మహాభారతంలోని అతి ముఖ్యమైన పాత్రలలో ద్రుపదుడు ఒకడు. మహా భారతానికి నాయకులైన పాండవులకు ద్రుపదుడు మామగారు. భారత కథకు నాయకురాలైన ద్రౌపదికి ఆ మహారాజు తండ్రి. లక్క ఇంటి నుండి బయటపడి అజ్ఞాతంగా జీవిస్తున్న పాండవులకు ద్రౌపదితో వివాహం జరిపించి వారికి అండగా నిలిచాడు ద్రుపదుడు . మత్స్య యంత్రం ఏర్పాటు చేసి అర్జునుని అసాధారణ ధనుర్విద్యా నైపుణ్యం లోకానికి పరిచయం చేశాడు ద్రుపదుడు. భారత యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడాడు అతడు.
అయితే, భారత యుద్ధంలో పాండవులను గెలిపించడంలో ద్రుపదుడు నిర్వహించిన పాత్ర ఏమిటి? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి తట పటాయించవలసి వస్తుంది. కౌరవ పక్షంలో భీష్మ, ద్రోణుల సరసన నిలువ దగిన యోధుడు కాదు ద్రుపదుడు. పది రోజులు సైన్యాధిపత్యంలో వీర రసాన్ని ప్రదర్శించాడు భీష్ముడు. ఐదు రోజులు సైన్యాధిపత్యంలో బీభత్సాన్ని చూపించాడు ద్రోణుడు. పాండవ సైన్యంలో ద్రుపదుడు గురించి ప్రస్తావనకు వస్తే అంతగా చెప్పుకోదగినది ఏమీ లేదు. ద్రుపదుని కాదని అతని కుమారుడు దృష్టద్యుమ్నుని పాండవ సైన్యాధ్యక్షుడుగా నియమించడాన్ని బట్టి అతడు ఏ పాటి వీరుడో అర్థం చేసుకోవచ్చు .చివరకు ద్రోణుని చేతిలో మృతి చెందాడు ద్రుపదుడు.
పిల్లను ఇచ్చినందుకు తన కుమారులు, బంధువులు సహా పాండవ పక్షాన ఒక అక్షౌహిణి సైన్యంతో పోరాడడం తప్ప దృపదుడు వారికి ఒరగ బెట్టింది ఏమిటి ? అని అనిపించక మానదు. పాండవుల విజయంలో ద్రుపదుని ప్రమేయం ఉన్నట్లు కనిపించదు. కాని నిశితంగా పరిశీలిస్తే ద్రుపదుడు లేకపోతే పాండవులు విజేతలు కావడం సాధ్యమయ్యేదా అనిపిస్తుంది.
కౌరవ సైన్యంలో ఆద్యులైన భీష్మ ద్రోణులు కూలిపోవడానికి కారణమైన శిఖండి, దృష్టద్యుమ్నుడు పాంచాల రాజు సంతానమే. కాని వారు ఆ మహారాజు కుమారులు కావటం యాదృచ్ఛికంగా జరగలేదు. భీష్మాచార్యుని మరణం కోసం శివుని గురించి తపస్సు చేసి శిఖండిని కుమారునిగా పొందాడు ద్రుపదుడు. అదేవిధంగా ద్రోణుని అంతు చూడటానికి యజ్ఞం చేసి దృష్టద్యుమ్నుని కుమారుడిగా పొందాడు ఆ మహారాజు.
అంబకు శివుని వరం
శిఖండి పూర్వ జన్మలో ఒక స్త్రీ. అప్పుడు ఆమె పేరు అంబ. కాశీరాజు కుమార్తెలైన అంబని, అంబికని, అంబాలికను తన సోదరుడైన విచిత్ర వీర్యుని కోసం స్వయంవర మండపం నుంచి రాక్షస వివాహ పద్ధతిలో తీసుకువచ్చాడు భీష్ముడు. ఆ సందర్భంలో తనను ఎదిరించిన సాల్వుడు మొదలైన రాజులను భీష్ముడు జయించాడు. తాను సాల్వ రాజును ప్రేమించానని తెలిపింది అంబ. ఆమెను వెంటనే వెనుకకు పంపాడు భీష్ముడు. కాని భీష్ముడు తనను జయించి అంబను తీసుకువెళ్లడం వల్ల ఆమెను చేపట్టడానికి సాల్వుడు అంగీకరించలేదు. ఆమె మళ్ళీ విచిత్ర వీర్యుని వద్దకు వచ్చింది. మరొకరు ప్రేమించిన ఆమెను తాను వివాహ మాడలేనంటాడు విచిత్ర వీర్యుడు. దీనితో అంబ బ్రతుకు రెంటికి చెడిన రేవడిలా మారింది. తనకు ఈ గతి పట్టించిన భీష్ముడే తనను వివాహమాడాలని అంబ కోరింది. ఆజన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టిన భీష్ముడు ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు.
భీష్ముని వైనం అతని గురువైన పరశురామునికి నివేదించింది అంబ. శిష్యుని ఒప్పించడానికి పరశురాముడు చేసిన ప్రయత్నం ఫలించలేదు… ఈ విషయమై గురు శిష్యులకు భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీష్ముడే పై చేయిగా నిలిచాడు. అంబకు న్యాయం చేయడానికి తాను అశక్తుడనని పరశురాముడు పేర్కొన్నాడు.
అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో తన లక్ష్య సాధన కోసం పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది అంబ. "మరు జన్మలో నీవు మొదట స్త్రీగా జన్మించి తరువాత పురుషుడిగా మారతావని, అప్పుడు నీ లక్ష్యం నెరవేరుతుందని పరమేశ్వరుడు ఆమెకు వరం ఇచ్చాడు.
ఇది ఇలాఉండగా, భీష్ముని అంతం చేయగల కుమారుని కోసం పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేశాడు ద్రుపద మహారాజు. పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై " నీకు మొదట కుమార్తె జన్మించి ఆ తరువాత కుమారుడుగా మారడం జరుగుతుందని, భీష్ముని అతడు అంతం చేయగలడని పరమేశ్వరుడు వరమిచ్చాడు. అంబ, ద్రుపదులకు పరమేశ్వరుడు ఇచ్చిన వరాల ప్రభావమే శిఖండి ఆవిర్భావం.
భీష్ముని నియమం
మొదట స్త్రీగా జన్మించి తరువాత పురుషుడిగా మారిన వారితో యుద్ధం చేయకూడదని భీష్ముడి నియమం. దీనికి అనుగుణంగా జన్మించిన శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముని అంపశయ్యపై కూల్చాడు అర్జునుడు. దీనిని బట్టి శిఖండి లేకపోతే భీష్ముని జయించడం పాండవులకు ఎంత కష్టమై ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంటే ద్రుపదుని తపః ఫలితం పాండవ విజయానికి దోహద పడిందన్న మాట.
ద్రోణునికి అవమానం
అదేవిధంగా ద్రోణుని వధలో సైతం ద్రుపదుని పాత్ర కీలకమైనదే. ద్రోణుడు, ద్రుపదుడు ఒకే గురువు వద్ద విద్యలు నేర్చుకున్నారు. నేను రాజు అయ్యాక నీవు కోరినది ఇస్తానని విద్యార్థి దశలో ద్రోణునికి మాట ఇచ్చాడు ద్రుపదుడు. ఆ తరువాత కాలంలో పేదరికంతో బాధపడుతున్న ద్రోణుడు గోవులను అర్ధించడానికి ద్రుపదుని వద్దకు వెళ్లాడు. ధనవంతునితో దరిద్రునికి, తత్వవేత్తతో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, శౌర్యవంతునితో పిరికివానికి, సజ్జనునితో దుర్జనునికి స్నేహం పొసగదని ద్రోణుని అవమానించాడు పాంచాల రాజు. అతని మాటలలో ద్రోణుని పేదరికాన్ని మాత్రమే గాక అతని శౌర్యాన్ని, సౌశీల్యాన్ని కూడా అవమానించడం కాన వచ్చింది. ఈ పలుకులు ధనురాచార్యుని గుండెలలో ములుకుల్లా గుచ్చుకోవడంలో ఆశ్చర్యం లేదు.
ఆ అవమానభారంతో హస్తినకు చేరుకున్నాడు ద్రోణుడు. అతని ధనుర్విద్య పాటవాన్ని గుర్తించి కౌరవులకు, పాండవులకు గురువుగా ద్రోణుని నియమించాడు భీష్ముడు.
గురుదక్షిణ
విద్యాభ్యాసం ముగిసిన అనంతరం ద్రుపదుని బంధించి తనకు గురుదక్షిణ సమర్పించవలసిందిగా శిష్యులను కోరాడు ద్రోణుడు. కౌరవులు ద్రుపదునితో యుద్ధం చేసి ఓడిపోతారు. అర్జునుడు తన సోదరులతో వెళ్లి ద్రుపదుని బంధించి తీసుకువచ్చి తన గురువు కాళ్ళ మీద పడవేస్తాడు.
ఇలా కాళ్ళ మీద పడిన ద్రుపదుని చూసి
నీ వెవరవయ్యా ద్రుపదమ
హారాజులెయిట్లు కృపణులయిపట్టువడెన్
వీరికి వలసెనె మహారాజ్య మదాంధకార మది
వాసెనొకో
ఇకనైన మమ్మునెరుగనిగనగునొక్కొ!
అని ద్రుపదుని అధిక్షేపిస్తాడు ద్రోణుడు. ఇక్కడ మాటలు సున్నితంగా ఉన్నా ద్రోణుని మాటలు ద్రుపదుని మనసుని తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటనతో బాల్య మిత్రులు ఇద్దరూ బద్ధ శత్రువులయ్యారు.
అనంతరం ద్రుపదుడు యజ్ఞం చేసి ద్రోణుని చంపగలిగిన కుమారుని, అర్జునుని వివాహ మాడగల కుమార్తెను అగ్నిగుండం నుంచి పొందాడు. అర్జునుడు తనను బంధించి తీసుకువెళ్లినప్పటికీ అతనిపై ద్రోణునికి కోపం రాకపోవడం విశేషం. గురువుగారి ఆజ్ఞను పాటించడానికి మాత్రమే అర్జునుడు తనతో యుద్ధం చేశాడని ఆ మహారాజు గ్రహించాడు. అందుకే అర్జునునిపై కోపం పెంచుకోకుండా తనకు అల్లుడిని చేసుకోవాలనుకున్నాడు.
ద్రుపద సంతానమే కీలకం
యజ్ఞపలంగా జన్మించిన దృష్టద్యుమ్నుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేసిన ద్రోణుని వధిస్తాడు. అగ్నిగుండం నుంచి ప్రభవించిన ద్రౌపదితో కౌరవులు చెలగాటమాడారు. ఆమెను అవమానించి తమ వంశ నాశనాన్ని కోరి తెచ్చుకున్నారు. ఆమెకు జరిగిన పరాభవం ధృతరాష్ట్ర సంతానాన్ని నిశ్శేషంగా దహించింది. అంటే ద్రుపద మహారాజు సంతానమే కౌరవులను కడతేర్చింది. మహారాజు చేసిన యజ్ఞ ఫలమే పాండవులకు విజయాన్ని చేకూర్చింది.
కాని యుద్ధానంతరం అశ్వత్థామ జరిపిన దాడిలో ద్రుపద సంతానమైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, వారి సైన్యం పూర్తిగా నశించింది. ప్రతీకారాగ్నిలో జన్మించడం వల్లనే శిఖండి, దృష్టద్యుమ్నుడు దీర్ఘాయుష్మంతులు కాలేదని భావించవచ్చు. ఏది ఏమైనా ద్రుపద మహారాజు సంతానమే పాండవ విజయానికి తోడ్పడింది అనడంలో సందేహం లేదు. ఆ ద్రుపదుడె లేకపోతే మహాభారత కథ మరొక రకంగా ఉండేదేమో అనిపించక మానదు.
మహాభారత యుద్ధంలో పాల్గొన్న తరాలు ఎన్ని?
మహాభారత యుద్ధం ఆ కాలంలో ఒక ప్రపంచ యుద్ధం వంటిది. భారత ఖండంలోనూ, పరిసర ప్రాంతాలలోనూ ప్రసిద్ధులైన రాజులంతా ఈ యుద్ధంలో పాల్గొన్నారు.
ఈ యుద్ధంలో మొత్తం ఆరు తరాల వీరులు పాల్గొన్నారని తెలుస్తున్నది. ఆ మహా యుద్ధంలో ఏ తరానికి చెందిన ఏ వీరులు పాల్గొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భీష్ముని పినతండ్రి అంటే శంతన మహారాజు సోదరుడైన బాహ్లికుడు ఈ యుద్ధంలో పాల్గొన్న మొదటి తరం యోధుడు. అతడు కౌరవ పక్షంలో పోరాడాడు. భీముని చేతిలో మృతి చెందాడు.
బాహ్లికుని కుమారుడైన సోమదత్తుడు ఈ యుద్ధంలో పాల్గొన్న రెండవ తరం వీరుడు. ఇతడు భీష్మునికి పినతండ్రి కుమారుడు. వీరిరువురు ఒకే తరానికి చెందినవారు. కనుక భీష్ముడు కూడా రెండవ తరానికి చెందిన యోధుడే. సాత్యకి చేతిలో సోమదత్తుడు మృతి చెందుతాడు.
బాహ్లికుని మనుమడు భూరిశ్రవసుడు మూడవ తరానికి చెందిన మహావీరుడు. ఇతడు కూడా కౌరవ పక్షంలోనే పోరాడాడు. ఇతడు పాండవులకు పిన తండ్రి వరుస. భూరిశ్రవసుని యుద్ధంలో సాత్యకి చంపుతాడు.
ఇక కౌరవులు, పాండవులు నాలుగో తరానికి చెందినవారు. యుద్ధంలో కౌరవులంతా మృతి చెందుతారు. పాండవులు ఐదుగురు, శ్రీకృష్ణుడు, అతని సోదరుడు సాత్యకి, ధృతరాష్ట్ర మహారాజుకు వైశ్య స్త్రీ వల్ల జన్మించిన యుయుత్సుడు యుద్దానంతరం ప్రాణాలతో మిగులుతారు. ధర్మరాజు పిలుపుపై యుయుత్సుడు పాండవ పక్షంలో యుద్ధం చేశాడు. కనుకనే యుద్ధంలో ప్రాణాలు కోల్పోలేదు. యుద్ధానంతరం యుయుత్సుని తగిన విధంగా ఆదరించాడు ధర్మరాజు.
ద్రౌపది కుమారులైన ఉపపాండవులు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు, ఉలూచి కుమారుడు ఇరావంతుడు, దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుడు మొదలైన వారంతా ఐదవ తరానికి చెందిన యోధులు. వీరంతా యుద్ధ రంగంలో మృతి చెందారు. ఘటోత్కచుని కుమారుడైన అంజనపర్వుడు ఆరవ తరానికి చెందిన యోధుడు. ఇతడు యుద్ధంలో అశ్వద్ధామ చేతిలో అంతమయ్యాడు.
ఇలా ఇన్ని తరాల వారు పాల్గొన్న యుద్ధాన్ని, వారి యుద్ధ నైపుణ్యాన్ని ఇంతగా వివరించిన గ్రంథం మహాభారతం తప్ప మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు.

