“పాస్ పోర్ట్ కేవలం ప్రయాణపు పత్రం మాత్రమేనని,అది పౌరసత్వానికి రుజువు కాదు” అని స్వయంగా భారత విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల్లో ఆందోళనతో పాటు వివాదం సృష్టించాయి. భారతీయ పౌరసత్వం పై కేంద్ర ప్రకటనతో మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. సాధారణంగా పౌరసత్వం అనేది ఒక సార్వభౌమ దేశంలో సభ్యత్వం, విధేయత మగా పరిగణిస్తారు.
జాతీయత, పౌరసత్వం ఒకటే అనే భావన ఉన్నా అంతర్జాతీయ చట్టం మేరకు ఈ రెండు భిన్న పదాలుగా భావించాలి. పౌరసత్వం రాజకీయ హక్కు కల్పిస్తే, జాతీయత ప్రతి ఒక్కరికి హక్కుగా ఉంటుందని మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన అధీకరణ పేర్కొంటుంది. జాతీయత అంటే మన దేశంలో పలు జాతులు ఉన్నా మన జాతీయత భారతీయులం అనేది అందరికీ వర్తిస్తుంది. కాని పూర్తి పౌరసత్వం కలిగి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే హక్కు, ఎన్నికయ్యే హక్కు ఉంటుంది. అలాగే, సమాజం నుంచి రక్షణ పొందే హక్కు, విధులు కలిగి ఉంటారు.
జాతీయత అందరికీ వర్తించినప్పటికీ చట్టపరమైన సంబంధాన్ని ప్రభుత్వంతో కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో పౌరసత్వం, జాతీయత మధ్య విడదీయరాని సంబంధమే కాక పర్యాయపదంగా భావిస్తారు. కొన్ని దేశాలలో దేశం బయట ఉన్నా పౌరసత్వం కలిగిన వారికి ఓటు వేసే హక్కు ఉంటుంది. గల్ఫ్ దేశాలు ముస్లిమేతరులకు అరుదుగా పౌరసత్వం ఇస్తారు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాస్ పోర్ట్ విదేశీ ప్రయాణాలకు అనుమతి పత్రంగానే భావిస్తారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలలో పౌరసత్వం లేని శరణార్ధులు లేదా మరి కొన్ని కేటగిరిల వారికి కొన్ని రకాల పాస్ పోర్ట్ లు జారీ చేస్తారు. భారతీయ విదేశాంగ శాఖ సాంకేతిక చట్ట పరిభాషలో పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం అని వ్యాఖ్యానించి ఉండవచ్చు.
కాని వివాదం రేగిన తరువాత అయినా సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా వివరించడంలో విఫలమయిందని భావించాలి.
రాజ్యాంగంలోని 1955 పౌరసత్వ చట్టం ప్రకారం మాత్రమే పౌరసత్వం నిర్ధారిస్తారని విదేశాంగ శాఖ ప్రకటనతో భారతీయులకు తాము దానిని అవసరమైతే ఎలా నిరూపించుకోవాలనే ప్రశ్న ఎదురైంది. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఇండియాలో ప్రతి ఒక్కరికీ పౌరసత్వం రాదు. తల్లిదండ్రుల పౌరసత్వ అర్హతలను అనుసరించి మారుతుంది. ఇటీవల అసోంలో జరిగిన ఎన్ఆర్సీ ప్రక్రియలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే.
పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్ లేదా నేచురలైజేషన్ ద్వారా పౌరసత్వం పొందే అవకాశం ఉంది.
పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖ ప్రకటనతో అసలు పౌరసత్వానికి నిజమైన రుజువు పత్రం ఏదీ అనే ప్రశ్న తలెత్తింది. ప్రభుత్వం పౌరసత్వం నిరూపించుకోవాలని కోరితే ఏమి చేయాలో అర్థం కాని స్థితి ఏర్పడుతుందని పౌరహక్కుల నేతలు భావిస్తున్నారు. సొంత దేశంలోనే పౌరసత్వం నిరూపించుకోవాల్సిన పరిస్థితులు రావడంపై ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం జారీ చేసే ఆధార్, ఓటర్ ఐడి, జనన ధృవీకరణ పత్రాలు పౌరసత్వానికి నిరూపణ పత్రాలు కావని తేల్చడం నిజంగా ఆందోళన కలిగించే అంశాలే. అవి కేవలం చిరునామా, ఓటు హక్కులను నిర్ధారించేవి మాత్రమేనా అనే సందేహాలు వస్తాయి.
పౌరసత్వం నిర్ధారించే సమయంలో ఇతర డాక్యుమెంట్లు అవసరమవుతాయి. కేవలం పాస్ పోర్ట్ తో మాత్రమే పౌరసత్వం నిర్ధారణ కాదు. ఇవి ఎప్పటినుంచో ఉన్న నిబంధనలని విదేశాంగ శాఖ స్పష్టం చేయడం గమనార్హం.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతోందని, పౌరుల ఓటు హక్కులను హరించేందుకే ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అది పౌరసత్వ నిర్ధారణ పత్రం కాకపోతే పాస్ పోర్ట్ జారీలో ఇన్ని నిబంధనలు, వెరిఫికేషన్ లతో వేధించడమెందుకని జోకులు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమని ప్రభుత్వం ప్రకటించినా సుప్రీంకోర్టు అది గుర్తింపు కార్డు మాత్రమేనని ప్రకటించడం, అలాగే ఓటర్ కార్డును కూడా కేవలం గుర్తింపు కార్డు అని కొట్టివేయడం వంటి వాటితో పౌరుడి గుర్తింపు ఏ పత్రంతో నిర్ధారిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా భారత పౌరుడుగా నిర్ధారించే పత్రం ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయించక పోవడం ప్రభుత్వాల వైఫల్యం క్రిందకు వస్తుంది. సహజంగా పౌరసత్వానికి గడువు ఉండదు. ఇది ప్రజలకు దేశంలో నివసించడానికి, పనిచేసుకోవడానికి, ఓటు హక్కును కల్పిస్తుంది. పాస్ పోర్ట్ జారీతో గుర్తింపు మరింత పదిల పరుచుకునే అవకాశం లభిస్తుంది.
కాని ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త నిబంధనల పేరుతో ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చుతున్నారు.
ప్రాచీన కాలంలో మొట్టమొదట నగర రాజ్యాలలో మగ జనాభాకు హక్కుగా పౌరసత్వం ఉద్భవించింది. ప్రాచీన నగర రాజ్యాల్లో మగవారికి పౌరహక్కుగా ప్రారంభమై బూర్జువా సామాజిక వర్గానికి పునాది వేసింది. కాలక్రమేణా దేశాలు పౌరసత్వ హోదాను స్త్రీలకు వర్తింపచేశారు. ఒక్కోదేశంలో ఒక్కో విధంగా పౌరహక్కుల పరిధి, నిబంధనలు ఉంటాయి.
ఇంతకీ మన ప్రభుత్వం పుట్టుక నుంచి జన్మ దృవీకరణ పత్రం, ఆధార్, ఓటర్ కార్డు, పాస్ పోర్ట్, మరణ ధృవీకరణ పత్రం వంటివి జారీ చేస్తున్నా ఏవీ పౌరసత్వం ధృవీకరించే అధికారిక పత్రాలు కాదని చెప్పడం దేశ పౌరులను అవమానపరిచే అంశాలు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ పౌరసత్వం నిర్ధారించే పత్రాన్ని జారీ చేసి వారిలో ఏర్పడిన ఆందోళన తగ్గించాల్సిఉంది.
పౌరసత్వాన్ని నిర్ధారించే సరళమైన డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేయాలి. ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్, డిజిటల్ ఇండియా అంటూ ఓకే గుర్తింపు కార్డు తెస్తున్నామని చెబుతున్నది. డేటా భద్రత కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా పౌరసత్వాన్ని నిర్ధారించలేనప్పుడు డేటా బేస్ వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్న తలెత్తుతోంది.
గ్రామీణ భారతంలో ఉండే నిరక్షరాస్యులు, వలస కూలీలు, గిరిజనులు పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు తాతముత్తాతల కాలం నాటి పత్రాలను ఎక్కడి నుంచి తేగలరు. సామాన్యుడు పౌరసత్వ నిర్ధారణ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేడు.శదానివల్ల సమయం, డబ్బు ఖర్చు పెరగడమేకాక అవినీతి పెరిగే ప్రమాదం ఉంది.
ఇంత పెద్ద దేశంలో పౌరసత్వం నిర్ధారణ తీవ్ర ఆందోళన కాకముందే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. ఉన్న పత్రాలలో ఒక దానిని నిర్ధారించే పమగా ప్రకటించాలి లేదా కొత్తగా ఐడెంటిటీ ప్రకటించి ప్రజల్లో భయాలు తొలగించాలి. విదేశాంగ, హోం శాఖలు స్పష్టమైన, సులువైన మార్గదర్శకాలు విడుదల చేయాలి.