సులోచన నిశ్శబ్దంగా ఏడుస్తోంది.
కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. దిండు తడిసిపోతోంది. ఆమె హృదయాంతరాళంలో గూడుకట్టుకున్న దు:ఖం ఎన్నో ఏళ్ళ తరువాత ఒక్కసారిగా మళ్ళీ తన్నుకువచ్చింది. తనకే ఈ సమస్య ఎందుకు వచ్చింది?
చిన్నవాడు రోహిత్ మంచి నిద్రలో ఉన్నాడు. తను ఏడుస్తున్న విషయం పిల్లలకు తెలియకూడదని విశ్వప్రయత్నం చేస్తోంది ఆమె. గదిలో ఓ మూలగా కూర్చుని చదువుకుంటున్న పెద్ద కొడుకు రవీంద్ర తల్లి రోజులా మామూలుగా లేదని గ్రహించాడు.
“అమ్మా! ఇంకా నిద్రపోలేదా?” అడిగాడు రవీంద్ర.
“ఇప్పుడే కునుకు పడుతోంది. చాలా రాత్రి అయింది నువ్వు కూడా పడుకో రవీ” తన స్వరం సాధారణంగా ఉండేలా మార్చి అన్నది సులోచన. “రేపు నాకు ముఖ్యమైన టెస్ట్ ఉందమ్మా, చదువుకోవాలి. నీ గొంతేమిటి అమ్మా ఎలాగో ఉంది, ఒంట్లో బాగాలేదా?” ఆత్రుతగా అడిగాడు రవి. “కాస్త జలుబు చేసినట్లుంది… అంతే…” ఓ అబద్ధాన్ని ప్రేమ నిండిన స్వరంతో చెప్పింది. “చదువుకుని త్వరగా పడుకో నాన్నా.
ఎక్కువ మేలుకుంటే, రేపు పరీక్ష సరిగా రాయలేవు” అంటూ అటు తిరిగి పడుకుంది సులోచన. కొడుకు పరీక్ష సంగతి సరే… మరి తన పరీక్ష సంగతేమిటి!?
ఆ రోజు జరిగిన అనూహ్య సంఘటన సులోచనపై చాలా ప్రభావం చూపించింది. తాను పనిచేస్తున్న ఇంటి యజమాని రఘునాథ్ చేసిన ప్రస్తావన గురించే ఆమె ఆలోచిస్తోంది.
“సులోచనా… మనం వివాహం చేసుకుందామా?” ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా హఠాత్తుగా రఘునాథ్ అడిగేసరికి ఆమె అవాక్కయింది.
“నాకు ఎదిగిన మగపిల్లలు ఇద్దరు ఉన్నారు, చదువుకుంటున్నారు?” అయోమయంగా అంది సులోచన.
“తెలుసు, అందుకే అడిగాను” ఆమె అర్థం కానట్టు చూసింది.
రఘునాథ్ నిజాయితీగా అన్నాడు.
“అవును…వాళ్ళ భవిష్యత్తు కోసం నేనో ప్రణాళిక వేశాను. ఉన్నత విద్య చెప్పించి విదేశాలకు కూడా పంపిస్తాను”
సులోచన మస్తిష్కం స్తంభించింది.
“అయినా ఇదేమిటి ఇలా అడిగారు? మీరేందుకు ఇదంతా…చెయ్యాలి?” తడబడుతూ అంది సులోచన. తను ఏమి మాట్లాడుతోందో ఆమెకే అర్థం కావడం లేదు. “అయినా మీరు ఇంత హఠాత్తుగా అడిగితే నేనేం చెప్పగలను” ఈ సంభాషణను ఇంతటితో ముగించాలని ఆమె భావిస్తోంది. ఆ క్షణంలో సులోచనకు రఘునాథ్ ముందు నిలబడటానికి కొంచం ఇబ్బందిగా ఉంది.
“పర్లేదు… ఆలోచించుకుని రేపు చెప్పు సులోచనా” అతని స్వరంలో అనునయం ఉంది.
సులోచన ఓ యంత్రంలా అక్కడి నుండి నడిచి వెళ్లిపోయింది.
ఇంటికి చేరిన సులోచనకు పదే పదే రఘునాథ్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. నలభై ఐదేళ్ల తనమీద రఘునాథ్ కు అటువంటి ఉద్దేశ్యం ఉంటుందని ఆమె కలలో కూడా ఊహించలేక పోయింది. అతని చూపులో కానీ, ప్రవర్తనలో కానీ ఆమెకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మరిప్పుడు ఇదేమిటి ఈ విచిత్ర ప్రస్తావన. రఘునాథ్ తెలివైన వాడిగా, మేధావి వర్గానికి చెందిన వ్యక్తిగా సులోచన చాలా గౌరవంగా చూస్తుంది. అతను పెళ్లి ప్రస్తావన తేవడం వెనుక ఏమైనా స్వార్థం ఇమిడి ఉందా? లేదా తన మీద జాలితో నిర్ణయం తీసుకున్నాడా? ఎటూ తేల్చుకోలేక పోతోంది సులోచన.
హృదయ కుహరంలో దాగి ఉన్న సున్నిత పొరను ఎవరు ఏ రూపంలో తడిమినా మనిషి భావోద్వేగానికి గురికాక తప్పదు. ఆడవారైతే ఆ ఉద్వేగపు తీవ్రత మరింత ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం సులోచన ఆ స్థితిలోనే ఉంది. నిద్రకు దూరమైన ఆమె అప్రయత్నంగా గతాన్ని నెమరు వేసుకుంది.
సులోచన బాల్యం సాధారణంగా గడచిపోయింది. తండ్రి రాఘవయ్య ఓ చిన్న రైతు. ఒక్కతే కూతురు. తమ గ్రామంలో ఉన్న బడిలో ఎనిమిదవ తరగతి వరకు చదివింది. పై చదువులకు ఊరికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న హైస్కూల్ కు పంపడం ఇష్టం లేక ఆమెను చదువు మానిపించి పొలం పనులు, ఇంటి పనులు చేయించారు. సులోచన యుక్త వయసులోకి వచ్చింది. ఆమె ఒంటి రంగు చామన ఛాయగా ఉన్నా, చక్కటి పొందికైన మొహం, విశాలమైన కళ్ళు, బారెడు జడ వేసుకుని, మంచి శరీర సౌష్ఠవంతో చలాకీగా తిరుగుతున్న ఆమెను ఇతర ఆడవాళ్ళు ఈర్ష్యగాను, మగవాళ్ళు ఆశగానూ చూసేవారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న ఆ కుటుంబానికి తల్లి సుభద్ర అనారోగ్యం మరింత కష్టాలను కొనితెచ్చింది. ఆమె చికిత్సకై రాఘవయ్య ఉన్న ఎకరం పొలం అమ్మేయడమే కాక అప్పు కూడా చేయవలసి వచ్చింది. చివరకు ఆమెను దక్కించుకోలేక పోయారు. భార్య మరణంతో రాఘవయ్య బాగా కుంగి పోయాడు. యవ్వనంతో మిసమిస లాడుతూ ఎదుగుతున్న సులోచనకు కుటుంబ పరిస్థితులు ఆందోళన కలిగించాయి. తండ్రి పరిస్థితి గమనించిన ఆమె ఆయనకు అండగా ఉంటూ కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకుంది. క్రమంగా తేరుకున్న రాఘవయ్య రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సేద్యం ప్రారంభించాడు. అప్పటికే సులోచనకు ఇరవై ఏళ్ళు వచ్చేశాయి. పెళ్లీడు దాటి పోతోంది. పిల్లకు పెళ్లి ఎప్పుడు చేస్తావని ఊరి జనం అడగడం మొద లెట్టారు. రాఘవయ్య కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్న పొలం పక్కనే ఉన్న మరో రెండు ఎకరాల పొలాన్ని సూర్యనారాయణ అనే పక్క ఊరి యువకుడు కౌలు సాగు చేస్తుండేవాడు. పాతికేళ్ళ యువకుడు. ఆజానుబాహువు. మంచి మాటకారి. తండ్రితో పాటు అప్పుడప్పుడు పొలానికి వెళ్ళిన సులోచన తన తండ్రి, సూర్యనారాయణ మధ్య జరిగే సంభాషణలు వింటూ ఉండేది. సేద్యంలో అతను చేపట్టిన ఆధునిక పద్ధతులను గురించి చెబుతూ ఉండేవాడు. ఆ యువకుడిలోని చురుకుదనం, భవిష్యత్తు పట్ల ఉన్న మంచి అవగాహన రాఘవయ్యకు ముచ్చటగాను, సులోచనకు ఇష్టం గానూ ఉండేవి. రాను రాను సులోచనకు సూర్యనారాయణపై ఏర్పడ్డ ఇష్టం అభిమానంగానూ, తరువాత ప్రేమగానూ రూపాంతరం చెందింది. సులోచనను మొదటిసారి చూసినప్పుడే సూర్యనారాయణను ఆమె చలాకీతనం, ముచ్చటగొలిపే రూపం ఆకట్టుకున్నాయి. వారిద్దరూ మొదట్లో కళ్ళతో మాట్లాడుకునే వారు. తరువాత చిన్న చిన్న మాటలు కలిశాయి. అప్పుడప్పుడు రహస్యంగా మాట్లాడుకునే వారు, ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ప్రస్తావన రాగానే మరో ముఖ్య సమస్య వారిని వేధించింది… అదే ఇద్దరి కులాలూ వేరు. వారి వివాహాన్ని సమాజం అంగీకరిస్తుందా?
“సమాజం అంగీకరించదని మనిద్దరికీ తెలుసు సులోచనా! సమాజాన్ని ముందుగా అడిగి అనుమతి తీసుకుని ఎవరూ ప్రేమించుకోరు కదా!. ప్రేమికులు వివాహం చేసుకోవడం నేరమేమీ కాదు కదా! మీనాన్నే మనకు ముఖ్యం. ఆయన అనుమతి తీసుకుందాం. ఆయన అంగీకరిస్తే ఈ సమాజం ఏమనుకున్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. నాకూ నా అనేవాళ్లు లేరు, నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడుతాను” ఒకరోజు దృఢంగా అన్నాడు సూర్యనారాయణ. రాఘవయ్య ఆవేశపరుడు. ఈ విషయంలో తండ్రి ఎలా స్పందిస్తాడోననే బెంగ సులోచనకు ఉంది. ఎలాగైనా ఆయనను ఒప్పించే తామిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇరువురూ ఒక నిశ్చయాని కొచ్చేశారు.
అనుకున్నట్టుగానే ఒకరోజు సూర్యనారాయణ ఇంటికి వచ్చి రాఘవయ్యతో తమ ఆలోచన చెప్పేశాడు. ఈ మాట వినగానే ఉగ్రుడైపోయి నానా రాద్ధాంతం చేస్తాడనుకున్న రాఘవయ్య మౌనంగా తలవంచుకుని కూర్చున్నాడు. తండ్రి మౌనం సులోచనకు మరింత భయం కలిగించింది. ఆయన మొహంలోకే ఆందోళనగా చూస్తూ నిలబడి ఉంది. మెల్లగా తలెత్తిన రాఘవయ్య కళ్ళలో నీళ్ళు…సులోచన ఆశ్చర్యపోయింది. తల్లి చనిపోయినప్పుడు కూడా ఆయన కన్నీరు పెట్టుకోగా చూడలేదు.
“ఈ పేద తండ్రి ఎలాగూ సంబంధాలు చూసి, కట్నాలు ఇచ్చి పెళ్లి చేయలేడని, ఈ నిర్ణయాని కొచ్చావా తల్లీ…” రుద్ధ కంఠంతో అన్నాడు రాఘవయ్య. సులోచన ఒక్క పరుగున పోయి తండ్రి భుజం పై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. “ఈ పెళ్లి జరిగితే ఈ ఊరి ప్రజలు, సమాజం నన్ను, మిమ్మల్ని కాకుల్లా పొడుచుకు తింటారు. వెళ్లిపోండి… ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. ఈ ముసలాడి సంగతి మరచిపొండి” రాఘవయ్య మాటల్లో ఏ భావమూ లేదు. అప్పుడు కలుగజేసుకున్నాడు సూర్యనారాయణ.
“నేను ఒక మిత్రుడి ద్వారా రెండు జిల్లాల అవతల ఒక గ్రామంలో ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాను. కోతల తరువాత ఇక్కడి బాధ్యతను వదిలించుకుంటాను. మేమిద్దరం పెళ్లిచేసుకుని ఆ గ్రామంలో కొత్త జీవితాన్ని ప్రారంబిస్తాము. మీరు కూడా మాతో వస్తారు, మాతోనే ఉంటారు. అంతే. ఇక్కడి మీ బాధ్యతలను కూడా త్వరగా వదిలించుకోండి” చాలా దృఢంగా అన్నాడు సూర్యనారాయణ. రాఘవయ్య అతన్ని సంబ్రమంగా చూశాడు. సులోచన కళ్ళలో వెలుగు తళుక్కు మంది.
ఎనిమిదేళ్లు గిర్రున తిరిగిపోయాయి.
సులోచన, సూర్యనారాయణ దాంపత్యం ముచ్చటగా సాగుతోంది. మొదటి సంతానం రవీంద్ర కు నాలుగో ఏడు. రెండవ వాడు రోహిత్ సంవత్సరం పిల్లవాడు. రెండేళ్ల క్రితం రాఘవయ్య జబ్బుతో చనిపోయాడు.
సూర్యనారాయణ కౌలు సేద్యం చేస్తూ ఈ ఎనిమిదేళ్ళలో ఏమీ సంపాదించలేక పోయినా, కుటుంబ ఖర్చులకు అప్పు కోసం ఎవరిముందూ చేయి చాపకుండా నెట్టుకొస్తున్నాడు. అతనికి భవిష్యత్తుపై ఎన్నో కలలు. పిల్లలిద్దరినీ మంచి చదువులు చదివించాలి. వారు ఉద్యోగాలు చేయాలి. తమ జీవితం క్రమంగా వృద్ధిలోకి రావాలి. దాని కోసం ఎంతైనా శ్రమించాలి. దంపతులిద్దరూ ఈ విషయాల గురించే ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటారు. ఒకరోజు అలసిపోయిన భర్త గుండెలపై సులోచన తలవాల్చి అతని జుట్టు నిమురుతూ, ”సూర్యం…” అంది గోముగా. పెళ్ళైన నాటి నుండి అతన్ని అలాగే పిలుస్తోంది ఆమె.
“ఏమిటి?” నిద్ర మత్తులో అస్పష్టంగా అన్నాడు.
“ఒకవేళ నేను చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా?”
ఒక్కసారిగా ఆమెను తోసేసి చివుక్కున లేచి కూర్చున్నాడు సూర్యం. అతను ఏదో అనేలోపే, సులోచన పకపకా నవ్వుతూ “ఓయ్…ఓయ్ కంగారుపడకు, ఏదో తమాషాకు అన్నానులే… నువ్వే నా జీవితమైతే… నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను” అతని చెంపలు నిమురుతూ అనునయంగా అంది.
“తమాషాకైనా ఇలాంటి మాటలు అనకు సులూ! ఈ జీవితం మనిద్దరిదీ…పిల్లలే మన ప్రాణం”
“ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు తమాషాకైనా అననులే, ఇదిగో లెంపలు వేసుకుంటున్నాను. సూర్యం… మనిద్దరి లాగే మనపేర్లు కూడా కలిశాయి
చూడు… ‘సు-సూ’ ”అతన్ని అల్లుకుపోతూ అంది.
“సులూ… నాకెప్పుడూ ఒక కల వస్తూ ఉంటుంది. అదేమిటో చెప్పనా…” ఆమె ముంగురులు సరిజేస్తూ అన్నాడు సూర్యం.
“ఊ… చెప్పు”
“పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ, బాగా డబ్బు సంపాదించి విశాలమైన స్థలంలో రెండస్తుల భవనం కడతారట, మనిద్దరి పేర్లు కలిసేటట్లు దానికి ‘సూర్యలోచనం’ అని పేరు పెడతారట. గృహప్రవేశం ఘనంగా చేస్తామట. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరికి పెళ్లిళ్లు చేసి, కోడళ్ళు, మనుమలు మనుమరాళ్లతో ముసలితనంలో మనం హాయిగా కాలక్షేపం చేస్తామట. ఎలా ఉంది కల?” మంద్రమైన స్వరంతో చెప్పాడు సూర్యం.
“చాలా బాగుంది సూరయ్య గారూ!, మీ కల నిజం అవుతుంది లెండి” చిలిపిగా ఆట పట్టిస్తున్నట్లు మాట్లాడుతున్న సులోచనను బాహువుల్లో బంధించి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు.
మరో సంవత్సరం గడచిపోయింది.
ఆ సంవత్సరం సమయానికి వానలు పడలేదు. నాట్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కాలవల్లో నీరు పంటకు సరిపడా అందుబాటులో లేదు. చాలా మంది రైతులు పొలాల్లో బోర్లు వేయించి మోటర్ల ద్వారా నీటిని తోడి పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.
సూర్యం కూడా పొలం యజమాని అనుమతితో తన పొలంలో బోర్ వేయించాడు. నీరు బాగా పడ్డాయి. తన పొలానికి బోర్ ద్వారా సమృద్ధిగా నీరు లభించినందుకు సూర్యం, సులోచన చాలా ఆనంద పడ్డారు. కానీ, కరెంట్ కోతల వల్ల ఎప్పుడుపడితే అప్పుడు బోర్లు వేసుకోవడానికి వీలయ్యేది కాదు. కరెంట్ అందుబాటులో ఉన్న సమయాన్ని రైతులు విభజించుకుని వారి వారి సమయాల్లోనే బోర్లు వేసుకుని పంటకు నీరు పెట్టుకునే ఒప్పందం చేసుకున్నారు. తన వంతుగా ప్రతి రోజూ తెల్లవారుఝామున పొలానికి వెళ్ళి బోర్ వేసి నీళ్ళు పట్టి తెల్లవారిన తరువాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు సూర్యం. నీరు సక్రమంగా అందడం వల్ల పైరు ఏపుగా పెరిగింది.
ఒకరోజు ఉదయానే ఎవరో తలుపు దబ దబా కొడుతుంటే నిద్రకళ్లతో తలుపు తీసిన సులోచనకు గుండె పగిలే వార్తను మోసుకు వచ్చారు గ్రామస్తులు. మోటార్ సరిగా పనిచేయక పోవడంతో రిపేర్ చెయ్యడానికి ప్రయత్నించిన సూర్యానికి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే నిర్జీవుడయ్యాడని వార్త.
ఆ క్షణంలో … అనంతకోటి విశ్వాలన్నీ నిశ్శబ్దంగా పేలిపోయాయి. అగ్నిపర్వతాలన్నీ ఒక్కమాటున ఫెటిల్లున పగిలిపోయి సుడిగాలి లావాను నిశ్శబ్దంగా ఎగరేసిన భావన. సప్త సముద్రాలన్నీ ఇంకిపోయి ఏడారులన్నీ జ్వలిస్తున్న అవస్థ. ఈ వార్త విని ఆమె ఎలా స్పందించిందో, ఆ విషాదాన్ని ఎలా దిగమింగిందో ఎప్పుడూ ఆలోచించలేదు. ఆమెకు ఒకటే గుర్తుంది అది ‘సూర్యం ఒక జ్ఞాపకం’ అంతే.
భర్త జీవితాశయాన్ని ప్రతి రోజూ మననం చేసుకుంటూ ఇద్దరి పిల్లలతో ఆగమ్యగోచరమైన జీవనయానాన్ని ప్రారంభించింది సులోచన. కొన్నాళ్ళు కూరగాయలు అమ్మింది. పూలు కొని మాలలుగా అల్లి పట్నం తీసుకువెళ్ళి సంతలో అమ్మింది. ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా పిల్లల చదువు మాత్రం ఆగకుండా చూసింది. పెద్దవాడు హై స్కూల్ చదువుకు వచ్చిన తరువాత మకాం పట్నానికి మార్చింది. ఇళ్ళలో పాచిపనులు చేసింది, పెళ్లిళ్లలో వంటలు చేసేవారికి సహాయకురాలిగా పనిచేసింది. చివరికి తెలిసిన వారి ద్వారా రఘునాథ్ ఇంటి పనిమనిషిగా కుదురుకుంది. నెలవారీ జీతం. ప్రతిరోజూ ఉదయాన్నే కల్లాపి చల్లి ముగ్గు పెట్టడంతో ప్రారంభించి, ఇల్లు ఊడ్చి, తుడవడం, వంట చేయడం… ఇలా సమస్తం ఆమెదే బాధ్యత. నెల నెలా చేతికి జీతం రావడంతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయి. భర్త మరణం తరువాత ఆమె కాస్త ప్రశాంతంగా, ఎటువంటి ఒత్తిడీ లేకుండా జీవించిందంటే అది ఇక్కడ పనిచేస్తున్న ఈ కాలంలోనే.
భర్త మరణించి పదిహేనేళ్లు దాటింది. ప్రశాంతమైన కొలనులో రాయి విసిరినట్లు రఘునాథ్ చేసిన పెళ్లి ప్రస్తావన ఆమెను ఆందోళనకు గురి చేసింది.
రఘునాథ్ ప్రతిపాదనను స్వీకరించి తన సుఖం మాత్రం చూసుకోవాలా? మరి పిల్లలు…? ఎదుగుతున్న పిల్లలు దీన్ని ఎలా స్వీకరిస్తారు? దీని ప్రభావం వాళ్ళ చదువులపై ఎలా ఉంటుంది? ఒకవేళ రఘునాథ్ పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తే వారు అంగీకరించి చదువులు కొనసాగిస్తారా? వీటన్నిటికంటే ముఖ్యం తన సూర్యం కన్నకలల సంగతేమిటి? ఆ స్వప్నాలను ఇతరుల సాయంతో సాధించాలా? లేదు…లేదు…కాదు…కాదు…అది ఎన్నటికీ జరగదు. ఆలోచనలతో సతమతమౌతూ ఏ వేకువ ఝామునో కునుకు పట్టింది సులోచనకు.
మరుసటి రోజు ఉదయం.
కంప్యూటర్లో మెయిల్ చూసుకుంటున్న రఘునాథ్ సమయం మించిపోయినా సులోచన పనిలోకి రాకపోవడంతో కంగారు పడ్డాడు. ప్రతిరోజూ ఆ సమయానికి వేడి వేడి కాఫీ అతనికి అందించడం ఆమె దినచర్యలో ఒక తప్పనిసరి అంశం. నిన్న తాను చేసిన ప్రస్తావనకు నొచ్చుకుని ఉంటుందా? అని మథనపడ్డాడు. తాను తొందరపడ్డానేమో అనే శంక వేధించ సాగింది.
ఆలస్యం కావడంతో హడావుడిగా పనిలోకి ప్రవేశించిన సులోచన గేటు ముందు ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టింది. కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. పది నిముషాల్లోపే వేడి వేడి కాఫీ కప్పు రఘునాథ్ కంప్యూటరు టేబుల్ పట్టింది. ప్రతిరోజూ కాఫీ అందించే సమయంలో రఘునాథ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వే ఆమె ఆరోజు నిర్లిప్తంగా ఉండిపోయింది.
రఘునాథ్ ఓరగా సులోచన వంక చూశాడు. ఆమె కళ్ళు నిద్రలేమి వల్ల ఎరుపెక్కిఉన్నాయి. మొహంలో కళ లేదు. అతనిలో ఒక అపరాధ భావన బలపడింది. ఆమె నిశ్శబ్దంగా తన రోజువారీ పనుల్లో మునిగిపోయింది.
మధ్యాహ్నం 12 దాటింది. ఆమె తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లడానికి సమాయత్తం అవుతోంది. రఘునాథ్ ఆమె మొహంలో కవళికలను అంచనా వెయ్యడానికి ప్రయత్నించాడు. అతనికి ఎటువంటి భావనా కనిపించలేదు, నిర్లిప్తంగా ఉంది.
రోజూ ఏదో ఒకటి మాట్లాడే ఆమె ఈ రోజు మౌనంగా ఉండిపోయింది. ఇది అతన్ని మరింతగా కలవర పరచింది. రోజూ తానేదో అడగడం, ఆమె సమాధానం చెప్పడం జరుగుతూ ఉండేది. నిజానికి తానూ ఈ రోజు ఆమెను పలకరించలేదు. తాను రోజు వారీ చేసే పనులను ఆమె యాంత్రికంగా చేసుకుపోతూ ఉంది. తాను వ్యక్తపరచిన భావనను ఆమె మరో విధంగా అర్థం చేసుకుందా? తనను తప్పుగా అంచనా వేసిందా? తననొక స్వార్ధపరుడిగా భావించిందా! ఆమె ఆంతర్యంలో ఏముందో అంచనా వెయ్యలేక పోతున్నాడు.
రఘునాథ్ చాలా ప్రాక్టికల్ మనిషి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఊగిసలాట, నాన్చుడు ధోరణి అతనికి నచ్చదు. తానూ అలాగే ఉంటాడు, ఇతరుల నుంచి కూడా అదే ఆశిస్తాడు. తాను ఓ పెద్ద కంపెనీ లో ఉద్యోగించినంత కాలం అదే సిద్ధాంతాన్ని పాటించాడు. సామాజిక సేవ చేసే అనేక స్వచ్చంద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. వారి దగ్గరైనా అంతే. అతని ఈ ముక్కు సూటిదనం, సత్వర నిర్ణయాలు అతని ఉద్యోగ జీవితంలోనూ, బయట కూడా ఆయన వ్యక్తిత్వానికి ఆభరణంలా నిలిచాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందే అతడు అన్ని కోణాల్లోనూ సమస్యను విశ్లేషించుకుంటాడు, తాను సరైనదని అనుకున్న మార్గానికి వెళతాడు. నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రం వెనక్కి తిరిగి ఆందోళన పడటం అవివేకమైన చర్యగా భావిస్తాడు. తాను తీసుకున్న నిర్ణయ ఫలితాలు ఎలా ఉన్నా వాటిని ఎదుర్కోవడానికి అతను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. “సులోచనా” ఏ భావమూ కనబడనీయకుండా సౌమ్యంగా పిలిచాడు. రోజూ పిలిచే పిలుపే అయినా ఆరోజు ఆ నాలుగక్షరాలూ కొత్తగా ఉచ్చరిస్తున్నట్లుగా అనిపించింది అతనికి. రోజూ కనిపించే వ్యక్తి అయినా ఆరోజు కొత్త మనిషిలా అనిపించింది.
బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సులోచన ఒక్క క్షణం తత్తరపడింది. రఘునాథ్ తన సమాధానం కోసం ఎదురు చూస్తాడాని తనకు తెలుసు. ఇప్పుడెలా!
“నిన్న నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా…?” ఏ ప్రశ్నైతే అతని నుంచి రాకూడదని అనుకుందో అది సూటిగా అడిగే సరికి ఆమె సమాధానం చెప్పక తప్పలేదు.
“రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను” మొహంలో ఏ భావమూ కనపడనీయకుండా సమాధానం చెప్పింది. అతనిలో ఒక్కసారిగా ఆతృత పెరిగింది.
“మరి… ఏమి నిర్ణయించుకున్నావ్?
“మీ గొప్పతనానికి, మంచితనానికి మనసులోనే నమస్కారం చెప్పుకున్నాను. కానీ,…”
“ఆ…మధ్యలో ఈ కానీ ఎందుకు? ఏమిటి నీకు ఉన్న ఇబ్బందులు?”
“నా పిల్లల భవిష్యత్తు… వారిని బాగా వృద్ధిలోకి తీసుకు రావాలి. నా మంచి కంటే, సుఖం కంటే వారి పెరుగుదల నాకు ముఖ్యం. వారు ఎదుగుతున్న పిల్లలు. చాలా సున్నితంగా ఉంటారు. అందుచేత…” ఆమె ఆగిపోయింది.
“ఊ… అందుచేత?”
“క్షమించాలి, మీరు చేసిన పెళ్లి ప్రస్తావనకు నేను ఒప్పుకోలేను?” దృఢంగా చెప్పింది.
రఘునాథ్ మొహంలో ప్రశాంతత చెరిగిపోలేదు. ఇటువంటి సమాధానం అతడు ముందే ఊహించి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతనిలో ఏ భావమూ కనిపించలేదు. కానీ, వెంటనే ఏమి మాట్లాడాలో అతనికి కూడా అర్థం కాలేదు.
“మిమ్ములను అవమానించినట్లు మాత్రం భావించకండి” ఆమె కంఠం బొంగురు పోయింది. “మీరు దేవుడు…నన్ను మన్నించండి” అనూహ్యంగా సులోచన కళ్లనుండి కన్నీళ్లు జలజలా జారాయి. ఈ పరిణామం అతడు ఊహించలేదు.
“సరే…సరే…మన్నించడం వరకూ ఎందుకు? నువ్వు నాకు ఏమీ అన్యాయం చేయలేదే…” చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో జీవం లేదు. “ఈ అరవై యేళ్ళ వయసులో నా సుఖం కోసం, కోరికలు తీర్చుకోవడానికే నిన్ను పెళ్లాడతానని అడగలేదు సులోచనా. నా భార్య చనిపోయి పదేళ్ళు అయింది. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిన నా ఒక్కగానొక్క కొడుకు అక్కడే స్థిరపడ్డాడు. నాకు వచ్చే పెన్షన్, ఇతరత్రా ఆదాయం నా ఒక్కడు బ్రతక డానికి కావలసిన దానికంటే ఎంతో ఎక్కువ. ఎనిమిదేళ్ళ నుంచి మా ఇంట్లో పనిచేస్తున్నావు. నీ నెమ్మదితనం, పరిశుభ్రత వీటన్నిటికి మించి నీ బిడ్డల ఉన్నతి కోసం నీవు పడుతున్న ఆరాటం చూసిన తరువాత నీ ఔన్నత్యం నాకు అర్థం అయింది. ముఫై యేళ్ళ లోపు వయసులో నువ్వు కోల్పోయిన చిరునవ్వును నా జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా మళ్ళీ నీ మొహంలో చూడాలనీ, డబ్బు లేకపోవడం నీ బిడ్డల ఉన్నత విద్యకు ఒక అడ్డంకి కాకూడదనీ, ఇన్నాళ్లూ చాకిరితో అలసిన నీకు విశ్రాంతి ఇవ్వాలనీ నేను ఈ నిర్ణయానికి వచ్చాను” మంద్రమైన స్వరంతో అన్నాడు రఘునాథ్.
“ఇన్నాళ్లూ నేను చేస్తున్న చాకిరీని కష్టం అని అనుకోలేదు ఎప్పుడూ. ఇళ్ళలో పనిచేసేవారిని మనిషిలా కాకుండా ఒక యంత్రంగా చూసే వాళ్ళను చూశాను. అవకాశం వస్తే దోచుకోవడానికి సిద్ధంగా ఉండే గుంటనక్కలను కూడా చూశాను. మీరు నన్ను మనిషిగా గుర్తించడమే కాదు, నా స్థితిని అంచనా వేసి, మీ భార్య హోదా ఇవ్వాలని చూశారు. మీ లాంటి వారు అరుదుగా ఉంటారు. కానీ, నా జీవితంలో ఒకసారి పెళ్లి జరిగింది, విధి నన్ను విధవను చేసినా నా మనసు, నా బంధం నా భర్తతోనే నా జీవితాంతం ముడిపడి ఉంటుంది. నా భర్త ఆశయం నెరవేర్చాల్సిన బాధ్యత నాకుంది. అదే నా జీవిత లక్ష్యం. అంతకు మించి ఈ జీవితానికి మరేమీ అక్కరలేదు. నేను వెళతాను” చకచకా బయటికి వెళ్లిపోయింది సులోచన.
ఆ సంఘటన జరిగిననాటి నుండి రఘునాథ్ మరేనాడూ ఆ ప్రస్తావన తేలేదు. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. ఓ సంవత్సరం తరువాత, ఓ రోజు పని ముగించుకుని వెళ్లబోతున్న సులోచనను పిలిచాడు రఘునాథ్.
“సులోచనా! నాకో సాయం చేస్తావా! అడిగాడు. ఆమెలో మళ్ళీ కంగారు మొదలయ్యింది. ఎటువంటి సాయం అడుగుతాడోననే బెరుకు కలిగింది. తన విశాలమైన కళ్ళెత్తి అతన్ని సూటిగా చూసింది. ఆ చూపులో అతనికి ఏ భావాలు కనిపించాయో… నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. చేతిలో ఒక బరువైన కవరుతో తిరిగి వచ్చాడు. ఆమెకు ఇవ్వబోయాడు.
ఏ… ఏమిటిది? ఈ కవరులో ఏముంది? తీసుకోవడానికి సందేహిస్తూ అడిగింది సులోచన.
“నువ్వు తీసుకుంటే… చెబుతాను… ఇంద తీసుకో” కవరు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె అయోమయంగా తీసుకుంది. “నేను ఈ ఇల్లు అమ్మేశాను సులోచనా…నేను యూఎస్ లో ఉంటున్న నా కొడుకు దగ్గరకు వెళ్లిపోతున్నాను. ఈ నెలాఖరుకే నా ప్రయాణం. బహుశా నేను ఇహ నీకు కనబడకపోవచ్చు. నీ నిలువెత్తు సంస్కారానికి, నిబద్ధతకు నా అభినందనలు. నీకు నెల నెలా జీతం ఇచ్చినప్పటికీ జీతం కోసం పనిచేసినట్లు కాకుండా, ఒక స్వంత మనిషిలా నీవు అందించిన సేవలకు విలువ కట్టడం సాధ్యం కాదు. దీనిలో కొంత డబ్బు ఉంది. ఇది ఒక మిత్రుడు పవిత్ర మనసుతో ఇచ్చిన బహుమతిగా స్వీకరించు. కాదనకు. చివరి మాటలు చెబుతున్నప్పుడు రఘునాథ్ కళ్ళలో చిరుతడిని ఆమె గమనించింది.
అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
చేతిలో కవరుతో సులోచన భారంగా బయటికి అడుగులు వేసింది.
మరో ఐదేళ్ళు కాలగర్భంలో కలసిపోయాయి.
సులోచన తన నివాసాన్ని హైదరాబాద్ కు మార్చింది. పెద్దవాడు రవీంద్ర బీ.టెక్. పూర్తి అయింది. క్యాంపస్ సెలెక్షన్ ద్వారా ఓ ప్రతిష్టాత్మకమైన సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. రెండు సంవత్సరాలు పని చేసిన తరువాత, తానే ఒక కంపెనీ ఎందుకు ప్రారంభించ కూడదు అనే ఆలోచన వచ్చింది. వెంటనే రంగంలోకి దిగాడు. ప్రభుత్వ సాయం తీసుకున్నాడు. బ్యాంకుల ద్వారా పెట్టుబడి సొమ్ము పొందాడు. ఎస్. ఎస్. టెక్నో పేరుతో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించాడు. రెండేళ్లలోనే బాగా పుంజుకుని కంపెనీ బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. చిన్నవాడు రోహిత్ డిగ్రీ తరువాత గ్రూప్ 2 పరీక్ష రాసి మంచి ర్యాంక్ సంపాదించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు.
ఓ రోజు రవీంద్ర హడావుడిగా లోపలికి వచ్చి “అమ్మా! త్వరగా బయటకు రా!” అంటూ కంగారు పెట్టాడు. ఏమి జరిగిందో అని బెదిరిపోయిన సులోచన ఇంటిముందు నిలబెట్టి ఉన్న ఖరీదైన కారు చూసి అవాక్కయింది.
“అమ్మా! నీ రెక్కల కష్టం ఇదిగో నీ ముందుంది చూడు. ఇది నీదేనమ్మా”
ఆనందంతో సులోచన కళ్ళు చెమర్చాయి. ప్రేమగా కొడుకు తల నిమిరింది.
“కూర్చోమ్మా… నిన్ను కారులో అలా త్రిప్పి తీసుకు వస్తాను”
“రోహిత్ కూడా ఉంటే బాగుంటుంది. వాడిని కూడా రానీయ్, ముగ్గురమూ వెళదాం” చిన్న కొడుకు కూడా ఉండాలని ఆ తల్లి ఆరాటం. “వాడు చాలా ముఖ్యమన పనిలో ఉన్నాడట, ఇంతకు ముందే ఫోన్ చేశాడు. మనని మధ్యలో కలుస్తాడట. పద బయలుదేరుదాం” సులోచన లోపలికి వెళ్ళి చీర మార్చుకుని వచ్చింది.
ఇద్దరూ కారులో బయలుదేరారు.
నగరంలో ఒక విలాసవంతమైన ప్రాంతం. ఖరీదైన కారు విలాసంగా వచ్చి విశాలమైన డ్యూప్లెక్స్ భవనం ముందు ఆగింది.
రవీంద్ర ముందుగా దిగి, కార్ డోర్ తీశాడు. తెల్లని చీరలో తళతళ మెరిసిపోతూ సులోచన దిగింది.
లోపలినుండి రోహిత్ నవ్వుతూ పూలగుచ్చంతో వచ్చి తల్లికి అందించాడు. కారు దగ్గర నుండి గేటు వరకు ఎర్ర తివాచీ పరచి ఉంది.
సులోచనకు ఇదంతా అయోమయంగాను, ఆనందంగాను, అర్థం అవుతూ కానట్టు, సంబరంగా ఉంది.
కొడుకులిద్దరూ తల్లికి చెరో పక్కా నిలబడి అమ్మ పైకి చూడు అన్నారు.
ఆ సాయంత్రపు నీరెండలో మెరిసిపోతున్న కొత్త భవనాన్ని తలెత్తి చూసింది. ఆ రెండు అంతస్తుల భవనం ఆమె కంటి అద్దాల్లో ప్రతిఫలించింది. “సూర్యలోచనం” భవంతి మొదటి అంతస్తు బాల్కనీ కిందుగా బంగారు వర్ణంతో ఏర్పాటు చేసిన అక్షరాలు చూసిన ఆమె సంతృప్తిగా తన ఇద్దరి కొడుకులవైపు చూసింది. ఆ అక్షరాలలో తన భర్త సూర్యనారాయణ కనిపించాడు.
ముగ్గురూ గేటు తీసుకుని లోపలికి వెళ్లారు.

