అమ్మా నాకు ఒక కెమెరా కావాలి. నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని చెప్పాడు విజయ్. ఫోటోగ్రఫీ ఏమిటి? మీ నాన్న నిన్ను టీచర్ చెయ్యాలని చూస్తుంటేను అంది విజయ్ వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ. ఏమిటి నేను టీచర్ అవ్వాలా…! నా చదువు అసలే అంతంత మాత్రం. ఏదో నాకు వచ్చిన చదువుతో ఇంటర్ వరకు లాక్కుని వచ్చాను. ఇంక నేను చదవలేను. టీచర్ కాలేను. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నాకు ఒక కెమెరా కొని ఇస్తే నేను ఫోటోగ్రఫీ నేర్చుకుని ఒక పెద్ద ఫోటో స్టూడియో పెడతాను, అది నా కల అని చెప్పాడు విజయ్. మరి మీ నాన్న కల అని అనుకుంటూ పక్కన సోఫాలో కూర్చుంది లక్ష్మమ్మ.

నువ్వే ఎలాగైనా నాన్నని ఒప్పించు అమ్మా అని బతిమిలాడాడు విజయ్. మీ నాన్నను ఒప్పించడం నా వల్ల కాదని చెప్పింది లక్ష్మమ్మ. ఇంతలో అక్కడకు వచ్చి నిలబడ్డాడు విజయ్ తండ్రి రాఘవయ్య. తండ్రిని చూసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు విజయ్. విజయ్ భుజంపైన చేయి వేసి కెమెరా కొనడానికి ఎంత డబ్బు కావాలని అడిగాడు రాఘవయ్య. విజయ్ ఆశ్చర్యంగా తండ్రిని చూస్తూ యాభై వేలు కావాలని చెప్పాడు.

యాభై వేలా! అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. ముఫై వేలకు ఏ కెమెరా వస్తే అది కొనుక్కుని నేర్చుకో. తరువాత చూద్దాం అన్నాడు విజయ్ తో రాఘవయ్య. అంత తక్కువ ఖరీదైన కెమెరాతో నేను నేర్చుకోవడం ఎలా…? అనుకుంటూ వేరే దారి ఏమీ లేక సరేనని తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని కెమెరా కొనుక్కుని ఫోటోగ్రఫీ ఇనిస్టిట్యూట్ లో చేరాడు విజయ్.

ముఫ్ఫై వేల కెమెరాలో అడ్వాన్స్ ఫీచర్స్ లేకపోవడంతో ఎంతో నిరాశగా ఉంటూ… తనతో పాటు ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్న వాళ్లను కెమెరా అడిగి అందరి కన్నా తొందరగా… ఎంతో అందంగా ఫోటోలు తియ్యడం నేర్చుకుని ఇనిస్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాడు విజయ్.

ఫోటోగ్రఫీ నేర్చుకున్న విజయ్ కి తన చుట్టు పక్కల ఉన్న వాళ్ళ ఇళ్లలో చిన్న చిన్న శుభకార్యాలకు ఫోటోలు తియ్యడం, ఆల్బమ్ తయారుచేయడం వంటి పనులు మెల్లగా రావడం ఆరంభమయ్యాయి. అలా వచ్చిన పనులు ఒకటి రెండు చేశాక… ఒక పెద్ద పెళ్ళికి ఫోటోలు తీయాలని ఒక పిలుపు వచ్చింది. తన దగ్గర ఉన్న ఆ చిన్న కెమెరా పట్టుకుని వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్లాడు విజయ్.

విజయ్ అక్కడకు వెళ్ళే సమయానికి చాలా మంది కెమెరామన్ పెద్ద పెద్ద కెమెరాలతో ఉన్నారు. పెళ్ళి కూతురు తండ్రి విజయ్ ను చూసి మీరు చాలా బాగా ఫోటోలు తీస్తారని విన్నాను. అందుకే మీకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కాని మీరు మంచి అడ్వాన్సెడ్ కెమెరా తీసుకు వచ్చి మంచి ఫోటోలు తియ్యాలని చెప్పాడు. విజయ్ సరేనని చెప్పి ఇంటికి వెళ్లాడు.

ఇంటికి వచ్చిన విజయ్ తండ్రి రాఘవయ్యను కలిసి తనకు ఎన్నో అదనపు ఆప్షన్లు ఉన్న కెమెరా కావాలని, అది కొనుక్కునేందుకు మూడు లక్షల రూపాయలు కావాలని అడిగాడు. నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాడు రాఘవయ్య. నేను బాగా ఎదిగే సమయం ఇదే. ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలాగని కోపగించుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు విజయ్.

విజయ్ ఇంటికి వచ్చే సరికి తండ్రి అప్పు చేసి ఒక లక్ష యాభై వేలు తీసుకొచ్చి నా స్తోమత ఇంతేనని ఇచ్చాడు. అప్పుడు కూడా చేసేదేమీలేక మనసు చంపుకుని తండ్రి ఇచ్చిన డబ్బుతో కెమెరా కొనుక్కుని పెళ్ళి వాళ్లతో మాట్లాడేందుకు వెళ్ళాడు విజయ్.

పెళ్ళికూతురు తండ్రి మీ దగ్గర ఆధునిక కెమెరా ఉంటేనే మీకు ఈ కాంట్రాక్టు దొరుకుతుందని చెప్పాడు. చేతికి దొరికిన అదృష్టం చేజారిపోయింది అనుకుంటూ బయటకు వచ్చిన విజయ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తి హలో ఎవరని? అడిగాడు. నా పేరు రాహుల్. నేను ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ ని. నీ ఫోటో షూట్ గురించి విన్నాను. నా దగ్గర పని చేస్తావా… నేను ఒప్పుకునే ప్రోగ్రామ్స్ కి నా కెమెరాలు తీసుకెళ్ళి ఫోటోలు తీసి వస్తే నీకు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. తండ్రి పైన ఉన్న అసంతృప్తితో విజయ్ ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే సరే అనేశాడు.

ఏ పెళ్ళి ఫోటోలు తియ్యడానికి విజయ్ ని పిలిచారో… ఆ పెళ్ళి ప్రోగ్రామ్ ని ఒప్పుకుని అదే పెళ్ళికి ఫోటోలు తీసేందుకు తన దగ్గర ఉన్న పూర్తి ఆధునిక కెమెరా ఇచ్చి విజయ్ ని పంపించాడు రాహుల్.

రాను రాను విజయ్ పూర్తిగా సొంతంగా ప్రోగ్రాంలు ఒప్పుకోవడం మానేసి చిన్నవాటికి తన దగ్గర ఉన్న కెమెరా పట్టుకుని వెళుతూ… పెద్ద ప్రోగ్రామ్ లకి రాహుల్ దగ్గర కెమెరాలు తీసుకు వెళుతూ… తనకు కావలసినది పొందినట్టు ఆనందంగా ఉండసాగాడు.

ఎప్పటికైనా విజయ్ తనకు గట్టి పోటీ అవుతాడని తలచిన రాహుల్… మెల్లగా విజయ్ కు తండ్రి పైన ఉన్న అసంతృప్తిని గుర్తు చేస్తూ… తాగుడికి బానిస చేశాడు. తాగుడుకి బానిసైన విజయ్ పూర్తిగా తన కలను మర్చిపోయి రాహుల్ దగ్గర ఒక పనివాడిగా మిగిలిపోయాడు.

విజయ్ లో వస్తున్న మార్పులను గుర్తిస్తున్న తల్లికి పూర్తిగా విషయం అర్థమైంది. ఒక రోజు విజయ్ బాగా తాగి ఇంటికి వచ్చాడు. తూలుతూ అస్సలు స్పృహ లేకుండా ఇంటికి వచ్చిన కొడుకు చేతులను చెరో భుజంపైన వేసుకుని తన గదిలో పడుకోబెట్టడానికి తీసుకు వెళ్లారు తల్లి తండ్రి.

ఉదయం అయింది. తల్లి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొచ్చి విజయ్ కి నిద్ర లేపి చేతికి అందించి ఏమీ మాట్లాడకుండా మళ్లీ వంట గదిలోకి వెళ్ళిపోయింది. విజయ్ కు పూర్తిగా స్పృహ వచ్చింది. రాత్రి తనను గదికి తల్లి తండ్రి ఇద్దరు తీసుకొచ్చి పడుకోబెట్టిన సంగతి గుర్తు వచ్చి… తన తల్లి దగ్గరకు వెళ్ళి సిగ్గుతో తల దించుకున్నాడు.

తాగుడు గురించి అడగకుండా నీ సొంత కల సంగతి ఏమిటని…? తల్లి ప్రశ్నించింది విజయ్ ని. ఏమిటి నా కల…! నాన్న దగ్గర ఉన్న డబ్బుకు నేను కల కనకూడదు అని నాకు తెలీలేదు అమ్మ. నా కలను నేను నెరవేర్చుకోవాలి అంటే నాకు చాలా డబ్బు కావాలి. ఇప్పుడు బజారులో మంచి కెమెరా ధర ఎంతో తెలుసా ఐదు లక్షలు. అంత డబ్బు నాన్న నాకు ఇవ్వలేరు. నేను ఒకరి దగ్గర చాలీచాలని జీతంతో పని చేస్తూ అంత డబ్బు సంపాదించలేను. ఇంక నా కలను ఎలా పూర్తి చేసుకుంటాను. డబ్బు ఉంటేనే ఏ కలైనా నెరవేరుతుందని తండ్రి పైన ఉన్న అసంతృప్తిని వెల్లడించాడు విజయ్.

నిజమే ఏ కల నెరవేరాలి అన్న డబ్బు చాలా అవసరం. నేను జరిగిన ఒక సంఘటన చెపుతా విను…,

మా చిన్నతనంలో మా ఊరిలో ఒక పెద్ద జమీందారు ఉండేవారు. అతనికి ఐదుగురు ఆడపిల్లలు, ఒకే ఒక మొగపిల్లాడు ఉండేవారు. జమీందార్ గారి ఇంటికి ఎప్పుడు చుట్టాలు వస్తుండేవారు. వచ్చిన చుట్టం ఆరేసి మాసాలు ఉండి వెళ్ళే వారు. జమీందారు గారికి కొంచెం బద్ధకం ఉండేది కూడా. అందువల్ల కూర్చొని తినడం, రాబడి, ఖర్చు విషయాలు పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఆస్తి మెల్లగా తగ్గుతూ తగ్గుతూ వాళ్ళ పిల్లలందరూ పెరిగే సమయానికి పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయి రోడ్డున పడ్డారు.

నలుగురిని సహాయం అడిగి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశారు. మొగ పిల్లాడికి ప్రభుత్వ బడిలో ఏదో ఇంటర్ వరకు చదివించారు. ఆ పిల్లాడు తల్లి తండ్రి చదివించినంత వరకు చాలా శ్రద్ధగా చదివి… ఆ ఇంటర్ సర్టిఫికేట్ ను పట్టుకుని కళాశాల నుంచి బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన ఆ పిల్లాడికి ఎక్కడా ఉద్యోగం రాలేదు. కుటుంబానికి అతను ఒక్కడే ఆసరా. ఏమి చెయ్యాలో తెలీదు.

తినడానికి తిండి లేదు. పై చదువులకు డబ్బు లేదు. ఉన్న డబ్బును పోగొట్టుకున్నారని బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎన్నో మాటలు అనేవారు. ఆ మాటలు, అవమానాలు, ఎంతో పేదరికం చవి చూసిన ఆ పిల్లాడిలో ఒకటే లక్ష్యం… ఎలాగైనా డబ్బును సంపాదించాలని. ఆ పిల్లాడు నా తండ్రి నాకేమీ ఇవ్వలేదు. జమీందారు గిరిని పోగొట్టి… పేదరికాన్ని మిగిల్చాడని తండ్రి పైన అసంతృప్తిని చూపించకుండా… తండ్రి ఇచ్చిన కొద్దిపాటి చదువుతోనే చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ… వచ్చిన డబ్బుతో ఇల్లును గడుపుతూ… పెద్ద ఉద్యోగాల కోసం కావలసిన చదువు చదివాడు. ఎంతో కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించి ఒక స్థాయికి చేరుకున్నాడు. జమీందారుగా ఉన్నప్పుడు పేరు కన్నా ఇప్పుడు ఆ తల్లిదండ్రికి రెట్టింపు పేరు వచ్చింది ఆ పిల్లాడి వల్ల. చూసావా తన తండ్రి తనకు ఆస్తులు, డబ్బులు, కావాల్సిన కోరికలు తీర్చకపోయినా, కనీసం అవసరమైన మౌలిక వసతులు కూడా ఇవ్వకపోయినా ఆ పిల్లాడు తన కష్టాన్ని నమ్ముకుని ఎంత పైకి ఎదిగాడో అని చెప్పి ఇలా అంది లక్ష్మమ్మ ‘కన్నా విజయ్ ఒక మాట చెపుతాను గుర్తుపెట్టుకో’…,

కష్టపడాలి కష్టపడాలి
కష్టంతోనే జీవితంలో బలపడాలి
కష్టపడనిదే సొమ్ము రాదు
కష్టపడకుండా వచ్చిన సొమ్ము
ఎన్నడూ నిలవదు
కష్టపడడమే మనిషికి ఆయుధం కావాలి
ఆ ఆయుధం చేపట్టి జీవితంలో అడుగు పెట్టు
కష్టం వలనే అదృష్టం నిన్ను వలచును

ఎదురయ్యే సమస్యలను చూసి నిరుత్సాహ పడి ఆగిపోకు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగు విజయాలు సాధించు అని చెప్పింది.

తల్లి మాటలు విన్న విజయ్ తన తప్పులు తెలుసుకుని తండ్రి పైన ఉన్న అసంతృప్తిని పూర్తిగా మనసులో నుంచి చెరిపేసి… తన గదికి వెళ్లి తండ్రి కొనిచ్చిన కెమెరాను చేతులోకి తీసుకుని ముద్దాడి భుజాన వేసుకుని సొంతంగా ప్రోగ్రామ్ లు చెయ్యడానికి బయలుదేరాడు.

విజయ్ చిన్న చిన్న ప్రోగ్రాములు చేస్తూ కష్ట పడుతూ కొద్ది కొద్దిగా డబ్బు కూడపెట్టడం ఆరంభించాడు. విజయ్ కి రాను రాను మంచి పేరు రావడం ఆరంభమైంది. ఫోటోగ్రఫీ రంగంలో మంచి పేరు రావడంతో విజయ్ కి ఒక పెద్ద కంపెనీ మోడలింగ్ ఫీల్డ్ లో ఫోటోలు తీసేందుకు ఒక సంవత్సరం అగ్రిమెంట్ చేసుకుంది. మంచి జీతం ఇచ్చింది.

ఆ డబ్బుతో విజయ్ కన్న కలను నెరవేర్చుకుని తండ్రి పేరు మీద రాఘవయ్య ఫోటో స్టూడియో నిర్మించి కష్టపడుతూ ఎంతో ఎత్తుకు ఎదిగాడు.

ఈ కథలో పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితమే.