లియో టాల్‌స్టాయ్ తన 82వ ఏట ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సంఘటనను పావెల్ బసిన్స్కీ లోతుగా పరిశోధించారు. ఆ వివరాలన్నింటినీ ఆయన తన “Flight from Paradise” పుస్తకంలో రాశారు. టాల్‌స్టాయ్ ఇల్లు విడిచి వెళ్ళిన వార్తను అప్పటి దినపత్రికలు ఎలా ప్రచురించాయో బసిన్స్కీ ఆ పుస్తకంలో వివరించారు.

“ముసలి సింహం తన గుహను వదిలి వెళ్ళిపోయింది”

“టాల్‌స్టాయ్ తప్పించుకుని పారిపోయారు”

“టాల్‌స్టాయ్ ఎక్కడ దాక్కున్నారు?”

ఇలా రకరకాలుగా వార్తలు రాశారు.

‘ఒడెస్సా’ అనే పత్రిక మాత్రం కొంచెం భిన్నంగా స్పందించింది. “టాల్‌స్టాయ్ కోసం వెతకకండి. ఆయన కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. మన అందరికీ సొంతమైనవాడు” అని రాసింది. అంతేకాదు, ఆయన కొత్త నివాసం త్వరలోనే తెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

మరో పత్రిక, “వృద్ధ సింహం ఒంటరిగా ప్రాణాలు వదలడానికి వెళ్ళింది” అని రాసింది.

ఆఖరి ఉత్తరం – ఆశ్చర్యం

ఇవాన్ బునిన్ రాసిన “The Liberation of Tolstoy” పుస్తకంలో టాల్‌స్టాయ్ తన భార్యకు రాసిన ఆఖరి ఉత్తరం ఉంది. “నా వయసులో ఉన్న ముసలివాళ్లు సాధారణంగా ఏం చేస్తారో, నేనూ అదే చేస్తున్నాను” అని టాల్‌స్టాయ్ ఆ ఉత్తరంలో రాశారు.

పేద రైతులు సాధారణంగా ఇలా కోపగించుకుని ఇల్లు వదిలి వెళ్తుంటారు. కానీ, టాల్‌స్టాయ్ లాంటి పెద్ద జమీందారు ఇలా చేస్తారా అని జనం ఆశ్చర్యపోయారు. ఆయన ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఉంటారని కొందరు భావించారు.

టాల్‌స్టాయ్ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న విషయం ఆయన కుమార్తె సాషాకు ముందే తెలుసు. ఆయన తన ఆఖరి ఉత్తరాన్ని ఆమెకే ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత తండ్రి ఉన్న చోటుకు సాషా రావాలని వారిద్దరూ ముందుగానే అనుకున్నారు.

నిశ్శబ్ద నిష్క్రమణ

భార్య సోఫియా నిద్రలేవకుండా టాల్‌స్టాయ్ రాత్రికి రాత్రే ఇల్లు దాటారు. ఆయన పడకగదికి, ఆమె గదికి మధ్య మూడు తలుపులు ఉండేవి. రాత్రి పూట టాల్‌స్టాయ్‌కు ఏమైనా సాయం కావాలేమోనని సోఫియా వాటిని తెరిచి ఉంచేది. కానీ, ఆ రోజు ఆ తలుపులన్నీ మూసి ఉన్నాయి. టాల్‌స్టాయ్ ఎలాంటి శబ్దమూ కాకుండా ఒక నీడలా గది నుంచి బయటకు నడిచారు.

టాల్‌స్టాయ్ ఇల్లు విడిచి వెళ్ళిన వార్తను రష్యా ప్రజలు ఎంతో ఉత్కంఠతో చదివారు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారనే విషయాలపై పత్రికలు రకరకాల అంచనాలు వేశాయి.

రిపోర్టర్లు అందరూ టాల్‌స్టాయ్ ఫామ్‌హౌస్‌కు పోటెత్తారు. అక్కడ ఉన్నవారిని రకరకాల ప్రశ్నలు అడిగారు, ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేశారు.

ప్రయాణం – వార్త

టాల్‌స్టాయ్ వెంట ఆయన వ్యక్తిగత వైద్యుడు మాకోవ్స్కి కూడా వెళ్లారు. తమ ప్రయాణం టాల్‌స్టాయ్ అల్లుడి ఫామ్‌హౌస్‌కే అని ఆ డాక్టర్ అనుకున్నారు. ఎందుకంటే, రెండు నెలలకు ఒకసారి టాల్‌స్టాయ్ అక్కడికి వెళ్ళడం అలవాటు.

తెల్లవారుజామున టాల్‌స్టాయ్ గుర్రపు బగ్గీలో వెళ్ళడాన్ని ‘ఫిల్కా’ అనే పోస్ట్‌మన్ చూశాడు. ఆ పోస్ట్‌మన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా దినపత్రికల్లో అచ్చయింది.

టాల్‌స్టాయ్ ‘అస్తపోవో’ రైల్వే స్టేషన్‌లో అనారోగ్యంతో ఉన్నారనే వార్తను సోఫియాకు టెలిగ్రామ్ కాన్‌స్టాంటిన్ ఓర్లోవ్ అనే జర్నలిస్ట్ తెలియజేశాడు. ఆ వార్త వినగానే సోఫియా కంగారుపడ్డారు. తులా నగరం నుండి అస్తపోవో వెళ్ళడానికి ఆమె ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ఆమె 492 రూబిళ్లు, 27 కోపెక్ లు ఖర్చు చేశారు.

‘కింగ్ లియర్’ నాటకంలో అందరూ వదిలేసిన లియర్ రాజు చివరికి దిక్కు తోచక నడుచుకుంటూ వెళ్తాడు. టాల్‌స్టాయ్ కూడా సరిగ్గా అదే బాటలో నడిచారు.

మరణం తర్వాత కుటుంబం

టాల్‌స్టాయ్ చనిపోయిన తర్వాత ఆయన ఆరుగురు పిల్లలు (సెర్గీ, తాత్యానా, ఇల్యా, ఆండ్రీ, మిఖాయిల్, సాషా) ఇంట్లో సమావేశమయ్యారు. తోటల భవిష్యత్తు గురించి, తల్లి పరిస్థితి గురించి వారు చర్చించుకున్నారు. తల్లి ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుందేమోనని భయపడ్డారు.

అందుకే వారంతా తల్లికి ధైర్యం చెప్పి, ఓదార్చారు. టాల్‌స్టాయ్ తన కుమార్తెలతో ఉన్నంత చనువుగా కొడుకులతో ఉండేవారు కాదు. అందుకే కొడుకులు ఎప్పుడూ తల్లి పక్షానే నిలబడ్డారు.

టాల్‌స్టాయ్ తన జీవితంలో మూడుసార్లు వీలునామా రాశారు. తన 80వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు మూడో వీలునామా రాశారు. అందులో తన మరణం తర్వాత ఎలాంటి మతపరమైన ఆచారాలు చేయకూడదని స్పష్టం చేశారు. ఒక సాధారణ సమాధి నిర్మిస్తే చాలన్నారు. తనను ఎక్కడ సమాధి చేయాలో కూడా ఆయనే స్వయంగా ఎంచుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ వీలునామా ప్రకారమే అంత్యక్రియలు జరిగాయి.