దర్జీ మస్తాన్ తన ఇంట్లో బట్టలు కుడుతున్నాడు. ఇంతలో ఆ గ్రామంలోని జమిందారు రఘువీరుడు నౌకరు రంగడు అక్కడికి వచ్చాడు. జమిందారు గారు పని ఉంది రమ్మన్నారని చెప్పి వెళ్ళాడు. మస్తాన్ చేతిలో పని ఆపి, భార్య ఫాయిజాకి చెప్పి వెంటనే బయలుదేరాడు.
జమిందారు రఘువీరుడికి పైళ్ళైన చాలా కాలానికి కూతురు పుట్టింది. ఆమెకు వందన అనే పేరు పెట్టి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆయన. మహ్మద్ దగ్గరే తన కూతురికి బట్టలు కుట్టిస్తుంటాడు. మహ్మద్ కూడా రకరకాల డిజైన్స్ తో బట్టలు కుడుతుంటాడు.
వందన పెద్దది అయి కళాశాలకు వెళుతోంది. మహ్మద్ ముసలివాడు అయ్యాడు. మునపటిలాగా బట్టలు కుట్ట లేకపోతున్నాడు. తన కొడుకు రఫీని పనిలో సహాయం చేయవలసిందిగా మహ్మద్ అడిగాడు. ‘నాకు దర్జీ పని అంటే ఇష్టంలేదు,
ఆ వృత్తికి సరైన గుర్తింపు ఉండదు, నాకు ఆ వృత్తి చేయడం సిగ్గుగా ఉంటుందని’ రఫీ చెప్పాడు. ఇటు మహ్మద్ ఎక్కువ బట్టలు కుట్టలేకపోతుండటంతో రాబడి తగ్గుతూ వస్తోంది. అటు రఫీ ఏ పని చేయకుండా కూర్చోవడం వల్ల ఆదాయం లేక ఇల్లు గడవడమే కష్టమైంది. కానీ జమీందారు మాత్రం తన కూతురి వందన బట్టలు మహ్మద్ దగ్గరే కుట్టిస్తున్నాడు.
ఒక రోజు వందన పట్నంలో ఉన్న పిన్ని కూతురు పూర్ణిమ పుట్టిన రోజుకి వెళ్ళింది. పూర్ణిమ అమ్మ నాన్న స్నేహితులను, దగ్గర బంధువులను పిలిచి ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకలో పూర్ణిమ కళ్లు చెదిరిపోయే కొత్త డిజైన్ తో ఒక అందమైన పొడవాటి గౌను వేసుకుని వచ్చి అందరి సమక్షంలో కేక్ కట్ చేసింది. వేడుకకు వచ్చిన వాళ్లందరి చూపులు పూర్ణిమ గౌను పైనే.
వందన అలాంటి డిజైన్ గౌను చూడడం అదే మొదటిసారి. తన పుట్టిన రోజుకు అలాంటి గౌను కావాలని తండ్రిని అడిగింది. జమీందారు వెంటనే సరేనన్నాడు.
సరిగ్గా కూతురు పుట్టిన రోజుకు పదిహేను రోజులు ఉన్నదనగా మహ్మద్ ని పిలిపించి తన కూతురి కోరిక చెప్పి గౌను నమూనా చూపించాడు జమీందారు. సరేనని పట్నం వెళ్ళి కావలసిన బట్ట, చెమ్కీలు కొని తీసుకు వస్తుండగా మహ్మద్ కు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మహ్మద్ కాలు కోల్పోయాడు. దీనితో దర్జీ పనికి పూర్తిగా దూరమయ్యాడు. ఆ సంగతి తెలుసుకున్న జమీందారు వందనకు తను ఇష్టపడిన గౌను కుట్టించి లేక పోతున్నానని బాధపడసాగాడు.
అయితే, ఎలాగైనా వందన కోరిక తీర్చాలని పట్నం వెళ్లి పూర్ణిమ గౌను వాళ్ళ తల్లీ తండ్రి ఎక్కడ కొన్నారో తెలుసుకున్నాడు. ఆ దుకాణానికి వెళ్ళి నమూనా చూపించి ఇలాంటి గౌను కావాలని అడిగాడు. కాని దుకాణం వాళ్ళు ఇక్కడ కుట్టిన గౌన్లు ఉండవని, నెల రోజుల ముందు ఆర్డర్ ఇస్తే కొలతలు తీసుకుని కుట్టి ఇస్తామని చెప్పారు. చేసేది ఏమి లేక తిరిగి ఊరికి వస్తున్న జమీందారుకి ఒక ఆలోచన వచ్చింది.
ఊరికి వచ్చిన వెంటనే సొంత ఊరు, పక్క ఊళ్ళల్లో ఉండే దర్జీలందరినీ పిలిపించి… ఇంకో వారం రోజుల్లో తన కూతురు పుట్టిన రోజు రాబోతున్నదని, ఆ రోజులోగా తన కూతురు ఇష్టపడిన గౌను ఎవరైతే అందంగా కుట్టి తెస్తారో వాళ్ళకు ఒక ఎకరం పొలం బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు జమీందారు. దర్జీలందరూ గౌను నమూనా చూసుకుని కొలతలు తీసుకుని వెళ్ళారు.
జమీందారు ప్రకటన గురించి తన స్నేహితుడు ద్వారా తెలుసుకున్న మహ్మద్ బాధ పడసాగాడు. తండ్రి బాధగా ఉండడం చూసిన రఫీ ఏమైంది అబ్బు…? అని అడిగాడు. ఏమిలేదు బేటా అన్నాడు మహ్మద్. జమీందారు ప్రకటన వల్ల ఇంక తన పేరు ఆ ఊరిలో తెర మరుగైపోతుందని బాధ పడుతున్నాడు మీ అబ్బు అని చెప్పింది మహ్మద్ తల్లి. జమీందారు ఏమి ప్రకటనిచ్చారు…? అని అడిగాడు రఫీ. ప్రకటన ఏమిటో చెప్పింది రఫీకి ఆమె.
రఫీ తనలో తాను ‘నేను పట్నంలో స్థిరపడడానికి డబ్బు కావాలి. నేను జమీందారు పెట్టిన పోటీ గెలిచి ఎకరం పొలం సొంతం చేసుకుని… దానిని విక్రయించగా వచ్చిన డబ్బుతో పట్నంలో వ్యాపారం చేయవచ్చు’ అని అనుకున్నాడు. వెంటనే జమీందారు ఇంటికి వెళ్ళి ఆ గౌను నమూనా చూసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు.
ఆ రోజు రాత్రి రఫీ పడుకోకుండా గౌను ఎలా కుట్టాలి, నమూనా ప్రకారమే కుట్టాలా లేక వేరేగా ఏమైనా డిజైన్ కుడితే నచ్చుతుందా లేదా. ఎలాంటి డిజైన్ కుట్టాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. మధ్య రాత్రి రఫీ వాళ్ళ అమ్మ ఫాయిజా నిద్ర లేచి ఏమైంది బేటా…? అని రఫీని అడిగింది. గౌను ఎలా కుట్టాలో తెలియడం లేదని అన్నాడు.
రఫీ మాటలు విన్న ఫాయిజా ‘నీకు ఏ పువ్వు అంటే ఇష్టం?’ అని అడిగింది. ఇప్పుడు పువ్వు గురించి దేనికి అమ్మి అన్నాడు రఫీ. అరె చెప్పు బేటా అంది వాళ్ళ అమ్మ. ఎర్ర గులాబీ పువ్వంటే ఇష్టమన్నాడు రఫీ. మనకు ఇష్టమైన గులాబీ పువ్వు మన చేతికి రావాలంటే ముందు మొక్క నాటాలి, నీరు పొయ్యాలి, ఎరువు వేయాలి తరువాత కదా ఆ చెట్టుకి పువ్వు పూస్తుందో…?లేదో…? తెలుస్తుంది. నువ్వు అసలు గౌను ఇంకా కుట్టనే లేదు అప్పుడే నచ్చుతుందో లేదో, ఏ డిజైన్ కుట్టాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఏమౌతుంది. ఆరంభిస్తే కదా ఒక ఆలోచన, అవగాహన వస్తుందని చెప్పింది రఫీకి వాళ్ళ అమ్మ.
తల్లి మాట విని రఫీ వెంటనే మహ్మద్ ని కొలతలు అడిగి గౌను కుట్టాడు. ఆ గౌను నిండా తనకు ఇష్టమైన ఎర్ర గులాబీ పువ్వులు వెల్వెట్ బట్టతో చెమ్కీలు అద్ది డిజైన్ కుట్టాడు. నడుము దగ్గర “ హ్యాపీ బర్త్ డే” అని అక్షరాలుగా గులాబీ రేకులను అమర్చినట్టు వెల్వెట్ బట్టతో ఎంతో అందంగా డిజైన్ చేశాడు.
రెండు రోజులోనే గౌను కుట్టి జమీందారుకి అందించాడు రఫీ. వందన ఆ గౌను చూసి ఎంతో ఇష్టపడింది. వెంటనే రఫీకి జమీందారు ఎకరం పొలం బహుమతిగా ఇచ్చాడు.
వందన పుట్టిన రోజుకి ఊరి వాళ్ళను, బంధువులను, స్నేహితులను అందరినీ పిలిచి ఎంతో ఘనంగా వేడుక జరిపించాడు జమీందారు. ఆ వేడుకకు వచ్చిన వాళ్లంతా జమీందారుని ఈ గౌను ఎక్కడ కుట్టించారని అడిగారు. వెంటనే జమీందారు మహ్మద్ ని చూపించి అతని కొడుకు కుట్టాడని చెప్పాడు. మహ్మద్ చాలా గర్వపడ్డాడు ఆ రోజు. కానీ రఫీ కేవలం పొలం కోసం మాత్రమే ఈ గౌను కుట్టాడని గుర్తు తెచ్చుకుని లోపల బాధపడసాగాడు.
ఎకరం పొలాన్ని ఎలాగైనా అమ్మి పట్నం వెళదామని అనుకుంటున్న రఫీకి “ప్రతిభ ఎన్నడూ దాగదు” అన్నట్టు ‘దాసరి ఫ్యాషన్ హబ్’ అనే కంపెనీ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మీ డిజైన్ మాకు బాగా నచ్చింది. మా కంపెనీలో మీరు పని చేయాలని అనుకుంటే వెంటనే వచ్చి కలవండని. రఫీ వెంటనే పట్నం వెళ్ళి దాసరి ఫ్యాషన్ హబ్ వాళ్ళను కలిశాడు. నువ్వు కుట్టిన డిజైన్ ఎంతో బాగుంది. నా దగ్గర ఆ డిజైన్స్ అన్ని కుడతావా…? నా దుకాణానికి మంచి పేరు వస్తుంది అని రఫీని అడిగాడు దుకాణం యజమాని. నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తా. కానీ నువ్వు ఇంకెవరికి ఆ డిజైన్స్ కుట్టి ఇవ్వకూడదని చెప్పాడు.
దుకాణం యజమాని మాటలు విన్న రఫీకి తండ్రి తన పేరు ఇక మాసిపోతుందని పడిన బాధ, దర్జీ వృత్తిలో గొప్పతనం, సమాజంలో దర్జీ వృత్తి అవసరం అన్నీ అర్థమయ్యాయి. రఫీ వెంటనే మనసులో ‘నేను పట్నం రాను. పట్టణాన్ని నా దగ్గరకు రప్పించుకుంటా.’ అని గట్టిగా నిర్ణయించుకుని, నేను ఎవరి దగ్గర పని చేయనని దుకాణం యజమానికి చెప్పి తిరిగి ఊరికి వచ్చాడు.
ఊరికి వచ్చిన రఫీలో చాలా మార్పు వచ్చింది. ఊరిలో ఆడవాళ్లందరికీ రకరకాల డిజైన్స్ తో జాకెట్లు, గౌనులు కుడుతూ తన ప్రతిభను పట్టణానికి చేరేలా చేశాడు. ఒక రోజు రఫీకి ఒక ఉత్తరం వచ్చింది. కొన్ని రోజుల్లో మా పెళ్లిరోజు రాబోతోంది. నా భార్యకు పసుపు గులాబీలంటే చాలా ఇష్టం. ఆ రంగులో గులాబీ పువ్వుల గౌను, పెళ్ళి రోజు సందేశంతో కుట్టి పంపండి. మీరు ఎంత డబ్బులు అడిగితే అంతా నేను పంపిస్తానని…
రఫీ ఊరిలో సెల్ ఫోన్, సరైన రహదారి, కనీసం వీధి దీపాల సదుపాయం కూడా లేవు. అందువల్ల ఉత్తరంలో ఇచ్చిన సమయానికి రఫీ ఆ గౌను అందించలేకపోయాడు. అందుకే రఫీని చాలామంది పట్టణానికి వచ్చి ఒక దుకాణం పెట్టుకోమన్నారు. రఫీ తనకు పట్టణం రావడం ఇష్టం లేదని అన్నాడు. దానితో రఫీకి ఆర్డర్లు రాలేదు. ఊరిలో ఉన్న వారు కూడా మెల్లగా పట్టణం ఫ్యాషన్ కి మొగ్గు చూపడం ఆరంభించారు.
ఒక రోజు తండ్రిని హాస్పిటల్ కు పట్నం తీసుకు వెళ్ళిన రఫీకి ఒక ప్రకటన కాగితం దొరికింది. పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళు ఒక ఫ్యాషన్ పోటీ నిర్వహిస్తున్నారని, గెలిచిన వాళ్ళకు లక్ష రూపాయలు నగదు బహుమతితో పాటు ఫ్యాషన్ డిజైనర్ అనే గుర్తింపు వస్తుందని ఆ ప్రకటన సారాంశం. కాగితం చదివిన రఫీ పోటీలో పాల్గొని ఎలాగైనా గెలిచి ఆ గుర్తింపును తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు.
పోటీలో గెలవాలని కొత్త కొత్తగా ఆలోచనలు చేస్తున్న రఫీకి… ఒక రోజు తన చెల్లి ఒక పెద్ద గులాబీ పువ్వు కొనుక్కుని జడలో పెట్టుకుంది. అప్పుడు రఫీకి ఒక ఆలోచన వచ్చి… “గులాబీపువ్వు రేకులు విచ్చుకున్నట్టు అందులో నుంచి ఒక అమ్మాయి వచ్చినట్టు ఉండే ఒక పొడవాటి గౌను కుట్టి పోటీకి తీసుకు వెళ్ళాడు.
పోటీకి చాలామంది ఫ్యాషన్ డిజైనర్ లు వచ్చారు. అక్కడకు “దాసరి ఫ్యాషన్ హబ్” వాళ్ళు కూడా వచ్చారు. రఫీని చూసి తను గెలవడం ఇష్టం లేక ఎలాగైనా ఓడిపోవాలని అతను కుట్టిన గౌను వేసుకోవలసిన అమ్మాయిని డబ్బుతో కొనేశారు.
రఫీ ఆ సంగతి తెలుసుకుని ఏమీ చేయలేక బాధపడసాగాడు. అనుకోకుండా ఆ పోటీలు చూడడానికి జమీందారు కూతురు వందన వచ్చింది. రఫీని చూసి ఎలాగైనా నువ్వు గెలవాలని చెప్పింది. రఫీ తన బాధను ఆపుకోలేక జరిగినది చెప్పాడు.
వందన వెంటనే మన ఊరు ఎలాగైనా గెలవాలని చెప్పి… తానే ఆ గౌను వేసుకుని వస్తానని చెప్పింది. రఫీ ఎంతో సంతోషించి వెంటనే తనకు ఆ గౌను అందించాడు. ఆమె గౌను వేసుకుంది కానీ కొంచెం కొలతలు సరిపోలేదు. రఫీ బాధగా ఆ ప్రదేశాన్ని వదిలేసి బయటకు వచ్చేశాడు. ఇంతలో పోటీ ఆరంభమైంది.
పోటీ అంతా ముగిసి జడ్జిలు అందరూ రఫీని విజేతగా ప్రకటించారు. రఫీ తన పేరు విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు తన గౌను వేసుకుని ప్రదర్శన ఇచ్చారని చూశాడు.
తన గౌను వేసుకున్న అమ్మాయిని చూసి ఎవరని వందనని అడిగాడు రఫీ. తన స్నేహితురాలు అని, ఆమె మన ఊరు సర్పంచ్ కూతురని చెప్పింది. ఇంతలో రఫీని బహుమతి అందుకోవడానికి పిలిచారు.
జడ్జిలు ప్రకటించిన నగదు బహుమతి , ప్రశంస పత్రాన్ని అందిస్తుంటే… రఫీ నేను గెలవాలి అనుకుంది మా అబ్బు కోసం. అందుకే ఇవి అన్నీ మా అబ్బుకే అందించండని అన్నాడు. మీ అబ్బు కోసం గెలవడం ఏమిటని అడిగారు జడ్జిలు.
నేను ఒక దర్జీని అని చెప్పాడు రఫీ. మైక్ తీసుకుని దర్జీ అనే పదం విన్న మీ అందరిలో ఒక చులకన భావం కలిగి ఉండవచ్చునని, దర్జీ అనే మాట వినగానే అందరికీ అదోలా అనిపించిందా అని అంటూ, మా కులవృత్తి “దర్జీ” వృత్తి. మా అబ్బు కులవృత్తి చేసి మమ్ములను పెంచాడు అని చెప్పాడు రఫీ.
కాని ఆ వృత్తి అంటే అందరికీ చులకన భావం ఉన్నదని, మా అబ్బు ఒక దర్జీ అని మా వెనుక నవ్వుకునే వారని నా తోటి పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారని రఫీ చెప్పాడు. అందుకే నాకు మా కులవృత్తి అంటే ఇష్టం లేదు. మా అబ్బు ముసలివాడు అవుతున్నాడని తనకు సాయం చేయమని అడిగాడని, కానీ నాకు ఇష్టం లేదన్నా మా అబ్బు నన్ను ఏమీ అనలేదని ఆవేదన వ్యక్తం చేశాడు
నేను స్వార్థంతో ఒక గౌను కుట్టాను. ఆ డిజైన్ కోసం నాకు పట్నం నుంచి ఒక అవకాశం వచ్చింది. అక్కడకు వెళ్ళాక నాకు అర్థమైంది… “కులవృత్తికి తల్లిదండ్రులు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు, దర్జీ యొక్క విలువ, అవసరం” . ఆ రోజు నుంచి నేను నా కులవృత్తి చేసుకుంటున్నాను. కానీ మా అబ్బు కోరుకున్నట్టు తన పేరు తరతరాలకు నిలిచిపోవాలంటే నేను ఏదో చెయ్యాలని అనుకునేవాడిని. అందుకే ఈ పోటీలో పాల్గొన్నానని, గెలిచానని తన బాధ, ఆశయం అన్నీ చెప్పాడు రఫీ.
అన్నీ విన్న న్యాయనిర్ణేతలు మీ అబ్బుని ఇక్కడకు తీసుకురండని రఫీకి చెప్పారు. వెంటనే వీల్ చైర్ లో తన అబ్బుని తీసుకొచ్చాడు రఫీ. మహ్మద్ ని పొగుడుతూ రఫీ గెలిచిన బహుమతి నగదు, బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అనే గుర్తింపు, ప్రశంస పత్రం అందించారు. రఫీని చూసి మహ్మద్ ఎంతో గర్వపడ్డాడు.
రఫీ తాను గెలిచిన లక్ష రూపాయలను ఊరికి మంచి రహదారి, సెల్ ఫోన్ సౌకర్యాలు తీసుకు రావడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. పట్టణాన్ని తన దగ్గరకు తీసుకొచ్చి… తన ఊరిలో “ మహ్మద్ ఫ్యాషన్ హబ్” అని ఒక దుకాణం పెట్టి తరతరాలకు తన తండ్రి పేరు నిలిచిపోయేలా చేశాడు రఫీ.

