రష్యా మహా రచయిత లియో టాల్‌స్టాయ్ రచించిన “అన్నా కెరనినా” ప్రపంచ సాహిత్యంలోనే ఒక గొప్ప నవలగా గుర్తింపు పొందింది. 19వ శతాబ్దపు రష్యన్ ఉన్నత వర్గాల జీవన విధానం, ప్రేమ, ద్రోహం, సమాజం విధించే కట్టుబాట్లు, కుటుంబ విలువలు వంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ నవలలోని ప్రధాన సారాంశం అన్నా - వ్రాన్ స్కీ ప్రేమ కథ. నవల కథానాయిక అన్నా కెరనినా అందమైన, తెలివైన, ఉన్నత సమాజంలో గౌరవం ఉన్న మహిళ. ఆమెకు తన కంటే వయసులో చాలా పెద్ద వాడైన ప్రభుత్వ అధికారి అలెక్సీ కెరనినాతో వివాహం జరుగుతుంది. వారికి ఒక కుమారుడు ఉంటాడు. కాని, వారి మధ్య ఎటువంటి భావోద్వేగ బంధం ఉండదు. ఒక సందర్భంలో అన్నాకు యువ మిలిటరీ అధికారి కౌంట్ వ్రాన్ స్కీ పరిచయమవుతాడు. వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. సమాజం, భర్తను లెక్కచేయకుండా వ్రాన్ స్కీ తో కలిసి జీవించడానికి అన్నా వెళ్ళిపోతుంది. సమాజం వ్రాన్ స్కీని అంగీకరిస్తుంది కానీ, అన్నాను వెలివేస్తుంది. కొడుకును చూడనివ్వకుండా భర్త దూరం చేస్తాడు. కాలక్రమేణా, వ్రాన్ స్కీకి తనపై ప్రేమ తగ్గిపోతుందేమోననే స్త్రీ సహజమైన అనుమానం, సమాజం తనను చూసే చులకన భావం అన్నాను మానసిక ఆందోళనలోకి నెట్టేస్తాయి. చివరకు ఆ వేదనను భరించలేక అన్నా ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె భావోద్వాగాలను,మానసిక స్థితిని రచయిత ఎంతో వాస్తవంగా చూపాడు. సమాజం తన పట్ల వ్యవహరిస్తున్న చిన్న చూపుతో అన్నా కుమిలిపోతుంది. ధీర వనిత గా అన్నా ను మొదట చూపించిన రచయిత రానురాను విధి వంచితగా చూపారు.
వ్రాన్ స్కీతో పరిచయం తమ్ముడు అబ్లాన్ స్కీ సంసారం చక్కదిద్దడానికి అన్నా రైలులో బయలుదేరింది. రైలులో వ్రాన్ స్కీ తల్లితో పరిచయం ఏర్పడుతుంది. తల్లిని తీసుకువెళ్లడానికి యువ సైనికాధికారి వ్రాన్ స్కీ రైలు పెట్టె లోపలికి వస్తుంటే అన్నా తమ్ముడి కోసం దిగుతూ ఒకరికొకరు ఎదురుపడతారు. వారి హావభావాలను,తొలి చూపులోనే ఇరువురి మధ్య ఏర్పడిన ఆకర్షణను రచయిత ఎంతో రసభరిత దృశ్య కావ్యంగా మలిచాడు. రచయిత మాటల్లో " ఆ క్షణంలోనే ఆమెను మళ్లీ చూడాలని ప్రేరణ కలిగింది. ఇది ఆవిడ మూర్తిలో ద్యోతకమయ్యే లావణ్యం వల్ల కాదు. తన పక్క నుంచి వెళ్లినప్పుడు ఆమె కమనీయ వదనంలో వ్యక్తమైన అసామాన్య కోమలత్వం, ,శరమణీయత మళ్ళీ మళ్లీ చూడాలనే ప్రేరణ కలిగించింది. అతను తన వైపు తిరగ్గానే ఆమె కూడా అతని వైపు తల తిప్పింది. ఆమె కళ్లు రజితవర్ణంగా,ప్రకాశవంతంగా ఉన్నాయి. అతని కళ్లు ఆమె కళ్లను చూస్తున్నాయి. ఒక్క క్షణం పరిచయం ఉన్నట్లు పలకరించుకున్నాయి. మరు క్షణం ఎవరి కోసమో వెతుకుతున్నట్లు బయట జనసమూహం కేసి మళ్లాయి. ఆ లిప్త కాలంలోనే ఆమె వదనం మీద లాస్యం చేసిన ఉత్సాహాన్ని అతను గమనించాడు. తేజోవంతమైన కళ్లల్లో తొణికిసలాడిన జీవ చైతన్యాన్ని,అరుణాధరాలను ఒంపు తిప్పుతూ లీలగా భాసించే మందహాసాన్ని గమనించాడు. ఆమె మూర్తిలో ఏదో ఉప్పొంగి వస్తున్నట్లు,అది ఇష్టానిష్టాలతో ప్రమేయం లేకుండా చిరునవ్వులోనూ,కళ్ల తేజస్సులోనూ వ్యక్తం అయినట్లు అతడు గుర్తించాడు. అన్నా కెరనినా తమ్ముడు అబ్లాన్ స్కీ కనిపించగానే ఆమె నిబ్బరంగా,లాఘవంగా అడుగులు వేస్తూ రైలు బయటకు వచ్చింది. అతను దగ్గరకు రాగానే తన ఎడమ చేతిని అతని మెడ మీద వేసి, తలవంచి గట్టిగా తమ్ముడిని ముద్దు పెట్టుకుంది. ఆ సొగసు, సాహసాన్ని చూసి వ్రాన్ స్కీ నిశ్చేష్టుడయ్యాడు. చూపు తిప్పుకోలేక పోయాడు. ఎందుకు నవ్వాడో తెలియకండా నవ్వాడు. వ్రాన్ స్కీ తల్లితో మాడ్లాడి, వీడ్కోలు చెబుతూ వ్రాన్ స్కీకి అన్నా చేయి అందించింది. తనకు అందించిన ఆ చిన్న చేతిని అతను అదిమాడు. అన్నా కూడా ఎంతో దృఢంగా,సాహసంతో అతని చేతిని అదిమింది. అది అతనికి ఎంతో సంతోషం కలిగించింది. ఆమె అందమైన రూపం అదృశ్యమయ్యే వరకూ ఆమెను కళ్లతో అనుసరించాడు వ్రాన్ స్కీ." అలా అన్నా కెరనినా,వ్రాన్ స్కీ మొదటి పరిచయంలోనే ఒకరంటే మరొకరికి ఆకర్షణ, ప్రేమ తెలియకండా ఏర్పడింది. దానిని రచయిత ఎంతో సొగసుగా,గుండెలకి హత్తుకునేలా,రమణీయంగా చిత్రీకరించడమే ఈ నవల గొప్పదనం. సాహసాన్ని,ధైర్యాన్ని ఆమె పాత్ర ప్రవేశంలోనే రచయిత ధీర మహిళగా చూపించాడు. రైలు క్రింద పడి ఒక వ్యక్తి చనిపోవడంతో అతని భార్యకు వ్రాన్ స్కీ సహాయం చేయడం ఆమెకు అతనిపై మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసింది. ఆ సంఘటన చూసి అన్నా పెదాలు వణకడం,ఆగని కన్నీళ్లు ఆమెలోని కరుణ కనిపించింది. ఇదే సందర్భంగా వ్రాన్ స్కీ తన మరదలు కిట్టికి కాబోయే వరుడిని కూడా తమ్ముడు అని చెప్పినప్పుడు ఆమె అలాగా అంది మెత్తగా. వారిద్దరి మధ్య బంధం ఏర్పడిన తరువాత వ్రాన్ స్కీ బాగా ఆలోచించాడు. తమ మధ్య ఉన్న ప్రేమ క్షణిక ఆకర్షణ కాదు. తాము ఉన్నత సమాజం దృష్టిలో పడితే సంభవించే కష్టాలు అతనికి గుర్తుకు వచ్చాయి. అబద్ధాలు చెప్పడం,మోసం చేయడం వంటి తమకు తెలియని ప్రవర్తనకు లోబడి ఉండవలసి ఉంటుందని అతనికి అర్ధమయింది. కాని అనురాగ భరిత క్షణాల్లో తమ ప్రేమ తప్ప మరేది ఆలోచించకూడదని ఎంతగా అనుకున్నా అన్నీ గుర్తుకు రావడంతో అతను మనసు వికలం అయింది. “ఇదివరలో ఆమె సుఖంగా లేదు.కాని గర్వంగా,శాంతంగా ఉండేది. ఇప్పుడు అన్నా వెల్లడి చేయలేకపోయినా శాంతంగా ఉండలేకపోతున్నది. ఆత్మ గౌరవ భావంతో ఉండలేకపోతున్నదని, ఈ పరిస్థితికి స్వస్తి చెప్పాలని” నిశ్చయంగా అనుకున్నాడు వ్రాన్ స్కీ. అందుకే అన్నా,వ్రాన్ స్కీల మధ్య విడదీయరాని బంధం ఏర్పడినా అది సమాజం హర్షించదనే విషయాన్ని రచయిత ఎంతో వాస్తవంగా చిత్రీకరించారు.
అదే సమయంలో కెరనినా మానసిక పరిస్థితిని కూడా టాల్ స్టాయ్ వివరించడం చూస్తే ఆనాటి రష్యా ఉన్నత సమాజంలోని డొల్లతనం బయట పడింది. " భార్యతో ఆనందంగా కాపురం చేసిన ఎనిమిది యేళ్లలోనూ వంచకులైన భార్యల గురించి ఎన్నోసార్లు అనుకున్నాడు కెరనినా.అలాంటి వాటిని ఎవరు సహిస్తారు. ఇటువంటి హేయమైన పరిస్థితి కి ఎందుకు స్వస్తి చెప్పరు" అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆ శాపం అతని నెత్తిమీద పడడంతో దానిని ఆలోచించడానికే ఇష్టపడని పరిస్థితి కెరనినాకు ఏర్పడింది. మిత్రులతో పూర్వం మాదిరిగా అతడు గడపలేకపోతున్నాడు. వ్రాన్ స్కీ,కెరనిన్ మనస్తత్వాలను అన్నా బేరీజు వేసుకోవడం ద్వారా స్త్రీ ల మనోగతం ఆవిష్కరించారు. తమ మధ్య ఉన్న బంధాన్ని భర్త కెరనిన్ కు చెప్పమని వ్రాన్ స్కీ ఒప్పించ చూసినా అన్నా వ్యతిరేకించింది. “తన మనసు పడే వేదన తెలిసినా ఏదో రకంగా తగ్గించుకోవాలని చూసింది. గుర్రపు పందాలు నుంచి వచ్చేప్పుడు ఆందోళనకరంగా ఉన్నా భర్తకు సర్వమూ చెప్పింది. ఇకపై అబద్ధాలు,వంచన ఉండవని తనలో తాను సంతృప్తి పడింది. కాని భర్తకు చెప్పినట్లు వ్రాన్ స్కీ కి చెప్పలేక పోయింది. తాను చెప్పిన తరువాత అతను తీసుకునే భయంకరమైన నిర్ణయం తలచుకుని భయ పడింది. ఈ స్థితి నుంచి తప్పించుకోవడానికి తన కుమారుడిని తీసుకుని దూరంగా వెళ్లాలని ఒక దశలో తలపోసింది. ఆ విషయం భర్తకు, ప్రియుడికి లేఖలు రాయాలని ప్రయత్నించి పూర్తి చేయలేక వాటిని చించేసింది”. కెరనినా రాసిన లేఖలో “మన జీవితం ముందు లాగా సాగాలి. అలా జరగకపోతే మీకు,మీ కుమారుడికి కలగబోయే పరిణామాలను ఊహించగలరు” అన్న మాట ఆమెకు ఆందోళన కలిగించింది. అతని కపటత్వం,వంచన అర్ధమైంది. చట్టాల సహాయంతో తనను ఇంకా నీచంగా, పతితురాలిగా చేయాలని చూస్తాడనే ఊహ రాగానే ఆమె వణికిపోయింది. తాను ప్రియుడితో ఉన్నా కుమారుడు లేకుండా తన జీవితం లేదు. అలా అయితే కళంకితురాలు,నీచురాలిని అవుతానని, అలాంటి పని చేయలేనని ఆమె తలపోసింది. విధి వంచిత అయిన మహిళ మనస్సు ఎన్నెన్ని విధాలుగా ఆలోచనల పుట్టగా మారుతుందో అన్నా మనసులోని మాటలు,ద్వర్ధి ఆలోచనలు రచయిత బట్టబయలు చేశారు.
మరో సమాంతర కథాంశం: లెవిన్ - కిట్టీల పవిత్ర ప్రేమ అన్నా విషాద కథకు పూర్తిగా భిన్నంగా కాన్‌స్టాంటిన్ లెవిన్, కిట్టీల కథ నడుస్తుంది. లెవిన్ ఒక భూస్వామి, నగర జీవితం కంటే పల్లెటూరి వాతావరణాన్ని, వ్యవసాయాన్ని ప్రేమిస్తాడు. మొదట్లో లెవిన్ ప్రేమని కిట్టీ తిరస్కరించినా, కాలక్రమేణా అతనిలోని నిజాయితీని గ్రహించి పెళ్ళి చేసుకుంటుంది. వీరిద్దరి దాంపత్య జీవితం పరస్పర గౌరవం, నమ్మకంతో సాగుతుంది. లెవిన్ జీవితం అర్థాన్ని, ఆనందాన్ని సాధారణ గ్రామీణ జీవితంలోని శ్రమలో వెతుక్కుంటాడు. ఆనాడు రష్యాలో అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు.వ్యవసాయమే వారి జీవనాధారం. ఇప్పటి లాగా గ్రామీణ పేదరికం ఆనాడూ ఉన్నది. రైతు సంబంధిత భూమి,అప్పులు, ఉత్పాదకత వంటి సమస్యలు రష్యాలో ఉండేవి. లెవిన్ వ్యవసాయంపై చేసే ఆలోచనలు టాల్ స్టాయ్ తన మాటల్లో చెప్పారు."దేశంలో నిజమైన మార్పు రావాలంటే రాజధాని,అధికారవర్గాల్లో కాదు,గ్రామాల్లోని రైతుల జీవితాల్లో రావాలని 150 సంవత్సరాల క్రితమే చెప్పడం విశేషం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పడం ఆయనకు అన్నదాతల జీవితాల మీద ఉన్న అవగాహన, విశ్వాసంలో కనిపిస్తుంది. రైతు సమాజంలో మార్పు రావాలంటే పోరాటం కావాలని పరోక్షంగా తన నవల ద్వారా రచయిత సూచించారు. ఆనాడు రష్యా మేధావుల్లో సామాజిక మార్పు మీద చర్చ నడుస్తుండేది. రష్యా పాశ్చాత్య నాగరికతను అనుసరించాలా లేదా సొంత సాంప్రదాయ మార్గంలో నడవాలా అనే అంశంపై చర్చ జరుగుతూ ఉండేది. ముఖ్యంగా చర్చ విద్య,వ్యవసాయం,రాజకీయాలు,సంస్కరణల మీద జరిగేది. నవలలో మరో కథానాయకుడు లెవిన్ ఆలోచనలు పాశ్చాత్య సిద్ధాంతాలను రష్యన్ గ్రామీణ వాస్తవాలతో పోల్చి ఆలోచిస్తాడు. అది వాస్తవంగా టాల్ స్టాయ్ ఆలోచనలు గా భావించాలి. ప్రత్యామ్నాయ జీవన దృక్పధం ప్రతిపాదించిన పాత్రగా లెవిన్ ను మలిచాడు రచయిత. ఈ నవలలో రచయిత లెవిన్,అన్నా పాత్రలను చేసిన విశ్లేషణ మరింత ఆసక్తికరంగా ఉన్నది. ఆనాటి ఉన్నత వర్గాల మహిళలైన భార్య,తల్లి కుటుంబ గౌరవం కాపాడే వ్యక్తులుగా భావించేవారు,ఆ పరిధిని అన్నా దాటి తన వ్యక్తిగత కోరిక ముందుకు తేవడం వల్ల ఆమె పట్ల కఠినంగా తీర్పు వచ్చింది. అన్నా ఆ నియమాలను ప్రశ్నించింది. అందుకే పలు విధాలుగా ఆమె భావ సంఘర్షణ నవలలో కనిపిస్తుంది. ఒకసారి స్వేచ్ఛ కోసం తపన,మరోసారి ప్రేమ కోసం ఆరాటం, తల్లిగా బిడ్డ కోసం ఆక్రోశం, సామాజిక ఒత్తిడి,అంతర్మధనం వంటి నీడలు ఆమె పాత్రలో ప్రస్ఫుటించేలా టాల్ స్టాయ్ సజీవంగా ఉంచారు. ఒక దశలో అన్నా తన మనసుకు నచ్చినట్లు ఎలా జీవించాలని పదేపదే ప్రశ్నించుకుంటుంది. అన్నా ప్రేమలో అద్దాన్ని వెతుకుతూ, తనను తాను నిందించుకుంటూ, ప్రియుడి వ్రాన్ స్కీ ప్రేమను సందేహించి బలవన్మరణం పొందుతుంది. అందుకే ఆమె పాత్ర ప్రపంచ సాహిత్యంలో అజరామరంగా నిలిచింది. ఇంకా లెవిన్ పాత్రను రచయిత ఉదాత్తంగా మలిచాడు. లెవిన్ కుటుంబంలో,ప్రకృతిలో,నైతిక జీవితంలో అద్దాన్ని వెతుకుతాడు. అందుకే ఈ రెండు జంటల కథలు పరస్పర విరుద్ధమైనా ఒకదానికొకటి అద్దంలా కనిపిస్తాయి.
నవల మొదటి వాక్యమే చాలా ప్రసిద్ధి చెందింది.“సంతోషంగా ఉండే కుటుంబాలన్నీ ఒకేలా ఉంటాయి, కానీ సంతోషం లేని ప్రతి కుటుంబం దానికదే ప్రత్యేకమైన కారణంతో బాధపడుతుంది.” తప్పు చేసిన పురుషుడు వ్రాన్ స్కీని సమాజం క్షమిస్తుంది, కానీ స్త్రీయైన అన్నాను మాత్రం తీవ్రంగా శిక్షిస్తుంది అనే సామాజిక వివక్షను టాల్‌స్టాయ్ ఇందులో ఎండగట్టారు. అన్నా, వ్రాన్ స్కీ ప్రేమ కేవలం శారీరక ఆకర్షణ, స్వార్థంపై ఆధారపడి ఉండి విఫలమైతే… లెవిన్, కిట్టీల బంధం త్యాగం, నైతికతపై ఆధారపడి విజయవంతమవుతుంది. “అన్నా కెరనినా” కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు. అది మనిషిలోని ఆశలు, ఆకాంక్షలు, తప్పులు, పశ్చాత్తాపాల సమాహారం. సమాజ నియమాలను ఎదిరించి, మనసుకు నచ్చినట్టు బ్రతకాలనుకున్న ఒక మహిళ జీవితం ఏ విధంగా విషాదాంతమైందో వివరించే అద్భుత కావ్యం ఇది. ఆనాడు రష్యా మార్పు సంధికాలంలో ఉన్నది. పాతది కూలిపోతున్నా, కొత్తది ఇంకా రూపుదిద్దుకోలేదు. భూస్వామ్య వ్యవస్థ మారి రైతు సమాజం నూతన రూపాన్ని సంతరించుకునే సంధికాలం దేశంలో ఉన్నది. రైల్వేలు,పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. నగర జీవనం పెరుగుతున్నది. ప్రజల్లో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మహిళలు తమ స్థానం గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. మరో పార్శంలో చూస్తే జార్ నిరంకుశ పాలన,ఉన్నత వర్గాల ఆధిపత్యం,చర్చి ప్రభావం,కుటుంబ సాంప్రదాయాలు, సామాజిక ప్రతిష్ట,పురుషాధిక్యత,నైతిక ప్రమాణాలు ఇంకా బలహీనపడలేదు. కొత్త,పాతల మధ్య సంఘర్షణ ను రచయిత అన్నా,కెరనిన్,వ్రాన్స్ స్కీ,డాలి,స్టీవా,లెవిన్, కిట్టి పాత్రల జీవితాల్లో ప్రస్ఫుటించేలా చూపించాడు. ఈ నవల మారుతున్న రష్యన్ సమాజం, మారుతున్న సజీవ సామాజిక దర్పణం. ఈ కథలో ఇద్దరే నాయకులు. ఒకరు అన్నాకెరినివా,మరోకరు లెవిన్ మాత్రమే. మిగిలిన పాత్రలన్నీ వీరిద్దరి మధ్యే తిరుగుతాయి. అన్నా మరణం తరువాత కూడా రచయిత నవలను కొనసాగించడానికి కారణం లెవిన్ పాత్రను మరింత విస్తరించడానికేనని పాఠకులు గ్రహించాలి. భూస్వామి అయినా రైతులు జీవితం ఎలా ఉండాలి,వారు ఎలా ఆర్ధికంగా మెరుగుపడాలి,భూస్వామి,రైతుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలని నిరంతరం ఆలోచించే నిజమైన వ్యవసాయ,ప్రకృతి ప్రేమికుడిగా లెవిన్ కథలో చివరి వరకూ కనిపిస్తాడు. 1861లో రైతు బానిసత్వం రద్దు కావడంతో భూస్వామ్య వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులు ప్రతి ధ్వని లెవిన్ ఆలోచన ద్వారా రచయిత ప్రతిఫలింపజేస్తాడు. అలాగే , రచయిత కథను పీటర్స్ బర్గ్,మాస్కో, గ్రామీణ రష్యా చుట్టూ నడిపించారు. పీటర్స్ బర్గ్ లో అధికారవ్యవస్థ,రాజ సభ,ఉన్నత సమాజం, కౌంట్ కెరనిన్ లాంటి అధికారులు ఉంటారు. మాస్కో సమాజం కుటుంబాలు,విందులు,వివాహాలు,పాత,కొత్త విలువలు కలయికతో ఉంటుంది. గ్రామీణంలో రైతులు,వ్యవసాయం,ప్రేమ కుటుంబ జీవితం ఉంటుంది. ఈ మూడు ప్రపంచాలు టాల్ స్టాయ్ దగ్గరగా చూపడం ద్వారా రష్యా ఆత్మను పాఠకుల ముందు పరిచాడు. ఎస్టేట్ యజమాని లెవిన్ ను గ్రామీణ ప్రపంచానికి వారధిగా రచయిత వ్యక్తీకరించి చూపాడు. భర్తను వదిలి ప్రియుడి వద్దకు వెళ్లిన స్త్రీ గా అన్నా కథను రచయిత చిత్రీకరించలేదు. ఆమె ఎదుర్కొన్న వివాహం,చర్చి, సామాజిక ప్రతిష్ట,తల్లిదనం,లింగవివక్ష,వ్యక్తిగత ఉద్వేగాలతో కలగలిపిన సంక్లిష్ట సమస్యగా రచయిత విశ్లేషించారు. ఆనాటి సమాజంలో విడాకులు సంక్లిష్టమైనదిగా చూపాడు. వివాహం ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయం కాదు. దీనితో కుటుంబం,సామాజిక గౌరవం,చర్చి,చట్టాలతో కలగలిసిన చిక్కుముడి. రష్యా సాంప్రదాయిక సమాజంలో కట్టుబాట్లు,నైతికతకు అత్యంత ప్రాధాన్యం ఉండేది. ఉన్నత వర్గాల జీవితాల్లో భవంతులు, విందులు,నృత్య కార్యక్రమాలు,గుర్రపు పందేలు,సమావేశాలు,అధికారుల పరిచయాలు, వివాహాల్లో ప్రతిష్ట, సమాజంలో పేరు ముఖ్యమైనవి. భార్యాభర్తలు మధ్య ప్రేమ లేకపోవడం, దాంపత్యంపై అప నమ్మకం,సామాజిక ప్రతిష్ట కనిపిస్తుంది. దానికి అబ్లాన్ స్కీ,డాలి సంసారమే మచ్చుతునక.
అన్నా కెరనినా నవల టాల్ స్టాయ్ రచించి నాటికి రష్యా ప్రజాస్వామ్య దేశం కాదు. జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2పరిపాలిస్తున్నాడు.1854-56 మధ్య క్రిమియా యుద్ధం తర్వాత దేశంలో సంస్కరణల అవసరం పెరిగింది. ఈ నవల మారుతున్న రష్యాను అర్ధం చేసుకోవడానికి ఒక ప్రయోగశాలగా టాల్ స్టాయ్ చూపాడు. ఐరోపా దేశాలతో పోల్చితే రష్యా పారిశ్రామికంగావెనుకబడి ఉన్నది.
నవలలోని సంభాషణల్లో ఫ్రెంచి భాష ఆధిపత్యం కనిపిస్తుంది. రష్యాపై నెపోలియన్ దండయాత్ర, క్రిమియా యుద్ధాల అనంతరం రష్యా ఉన్నత సమాజంలో ఫ్రెంచి భాష మమేకమయిందని భావించాలి. అది ఉన్నత వర్గాల సమాజంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామీణ రష్యాలో వారి సొంత భాషకు అగ్రస్థానం కనిపిస్తుంది. రచయిత ఈ రెండు సమాజాలను విశ్లేషించే సమయంలో ఆయా సందర్భాల్లో ఆయా భాషను వాడి వాస్తవికతకు దర్పణం పట్టారు.
రష్యన్ మహా రచయిత టాల్ స్టాయ్ 1828లో ఒక జమిందారీ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. యవ్వనంలో చదువు పట్ల శ్రద్ధ లేకపోయినా,తరువాత న్యాయశాస్త్రం,ఫిలాసఫీలలో చేరాడు. రష్యా,క్రిమియా యుద్ధంలో సైన్యంలో పని చేశాడు. తిరిగి వచ్చి ఒక వైద్యుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి 13 మంది సంతానం. ఆయన రచనలు యుద్ధం-శాంతి,అన్నా కెరనినా నవలలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అన్నా కెరనినా నవల రాయడానికి టాల్ స్టాయ్ కి దాదాపు ఐదేళ్లు పట్టింది. ఆయన నవలలో చరిత్రను,సమకాలీన జీవితాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించాడు. అలా పరిస్థితులను వివరించాలంటే ప్రతి చిన్న విషయంపై రచయితకు అవగాహన ఉండాలి. టాల్ స్టాయ్ తన నవలలో అలాంటి అన్నా,వ్రాన్ స్కీ ప్రేమ కథను పరిచయం చేశాడు. జీవితాల్లో పాతబడిన విలువల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టే సాహసోపేత ప్రయత్నం చేశాడు. తప్పు చేసిన పురుషుడిని సమర్దించి, అన్నా ను సమాజం చిన్న చూపు చూసే వివక్షను మాత్రం ఖండించడం సంస్కరణాభిలాషిగా భావించాలి. ఆనాటి జమిందారీ,ఉన్నత కుటుంబాల పతనచిహ్నాలు తన నవల ద్వారా బట్టబయలు చేశాడు. అన్నా జీవితాన్ని మాత్రమే టాల్ స్టాయ్ రాయలేదు,అన్నా జీవితాన్ని తీర్పుచేసిన సమాజాన్ని తన రచనలో చూపాడు. అందుకే ఈ నవల ఒక ప్రేమ కథను దాటి ఒక యుగం తనను తాను చూసుకునే అద్దంగా కనిపిస్తుంది.

