దసరా ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మను దర్శించుకోవడం రాముకు గత 20 సంవత్సరాలుగా అలవాటు. ఒకవేళ ఏదైనా ఊరు వెళ్లినా ఆ సమయంలో విజయవాడ రావటం, నవరాత్రుల్లో అమ్మవారిని వీలయినన్నిసార్లు దర్శించుకోవడం రివాజుగా మారింది. ఈసారి నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు వచ్చాయి. దాంతో చండికావతారం 8 వ రోజు ప్రదర్శించారు. తొమ్మిదో రోజు మూలా నక్షత్రం. విద్యల తల్లి సరస్వతీ అవతారం. ఆ రోజు ఇంద్రకీలాద్రిమీద భక్తులు వెల్లువెత్తారు. ఆ రోజు మర్చిపోలేని రోజు. అమ్మవారిని దర్శించుకుని జనాలను చూస్తూ నిలుచున్నాడు రాము.

ఇంతలో భుజం మీద ఎవరిదో చేయి పడింది.

వెనక్కి చూసాడు. ఒక వ్యక్తి నవ్వుతూ నిలుచున్నాడు. ఎక్కడో చూసినట్లు అనిపించింది గాని గుర్తుకు రాలేదు.

అదే విషయాన్ని అడిగాడు.

అతను మరింతగా నవ్వుతూ “మరోసారి ఆలోచించు” అన్నాడు.

ఎంతగా ఆలోచించినా రాముకు గుర్తు రాలేదు.

కాని ఎక్కడో పరిచయం ఉన్న ముఖంలా అనిపిస్తున్నది.

చివరికి ఓడిపోయిన వాడిలా ముఖంపెట్టి క్లూ ఇవ్వమన్నాడు.

పటమట హైస్కూలు అన్నాడు.

అప్పుడు బుర్రలో ప్లాష్ వెలిగింది.

“రాజు కదా” అన్నాడు.

“అవును” అని బిగ్గరగా నవ్వాడు.

రాము “నువ్వు ఏమీ మారలేదు రా” అన్నాడు.

“నువ్వు మారావురా” అన్నాడు రాము.

ఇద్దరూ ఆప్యాయంగా కౌగలించుకుని తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

“ఇన్నాళ్లకు కలిసాం…ఎక్కడ…ఏమి చేస్తున్నావు”? అని రాము ప్రశ్నల వర్షం కురిపించాడు.

“నేను ఇటీవల విజయవాడ బదిలీ అయి వచ్చాను. బరోడా బ్యాంక్ లో పనిచేస్తున్నాను” అన్నాడు రాజు.

“నువ్వు ఏమి చేస్తున్నావని” అడిగాడు.

“నేను స్థానిక కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను, మొదటి నుంచి విజయవాడలోనే ఉన్నా కదా” అన్నాడు రాము.

“సరే…ఎంతమంది పిల్లలు” అని అడిగాడు రాజు.

“అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి ఇంజనీరింగ్ అయి ఈ ఏడాదే ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్లో పనిచేస్తున్నది. అబ్బాయి బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు” అన్నాడు రాము.

“మరి నీకు?” అన్నాడు.

“నాకు ఒక్కడే కొడుకురా… బెంగుళూరులో రెండేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు” అన్నాడు రాజు.

“సరే లేరా… రేపు ఆదివారం కదా, మీ దంపతులు మా ఇంటికి భోజనానికి రండి, చాలా రోజులకు కలిసాం” ఆహ్వానించాడు రాము.

“సరే వస్తాం లే” అన్నాడు రాజు.

ఆదివారం…

ఉదయం 12 గంటలు…

రాము ఇంటిలో హడావుడిగా ఉంది.

రాజు వాళ్లని రమ్మన్నాడు కదా…వారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు రాము.

రాము కూతురు మాధవి కూడా పండుగ అని వచ్చింది.

కొడుకు రమేష్ ఇక్కడే కళాశాలలో చదువుతున్నాడు.

వీరిది మూడు బెడ్ రూమ్ ల ఇల్లు. పాత ఇల్లు మార్చి కట్టించాడు. పైన ఒక రూం కట్టించాడు.

ఇంటిముందు కారు ఆగిన శబ్దం వినిపించింది.

అందరూ బయటికి వచ్చారు.

డ్రైవర్ సీటులో ఒక యువకుడు ఉన్నాడు.

రాజు, అతని భార్య మాలతి కారు నుంచి దిగారు.

కారు లాక్ చేసిన యువకుడిని రాజు పరిచయం చేస్తూ “వీడు నా కొడుకు, రాధేశ్యామ్” అన్నాడు.

“నమస్తే అంకుల్, ఆంటీ” అని నమస్కారం చేసాడు.

మనిషి ఆరు అడుగులు ఉన్నాడు. మంచి రంగు, రూపుతో అందంగా ఉన్నాడు.

రాము తన కూతురు మాధవిని, కుమారుడు రమేష్ ను పరిచయం చేసాడు.

వారు రాజు, మాలతికి నమస్కారం చేసి, రాధేశ్యామ్ తో “హాయ్’” అన్నారు. అందరూ ఇంటి హాలులోకి వచ్చారు.

సోఫాలో కూర్చున్నారు.

వారికి మాధవి, రాము భార్య రమ్య పండ్ల రసం ఇచ్చారు.

రమ్య, మాలతి ఒక పక్క, రాము, రాజు మరోపక్క కబుర్లలో పడ్డారు. రమేష్ రాధేను ఏవోవో సందేహాలు అడుగుతున్నాడు.

మాధవి నవ్వుతూ వింటున్నది.

రాధే రమేష్ ప్రశ్నలకు సమాధానం చెబుతూ మధ్యమధ్యలో మాధవిని వాళ్ల కంపెనీ విషయాలు అడుగుతున్నాడు.

భోజనం అయిన తరువాత మరికాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత రాజు కుటుంబం వెళ్లిపోతూ “మీరు మా ఇంటికి రండి” అని ఆహ్వానించి వెళ్లారు.

అలా వారి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

రాధేకి హైదరాబాద్ బదిలీ అయింది.

దాంతో తరచూ మాధవిని కలుస్తున్నాడు. వారి మధ్య స్నేహం పెరిగింది.

ఒకసారి మాధవి తన కొలీగ్ అభిరామ్ ను రాధేకి పరిచయం చేసింది.

ముగ్గురూ ఒక శనివారం రెస్టారెంట్ కు వెళ్లారు.

అక్కడ వారి వైఖరిని బట్టి మాధవి, అభీ ప్రేమించుకుంటున్నారేమో అనుమానం రాధేకు కలిగింది.

అడుగుదామంటే సంస్కారం అడ్డు వచ్చి మౌనంగా ఊరుకున్నాడు.

సంక్రాంతికి విజయవాడ వెళుతున్నానని రాధే చెప్పాడు.

మాధవి తానూ వస్తానని చెప్పింది.

సరే ఫోన్ చేస్తానన్నాడు.

సంక్రాంతికి రెండు రోజుల ముందు రాధే తన కారులో మాధవిని ఎక్కించుకుని విజయవాడ బయలుదేరాడు.

మధ్యలో అభిరాం విషయం వచ్చింది. రాధే ఊహించినట్లు వారిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు మాధవి చెప్పింది.

తాము చిన్ననాటి నుంచి స్నేహితులమని, తన గురించి అతను తాను చేస్తున్న కంపెనీలో ఉద్యోగానికి మారాడని, తమ విషయం ఇంకా ఇంట్లో తెలియదని చెప్పింది.

రాధే మౌనంగా విని ఊరుకున్నాడు.

సంక్రాంతి సమయంలో రాము, రాజు కుటుంబాలు మళ్లీ కలవడం తటస్థించింది.

అప్పుడు రాము దంపతులు రాధే, మాధవి జంట బాగుంటుందని అడుగుదామని నిర్ణయించుకుంటారు.

ఆ విషయం ముందుగా మాధవిని అడిగారు. మాధవి తాను తనతో పనిచేసే అభిరాంని ప్రేమిస్తున్నానని బాంబు పేల్చింది.

వారు నిశ్చేష్టులయ్యారు.

అన్నీ ఆలోచించుకుని మాధవి అభిప్రాయం గౌరవిస్తూ రాము దంపతులు మాట్లాడడానికి అభి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వచ్చారు.

అభి, అతని తండ్రి సురేష్ మాత్రమే ఉన్నారు. సురేష్ తనతో పనిచేసే మేరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అభి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మరణించింది. రెండవ ప్రసవం సమయంలో సీరియస్ అయి వారికి దూరమైంది. సురేష్ మళ్లీ పెళ్లి చేసుకోకుండా అభిని పెంచి పెద్ద చేసాడు.

ఈ విషయాలన్నీ విని ఏమి చేయాలో తెలియక, నిర్ణయం చెప్పలేక రాము, అతని భార్య రమ్య వెనుకకు వచ్చారు.

రాగానే రాజును, మాలతిని పిలిపించి అభిరాం జన్మ విషయం చెప్పి సలహా అడిగారు.

వారు రాముకి మరో విషయం చెప్పి ఆశ్చర్యపరిచారు.

తమకు పిల్లలు లేకపోతే తాము అనాథ ఆశ్రమం నుంచి నెలల పిల్లవాడు రాధేశ్యామ్ ను తెచ్చుకుని పెంచుకున్నామని చెప్పారు.

కులమతాలకన్నా మానవత్వం గొప్పదని తాము నమ్ముతామని, అలాగే రాధేని విలువలతో పెంచుతున్నామని చెప్పారు.

రాధే కన్నతల్లిదండ్రులు ఎవరో తమకు తెలియదని చెప్పారు.

ఇప్పటికీ అప్పుడప్పుడూ అనాథ శరణాలయానికి వెళ్లి వస్తూ ఉంటామన్నారు. దాంతో రాము దంపతులు రాజు దంపతుల ఆదర్శానికి ముగ్దులయ్యారు. వెంటనే మాధవి, అభిల వివాహానికి అంగీకరించారు.

నిశ్చితార్ధం పెట్టుకున్నారు.

మూడు కుటుంబాలు కలిసాయి.

రాధేని చూసి సురేష్ ఆశ్చర్య పోయాడు. ఎందుకంటే తన చిన్నప్పుడు తాను ఎలా ఉన్నాడో రాధే అలాగే ఉన్నాడు.

రాజు ముందు సురేష్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా వారు రాధేని తాము తెచ్చుకుని పెంచుకున్నామని చెబుతారు.

అది వాడికి తెలియదని చెబుతారు.

శరణాలయంలో విచారణ చేయగా సురేష్, మేరీల రెండో సంతానమే రాధేగా నిర్ధారణ అయింది.

మేరీ చనిపోవడంతో సురేష్ పసిబిడ్డను ఆస్పత్రిలోనే వదిలేసాడు. ఆ బిడ్డ అనాథ శరణాలయానికి చేరి రాజు దంపతులకు దత్తతగా వచ్చాడు.

తాను అభీని పెంచుతూ రెండో బిడ్డను వదిలేసాననే నూన్యతతో సురేష్ ఆ తరువాత చాలాకాలం బాధపడ్డాడు. ఆస్పత్రిలో, శరణాలయంలో అడిగినా ఎవరో పెంచుకోవటానికి తీసుకు వెళ్లారని, వివరాలు చెప్పడానికి నిరాకరించారు.

అలా సురేష్ మనసులోనే బాధను అనుభవిస్తున్నాడు.

ఇప్పుడు తన రెండో కుమారుడు రాజు దంపతుల వద్ద బాగున్నాడని తెలుసుకుని సంతోషపడ్డాడు.

అభి, రాధే అన్నదమ్ములనే విషయం వారికి తెలియదు.

రాము, రాజులు విషయం తెలిసినా చెప్పలేదు. సురేష్ తన కుమారుడు క్షేమాన్ని చూసి సంతోషించాడు తప్ప నోరు విప్పి చెప్పలేదు. మన హృదయం మంచిదయితే అంతా మంచిగానే ఉంటుందని నమ్మిన ఆ కుటుంబాలను బంధాలతో భగవంతుడు కలిపాడు.