన్మహక్కు
అనే నినాద కర్త) మరణించిన తరువాత వెంకయ్య గారు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పటికి
వెంకయ్య గారి జీవితంలో సగం కాలం గడిచిపోయింది. మిగిలిన జీవితమంతా పరిశోధన, ప్రయోగాలలోనే
గడిపారు. జీవన పోరాటంలో అనేక అగచాట్లు పడ్డారు. మాన్యులు కొందరు కొంతనిధిని అందించారు.
అయినప్పటికీ వృద్ధాప్య బాధలను తప్పించుకోలేకపోయారు. చివరకు కడు పేదరికంలోనే తుదిశ్వాస విడిచి,
దివికేగారు.
భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నంతకాలం గుర్తుండే మహనీయుడు, ధన్యజీవి పింగళి
వెంకయ్యగారు. ఆయన జయంతి సందర్భంగా మరొక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళి
అర్పిస్తున్నాం.