రాజు, అస్లాం ఇద్దరూ అవనిగడ్డ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతులు కలిసి చదువుకున్నారు.

రాజు తండ్రి పులిగడ్డలో పని చేసేవారు. రాజు ప్రతిరోజూ పులిగడ్డ నుండి రెండు కిలోమీటర్లు నడిచి అవనిగడ్డ పాఠశాలకు వచ్చేవాడు. మధ్యాహ్నం అక్కడే తిని, సాయంత్రం ప్రైవేట్ చదువుకుని అక్కడే పడుకునేవాడు.

అస్లాం అవనిగడ్డలోనే ఉండేవాడు. రాజు ప్రైవేట్‌కు వెళ్లే ముందు వరకు ఇద్దరూ కలిసి సరదాగా గడుపుతూ, భవిష్యత్తు గురించి కలలు కనేవారు. రాజు ఎప్పుడు చదువు ఆపవద్దని, చదువే మన భవిష్యత్ నిర్ణయిస్తుందని చెప్పేవాడు. “నా తలరాతలో చదువు కనిపించడంలేదు కానీ, నా పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తా” అనే వాడు అస్లాం.

పదవ తరగతి పూర్తయ్యాక రాజు బందరులో, అస్లాం అవనిగడ్డలోనే ఇంటర్ చేరారు.

జై ఆంధ్రా ఉద్యమం వల్ల సెలవులు రావడంతో రాజు సొంతూరు వెళ్లాడు. ఆ సమయంలో అస్లాంను చూడటానికి అవనిగడ్డ వెళ్లిన రాజుకు ఒక చేదు నిజం తెలిసింది. అస్లాం తండ్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. అస్లాం ఆ విషయం రాజుకి చెప్పలేదు. ఎందుకంటే రాజుకు పరీక్షలు ఉన్నందున ఎలాంటి ఆటంకాలు కలగకూడదని. కుటుంబ పోషణ కోసం, చెల్లి చదువు కోసం అస్లాం తన చదువు మధ్యలోనే ఆపేసి, మోటారు సైకిల్ మరమ్మత్తు పనిలో చేరాడు.

కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులతో కాలం గడిచింది. అస్లాం తన చెల్లికి పెళ్లి చేసి, తాను కూడా పెళ్లి చేసుకున్నాడు. భార్య సల్మా కూడా కుట్టు మిషన్ కుడుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. రాజుకు ఇద్దరు కూతుళ్లు, అస్లాంకు ఒక కొడుకు (నజీర్), ఒక కూతురు (నదియా) పుట్టారు. రాజు తిరుపతిలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

అస్లాం పిల్లల చదువుల కోసం రాత్రింబగళ్లు కష్టపడ్డాడు. పగలు షాపులో పనిచేస్తూ, రాత్రిళ్లు జీపు అద్దెకు తీసుకుని ప్రయాణికులను చేరవేసేవాడు. రాజు కూడా అస్లాం పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా అవసరమైనప్పుడు ఆదుకునేవాడు.

అస్లాం కష్టానికి తగ్గట్లే నజీర్ ఐఐటీలో చదివి బెంగళూరులో, నదియా మెడిసిన్ చదివి హైదరాబాద్‌లో వైద్యురాలిగా స్థిరపడ్డారు. రాజు కూతుళ్లు కూడా ఇంజనీరింగ్, మెడిసన్ చదివి హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు.

అస్లాం పిల్లలు స్థిరపడ్డాక తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశారు. రాజు ఉద్యోగ విరమణ చేసి విజయవాడలో స్థిర పడ్డాడు. తాము పడ్డ కష్టాలు మరే పేద విద్యార్థి పడకూడదనే ఉద్దేశంతో అస్లాం పిల్లలు (నజీర్, నదియా) తమ తాత పేరిట ‘అలి విద్యా వికాస చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు.

రాజు చూపిన స్ఫూర్తికి కృతజ్ఞతగా ఆయనను ఈ ట్రస్ట్‌కు నిర్వాహకుడిగా పెట్టారు. రాజు పిల్లలు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.

ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన ఎంతోమంది పేద విద్యార్థులు (జరీనా - ఆర్‌డీఓ, రవి - ప్రొఫెసర్, సుమన్ - డీఎస్పీ, రమ్య - సాఫ్ట్‌వేర్ ఇంజనీర్) నేడు ఉన్నత స్థానాల్లో ఉండి, తిరిగి ఈ ట్రస్ట్‌కే సహాయం చేస్తూ ఎంతో మందికి ఆశాదీపంగా నిలిచారు.

ఒకరోజు రాత్రి భోజనం చేసి రాజు ఆరు బయట కూర్చున్న సమయంలో బెంగళూరు నుండి నజీర్ ఫోన్ చేశాడు. “నాన్నకు ఒంట్లో బాగాలేదు అంకుల్, రేపు ఉదయం విమానానంలో వస్తున్నాను, మీరూ నాతో వస్తారా” అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. రాజు సరేనని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన రాజుకు గడిచిన ముప్పై ఏళ్ల జ్ఞాపకాలు, అస్లాం పడ్డ కష్టం అంతా గుర్తుకు వచ్చి మనసు బరువెక్కింది. ఆ ఆలోచనలతోనే రాజు కలత నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం 8 గంటలకు నజీర్ రాగానే ఇద్దరూ కారులో అవనిగడ్డ బయలుదేరారు.

దారిలో నజీర్… నాన్నకు ఛాతిలో నొప్పి వచ్చినా బెంగళూరు రావడానికి ఒప్పుకోవడం లేదని, షాపు పని మాననంటున్నాడని, మీరు చెబితే వింటాడని రాజుకు వివరించాడు.

వారు అవనిగడ్డలోని ఇంటికి వెళ్లే సరికి అస్లాం భార్యతో హాయిగా మాట్లాడుతున్నాడు. రాజును చూడగానే ఆశ్చర్యపోయాడు. నిన్న షాపులో కొద్దిగా ఛాతి నొప్పి వస్తే కుర్రాడు రమణ ఆస్పత్రికి తీసుకెళ్లాడని, ఇప్పుడు బాగానే ఉందని చెప్పాడు. రాజు చొరవ తీసుకుని… “పిల్లల దగ్గరకు వెళ్లి పూర్తి వైద్య పరీక్షలు చేయించుకో, కొన్నాళ్లు అక్కడ ఉండి రా. షాపు బాధ్యతలు రమణకు అప్పగించు, వాడు నెల నెలా డబ్బులు ఇస్తాడు” అని అస్లాంను ఒప్పించాడు. రాజు మాటను అస్లాం కాదనలేకపోయాడు.

రాజు మాటకు అస్లాం ఒప్పుకోవడంతో సల్మా సంతోషంతో బెంగళూరు వెళ్లడానికి సామాన్లు సర్దడం ప్రారంభించింది. రెండు రోజుల్లో బయలుదేరుతామని, విజయవాడ మీదుగా వచ్చేటప్పుడు రాజు ఇంటికి వస్తామని నజీర్ చెప్పాడు. రాజు ట్రస్ట్ విస్తరణ గురించి నజీర్‌తో మాట్లాడి, సల్మా ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి సంతోషంగా కారు ఎక్కాడు. అస్లాం కుటుంబం రాజుకు ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఆ ప్రాంతమంతా వారి స్నేహ పరిమళాలు వ్యాపించినట్లుగా అనిపించింది.