తన తండ్రి మంచం మీద ఉన్నప్పుడు చేతి నిండా పని ఉండేది కృష్ణారావుకి.
ఎప్పుడూ “ఒరేయ్ కృష్ణా” అని పిలుస్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఏ పని లేకుండా ఉంది అని అనుకున్నాడు కృష్ణారావు, చనిపోయిన తన తండ్రి రామారావు గురించి.
ఆఫీసుకు వెళ్లినా ఇంటి దగ్గర ఉన్న తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు కృష్ణారావు. ఆఫీసు నుండి వచ్చిన వెంటనే తండ్రి పని చూడడం ఒక పెద్ద బాధ్యతగా ఉండేది. తండ్రి మంచం మీద ఉన్నా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. భార్య పోయిన తర్వాత రామారావు ఇంచుమించుగా మంచం పట్టేసాడు. తండ్రి పోయిన తర్వాత ఇప్పుడు “ఒంటరివాడిని” అనే భావన వస్తోంది కృష్ణారావుకి.
అప్పుడే పన్నెండు రోజులు గడిచిపోయాయి. బంధువులంతా కృష్ణారావుకు ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. బంధువులతో పాటు కృష్ణారావు అక్క సుమతి కూడా బయలుదేరుతూ, “తమ్ముడూ బాధపడకు, ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో!” అని చెప్పి ఏడుస్తూ తమ్ముడిని దగ్గరకు తీసుకుంది సుమతి.
“ఇంకో ముఖ్య విషయం… ఇంటి కాగితాలు రెడీ చేయించు. మాసికానికి వచ్చినప్పుడు సంతకం పెడతాను. నాకు కూడా వయసు మీరిపోతోంది, ఇది చాలా ముఖ్యం,” అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి.
ఇంకా తండ్రి పోయి నెల కూడా కాలేదు. అప్పుడే ఆస్తి పంపకాల గురించి అడుగుతోంది. నాన్న బతికున్నప్పుడు పట్టుమని పది రోజులు కూడా ఉండి చాకిరి చేయలేదు. మందులకి, హాస్పిటల్ కి ఐదు లక్షల రూపాయలు ఖర్చయింది. చిన్న ఉద్యోగస్తుడైన కృష్ణారావుని “డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నావు?” అని ఏనాడు సుమతి అడగలేదు. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతోంది. నేరుగా చెప్పకపోయినా, దస్తావేజులు తయారు చేయమని చెప్పింది కదా — దాని అర్థం అదే కదా! మనుషులు ఎంత మారిపోయారు… అయినా మనుషులు అక్కర్లేదు, వాళ్లు సంపాదించిన డబ్బు కావాలి. ఏమిటో లోకం ఎలా మారిపోయిందో అని బాధపడ్డాడు కృష్ణారావు.
చనిపోయిన రామారావుకి ఇద్దరు సంతానం. రామారావు అదే గ్రామంలో హెడ్మాస్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. కొడుకు కృష్ణారావుని పెద్ద చదువులు చదివించుదాం అనుకున్నా, అతనికి చదువు అబ్బకపోవడంతో, డిగ్రీతో సరిపెట్టి పక్క ఊర్లోని తెలిసిన వాళ్ల కంపెనీలో ఉద్యోగం వేయించాడు.
సుమతికి చిన్నప్పుడే పెళ్లి చేసేసాడు రామారావు. సుమతి భర్త జగన్నాథం ఖమ్మం గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తూ ఉంటాడు.
తండ్రి కట్టిన ఇంట్లోనే ఆయనతో కలిసి కృష్ణారావు ఉండేవాడు . అక్కడి నుంచే ఉద్యోగానికి వెళ్ళొస్తుంటాడు. అందమైన పెంకుటిల్లు, చుట్టూ మొక్కలు, దొడ్లో బావి, పాకలో పశువులు — ఇవన్నీ కృష్ణారావుకి చాలా ఇష్టం. రామారావు తనకు వచ్చిన పెన్షన్ డబ్బులతో హాయిగా భార్య లక్ష్మితో, కొడుకు కోడలితో కలిసి మెలిసి ఉండగా, పాపం భార్య లక్ష్మికి క్యాన్సర్ వచ్చి చనిపోయింది.
అదే బెంగతో రామారావుకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినా, మంచం పట్టేసాడు. తల్లి మరణం, తండ్రి అనారోగ్యం వరుసగా రావడంతో కృష్ణారావుకి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఎప్పుడూ ఎవరిని చెయ్యి చాచి డబ్బులు అడగని కృష్ణారావు, దూరపు బంధువుల దగ్గర అప్పు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇల్లు అమ్మేసి బాకీ తీర్చేద్దామంటే — సుమతి వాటా, అప్పు పోగా మిగిలేది ఇంకేం ఉంటుంది? అయినా ఇంత విశాలమైన ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలంటే చాలా ఖర్చు అవుతుంది. అవన్నీ నెలనెలా భరించడం చాలా కష్టం. ఏం చేయాలో పాలు పోవడం లేదు అనుకున్నాడు కృష్ణారావు.
ఇలా నెల రోజులు గడిచాయి. రామారావు నెల మాసికానికి వచ్చిన సుమతికి, కృష్ణారావు ముభావంగా ఉండడం చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు అక్క చెప్పిన పని చేయలేదు. అక్కకి ఏం సమాధానం చెప్పాలి అని తనలో తాను మధనపడ్డాడు కృష్ణారావు.
ఆ మర్నాడు, “తమ్ముడు… ఇంటి దస్తావేజులు ఒకసారి బయటికి తీయరా. మా ఊర్లో నాకు తెలిసిన లాయర్ గారు ఉన్నారు. ఆయనకు విషయం అంతా చెప్తే అవి పట్టుకు రమ్మన్నారు,” అంది సుమతి.
ఒక్కసారిగా సుమతి మీద కోపం ముంచుకొచ్చింది కృష్ణారావుకి. “అంత తొందర ఎందుకు? ఇంట్లో వాటా పంచకుండా నేనేమైనా తినేస్తానా! ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంటికి పెద్దదయ్యుండి ఇలా మాట్లాడొచ్చా?” అని అనిపించింది. కానీ ఇప్పుడు దస్తావేజులు ఇవ్వనంటే పెద్ద గొడవ చేస్తుంది అనుకుని, మాట్లాడకుండా పెట్టెలోంచి తీసి అక్క చేతిలో పెట్టాడు కృష్ణారావు.
ఆ మరుసటి నెల మాసికానికి సుమతి రాలేదు. “ఇంకెందుకు వస్తుంది? ఇంటి కాగితాలు పట్టుకుపోయిందిగా! అవసరం తీరిపోయింది. వచ్చే నెలలో వచ్చి సంతకాలు పెట్టించుకుంటుంది,” అని అనుకున్నాడు బాధగా కృష్ణారావు.
కొద్దిరోజులకి సుమతి చనిపోయిందంటూ ఫోన్ వస్తే ఖమ్మం బయలుదేరి వెళ్ళాడు కృష్ణారావు. అప్పుడే అసలు చేదు విషయం తెలిసింది. సుమతి, రామారావు మంచం మీద ఉన్నప్పటి నుంచే క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది మీ అక్క అని ఏడుస్తూ చెప్పాడు జగన్నాథం.
రోజులన్నీ అయిపోయిన తర్వాత, కృష్ణారావు బయలుదేరే సమయంలో, “ఇది మీ అక్క మీకు ఇమ్మంది,” అంటూ ఒక పెద్ద కవర్ చేతిలో పెట్టాడు జగన్నాథం. కవర్ విప్పి చూసిన కృష్ణారావుకి — ఇంటి కాగితాలు, ఐదు లక్షల రూపాయల డ్రాఫ్ట్, ఇంటిలో తన హక్కు వదులుకుంటున్నట్టు లాయర్ చేత రాయించిన డాక్యుమెంట్, ఒక లెటర్ కనిపించాయి. ఆ లెటర్ తీసి ఆత్రంగా చదివాడు.
“తమ్ముడు… ఈ ఉత్తరం నీ చేతికి అందేటప్పటికి నేను ఉండను. నేను నాన్న బాధ్యత పంచుకోలేదని నీకు కోపంగా ఉంది కదా! అలాగే ఇంటి కాగితాలు అడిగాను అని కూడా నీ మనసు బాధపడి ఉంటుంది. నాన్న మంచం మీద ఉన్నప్పుడే నాకు క్యాన్సర్ వచ్చింది. ఈ విషయం చెప్తే మీరు ఇంకా తట్టుకోలేరని చెప్పలేదు…
హాస్పిటల్ కి తిరగడం, మందులు, టెస్ట్లు — అదంతా ఒక నరకం. అందుకనే ఎప్పుడూ వీడియో కాల్ లోనే మాట్లాడేదాన్ని. ఇప్పుడు రెండో స్టేజిలోకి వచ్చింది క్యాన్సర్. మొదట్లోనే చెప్పారు — నమ్మకాలు లేవని. అయినా మాకు కూడా వైద్యానికి చాలా ఖర్చయింది. నేను ఎన్ని రోజులు బతుకుతాను అనేది సమాధానం లేని ప్రశ్న…
అందుకనే నాన్న పోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాను. నా మీద ఉన్న బాధ్యతని తీర్చుకోవడానికి ఆ దస్తావేజుల గురించి నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు కదా! నాకు తెలుసు — నేను కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే అలాగే ఆలోచిస్తాను. తమ్ముడు… మనుషులు ఎప్పుడూ మారరు. పరిస్థితులే మనుషులను మారుస్తాయి.
నాన్న కట్టిన ఇంట్లో నా హక్కు వదులుకుంటున్నట్లు లాయరుగారి చేత దస్తావేజు రాయించాను. ఆ ఇల్లు నీకు అవసరం. నీకు చాలా ఇష్టం కూడా. ఒకసారి నేను గుమ్మం దాటిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఆస్తి వస్తుందంటే ఎవరికైనా ఆశ పుడుతుంది… భగవంతుడు దయవల్ల నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. అమ్మ పోయినప్పుడు అమ్మ బంగారం అంతా నాకే ఇచ్చేశావు. అప్పుడే నీ నిజాయితీ నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ బంగారంలో కొంత అమ్మి నీకు ఐదు లక్షల రూపాయలు డ్రాఫ్ట్ ఇస్తున్నాను.
నాన్న కోసం నువ్వు తీసుకున్న అప్పులు తీర్చేసి, ఆ ఇంట్లో సుఖంగా పిల్లలతో కాలక్షేపం చెయ్యి.
ఆశీస్సులతో — అక్క.”
అక్క చేతి రాతలో ఉన్న ఆ ఉత్తరాన్ని గుండెలకి హత్తుకుని మౌనంగా కూర్చున్నాడు కృష్ణారావు. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లేటప్పుడు తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిన అక్క, తాను ఏడిస్తే నచ్చజెప్పిన అక్క, తాను సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకున్న అక్క — ఒక్కో జ్ఞాపకం ఒక్కో గాయంలా గుండెల్ని తాకింది. “అక్కా… నిన్ను నేను అర్థం చేసుకోలేక పోయాను,” అని మనసులోనే పలుమార్లు అనుకుంటూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మాటల్లో చెప్పలేని అక్క ప్రేమ, తమ్ముడి కోసం చేసిన త్యాగం జీవితాంతం తనతోనే ఉంటుందని గ్రహించాడు. అక్క ఆశించినట్టుగానే ఆ ఇంటిని కాపాడుకుంటూ, ఆమె ఇచ్చిన ఆప్యాయతను జ్ఞాపకంగా పెట్టుకుని సంతోషంగా జీవించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కృష్ణారావు.

