ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న గన్నవరం విమానశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం ప్రయాణికులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తున్నా గన్నవరం విమానాశ్రయానికి దేశీయ విమానాలు మాత్రమే వస్తున్నాయి. వారానికి రెండుసార్లు ఒక అంతర్జాతీయ విమాన సర్వీసు నడుస్తున్నా అది పెద్ద లెక్కలోనికి రానట్లే. ఎందుకంటే ఆ విమానం సమయానికి వస్తుందో రాదో తెలియదు. కొన్ని సందర్భాలలో రానూ రాకపోవచ్చు.

సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తున్నది. గన్నవరం విమానాశ్రయానికి చుట్టుపక్కల ఉన్న గోదావరి , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు ప్రకాశం జిల్లాల ప్రజలు అత్యధికంగా విదేశాలకు వెళుతూనే ఉంటారు. ఉద్యోగరీత్యా,కాని, వ్యాపార రీత్యా గాని తరచు ప్రయాణిస్తూనే ఉంటారు అటువంటి సందర్భాలలో ప్రయాణికులు అంతర్జాతీయ విమాన సర్వీసులు కోసం హైదరాబాద్ వెళ్ళవలసి వస్తున్నది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రోజు 11 విమానాలు దుబాయ్ కి, మరో 10కి పైగా సర్వీసులు సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్, బహ్రెయిన్, కువైట్ దేశాలకు వెళుతున్నాయి. సగటున రోజుకి 2500 మంది ప్రయాణికులు కేవలం దుబాయ్ విమానాలలో ప్రయాణం చేస్తుంటారు. అందులో సగం మంది ఆంధ్ర రాయలసీమ ప్రాంత వాసులే. వీళ్ళు అందరూ కేవలం గల్ఫ్ వరకు మాత్రమే ప్రయాణం చేయరు. అక్కడ నుంచి అమెరికా ఐరోపా దేశాలకు కనెక్టింగ్ విమానాలలో గమ్యస్థానాలకు చేరుకుంటారు

చంద్రబాబు చలవే

మనదేశంలో 2003 వ సంవత్సరం వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు అనుమతి లేదు. కేవలం దేశీయంగా మాత్రమే ఎయిర్ సహారా, ఎయిర్ డెక్కన్, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు సర్వీసులు నడిపేవి… కేవలం ఎయిర్ ఇండియా, ఇతర దేశాల విమానాలు మాత్రమే అంతర్జాతీయ సర్వీస్ లు నడుపుతుండేవి .ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు ఎమిరేట్స్ విమానాన్ని బేగంపేట విమానాశ్రయానికి రప్పించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో ఎమిరేట్స్ విమానం బేగంపేట విమానాశ్రయంలో అడుగుపెట్టింది .శ్రీ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అప్పట్లో దుబాయిలో ఉన్న దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ ఎమిరేట్స్ విమాన సర్వీసులు కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఎమిరేట్స్ కి, భారతదేశంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య రాజేంద్రప్రసాద్ సంధానకర్తగా వ్యవహరించి హైదరాబాదుకు విమాన సర్వీసును రప్పించారు. 2001 జూలై రెండవ తేదీన మొట్టమొదటి ఎమిరేట్స్ విమానం హైదరాబాదు వచ్చింది.

ఎమిరేట్స్ విమానం హైదరాబాదుకు వచ్చిన మొత్తం వైనాన్ని ఈ వ్యాస రచయిత శ్రీ వేమూరి రాజేష్ తో శ్రీ రాజేంద్రప్రసాద్ వివరించారు. అయితే, ఎమిరేట్స్ విమానాన్ని రప్పించిన ఘనత శ్రీ చంద్రబాబుదేనని శ్రీ రాజేంద్రప్రసాద్ చెప్పేవారట.

ఎందుకీ ఉదాసీనత

ఈ మొత్తం విషయాన్ని ఎందుకు గుర్తు చేయవలసి వచ్చిందంటే, రాష్ట్ర రాజధానికి అంతర్జాతీయ విమానాలు రాకపోతే పెట్టుబడిదారులు రారని అప్పట్లో భావించిన శ్రీ చంద్రబాబు బేగంపేట విమానాశ్రమానికి ఎమిరేట్స్ విమానాలను రప్పించారు. అదే శ్రీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తున్నా గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు రప్పించడంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాని విషయం. అప్పటి బేగంపేట విమానాశ్రయం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని దగ్గరలో ఉన్న గన్నవరం విమానాశ్రయం విషయంలో శ్రీ చంద్రబాబు చూపటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇంతకుముందు అంటే 2014, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం లో విమానయాన మంత్రిత్వ శాఖను ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం సభ్యులే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ, అంతర్జాతీయ హోదా ఉన్న గన్నవరం విమానాశ్రయానికి ఒక్క డైలీ అంతర్జాతీయ విమాన సర్వీసు సాధించలేకపోయారని,ఈ విషయంలో శ్రీ చంద్రబాబు ఎందుకు శ్రద్ధ చూపటం లేదో అర్థం కావటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

2003 వ సంవత్సరం తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఓపెన్ స్కై పాలసీ తీసుకు వచ్చింది. ఆ మరుసటి సంవత్సరం నుండే ఇండిగో, జెట్, స్పైస్ జెట్ వంటి ప్రైవేటు ఎయిర్ లైన్స్ ఇతర దేశాలకు నేరుగా విమానాలు నడపడం ప్రారంభించాయి. ఓపెన్ స్కై పాలసీ విధానం లేని రోజులలోనే బేగంపేట విమానాశ్రయానికి శ్రీ చంద్రబాబుఎమిరేట్స్ విమానాన్ని రప్పించారు.

సింగపూర్ సర్వీసు రద్దు

2014 ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే శ్రీ చంద్రబాబు నాయుడు విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకువచ్చి సింగపూర్ కి విమాన సర్వీసు సాధించారు. పాత టర్మినల్ పక్కన కొత్త టెర్మినల్ కూడా ఆగమేఘాల మీద నిర్మించారు. రన్ వే నుండి పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా విస్తరించారు. ఆ తర్వాత మరో పెద్ద ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కి శంకుస్థాపన కూడా చేశారు. అయితే, ఆ నిర్మాణం కూడా మందకుడిగా సాగింది. ఇంతలో 2019లో అధికారంలోకి వచ్చిన కొత్త ప ప్రభుత్వం ఉన్న ఒక్క సింగపూర్ సర్వీసును రద్దు చేయడంతో పాటు నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ విషయంలో ఏమీ పట్టనట్లు వ్యవహరించింది.

షార్జా వరకే పరిమితం

ఇప్పుడు కేవలం ఒక ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం మాత్రం వారానికి రెండుసార్లు విజయవాడ నుండి షార్జా కు వెళుతున్నది. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సర్వీసు. కానీ ఈ సర్వీస్ షార్జా వరకే పరిమితం. అక్కడ నుండి కనెక్ట్ ఫ్లైటు ఉండదు . ఇంటర్నేషనల్ టెర్మినల్ గా ఇంతకు ముందు ఉన్న పాత భవనాన్ని ఉపయోగిస్తూ విమానాలకు కొత్త టెర్మినల్ వాడుతున్నారు. షార్జా విమానాల్లో 180 మంది ప్రయాణికులు వస్తుంటే, ఇమిగ్రేషన్ కౌంటర్ గదిలో 50 మంది మాత్రమే వేచి ఉండటానికి స్థలం ఉన్నది. దీనితో బయటకు రావడానికి చాలా సమయం పడుతున్నది. వారంలో వచ్చే ఈ రెండు విమానాల కోసం ఇప్పుడు ఉన్న దేశీయ విమానాలకి వాడుతున్న కొత్త టెర్మినల్ ఉపయోగిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక, త్వరితగతిన బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.

ఎమిరేట్స్ ప్రతినిధుల సర్వే

కేంద్ర విమానా శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు శ్రీ రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్నారు భోగాపురం విమానాశ్రయం మీద అమితమైన శ్రద్ధతో త్వరితగతిన నిర్మాణం పూర్తి అయ్యేటట్లుగా పర్యవేక్షించడం మంచిదే. కానీ రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులు రప్పించడంలో కూడా శ్రద్ధ వహిస్తే బాగుంటుంది అని ప్రజలు భావి స్తున్నారు. ఎప్పుడో పూర్తయ్యే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కోసం చూడకుండా ఉన్న వనరులతోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల ఎమిరేట్స్ ప్రతినిధులు వచ్చి నూతన టెర్మినల్, రన్ వే పై సర్వే చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎమిరేట్స్ వంటి పెద్ద సర్వీసులు అంత సులువుగా కొత్త సర్వీసులు ప్రారంభించవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ బోయింగ్ 7777 విమానాలే. అందులో 350 నుంచి 400 మందికి సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. వయబిలిటీ చూసుకున్నా అంత సులువుగా రావడం కష్టమే. అన్నిటిని మించి 201 4 మన దేశంలోకి గల్ఫ్ దేశాల విమానాలకు అనుమతి పరిమితంగా ఉంది. సీట్ల నిష్పత్తి సమానంగా ఉండాలనే నిబంధన వల్ల ఎమిరేట్స్ వంటి గల్ఫ్ విమాన సంస్థలు ఎటువంటి కొత్త సర్వీసులను భారతదేశానికి నడిపే అవకాశం లేదు. కాబట్టి మన దేశ విమాన సంస్థలు మాత్రమే గల్ఫ్ కి విమానాలు నడపగలవు.

ఇండిగో, స్పైస్ జెట్, విస్తార నడిపే 180 సీట్ల విమానాలు ఇప్పుడు విజయవాడ విమానాశ్రయంలో ఉన్న సౌకర్యాలతో అద్భుతంగా నడుస్తున్నాయి. ప్రైవేట్ విమానయాన సంస్థలు అన్నీ చాలా అంతర్జాతీయ విమాన సంస్థలతో కోడ్ షేరింగ్ ఒప్పందాలు కలిగి ఉంటాయి. కోడ్ షేరింగ్ అంటే ఉదాహరణకి అమెరికాకి, యూరప్ కి వెళ్లే వాళ్లు హైదరాబాద్ నుండి ఖతర్ ఎయిర్ వేస్ కి బుక్ చేసుకుంటారు. హైదరాబాద్ నుండి ఖతర్ ఎయిర్ వేస్ కి కోడ్ షేరింగ్ బేసిస్ లో ఇండిగో విమానంలో ఖతర్ కి వెళ్లి అక్కడ ఖతర్ ఎయిర్ వేస్ విమానం ఎక్కుతారు. ఇది ఇండిగో కి ఖతర్ ఎయిర్ వేస్ కి ఉన్న ఒప్పందం వల్ల ఒకే టికెట్ తో ఈ రెండు విమానాలు బుక్ అవుతాయి. ఇమిగ్రేషన్, లగేజ్ అన్నీ హైదరాబాదులోనే పూర్తవుతాయి. రెండు విమానయాన సంస్థల మధ్య ఉన్న అవగాహన వల్ల ఖతర్ విమానాశ్రయంలో విమానం మారినప్పుడు లగేజీ కూడా ఎయిర్ లైన్స్ వాళ్లు మార్చుకుంటారు.

గల్ఫ్ కి ప్రైవేట్ విమానాలు నడపాలి

ఎప్పుడో పూర్తయ్యే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కోసం ఎదురుచూడకుండా, ఆ తర్వాత మరెప్పుడో వచ్చే ఎమిరేట్స్ విమాన సర్వీసులు కోసం ఎదురు చూడకుండా ఏవైనా ప్రైవేట్ సంస్థలు ముందుగా గల్ఫ్ కు విమాన సర్వీసులు ప్రారంభిస్తే రాజధాని అమరావతికి అంతర్జాతీయ కనెక్టివిటీ వస్తుంది. నేరుగా విజయవాడ నుండి అమెరికా, ఐరోపా, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది.

రోజు గోదావరి జిల్లాల నుంచి దాదాపు 20 బస్సులు శంషాబాద్ కు నడుస్తున్నాయి. ఈ ప్రయాణికులు అంతా గల్ఫ్ లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు. కృష్టా, ఎన్టీఆర్ , ప్రకాశం ,ఉభయ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి వేలాది మంది విదేశాలకు వెళుతుంటారు ఈ ఏడు జిల్లాలకు అతి దగ్గరగా ఉండేది విజయవాడ విమానాశ్రయం.

ప్రస్తుతం ఉన్న వనరులతో ముందుగా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించి కనెక్టివిటీ సాధించాలి. అందుకు సమాంతరంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ని పూర్తి చేసి పెద్ద విమాన సర్వీసులు ప్రారంభించాలి. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడితే ప్రవాసులకు మేలు జరగడంతో పాటు రాష్ట్ర ప్రగతికి విమానయానం తోడ్పడుతుంది. ఇటీవల ప్రారంభించిన వెస్ట్ బైపాస్ ద్వారా అమరావతికి 40 నిమిషాలలో చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయితే అన్ని జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది .ఉన్న విమానాశ్రయానికి సర్వీసులు తీసుకురాకుండా ఇంకో పది సంవత్సరాలు ఆగండి, కొత్త విమానాశ్రయం కట్టిన తర్వాత విమానాలు వస్తాయి అంటే తటస్తులు సైతం సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గల్ఫ్ అంటే దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించడం ద్వారా కేంద్ర విమానయానా శాఖామంత్రి సొంత రాష్ట్ర రాజధానికే అంతర్జాతీయ సర్వీసులు లేవనే అపప్రద నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల ముందు గన్నవరం విమానాశ్రయం సగర్వంగా తలెత్తుకోవచ్చు.