ఆగస్టు 29…భారత జాతీయ క్రీడాదినోత్సవం. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి రోజును జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకొంటూ రావడం గత కొద్ది సంవత్సరాలుగా ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే…79 సంవత్సరాల స్వతంత్రభారత్ లో ఇప్పటికీ జాతీయ క్రీడాదినోత్సవం ప్రాధాన్యం ఏమిటో …అసలు ఏ రోజున జరుపుకొంటారో తెలియని నవయువ జనాభా చాలామంది ఉన్నారంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది…
ఎవరికీ పట్టని జాతీయ క్రీడాదినోత్సవం…
ప్రపంచంలోని 204 దేశాలలో అత్యధిక యువజన జనాభా ఉన్న దేశం భారత్. దేశ జనాభాలో 40 శాతం మంది యువజనులే. అయినా క్రీడలంటే ఏమాత్రం ఆసక్తి లేదు. వాలంటైన్స్ డే, మైకేల్ జాక్సన్ ల పుట్టిన రోజుల గురించి ఉన్న అవగాహన…జాతీయ క్రీడాదినోత్సవం గురించి లేకపోవడం చేదునిజం.
వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది అర్జున అవార్డీల బృందంతో ఇటీవలే నిర్వహించిన ఓ సదస్సులో…భారత క్రీడారంగం వెనుకబాటుకు గల కారణాలు బయటకు వచ్చాయి. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
125 కోట్ల భారత జనాభాలో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఇటీవలే నిర్వహించిన తాజా సర్వే ద్వారా తేలింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉందంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. అంతేకాదు…దేశ జనాభాలో 3.27 శాతం మంది మాత్రమే…క్రీడల గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడయ్యింది.
ప్రతి ఏడాదీ ఆగస్టు 29వ తేదీన జరిగే జాతీయ క్రీడాదినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ మొక్కబడి తంతుగా మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నాయి. యువతలో స్ఫూర్తిని నింపే విధంగా ఏమాత్రం వ్యవహరించడం లేదు. చివరకు పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు ప్రశ్నగా ఆగస్టు 29 మిగిలిపోయే దుస్థితి దాపురించింది.
జాతీయ క్రీడే లేని దేశం భారత్…
క్రికెట్ మత్తులో జోగుతున్న భారత్ కు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదన్న వాస్తవాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోడం కష్టమే. ఒలింపిక్స్ లో భారత్ బంగారు క్రీడ హాకీని శతకోటి భారత క్రీడాభిమానులు ఇప్పటికీ జాతీయక్రీడగానే పరిగణిస్తున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పలు రకాల పోటీ పరీక్షల్లో జాతీయక్రీడ ఏదంటూ గత కొద్ది సంవత్సరాలుగా ఓ ప్రశ్న తప్పనిసరిగా ఉంటూ రావడం, జవాబుగా హాకీనే అంటూ సమాధానం ఇవ్వటం అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ కు…జాతీయ క్రీడ అంటూ ఏదీలేదని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే నిర్దారించింది.
1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ వరకూ భారత్ అత్యధికంగా హాకీ క్రీడలోనే ఎనిమిది బంగారు పతకాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో …భారత్ కు ఒలింపిక్స్ లో అత్యధిక స్వర్ణపతకాలు సంపాదించి పెట్టిన హాకీనే జాతీయక్రీడగా పరిగణిస్తూ వచ్చారు. ఇంతగా ప్రచారం జరుగుతున్నా…గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పెదవి విప్పలేదు. అయితే…ఆర్టీఏ చట్టం పుణ్యమా అంటూ…భారత్ కు జాతీయ క్రీడ అనేది ఏదీలేదనేది వెలుగులోకి వచ్చింది. దేశంలో అన్నిరకాల క్రీడలను ప్రోత్సహించడం కోసమే జాతీయక్రీడగా ఇప్పటివరకూ ఏ క్రీడనూ నిర్ధారించలేదంటూ ఒక అధ్యాపకుడు ఆర్టీఎ కింద అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చింది.
క్రీడలు… ఓ లాభసాటి వ్యాపారం…
క్రీడలంటే ఒకప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఆడే ఆటలు మాత్రమే. అయితే …ప్రపంచీకరణ పుణ్యమా అంటూ …క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ లాంటి టీవీ ఫ్రెండ్లీ ఆటలతో…క్రీడారంగం కూడా బహుళజాతి సంస్థల వ్యాపారవాహకంగా మారిపోయింది.
క్రికెట్ అంటే ఇప్పుడు పరుగులు, వికెట్లు, క్యాచ్ లు, రికార్డులు ఏమాత్రం కాదు. ప్రసారహక్కులు, కిట్ బ్యాగులు, లోగో హక్కులు, ఇన్ స్టేడియా హక్కులు, జట్టు, క్రీడాకారుల వ్యక్తిగత ఎండార్స్ మెంట్లు…ఇలా ఏది చూసినా కోట్ల రూపాయల వ్యాపారమే. టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు…ఆటతో కోట్ల కోటలు దాటినవారే. బహళజాతి సంస్థల అండదండలు, మీడియా ఫ్రెండ్లీగా ఉండే…క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఒకటి రెండు క్రీడల దెబ్బకు…మిగిలిన క్రీడలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు సైతం తమకు ఆదాయం, ప్రచారం తెచ్చిపెట్టే క్రీడలని, క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ…మిగిలిన క్రీడలను, క్రీడాకారులను చిన్నచూపు చూస్తున్నాయి.
కనుమరుగైపోతున్న జాతీయస్థాయి పోటీలు
దేశంలో క్రీడలు ఎన్ని రకాలు ఉన్నా…సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ స్థాయిలో జాతీయ పోటీలు నిర్వహించడం ఓసాంప్రదాయంగా ఉండేది. ఈ పోటీల నిర్వహణ కోసం జాతీయ ఒలింపిక్ సంఘం, కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖలు సహాయసహకారాలు అందచేస్తూ ఉండేవి. అయితే…లాభసాటి లీగ్ వ్యాపారం భారత క్రీడారంగంలోకి చొరబడటంతో…జాతీయపోటీల నిర్వహణ తూతూమంత్రంగా మారిపోయాయి. చివరకు భారత క్రీడారంగ మూలాలే బలహీనపడే ప్రమాదం పొంచిఉంది.
దీనికితోడు…క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో… ఓ స్పష్టమైన క్రీడావిధానం అంటూ లేకపోవడం భారత క్రీడారంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అదీచాలదన్నట్లుగా…ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఎలాంటి విధానాలు లేవని మాజీ క్రీడాదిగ్గజాలు అంటున్నారు. దశాబ్దాలనాటి క్రీడామౌలిక సదుపాయాలతో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో ఏవిధంగా రాణించగలరని భారత హాకీ మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఎం.పీ.గణేశ్ ప్రశ్నిస్తున్నారు.
మైదానాలు లేని పాఠశాలలు…
పాఠశాల అంటే సువిశాలమైన క్రీడా మైదానం, తరగతి గదులు అన్నమాట…నేటి తరం పాఠశాలలకు ఏమాత్రం వర్తించదు. చిన్నచిన్న నగరాలు, పట్టణాలలో సింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్, ట్రిపుల్ బెడ్ రూం కళాశాలలను చూస్తుంటే క్రీడారంగంలో భారత్ ఏగతిన బాగుపడుతుందన్న సందేహం రాకమానదు.
దేశంలోని క్రీడారంగ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు నిపుణుల సంఘాలలో సభ్యుడిగా ఉన్న భారత హాకీ మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ సైతం…ఆటలంటే ఏమిటో తెలియని నేటితరం బాలలు, పాఠశాలలు, కళాశాలలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస క్రీడాసౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదని భారత మాజీ క్రీడాదిగ్గజాలు, అర్జున అవార్డీలు వాపోతున్నారు.
క్రీడలను సైతం నిర్భంద పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. మన సమాజం, ప్రభుత్వాలు, క్రీడావ్యవస్థ ఆలోచనా ధోరణిలో మార్పురానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ సంస్కృతి, స్మార్ట్ ఫోన్ విష కౌగిలి, పశ్చిమదేశాల అనుకరణలో ముందున్న మనదేశంలో…కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చొరవచూపకుంటే…క్రీడాసంస్కృతి ఎండమామిగానే మిగిలిపోతుంది.
నిధుల కేటాయింపు అంతంతే…!
కేంద్రంలోను, తెలుగు రాష్ట్రాలలోనూ వార్షిక బడ్జెట్ల సమర్పణ తంతు చూస్తే మన ప్రభుత్వాలకు క్రీడలంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎప్పటిలానే క్రీడారంగానికి అరకొర మొత్తాలను మాత్రమే ఆర్థికమంత్రులు విదిలించి…క్రీడలకు తాము ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో చెప్పకనే చెప్పారు…
ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నా…క్రీడారంగానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అరకొర కేటాయింపులతో, విదిలింపులతోనే సరిపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు…నిధులు మిక్కుటంగా ఉన్న తెలంగాణా, నిధులో రామచంద్రా అంటూ కేంద్రప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ తమతమ ప్రాధమ్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకొంటున్నాయి.
ప్రపంచ క్రీడాపటంలో మనమెక్కడ?
79 సంవత్సరాల స్వతంత్ర భారత్…శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించిన దేశం. అంతేకాదు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న దేశం. ప్రపంచంలోని విఖ్యాత బహుళజాతి కంపెనీల చూపంతా ఇప్పుడు భారత్ మార్కెట్ వైపే. అయితే, ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. క్రీడాపరంగా భారత్ ప్రగతి చూస్తే…ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని చెప్పక తప్పదు.
పారిస్ వేదికగా ముగిసిన 2024 ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ కు దక్కినచోటు కేవలం 71వ స్థానం మాత్రమే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలలో ఒకటిగా , అత్యధిక యువజన జనాభా కలిగిన ఏకైక దేశంగా ఉన్న భారత్ కనీసం ఒక్క బంగారు పతకమైనా సాధించలేకపోయింది. కేవలం ఓ రజత, ఐదు కంచు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మన పొరుగుదేశం చైనాతో పోల్చిచూస్తే…ఒలింపిక్స్ లో భారత్ పరిస్థితి తీసికట్టే. జనాభాలో ప్రపంచంలోనే చైనా అతిపెద్ద దేశం. దేశ జనాభాకు తగ్గట్టుగానే క్రీడారంగంలో చైనా కళ్లు చెదిరే ప్రగతి సాధించింది. అమెరికా లాంటి సూపర్ పవర్ కే సవాలు విసిరే పరిస్థితికి ఎదిగింది. అదే…జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్…పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టిక 71వ స్థానంలో ఉందంటే…మన పరిస్థితి ఎంత దయనీయమో మరి చెప్పాల్సిన పనిలేదు.
మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. చివరకు 77 దేశాల కామన్వెల్త్ గేమ్స్, 45 దేశాల ఆసియాక్రీడల్లో సైతం…భారత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. జాతీయ క్రీడ హాకీలో సైతం భారత మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. క్రికెట్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ లాంటి ఒకటి రెండు క్రీడల్లో భారతజట్టు, క్రీడాకారులు రాణిస్తున్నా అది నామమాత్రమే.
వందల కోట్ల తంత్రం…
మనదేశంలో ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నా క్రీడారంగ పరిస్థితి మాత్రం రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి గత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ…ఖేలో ఇండియా అనే వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.
గతంలో ఉన్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, పట్టణ ప్రాంతాలలో మౌలిక క్రీడాసదుపాయల కల్పన పథకం, క్రీడారంగంలో జాతీయ ప్రతిభాన్వేషణ పథకాలను మిళితం చేయడం ద్వారా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పథకం అమలు కోసం 1756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేశారు.
క్రీడారంగంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి చదువుకు ఆటంకం కలగని విధంగా క్రీడల్లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి…దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులకు ఈ 20 విశ్వవిద్యాలయ కేంద్రాలు…స్పోర్టింగ్ ఎక్స్ లెన్స్ వేదికలుగా అందుబాటులో ఉంటాయి.
మూడంచెల విధానం…
అధునాతన శిక్షణ సదుపాయాలతో పాటు…అత్యాధునిక రీతిలో తీర్చి దిద్దే శిక్షకులు సైతం ఈ కేంద్రాలలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అట్టడుగుస్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి…శిక్షణతో పాటు విద్యాసదుపాయాలను సైతం అందిస్తారు.
దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, వ్యవస్థలు…స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. అంతేకాదు…వివిధ క్రీడలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోడానికి వీలుగా ప్రత్యేక యాప్ లను సైతం సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర క్రీడామంత్రి ప్రకటించారు.
ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలోని క్రీడామైదానాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉంచడం, క్రీడాశిక్షకుల పరిజ్ఞానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడం…ఖేలో ఇండియాకు ఆయువుపట్టుగా ఉంటాయి.
పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసున్న ప్రతిభావంతులైన బాలలు, యువతీయువకులను గుర్తించి…ఎంపిక చేసిన క్రీడలతో పాటు చదువులోనూ రాటుదేలేలా చేయటమే ఖేలో ఇండియా ప్రధానలక్ష్యంగా ఉంది.
క్రీడావిధానం పైనా పునరాలోచన…
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన రాజ్యాంగంలో…క్రీడలు ఉమ్మడి జాబితా అంశంగా ఉండటం కూడా దేశక్రీడాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారయ్యింది. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ ఓ క్రీడా విధానాన్ని రూపొందిస్తే…రాష్ట్రాలస్థాయిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేక క్రీడావిధానం ఏర్పాటు చేసుకోవడం క్రీడాప్రగతిలో అసమానతలకు తావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించి…దేశమంతటికీ ఓ సమగ్ర క్రీడావిధానం సిద్ధం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటామని క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అంటున్నారు. క్రీడలని ప్రస్తుత ఉమ్మడి జాబితా నుంచి కేంద్ర జాబితా అంశంగా మార్చే ఆలోచన కూడా ఉందని ప్రకటించారు. అయితే ఇదంతా దశలవారీగా జరుగుతుందని చెబుతున్నారు.
జాతీయక్రీడే లేని దేశంలో జాతీయ క్రీడాదినోత్సవం సైతం ఓ ప్రహసనంగా తయారు కావడం శోచనీయం.
ఏదిఏమైనా…జనజీవితంలో క్రీడలు ఓ ప్రధాన భాగంకానంత వరకూ, క్రీడాసంస్కృతి పాదుకోనంత వరకూ,జాతీయ గీతం, జాతీయ పతాకంతో సమానంగా జాతీయ క్రీడాదినోత్సవానికి ప్రాధాన్యం ఇవ్వనంత వరకూ…భారత క్రీడారంగ ప్రగతి ఓ అందమైన కలగానే ఉండిపోతుంది.

