“కాస్సేపు విశ్రాంతి తీసుకోండత్తయ్యా… రైలులో సరిగా నిద్ర పట్టి ఉండదు మీకు…” అత్తగారు తాగిన కాఫీ గ్లాసు అందుకుంటూ అన్నది విశాలాక్షి.
“ఏదో కొంతసేపు నిద్రపోయానే… నువ్వన్నట్లు సరిగా నిద్ర పట్టదు… అయినా ఇప్పుడింక పడుకున్నా నిద్ర రాదు…మధ్యాహ్నం ఎలానూ ఓ కునుకు తీస్తాగా…” అన్నది అత్త అనసూయమ్మ.
“అవునూ…ఓ పదిహేను ఇరవై రోజులుంటానని వెళ్లారుగా అత్తయ్యా…వారం కాకుండానే తిరిగొచ్చేశారేం?” నవ్వుతూ అడిగింది విశాలాక్షి, ఖాళీగ్లాసు వంటింటిలోని సింక్లో పడేసి వచ్చి అత్తగారి పక్కనే సోఫాలో కూర్చుంటూ.
కోడలి ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేదు అనసూయ. అభావంగా చూస్తూండిపోయింది. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో…ఎలా మొదలెట్టాలో అన్న మీమాంసలో ఉంది అనసూయ.
“చంటాడు అర్నవ్ పుట్టిన రోజొస్తోంది… మనందర్నీ రమ్మని చిన్నాడు హేమంత్ ఫోన్ చేశాడు… అందరికీ వీలు కాకపోతే కనీసం నన్నూ, మీ నాన్ననీ రమ్మని చిన్నాడు మరీమరీ చెప్పాడురా… నీకు కళాశాలలో పరీక్షలు అంటున్నావు… నాన్నేమో నాకు ఓపికలేదు…నువ్వెళ్లు అంటున్నారు. ఎవరో ఒకళ్లు వెళ్లకపోతే బావుంటుందా? ఎవరూ వెళ్లకపోతే చిన్నాడు చిన్నబుచ్చుకుంటాడు…చిన్నకోడలు అలుగుతుంది కూడానూ…” పదిరోజుల క్రిందట అనసూయ అనడంతో: “అవునమ్మా…ఎవరో ఒకరు వెళ్లాలి… లేకపోతే తమ్ముడు బాధపడతాడు… పోనీ నువ్వెళ్లిరారాదూ?” పెద్దకొడుకు మనోహరం అన్నాడు తల్లి అనసూయతో.
“వెళ్లమంటావా అయితే… పోనీ విశాలా నేనూ వెళదామంటే ఇక్కడ నీకూ, నాన్నకీ ఇబ్బంది మరి…” అనసూయ అన్నది.
“అందుకే నువ్వు వెళ్లమ్మా… ఓ నాలుగురోజులు ఉండిరా…వాడూ సంతోషిస్తాడు…” మనోహరం చెప్పాడు.
“అవునత్తయ్యా…వెళ్లిరండి…” విశాలాక్షి అన్నది.
“ఇక్కడ రైలు ఎక్కి… అక్కడ దిగడమేగదా! మీరూ రండి…” అడిగింది భర్త శంకరాన్ని అనసూయ.
“అవుననుకో…కానీ నా వల్ల కాదే అనసూయా… నా పరిస్థితి నీకు తెలియంది కాదు… అక్కడకొచ్చి వాళ్లని ఇబ్బంది పెట్టడం తప్ప…నువ్వెళ్లిరా చాలు…” శంకరం చెప్పాడు తనకున్న సుగరూ, బీపీ, కీళ్ల నొప్పులూ వగైరా బాధలు తల్చుకుంటూ. “అదీ నిజమే లెండి…” అనసూయ అన్నది.
“అందుకే మీరు వెళ్లండి అత్తయ్యా…” విశాలాక్షి అన్నది.
“అవునమ్మా…నువ్వెళ్లిరా…” మనోహరం అన్నాడు.
"అలాగే వెళతాను…ఓ పదిహేను… ఇరవై రోజులుండి వస్తాను…’ అంటూ సంతోషంగా వెళ్లిన అత్తయ్య అనసూయ నాలుగు రోజులకే తిరిగి వచ్చేయ్యడం విశాలాక్షికి పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు.
కానీ, ఆవిడ మామూలుగానే అక్కడ తోచక… అంటే తన తోటికోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోవడం వల్ల… వచ్చేసిందా…మరేదన్నానా అన్నదే ఆలోచన.
తన మరిది హేమంత్ గురించి, అతడి భార్య, తన తోటికోడలు అయిన శ్రీదేవి గురించీ ఆమెకు బాగానే తెలుసు. తన భర్త మనోహరం మాదిరిగా కాదు హేమంత్.
అన్నిటికీ హడావిడి పడిపోవడం, ఒక్కోసారి నోటికి ఎంతొస్తే అంత అనేయ్యడం అతడికి అలవాటు. అతడికి తగ్గట్లే భార్య శ్రీదేవికి కూడా కాస్త నోటి దురుసు ఎక్కువే.
దానికితోడు పట్నంలో పుట్టి పెరిగిన సంస్కృతి బాగా వంటబట్టించుకున్న మనిషి. వాళ్లతో ఈవిడకి పడలేదా? వాళ్లేదైనా నోరు జారితే ఈవిడ నొచ్చుకున్నదా? ఇరవై రోజులు ఉంటానని వెళ్లినావిడ ఇలా నాలుగు రోజులకే అర్ధంతరంగా వచ్చేసిందంటే అక్కడేదైనా జరిగి ఉండాలి…’ అనుకుంటూ పరిపరి విధాల విశాలాక్షి ఆలోచనలో పడింది.
ఇప్పుడో, అప్పుడో ఈరోజో, రేపో అత్తగారు అక్కడ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు తనకి చెప్పకపోదు. అయినా ఆమె ఆత్రం ఆమెది.
అలాగని తోటికోడలిమీద అక్కసో, మరేదో మాత్సర్యమోలాంటివేమీ విశాలాక్షికి లేవు… ఆ ఇంటికి పెద్ద కోడలిగా విశాలాక్షి కాపురానికి వచ్చిన నెలరోజులకే మంచి మార్కులు తెచ్చుకున్నది.
ఆమెకు తగ్గట్టుగానే కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మనోహరం కూడా పద్ధతైన వాడు. ఇంట్లో ఏ విషయమైనా సరే పెద్దాడితో ఓ మాట చెప్పాలి… అని తల్లిదండ్రులు తనకి ప్రాముఖ్యత ఇచ్చేంతగా నడుచుకుంటాడు మనోహరం.
“అక్కడేదో జరిగే ఉంటుంది… ఏదోలే పెద్దావిడ వచ్చింది… నాలుగురోజులుంటుంది… కాస్త జాగ్రత్తగా ఉండొద్దూ…” అని తోటికోడలు, మరిది గురించి అనుకున్నది విశాలాక్షి.
ఆ ప్రక్కనే కుర్చీలో కూర్చుని వార్తాపత్రిక చదువుకుంటున్న మామ శంకరం చిన్నగా దగ్గడంతో విశాలాక్షి గోడనున్న గడియారం కేసి చూసింది.
సమయం ఏడున్నర కావస్తూండటంతో, మామగారికి అల్పాహారానికి టైమయిందని, ఆయన మందులు వేసుకోవాలని గుర్తొచ్చి, చిన్నగా నవ్వుకుని-“ఇడ్లీలు పెడుతున్నానత్తయ్యా…” అంటూ లేచి వంటింట్లోకి వెళ్లింది.
అలా వెళుతున్న పెద్దకోడలు విశాలాక్షిని చూసి సంతృప్తిగా తలూపింది అనసూయ. ఆ మధ్య కరోనా అంటూ ఓ కొత్త రోగం వచ్చి శుచి శుభ్రత అంటూ…మూతికి గుడ్డలు, చేతికి మాటిమాటికీ శానిటైజర్లు…అంటూ నానా హంగామా చేసి, కొందర్ని తనతో పైకి తీసుకుపోయి, మరికొందర్ని పీల్చిపిప్పిచేసి, ఉన్నదంతా ఊడ్చేసి… వెళ్లిపోయింది.
కానీ, తన కోడలు ఉదయం స్నానం చెయ్యనిదే వంటా వార్పూ జోలికెళ్లదు. ఎప్పుడూ కడిగిన ముత్యంలాగానే ఉంటుంది. శుచీ,శుభ్రత విషయంలో ఆమె చాలా నిక్కచ్చి మనిషి!
అందుకే కరోనా ఆ ఇంటి దరిదాపుల్లోకి రాలేదు! ఎవరూ చిర్రున చీదలేదు…ఒళ్లు నొప్పులంటూ పడుకోనూ లేదు! “టిఫిన్లోకి పచ్చడి ఏదన్నా చెయ్యాలా విశాలా?” అంటూ వంటింట్లోకి వచ్చింది అత్త అనసూయ.
“అక్కర్లేదు అత్తయ్యా… నిన్న చేసింది ఫ్రిజ్ లో ఉందిలెండి…” చెప్పింది విశాలాక్షి.
“ఏమిటో…ఇక్కడ మన వంటిల్లు ఇంత శుభ్రంగా ఉంటుంది… అక్కడ ఓ శుచీ శుభ్రతా లేదే విశాలా!.. గ్యాస్ పొయ్యి కూడా శుభ్రం చేసుకోరు…జిడ్డుపట్టి ఉంటుంది. కూరలు తరిగాక ఆ చెత్త వెంటనే చెత్తబుట్టలో పడెయ్యాలా… ఊహు…ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు పడేస్తారు…మూతలూ సరిగా పెట్టరు… ఏం మనుషులో ఏంటో…” విశాలాక్షి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి వేస్తూంటే అనసూయ చిన్నకొడుకు హేమంత్ ఇంటి గురించి చెప్పుకొచ్చింది.
చిరునవ్వుతో విన్నది విశాలాక్షి. ఆ విషయం తను చాలాసార్లు గమనించిందే!
“సరే! ఏ కూర చేస్తావ్?” అంటూ ఫ్రిజ్ తలుపు తీసింది అనసూయ. “మీ ఇష్టం అత్తయ్యా ఏదో ఒకటి…” అన్నది విశాలాక్షి. “మన ఫ్రిజ్ చూడు ఎంత శుభ్రంగా ఉంటుందో… అక్కడ వాళ్ల ఫ్రిజ్ అస్సలు శుభ్రంగా ఉండదే విశాలా! కూరలు, డ్రింకు సీసాలూ, చాక్లెట్లూ… ఇంకా ఏవేవో… అన్నీ కుక్కేసినట్లుంటాయి… ఓ పద్ధతిగా సర్దుకోవచ్చుగా… ఏం మనుషులో… అంత టైము లేకుండా ఉన్నారా?!” అన్నది అనసూయ ఆరోజు వండాల్సిన కూరలు తీసి కడుగుతూ. “ఇద్దరూ ఉద్యోగాలు కదా అత్తయ్యా… సమయమూ ఉండదు… ఆఫీసులో పనిచేసి వచ్చేసరికి ఎంతయినా అలిసిపోతారు…” సర్ది చెప్పింది విశాలాక్షి,
“అదీ నిజమే అనుకో… కానీ ఒక్క పావుగంట ఓపిక పడితే శుభ్రంగా సర్దుకోవచ్చుకదా?!.. నువ్వెన్నయినా చెప్పు ఇద్దరికీ బద్ధకమే…” ఆ మాటకి విశాలాక్షి ఏమీ అనలేదు. మరిదీ, తోటికోడళ్లిద్దరికీ కొన్ని విషయాల్లో శ్రద్ధ లేని మాట నిజమే అని ఆమెకు తెలియంది కాదు.
“పనమ్మాయి వస్తుంది… ఏదో చేస్తుంది. వెడుతుంది… దగ్గరుండి జాగ్రత్తగా పని చేయించుకోవాలి కదా?..ఉహు…లేదు… ఏమోనే అమ్మాయ్ శుభ్రత తక్కువ వాళ్లకి…” అన్నది అనసూయ. నవ్వి ఊరుకున్నది విశాలాక్షి. “ఈ మధ్య వాళ్లో కుక్కని పెంచుతున్నారు. అది ఆంగ్లం కుక్క… దానికి తెలుగు రాదుట నా మొహం… నాకు ఆంగ్లం రాదు…దానికి తెలుగులో చెబితే అర్థం కాదుట. గో గో… కమ్ కమ్… అనాలిట! అది మనం పడుకునే మంచాలు ఎక్కిదొర్లుతుంటే నాకదోలా అనిపించేది సుమా… ఇక ఆ కుక్క… దానికేదో పేరు… ఆంగ్ల పేరేలే… అది చంటాడు అర్నవ్ మూతి నాకుతుంటుంది…వాడూ దాన్ని ముద్దులు పెట్టేసుకుంటుంటాడు…ఏ రోగాలు అంటుకుంటాయోనని నాకు భయం…“ఫర్వాలేదత్తయ్యా కుక్కకి ఇంజెక్షన్లు చేయించాం” అంటుంది శ్రీదేవి… ఏం ఇంజెక్షన్లో ఏమిటో… ఎవరి పిచ్చి వాళ్లకానందం అన్నట్లు. ఎవరి కుక్క వాళ్లకానందంలే…” ఆ మాటకి విశాలాక్షి నవ్వింది.
“అక్కడ నేనున్నది నాల్రోజులే…మూడు రోజులు సాయంత్రాలు బయటనుంచి తెప్పించడమే… పూరీనో, చపాతీనో… నాకు. వాళ్లకి ఏవేవో న్యూడిల్స్…ఫ్రైడ్ రైసులాంటివన్నమాట… వాళ్ల మోజులు నేను కాదనను… కానీ, రోజూ అంటే… పోనీ నేను చేస్తానురా అంటే వాడు ఎందుకమ్మా శ్రమ అంటాడు… ఇంట్లో వండుకోవడమూ శ్రమ అంటే ఎలానే విశాలా?! నిద్రలేచి ఆ బట్టలతో వంటా వార్పూ అంటే… నాకదోలా అనిపించేదే… ఏమన్నా అంటే శ్రీదేవి ఏమనుకుంటుందోనని ఊరుకున్నాను… రోగాలు ఎలా వస్తాయి… శుచీ శుభ్రతా ఉండాలి కదా!..”
"హేమంత్ తొమ్మిదింటికల్లా వెళ్లిపోతాడు కార్యాలయానికి. దాదాపు అదే సమయానికి శ్రీదేవీ వెళ్లిపోతుంది. ఏమిటో హడావిడిగా వండుకోవడం…బాక్స్ ల్లో పెట్టుకుని వెళ్లిపోవడమూను… శ్రీదేవి వెళుతూ చంటాడిని డేకేర్లో వేసి వెళ్లిపోతుంది ఆఫీసుకి. ఇక ఇంట్లో ఉండేది నేనొక్కద్దాన్నే! రాత్రి వాళ్లొచ్చేసరికి ఏడున్నరా ఎనిమిదీ అవుతుంది… అప్పటి దాకా ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కూర్చోవాలి…ఓ పక్కింటి వాళ్ల పలకరింపూ ఉండదు… అపార్ట్ మెంట్ కిందికి వద్దామంటే…వచ్చి అక్కడ మాత్రం ఏం చెయ్యాలి…అక్కడికీ కాపలావాడి పెళ్లాంతో కాస్సేపు కబుర్లు చెబుతూ కూర్చున్నాను…ఓ ఇరుగూ, పొరుగూ లేని ఏం జీవితాలే అవి… అందుకే ఉండలేకపోయానే విశాలా!
చంటాడి పుట్టినరోజు నాడు… హాలంతా బాగానే అలంకరణ చేశారు. అపార్ట్ మెంట్ లోని పిల్లలూ బాగానే వచ్చారు… పెద్ద కేకు పెట్టారు…వాడికిది మూడో పుట్టినరోజు కదా మూడు కొవ్వొత్తులు వెలిగించారు. అందరూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటే చంటాడు అర్నవ్ వాటిని ఉఫ్ అంటూ ఆర్పేశాడు. తర్వాత కేకు ఒకళ్లకొకళ్లు తినిపించుకున్నారు. నేనూ చంటాడికి తినిపించాను. ఆ తర్వాతేంటో కేకును ముఖాలకు రాసుకుని గంతులేశారు… ఏంటో ఆ తంతు…విశాలా దీపాలు ఆర్పడమేంటే?!.." గుక్క తిప్పుకోకుండా మాట్లాడేసిన అనసూయ అడిగింది కోడలు విశాలాక్షిని.
“అదే అత్తయ్యా! మూడేళ్లు గడిచిపోయాయని…” ఏమిటీ అంటే ఇది అని విశాలాక్షీ కచ్చితంగా చెప్పలేకపోయింది. “సరేలే…ఈ వైశాఖంలోనే కదా మన అనన్య పుట్టినరోజు?” అడిగింది. విశాలాక్షి కూతురు అనన్య. ఇప్పుడామెకి ఐదో ఏడు దాటి ఆరో సంవత్సరం వస్తోంది. యుకేజీ కూడా దాటి మొదటి తరగతిలోకి రాబోతోంది.
“అవునత్తయ్యా…తిధుల వారీ అయితే పన్నెందో తేదీ…తారీఖుల వారీగా అయితే పద్దెనిమిది…” చెప్పింది విశాలాక్షి. “సరే! మొదటిది మన ఇంటి వరకే పరిమితం చేద్దాం…తేదీల ప్రకారం పద్దెనిమిదిన నలుగురినీ పిలుద్దాం… అన్నట్లు… వీలైతే వస్తారు సరదాగా… హేమంత్ నీ, శ్రీదేవినీ రమ్మని ఫోన్ చెయ్యండి…” చెప్పింది అనసూయ. “అలాగే అత్తయ్యా…మీ అబ్బాయి ఫోన్ చేస్తానన్నారు… అయినా మళ్లీ చెబుతాన్లేండి…” అన్నది విశాలాక్షి. వారం రోజుల్లో అనన్య పుట్టినరోజు రానే వచ్చింది. తిధుల ప్రకారం ఆ రోజు సోమవారం కావడంతో మనవరాలికి తలంటి స్నానం చేయించి కొత్తబట్టలు వేసి, తాతా నానమ్మలిద్దరూ ముద్దుగా గుడికి తీసికెళ్లి అర్చన చేయించుకొచ్చారు… కూతురుకి ఇష్టమైన సేమ్యా పాయసం చేసింది విశాలాక్షి.
ఇక తేదీల వారీగా పద్దెనిమిదో తేదీ ఆదివారం కావడంతో నలుగురూ రావడానికి సెలవురోజయింది. ఆ ఉదయమే ఆరింటికల్లా హేమంత్, శ్రీదేవి, అర్నవ్ దిగారు. వాళ్లని చూడగానే అనన్య ఎగిరి గంతేసింది. ఇల్లంతా సందడి. హేమంత్, శ్రీదేవి, మనోహరం కలసి హాలంతా బాగా అలంకరించారు. పెద్ద కేకు తీసుకొచ్చారు. శ్రీదేవి, విశాలాక్షి బజారుకి వెళ్లి పిల్లలకి ఇవ్వడానికి కానుకలు కొనుక్కొచ్చారు. కేటరింగ్ కి చెప్పే వంటకాల విషయంలో శ్రీదేవి ఏదో చెప్పబోతే విశాలాక్షి కళ్లతోనే వారించింది. అనసూయే ఏం కావాలో చెప్పేసింది.
“వచ్చిన వాళ్లు తృప్తిగా కడుపు నిండా తినాలి… ఏవేవో తెప్పించి… ఆ వచ్చిన వాళ్లు కంచం నిండా పెట్టించుకుని ఏం తినాలో తెలియక… అంతా చెత్తబుట్టలో పారెయ్యడం కాదు భోజనమంటే… హాయిగా తినాలి…” అన్నది అనసూయ. ఆ మాటకి హేమంత్ చివుక్కున తలెత్తి తల్లికేసి చూశాడు… తన కొడుకు అర్నవ్ పుట్టిన రోజునాడు… అనసూయ పళ్ళెంలో బిర్యాని, ఫ్రైడ్ రైస్… ఇంకా ఏదో మీటా… ఏం తినాలో తెలియక… ఏదీ తినలేక… ఏదో నాలుగు మెతుకులు కెలికినట్లు తిని మొత్తం చెత్తబుట్టలో పారేసిన సంఘటన గుర్తుకొచ్చింది హేమంత్ కి ఆ క్షణం. ఓ అరటిపండు తిని మంచినీళ్లు తాగిందామె. ఇప్పుడు తల్లి అన్న మాటకు అతడేం మాట్లాడలేదు.
అక్కడ అది మెట్రో సిటీ వాతావరణం… ఇక్కడ కొంత తేడా ఉంది…ఇది తెలుగులో ఇంచక్కా చెప్పుకునే విందు! సోఫాలు పక్కకి జరిపి ఓ పది కుర్చీలు వేయించాడు మనోహరం. హాలులో ఓ చివర మధ్యలో చిన్న టేబులు, దాని మీద కేకు పెట్టారు. దాని ప్రక్కనే గుప్పెడంత సైజులో ఉన్న సరస్వతీ దేవి ప్రతిమ పెట్టించింది అనసూయ, దానికెదురుగా దీపపుకుందెలో నూనెపోసి వత్తి పెట్టింది.
ఓ అరగంటకి పిల్లలు, పెద్దలతో హాలు నిండిపోయింది.
“అంతా వచ్చినట్లున్నారుగా… ఇక కేక్ కట్ చేయించండి మరీ…” హేమంత్ అన్నాడు. చిన్న రాజకుమారిలా కొత్త బట్టల్లో మెరిసిపోతున్న అనన్యని తీసుకొచ్చింది విశాలాక్షి. ఆమె, భర్త మనోహరం పక్క పక్కనే నిల్చోగా, అనసూయ మనవరాలిచేత సరస్వతీ దేవి దగ్గర దీపం వెలిగించింది. చేతులు జోడించి నానమ్మకేసి చూసింది అనన్య. ‘హ్యాపీ బర్త్ డే’ అని పాడబోతున్న వారంతా క్షణం ఆగారు.
“యాకుందేందు…తుషార హార…” అంటూ అనసూయ సరస్వతీ ప్రార్థన అందుకోగానే, నానమ్మతో బాటుగా అనన్య కూడా శృతి కలిపింది. ఓ కొత్త దృశ్యాన్ని చూస్తున్న వారంతా నిశ్శబ్దంగా, తమకు తెలియకుండానే చేతులు జోడించారు. “అద్భుతం…ఇది మంచి సంప్రదాయం…” వచ్చిన వారిలో, మనోహరం కళాశాలలో అతడి విభాగం హెడ్ ప్రొఫెసర్ సారంగ అన్నాడు. “అవును… అవును…” మరికొన్ని గొంతులు కలిశాయి. హేమంత్ కి తనకి అమ్మ నేర్పిన పద్యాలు, శ్లోకాలు గుర్తుకొచ్చాయి. అతడి పెదవులు, మనోహరం దంపతులూ కూడా అనసూయ పాడుతున్న శ్లోకంతో శృతి కలిపాయి… శ్రీదేవి ఆశ్చర్యంగా చూస్తోంది. వచ్చిన వారంతా శ్రద్ధగా విన్నారు. కొందరు పెదవులు కదిల్చారు… వాగ్దేవి ప్రార్థన అయింది. ఆ ప్రక్కనే ఉన్న తాత శంకరం, నానమ్మ అనసూయ మనవరాలు అనన్య శిరస్సుమీద అక్షతలు వేసి ఆశీర్వదించారు. తర్వాత తల్లిదండ్రులు…పిన్నీ బాబాయ్. ఇంకా వచ్చిన వారిలో పెద్దలనబడే వారూ… ఆశీర్వదించారు. అందరికీ అనన్య నవ్వుతూ కాళ్లకి నమస్కారం చేసింది. అదయ్యాక అనసూయ గొంతు సవరించుకుని: “దీపం జ్యోతి పరబ్రహ్మ… అన్నారు మన పెద్దలు… మనది దీపాలు ఆర్పే సంస్కృతి కాదు. దీపాలు ఆర్పడం శుభసూచకం కాదు కూడా! దీపం వెలిగించే సంస్కృతి మనది. ఏ శుభ కార్యానికైనా, ఆఖరికి సభలు ప్రారంభించే ముందూ మనం జ్యోతి వెలిగించి మరో కార్యక్రమాలు మొదలెడతాం… అనన్య చదువుకుంటున్న పిల్ల. అందుకే వాగ్దేవి అయిన ఆ సరస్వతీ దేవి ముందు దీపం వెలిగించి మా మనవరాలి చేత ఇలా ప్రార్థన చేయించాను…ఇప్పుడు కేకు కట్ చేయడం…వగైరా మీ సరదాలు కానివ్వండి…” అని చేతులు జోడించి అందరికీ చెప్పేసరికి ప్రొఫెసర్ సారంగ: “అవును. అవును. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. మనం ఇవి మర్చిపోతున్నాం. పిల్లలూ ప్రారంభించండి… హ్యాపీ బర్త్ డే అనన్యా…” అంటూ అందుకున్నారు.
అందరూ చప్పట్లు కొడుతూ శృతి కలిపారు. అనన్య కేక్ కట్ చేసింది. అందరూ చిన్నచిన్న ముక్కలు ఆమెకు తినిపించారు. తమాషా ఏమిటంటే…ఎవరూ చెప్పనక్కర్లేకుండానే… అక్కడ అందరిలో ఓ క్రమశిక్షణ దానంతట అదే వచ్చేసింది. పిల్లలు పొందికగా కేకు ముక్కలు పెట్టిన పళ్ళెం అందుకున్నారు…
“ఉఫ్… అంటూ కొవ్వొత్తులు ఆర్పడమేంటి?! అయినా అది మన సంప్రదాయం కాదు…ఇదిగో ఈ సినిమా వాళ్లూ, టీవీ వాళ్లూ నేర్పుతున్న పనికిమాలిన పద్ధతులు…ఇక మనింట్లో పుట్టినరోజులు ఇలాగే చెయ్యాలి…” ఇలా ఎవరికి తోచింది వాళ్లు అనుకుంటూ…ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటూ, ఇంకా మన ఆచారాల గురించి చెప్పుకుంటూ అందరూ హాయిగా భోజనం చేశారు…చెత్తబుట్టలో చాలా భాగం ఖాళీ ఆకులే ఉన్నాయి…
“వదినా…అద్భుతం…బాగా చేశారు…” హేమంత్ అన్నాడు విశాలాక్షితో.
“ఈ ఆలోచన అంతా మీ అమ్మగారిదేనయ్యా… నేను ఆచరించానంతే… ఈ వేడుక ఇంత బాగా జరిగిందంటే ఆ ఘనత మీ అమ్మగారిదే.” నవ్వుతూ చెప్పింది విశాలాక్షి.
“బావుంది అత్తయ్యా… చాలా బావుంది… ఇకనుంచి మేమూ ఇలానే చేస్తాం…” శ్రీదేవి అన్నది.
“పిల్లలకి మన సంప్రదాయాలు చెప్పాలి… వారసత్వంగా ఆస్తులు ఇచ్చినట్లే… ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఇవ్వాలి. ఆ దృష్టి లేకనే ఇప్పుడు కొందరు యువత వెర్రి వ్యామోహాలకు బానిసలౌతున్నారు. బావుంది మనోహరం…చాలా బావుంది పుట్టినరోజు వేడుక…” ప్రొఫెసర్ సారంగ అన్నారు మనోహరం భుజం తడుతూ.
"అవునవును…” వచ్చిన వాళ్లలో మరో కొన్ని గొంతులు కలిశాయి!!

