2036 లో జరిగే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని భారత్ ముచ్చట పడుతున్నది. కనీస అవసరాలు తీరని కోట్లాది మంది జనాభా కలిగిన భారత్ కు ఒలింపిక్స్ లాంటి ఖరీదైన క్రీడలు నిర్వహించే సత్తా ఉందా?.. అసలు ఒలింపిక్స్ నిర్వహించడం భారత్ కు అవసరమా? అన్న ప్రశ్నలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ ను అట్టహాసంగా నిర్వహించడం అంటే లక్షల కోట్ల రూపాయల వ్యవహారం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికైతే తలకు మించిన భారమే. అయితే, భారత ప్రభుత్వం మాత్రం అహ్మదాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ ను నిర్వహించాలని తెగ ఆరాట పడుతున్నది. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒలింపిక్స్ ఆతిథ్య పోటీలో తాము సైతం ఉన్నామంటూ అధికారికంగా ప్రకటించారు. గతంలో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ తో పాటు హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఆఫ్రో-ఆసియా క్రీడల అనుభవంతో ఏకంగా ఒలింపిక్స్ కే ఆతిథ్యమివ్వాలని భావిస్తున్నది.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు…!
పారిస్ వేదికగా జరిగిన 2024 ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ కు దక్కిన చోటు కేవలం 71వ స్థానం మాత్రమే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలలో ఒకటిగా, అత్యధిక యువజన జనాభా కలిగిన ఏకైక దేశంగా ఉన్న భారత్ కనీసం ఒక్క బంగారు పతకమైనా సాధించలేకపోయింది. కేవలం ఓ రజిత, ఐదు కంచు పతకాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
మన పొరుగు దేశం చైనా మాత్రం పతకాల పట్టిక మొదటి రెండు స్థానాలలో నిలవడం ద్వారా అమెరికాకు అడుగడుగునా పోటీగా నిలిచింది. అంతేకాదు, ఒలింపిక్స్ కు కొనసాగింపుగా జరిగిన పారా ఒలింపిక్స్ లో భారత్ పతకాల పట్టిక 18వ స్థానంలో నిలవడం ద్వారా పరువు దక్కించుకోగలిగింది. ప్రపంచంలోని 204 దేశాలు తలపడే ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించే సత్తాలేని, పతకాల పట్టిక మొదటి ఐదు స్థానాలలో నిలిచే స్థాయిలేని భారత్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తానంటూ ముందుకు రావడాన్ని క్రీడా విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒలింపిక్స్ నిర్వహించినా పతకాల పట్టిక మొదటి ఐదు స్థానాలలో నిలువలేక అభాసుపాలు కావడం తప్ప మరొకటి ఉండదంటూ హెచ్చరిస్తున్నారు. ముందుగా క్రీడా రంగాన్ని, క్రీడా ప్రమాణాలను మెరుగు పరచుకొని తద్వారా దేశంలో క్రీడాసంస్కృతిని పాదుకొల్పడం, ఆశించిన ఫలితాలు సాధించిన తరువాతే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడం గురించి ఆలోచన చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఆర్థిక సుడిగుండం ఒలింపిక్స్ ఆతిథ్యం
ప్రపంచంలోని 204 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు పోటీ పడే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడం అంటే మాటలు కాదు. లక్షల కోట్లు మంచి నీటిప్రాయంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. గతంలో ఒలింపిక్స్ నిర్వహించడం ద్వారా గ్రీసు, బ్రెజిల్ లాంటి దేశాలు ఆర్థికంగా దివాళా పరిస్థితిని ఎదుర్కొన్నాయి. క్రీడా రంగానికి వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే వెసలుబాటు లేని భారత్ కు లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ఒలింపిక్స్ నిర్వహించడం తలకుమించిన భారమే అవుతుంది.
పైగా ప్రపంచ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక క్రీడామౌలిక సదుపాయాలు కలిగిన రాజధాని న్యూఢిల్లీ నగరాన్ని కాదని అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆలోచనా ఆందోళన కలిగిస్తున్నది.
ఏ క్రీడ చూసినా ఏమున్నది గర్వకారణం
ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారత క్రీడారంగం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడలేదు. ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. పెరిగే జనాభాకు అనుగుణంగా మౌలిక క్రీడా సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయి. రూపాయి పనికి వంద రూపాయల ప్రచారం చేసుకొంటూ మభ్యపెట్టడం, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మాయ చేస్తూ పబ్బం గడుపుకోవడం మన ప్రజా ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ప్రభుత్వాల చేతిలో ప్రజలు మోసపోయినా తెలివైన నేటి యువతరం మాత్రం వాస్తవాలను గమనిస్తూ ఆందోళన బాట పట్టడంతో ఒలింపిక్స్ నిర్వహణ రాగం అందుకోవాల్సి వచ్చిందంటూ విమర్శకులు గుర్తు చేస్తున్నారు. క్రీడాపరంగా మనం అంతర్జాతీయస్థాయిలో ఏం సాధించామంటూ నిలదీస్తున్నారు.
200కు పైగా దేశాలు తలపడే ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం 71. దాదాపు 204 దేశాలు తలపడే అత్యధిక జనాదరణ పొందిన క్రీడ ఫుట్ బాల్ లో మన ర్యాంకు వందకు పైనే. 77 దేశాలు తలపడే కామన్వెల్త్ గేమ్స్ లో మన చోటు నాలుగవ స్థానం మాత్రమే. అంతేనా… 45కు పైగా దేశాలు తలపడే ఆసియా క్రీడల పతకాల పట్టికలో సైతం మొదటి ఐదు స్థానాలలో నిలవడం మనకు సాధ్యపడడం లేదు.
ఏటా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ… జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తులు మీద వేసే నానారకాల పన్నుల ద్వారా వచ్చే రాబడితో కేంద్ర ప్రభుత్వం, మద్యం విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో నడిపే రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఉన్న మన దేశానికి లక్షల కోట్ల రూపాలు ఖర్చుచేసి ఒలింపిక్స్ నిర్వహించడం అవసరమా అంటూ ఆర్థికరంగ నిపుణులు సైతం నిలదీస్తున్నారు.
ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తే తప్పేంటి?
మరోవైపు… ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రపంచ క్రీడలను భారత్ నిర్వహిస్తే తప్పేంటని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. జీ-20 ప్రెసిడెన్సీ శిఖరాగ్ర సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించిన భారత్… ఒలింపిక్స్ ను మాత్రం ఎందుకు నిర్వహించలేదని కేంద్ర మాజీ క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్ ఒలింపిక్స్ ను ఎందుకు నిర్వహించకూడదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
2032 వరకూ ఒలింపిక్స్ వేదికలు ఖరారు కావడంతో… 2036 ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యమివ్వాలని భావిస్తున్నట్లు ఠాకూర్ గతంలోనే ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం భారత్ కు అవకాశం ఇస్తే గుజరాత్ వేదికగా ప్రపంచ క్రీడల పండుగ నిర్వహిస్తామని అంటున్నారు. ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వటానికి జరిగే పోరులో భారత్ నిలువనున్నట్లు తెలిపారు.
గతంలో ఎన్నడూలేని విధంగా భారత ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదని, గత దశాబ్దకాలంలో వివిధ క్రీడల్లో భారత్ కళ్లు చెదిరే ప్రగతి సాధించిందని, సత్తా చాటుకోడానికి ఒలింపిక్స్ ను సైతం నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్న వాస్తవాన్ని ప్రపంచ దేశాలు గమనించాలని కోరారు. ఇప్పటికే… గుజరాత్ పలుమార్లు ఒలింపిక్స్ నిర్వహించడానికి తన సంసిద్ధతను తెలిపిందని, ఒలింపిక్స్ కు అవసరమైన క్రీడాసముదాయాలు, విమానాశ్రయాలు, స్టార్ హోటళ్లు, హాస్టల్సు లాంటి మౌలిక సదుపాయాలు గుజరాత్ లో ఉన్నాయని గుర్తు చేశారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు సైతం అహ్మదాబాద్ వేదికగా భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు… 2036 ఒలింపిక్స్ ప్రారంభం నాటికి భారత పట్టణ జనాభా 40 శాతానికి పెరుగుతుందని, ఆర్థికవ్యవస్థ సైతం మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరటం ఖాయమని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంట్లో ఈగల మోత…
గుజరాత్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహించడం అంటే ఆర్ధికంగా దివాళా తీయటమేనని మరికొందరు హెచ్చరిస్తున్నారు. తమ రాష్ట్ర్రప్రభుత్వ ఉద్యోగులకే సకాలంలో జీతాలు చెల్లించలేక సతమతమవుతున్న గుజరాత్ కు వేలకోట్ల రూపాయల ఖర్చుతో ఒలింపిక్స్ నిర్వహించే సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒలింపిక్స్ నిర్వహణకు తాము సిద్ధమని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించడం బాధ్యతారాహిత్యం, హాస్యాస్పదమని అంటున్నారు.
పైగా… గత దశాబ్దకాలంగా భారత ప్రభుత్వం అప్పులకుప్పగా మారిపోతున్నది. ఏడాది ఏడాదికీ అప్పుఊబిలో మరింతగా కూరుకుపోతున్నది. లోక్ సభలో కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… రోజుకు 3వేల 24 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం పలురూపాలలో అప్పులు చేస్తూ వస్తోంది.
నెలకు 90వేల 720 కోట్లు, సంవత్సరానికి 10.88 లక్షల కోట్ల వంతున గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో కేంద్రప్రభుత్వం 92లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. భారత పౌరులను లక్షాధికారులు చేయటం సంగతేమో కానీ… ఇప్పటికీ తలసరి అప్పును లక్షల మేరకు దాటించింది.
గతంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడం ద్వారా గ్రీస్, బ్రెజిల్ లాంటి దేశాలు ఆర్థికంగా దివాళాతీశాయి. జపాన్, ఇంగ్లండ్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వటాన్ని ఓ దుస్సాహసంగా పరిగణించాయి.
గతంలో 72 దేశాలు తలపడిన కామన్వెల్తే గేమ్స్ కు ఆతిథ్యమివ్వటానికే నానాపాట్లు పడిన భారత్ 204 దేశాలు పోటీపడే ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తాననడం అర్థంలేనిదని అనేవారు లేకపోలేదు.
ఒలింపిక్స్ నిర్వహించడం సంగతి అటుంచి… ఆతిథ్యమివ్వటానికి జరిగే పోటీలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉన్నది. ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోగలిగితే అదే గొప్ప ఘనకార్యమని చెప్పుకోక తప్పదు.
వచ్చే (లాస్ ఏంజెలిస్) ఒలింపిక్స్ లో భారత్ రెండుకు మించి బంగారు పతకాలు సాధించగలిగితే, పతకాల పట్టిక మొదటి 10 స్థానాలలో నిలువగలిగితేనే ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే విషయం గురించి ఆలోచించాలి. ఒలింపిక్స్ నిర్వహణతో భారత్ కు జరిగే మేలు కంటే కీడే ఎక్కువన్న వాస్తవాన్ని గమనించకుంటే భారత ప్రజలు భారీమూల్యం చెల్లించక తప్పదు.

