సమీక్షకులు:యం.వి.రామారావు

“తిమ్మాపురం తీగ మల్లెలు” బడి పిల్లలు రాసిన 25 కథల సంకలనం. బాల రచయితలు రాసిన పెద్ద పుస్తకం. ఇందులో కథలన్నీ నీతిని బోధించి తోటి బాలల్లో ఆలోచనలు రేకెత్తించేలా ఉండడం విశేషం. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎన్. తిమ్మాపురం ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు తమ చిట్టి చేతులతో పేజీ మించని చిట్టి చిట్టి కథలు రాయడం నిజంగా వారి సృజనకు నిదర్శనం. వారిలోని రచనాభిలాషను వెలికితీసి, ప్రొత్సహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహర్, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించాలి. అంతేకాక వారి కథలను సరిచేసి సంకలనంగా తీర్చిదిద్ది ప్రచురణకు సహకరించిన ఉపాధ్యాయులు, రచయిత దాసరి చంద్రమోహన్ అభినందనీయులు. ఈ స్ఫూర్తితో బాలలందరూ రచనలు సాగించడానికి ప్రయత్నిస్తే సాహిత్యం మరింత రసమయం కాగలదనడంలో సందేహం లేదు.

కథల్లోకి వెళితే…

విద్యార్థిని జి. విశాలాక్షి రాసిన ‘నిజాయితీ’ కథలో శీనయ్య తనకు దొరికిన చేపను చూసి సంబరపడ్డాడు. కాని ఆ చేప తనను సముద్రంలో వదిలితే రత్నం ఇస్తానని మానవభాషలో చెప్పింది. దాంతో దాన్ని శీనయ్య సముద్రంలో వదిలాడు. అది సముద్రంలోని రత్నం తెచ్చి ఇచ్చింది. ఆ రత్నాన్ని చూసి అది తనకంటే రాజు వద్ద ఉండడమే న్యాయమని భావించాడు. దాన్ని ఆ దేశ రాజుకు ఇచ్చాడు. రాజు అతని నిజాయితీ మెచ్చుకుని అతను బతకడానికి కావలసిన కానుకలిచ్చాడు. ఈ కథలో శీనయ్య నిజాయితీని ఆదర్శంగా తీసుకోవాలన్నది నీతి…

పి. తరుణ్ “సాహస బాలుడు” కథలో కృష్ణుడి గుడిలోని నిధిని స్నేహితుల సాయంతో సాధించి ప్రభుత్వానికి అప్పగిస్తాడు. ధైర్య సాహసాలతో ఏదైనా సాధించవచ్చని కార్తికేయ పాత్ర ద్వారా చెప్పడం స్ఫూర్తిదాయకం.

బి. మేఘన రాసిన ‘మూఢ నమ్మకాలు’ కథలో శేషప్పకు అనారోగ్యం వస్తే తల్లిదండ్రులు మూఢనమ్మకాలతో భూతవైద్యుడి వద్దకు తీసుకు వెళ్ళడం, అనారోగ్యం తగ్గకపోగా ఇంకా పెరగడం, పొరుగున ఉన్న భరత్ సలహాతో వైద్యుడి వద్ద చికిత్స చేయించడంతో నయం కావడం సారాంశం. మూఢ నమ్మకాలు ముప్పును కలిగిస్తాయనే నీతి ఈ కథ చెప్పింది.

కె. సందీప్ “అపకారికి ఉపకారం” కథలో కాకి, రామచిలుక ఒకే చెట్టుపై గూడు కట్టుకుని ఉంటాయి. కాకి తరచూ చిలుక గూడు నాశనం చేసేది. అది గాలి వల్ల అనుకునేది. చివరకు కాకి దుర్మార్గం తెలిసినా మౌనం వహించింది. ఒకసారి గాలివానకు కాకి గూడు కూలిపోయింది. చిలుక కాకిని తన గూటిలోకి ఆ రాత్రి ఆహ్వానించి కాపాడింది. దాంతో కాకిలో పశ్చాత్తాపం కలిగి తాను చేసిన పని చెప్పింది. చిలుక తనకు తెలుసంది. కాకి సిగ్గుపడి క్షమాపణ చెప్పడంతో కథ ముగుస్తుంది. అపకారికీ ఉపకారం చేస్తే మంచి జరుగుతుందనేది నీతి.

బి. బిందు కథ 'కూరగాయల విలువ’లో పౌష్టికాహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనేది నీతి. అందుకు ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ప్రతిరోజూ మన ఆహారంలో భాగం కావాలని రచయిత చెప్పడం బాగుంది. పి. శశికళ రాసిన ‘నేతి మిఠాయిలు’ కథ లాభం కోసం కల్తీ చేస్తే జరిగే పరిణామాలు చక్కగా వివరించింది. చివరకు వ్యాపారి కుమారుడు తండ్రి తయారుచేసిన కల్తీ మిఠాయిలు తిని అనారోగ్యం పాలవడంతో బుద్ది తెచ్చుకుని బాధితులకు పరిహారం చెల్లించాడు. వ్యాపారంలో నిజాయితీ, నాణ్యత పాటించాలన్న నీతి బాగుంది.

కె. సందీప్ కథ ‘ప్రజా చైతన్యం’ లార్డు అనే యువకుడు ప్రజలను పీడించే రాజుపై తిరుగుబాటు చేసేలా యువతలో చైతన్యం కలిగిస్తాడు. తిరుగుబాటుతో బానిసత్వం నశిస్తుందని నీతిగా కథలో చెప్పడం విశేషం. బి. అనురాధ కథ 'సహనం’లో రామచంద్ర తాను అంధుడనని తోటివారు ఎగతాళి చేస్తున్నారని తల్లితో వాపోయేవాడు. తల్లి నీవు సహనంతో ఉండు అదే నీకు మంచి చేస్తుందని ధైర్యం చెప్పేది. చివరకు అతను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాడు. దాంతో అతన్ని గౌరవించడం ప్రారంభించారు. ఎవరిని ఎగతాళి చేయరాదని నీతి బాగుంది.

అనూరాధ కథలు ‘స్నేహం విలువ’, ‘తిరుపతయ్య తీర్పు’ లు కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

బి. జయశ్రీ రాసిన “బంగారు జామకాయలు” కథ దురాశ వల్ల దుఃఖం తప్ప ఏమీ రాదని చెప్పడం బాగుంది.

వి. నాగేశ్వరి కథ 'ఈర్ష్య’లో లక్ష్మి సవతితల్లికి కనువిప్పు కలిగించటం, కోపం, ఈర్ష్య వల్ల చెడే తప్ప మంచి జరగదని చెప్పడం గమనార్హం.

బి. హంపయ్య కథ ‘మానవత్వం’లో సత్యభామను రక్షించి ముసలవ్వ ఆమెలో మానవత్వాన్ని మేల్కొపడం విశేషం.

ఎం. శ్రావణి కథ ‘శ్రమ విలువ’ లో మంచిపై చెడు ఎన్నడూ గెలవదని చెప్పిన నీతి స్ఫూర్తిదాయకం.

ఎన్. పుష్పలత ‘మల్లయ్య కోడళ్లు’ కథ కలసి ఉంటే కలదు సుఖమని చెప్పడం బాగుంది.

బి. శైలజ రాసిన 'గర్వభంగం’లో అందం ఒకరి సొంతం కాదని కోడి, నెమలి కథలో చెప్పడం సృజనకు నిదర్శనం.

పి. జ్యోత్స్నరాసిన “రుణం తీర్చుకున్న ఆవు” కథ మూగజీవులపై ప్రేమ ఉండాలని, అవి యజమాని పట్ల కృతజ్ఞతతో ఉంటాయని చెప్తుంది.

వి. నాగ మాధవి కథ ‘సమానత్వం’ కుటుంబంలోని ఆడ, మగ పిల్లల చదువు, ఇతర విషయాల్లో వివక్ష చూపరాదని టీచర్ ద్వారా చెప్పించడం, పిల్లల్లో లింగ వివక్ష చూపించరాదన్న సందేశం స్ఫూర్తిదాయకం.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు స్వంతంగా ఆలోచించి అర్థం చేసుకునే పరిస్థితులు దాదాపు మృగ్యమైపోయాయనే చెప్పవచ్చు. ఎంతసేపు పుస్తకాల్లో ఉన్నదానిని బట్టీ పట్టి పరీక్షల్లో పేపర్ మీద పెడుతున్నారు. ఇంక పుస్తక పఠనం సంగతి చెప్పనే అక్కరలేదు. పుస్తకాలు చదివే పిల్లలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలతో కథలు రాయించడమే కాకుండా, ఆ కథలను పుస్తకంగా ప్రచురించడం ముదావహం. దీనిని రాష్ట్రంలోని మిగతా పాఠశాలలు కూడా ఆదర్శంగా తీసుకుంటే మన భాష, సంస్కృతి పది కాలాలపాటు మనుగడ సాగిస్తాయి.

కాపీలు కావాల్సినవారు జడ్పీహెచ్ స్కూలు, తిమ్మాపురం 9177948813 నంబరుకు సంప్రదించగలరు.