అది జరిగి పాతికేళ్ళయినా నాకింకా నిన్న మొన్న జరిగినట్లే ఉందమ్మా! అకారణంగా నాన్న రక్తం కళ్ళచూసినవాడు, నీకు సొంత అన్నగారైనా అలాంటివాణ్ణి నాన్నేమన్నా క్షమిస్తాడేమోగానీ, నేను మాత్రం జీవితాంతం శత్రువుగానే చూస్తానంతే !" పళ్ళు కొరుకుతూ అంటున్న కొడుకు సత్యమూర్తిని వారిస్తూ, ఇప్పుడెందుకురా ఆ పాత గొడవలు? అసలే మీ నాన్నకి యాక్సిడెంటై ఐ.సి.యూ. లో ఉంటే ? అంటూ కంట నీరు పెట్టుకున్న తల్లితో, “సారీ అమ్మా ! నాన్నకి రక్తం అవసరం అనేసరికి ఆనాటి సంఘటన గుర్తుకొచ్చి…” కొంచెం గిల్టీగా అన్నాడు సత్యమూర్తి.
“కృష్ణమూర్తిగారి తాలూకు మీరేనా? మధ్యాహ్నంలోగా 2 బాటిల్స్ రక్తం ఎక్కించాలి. ‘ఏ’ పాజిటివ్ గ్రూప్”, ఇప్పటికప్పుడు ఆ గ్రూప్ మాకెక్కడ దొరుకుతుందండీ ? " ఆందోళనగా అంటున్న తల్లితో, “పరవాలేదమ్మా! కంగారుపడకు. ముందు హస్పిటల్ వాళ్ళు వాళ్ళ దగ్గరున్న రక్తం ఎక్కిస్తారు. మనం రిప్లేస్ మెంటు చేద్దాము.” చెప్పాడు. అవునన్నట్లు తలూపి వెళ్ళింది నర్స్.
గతంలోకి జారుకుంది సావిత్రి. తన పెళ్ళై ఇరవై ఏళ్ళ తరువాతి మాట. కొడుకు సత్యమూర్తికి ఇరవై వచ్చాయేమో గూడా. కూతురు పావని తన కొడుకు సందీప్ తో చనువుగా ఉంటోందని వదినకి కోపం. సందీప్ ని వాళ్ళన్న కూతురు సౌమ్యకి చేసుకోవాలని వదిన సరస్వతి కోరిక. కానీ సందీప్, పావని చనువుగా ఉండటం ముందు ముందు దేనికి దారి తీస్తుందోనన్న భయంతో ముందు జాగ్రత్తగా అన్నయ్యని రెచ్చగొట్టింది. అన్నయ్య ప్రసాద్, తనూ, ఇద్దరే. నాన్నెప్పుడో పోయాడు. తల్లి పోయిన కార్యక్రమాలకి వచ్చింది తను. పదమూడో రోజున ఈ గొడవ. సరస్వతి ప్రభావంతో బాగా రెచ్చిపోయాడు ప్రసాద్.
“ఇలా ఆడపిల్లని మావాడి మీదకి వదిలేయడం సంస్కారం కాదు బావా!” అంటూ – అంతే ఘాటుగా స్పందించాడు కృష్ణమూర్తి. “మాటలు జాగ్రత్తగా రానీ …” అంటూ- ఇలా మాటా మాటా పెరిగి, ప్రసాద్ కృష్ణమూర్తి మీద చెయ్యి చేసుకోవడం, అది తగలరాని చోట తగిలి కృష్ణమూర్తి ముక్కులోంచి ధారాపాతంగా రక్తం కారటం- హాస్పిటల్… నానా గందరగోళమూ అవటం క్షణాల్లో జరిగిపోయింది.
“ఇంక నా కంఠంలో ప్రాణం ఉండగా నీ గుమ్మం తొక్కను.” అంటూ శపథం చేసినంత పని చేసి అత్తగారింటి నుంచి వచ్చేశాడు కృష్ణమూర్తి భార్య, పిల్లల్తో. సత్యమూర్తి, పావని పెద్దల వ్యవహారంలో వేలు పెట్టకుండా గుడ్ల నీరు కుక్కుకుని తల్లిదండ్రులను అనుసరించారు.
“అమ్మా! కుర్చీలో కూర్చుని ఏం కునికిపాట్లు పడతావు? నాన్నగారు ‘అవుటాఫ్ డేంజర్’ అని చెప్పారు. చిన్న సర్జరీ చేశారు. 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. పద, కొంచెం వేడివేడిగా కాఫీ తాగుదువుగాని” అంటోంది పావని. “హమ్మయ్య! ఇంతకీ నీ పిల్లలెక్కడే? వచ్చారా?” “లేదమ్మా. ఇద్దరూ కాలేజీకి వెళ్ళారు. ఆయనేమో ఇందాక వచ్చి నాన్నని చూసి వెళ్ళారు ఆఫీసుకి” హాస్పిటల్ క్యాంటీన్ నుంచి తెచ్చిన పొగలు కక్కే వేడి వేడి కాఫీ అందించింది తల్లికి.
" మరి అన్నయ్య ఏడే?" “అన్నయ్యా! అక్కడే ఐ. సీ.యూ. దగ్గర అటెండెంట్స్ రూంలో ఉన్నాడు- ఒక్కళ్ళనే రానిస్తారు. ఇప్పటిదాకా ఉండి వదిన కూడా ఇంటికి వెళ్ళింది-వాళ్ళమ్మాయి దీప్తి ఫ్రెండ్స్ లంచ్ కి వస్తున్నారట.” వరుసగా చెప్పుకుంటూ పోతోంది పావని.
వేడి వేడి కాఫీ తాగి కుర్చీలో కూలబడ్డ సావిత్రి నిద్రా, కలా కాని స్థితిలోకి వెళ్ళిపోయింది. తన పిల్లల పెళ్ళిళ్ళకి అన్నని పిలుద్దామంటే, ససేమిరా అన్నాడు భర్త కృష్ణమూర్తి. కొడుకైతే అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు. పావని మాత్రం, “ఎందుకు నాన్నా ఈ పంతాలు? గొడవ జరిగి నాలుగేళ్ళయిపోయిందిగా-పిలుద్దాంలే నాన్నా” అంది పాపం. “నో ! పెళ్లికి గనక ఆ కుటుంబం వస్తే, నీ అన్న లేకుండా చేసుకోవాల్సి వస్తుంది పెళ్ళి. ఎవరు కావాలో నువ్వే తెల్చుకో” అంటూ చిందులూ శివాలూ తొక్కాడు సత్యమూర్తి. దాంతో తన పుట్టింటివాళ్ళు రాకుండానే కూతురి పెళ్ళి చేసుకోవలసి వచ్చింది.
కాకపోతే తల్లి మనసు అర్థం చేసుకున్న కూతురిని చూసి ఆనందించింది సావిత్రి. ఆడదాని మనసు మరో ఆడది మాత్రమే అర్థం చేసుకోగలదంటే ఇదేనేమో - అనుకుంది. పావని పెళ్ళికే పిలవద్దని గొడవ చేసిన కొడుకు ఇంక తన పెళ్ళికి పిలుస్తానంటే ఇంకెంత రాద్ధాంతం చేస్తాడోనని, అన్న ఊసే ఎత్తలేదు సావిత్రి.
ఎందుకో ఒక్కసారి అంబులెన్స్ సౌండ్ కి ఈ లోకంలోకి వచ్చి చూసింది- ఎవరినో స్ట్రెచర్ మీద హడావిడిగా ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకెళ్తున్నారు. అంతా ఉరుకులూ, పరుగులూ. కంగారుగా చూస్తున్న సావిత్రితో, “ఈ కార్పొరేట్ హస్పిటల్స్ లో ఇలాంటివి సహజమమ్మా! రోజుకిలాంటి వెన్నో” జనాంతికంగా అంటున్నట్లు తనతోనే అన్నాడు పక్క సీట్లో పెద్దాయన.
“నాన్నెలా ఉన్నార్రా?” అప్పుడే వస్తున్న కొడుకుని అడిగింది. “బానే ఉన్నారమ్మా. సమయానికి ఇద్దరు దాతలు వచ్చి రక్తం కూడా ఇచ్చారట.”
“అట అంటున్నావ్? నువ్వెక్కడున్నావురా?” “అంటే ఆ టైముకి ఫోర్త్ ఫ్లోర్ లో నాన్న మెడిక్లెయిమ్ విషయం మాట్లాడానికి వెళ్ళానమ్మా ! అక్కడే గంట పట్టింది - ఈలోగా వాట్సప్ గ్రూప్ లో మన ప్రకటన చూసి ఎవరో వచ్చి రక్తదానం చేసి వెళ్ళిపోయారట.” “చూశావా? మీ నాన్న మంచితనం- భగవంతుడే సమయానికి తన ఇద్దరు దాతల ద్వారా రక్తం పంపించాడన్న మాట.” కళ్ళనీళ్ళు పెట్టుకుంది సావిత్రి.
ఈలోగా క్యారేజీ పట్టుకొచ్చింది కోడలు శరణ్య - ఆ దీప్తికెప్పుడూ ఫ్రెండ్స్ గోల. హఠాత్తుగా నలుగురిని తీసుకువచ్చి “అమ్మా! అన్నం పెట్టు మా అందరికీ - అంటుంది, ముందు కనీసం ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వదు రాస్కెల్” అంటూ కూతురి ఘనకార్యాన్ని మురిపెంగా చెప్పుకుంటూ, “వాళ్ళందరికీ పెట్టి వచ్చేసరికి నాకు లేటయింది - సారీ అత్తయ్యా!” అంది.
“ఇంకా రెండన్నా అవలేదు - అయినా ఈ హాస్పిటల్ లో ఆకలేమేసిచస్తుంది- ఏదో తినాలి గాబట్టి తింటాంగానీ, నా మనవరాలిని మాత్రం ఏమీ అనకమ్మా” అంది సావిత్రి. అందరి భోజనాలు పూర్తయ్యాయి నెమ్మదిగా -
"అమ్మా - నేనొకసారి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లొస్తాను - థర్డ్ ఫ్లోర్ లో ఉంది – ఐ.సి.యు. బయట చెల్లి ఉంటుంది - నువ్వు, మీ కోడలూ ఇక్కడే వెయిట్ చెయ్యండి అని చెప్పి సత్యమూర్తి వెళ్ళబోతుంటే… “ఒరేయ్ నాయనా సత్యా! మీ నాన్నకి బ్లడ్ ఇచ్చిన వాళ్ళెవరో కనుక్కో. ధన్యవాదాలు చెప్పటం మన కర్తవ్యం”, అంటున్న తల్లితో, “అందుకేనమ్మా వెళ్తున్నది బ్లడ్ బ్యాంక్ కి” చెప్పాడు సత్యమూర్తి.
బ్లడ్ బ్యాంక్ లో రిసెప్షనిస్టుని వివరాలడిగాడు - పేషెంటు పేరు, నెంబరు అన్నీ చెప్పిన 10 నిమిషాలకి వివరాలు వచ్చాయి. రక్తం ఇచ్చినవాళ్ళు తండ్రీ కొడుకులట. “వారి పేర్లూ… ఫోన్ నెంబర్లూ”, అడిగాడు సత్యమూర్తి. “అవేం చెప్పలేదుగానీ ఈ కవర్ ఇమ్మన్నారు సార్” అంటూ ఇచ్చింది. “కవరా?” ఆశ్చర్యంగా తీసుకుని ఓపెన్ చేశాడు.
“బావా! మూడు దశాబ్దాలనాడు ఆవేశంలో, తొందరపాటుతో నిన్ను కొట్టిన దెబ్బ తగలరాని చోట తగిలి నీ రక్తం కళ్ళ చూశాను. ఆ తప్పుకి ఆనాటినుంచీ బాధపడుతూనే వున్నాను- పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరదామని ఇంటికొచ్చినా, ఆ అదృష్టానికి నోచుకోలేదు - ఆ ఒక్క పొరపాటుకి మన జీవితాల్లో జరిగిన ఎన్నో ముఖ్య ఘట్టాల్లో మీరు-మేము కూడా ఒంటరులైపోయాము- ఎంతో ఆనందంగా గడపాల్సిన మధురక్షణాలని ఒకరికొకరం దూరమై భర్తీ చేయలేని నష్టాన్ని అనుభవించాము- ఆనాడు నా పొరపాటువల్ల నీ రక్తం కళ్ళచూశాను. ఈనాడు నీకు రక్తం కావాల్సి వచ్చిందని తెలిసి, ఆనాటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఇదొక్కటే మార్గమనిపించి నేనూ, మా అబ్బాయి సందీప్ - లక్కీగా మా ఇద్దరిదీ ‘ఏ పాజిటివ్’ గ్రూప్ (నీ గ్రూపే) కావడంతో ఇలా రక్తం ఇచ్చి మీ అబ్బాయి కంటపడకుండా వెళ్ళిపోతున్నాము. మాలాంటి వాళ్ళ రక్తం తీసుకోవడానికి కూడా తాను నిరాకరిస్తాడన్న భయంతో తనున్నంత సేపూ దూరంగా నిరీక్షించి, తను వెళ్ళాక బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాము. మీ కుటుంబం కలకాలం చల్లగా ఉండాలి. ఇప్పటికైనా క్షమిస్తావని ఆశిస్తూ… నీ బావమరిది ప్రసాద్.”
సత్యమూర్తి కళ్ళనుండి కురిసిన వర్షంతో చేతిలోని ఉత్తరం తడిసిపోయింది.

