తమిళనాడులో టివికె (తమిళ వెట్రి కజగం ) పార్టీ సారథ్యంలో ఏర్పాటు అయిన నూతన ప్రభుత్వం అనూహ్యంగా’ విజయ’కేతనం ఎగురవేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేవలం 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టి.వి.కె అసెంబ్లీలో బలాన్ని ఏ విధంగా నిరూపించు కోగలదన్న సందేహం చాలా మందికి కలిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత బలం ఉన్నట్లు లిఖిత పూర్వక ఆధారాలు చూపే వరకు గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించలేదు. కానీ అనూహ్యంగా అసెంబ్లీలో టి.వి.కె. కి 144 మంది సభ్యుల మద్దతు లభించింది. వ్యతిరేకంగా 22 ఓట్లు లభించాయి . ఈ అద్భుతం ఎలా సంభవించిందో ఇప్పుడు పరిశీలిద్దాం.

టి.వి.కె .కు మొత్తం 108 సీట్లు లభించాయి రెండు స్థానాలలో గెలిచిన విజయ్ ఒక స్థానానికిరాజీనామా చేయడంతో 107 స్థానాలు మిగిలాయి .ఒకే ఒక్క ఓటుతో తిరువత్తూరు నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యుడు శ్రీనివాస సేతుపతి హైకోర్టు ఆదేశం మేరకు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీనితో టి.వి.కె. బలం 106 కు తగ్గింది. కానీ కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., వి.సి.కె., ఐ.యూ.ఎం.ఎల్., ఎ.ఎం.ఎం.కే సభ్యులు, అన్నా. డి.ఎం.కె.కు చెందిన 25 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారి సంఖ్య 144 కు పెరిగింది. డీ.ఎం.కె. సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. ఎం.డి.ఎం‌.కె సభ్యు లు ఓటింగ్ కు దూరంగా నిలిచారు‌. పి.ఎం.కె., బిజెపి సభ్యులు తటస్తులుగా ఉన్నారు. దీనితో అన్నా డి.ఎం.కె చీలిక వర్గానికి చెందిన 22 మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. దీనితో విజయ్ కి బలపరీక్షలో ఘన విజయం లభించింది.

ఎంతటి ఘన విజయం సాధించినప్పటికీ ఈ నూతన ప్రభుత్వానికి రాజకీయ సెగలు తప్పలేదు. ఎరువు తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ సుపరిపాలనను ఏ విధంగా అందించగలరని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతామన్న విజయ్ తమ పార్టీలో చీలిక తెచ్చారని ఎ ఐ డీఎంకె కార్యదర్శి పళని స్వామి ఆరోపించారు. ప్రజాభీష్టం మేరకే తాము విజయ్ కి మద్దతు ప్రకటించామని ఎ.ఐ డి.ఎం.కె చీలిక వర్గ నాయకుడు వేలుమణి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంపై వివిధ రాజకీయ పార్టీలకు ఉన్న భేదాభిప్రాయాలకు ఈ వ్యాఖ్యలు సంకేతం. వీటిని తేలికగా తీసుకోవడానికి వీలు లేదు.

కాగా, తమ ప్రభుత్వం ఎవరిని నొప్పించదని, గాయపరచదని, నమ్మి ఓటు వేసిన ప్రజల రుణం తీర్చుకుంటామని కొత్త ముఖ్యమంత్రి విజయ్ హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకోవడంపైనే విజయ్ ప్రభుత్వ గౌరవం ఆధారపడి ఉంటుంది. ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తే ఈ రాజకీయ పొగలు, సెగలు విజయ్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు.

మద్య నియంత్రణకు చర్యలు

విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే మద్యం అమ్మకాలపై నియంత్రణ చర్యలు ప్రారంభించారు. ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదని శాసించారు. మద్యం నిషేధానికి తీసుకోబోయే దశల వారి చర్యలలో ఇది మొదటి దశ.

ఈ సందర్భంగా మధ్య నిషేధంపై మన నాయకులు చెబుతున్న మాటలు పరిశీలించడం అవసరం. మద్యం వల్లనే ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తోందని, దాన్ని నిషేధిస్తే ప్రభుత్వానికి నష్టం వస్తుందని మన నాయకులు వాదిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని మద్యం అమ్మకాలను అరికట్టడానికి బదులు వాటిని పెంచుతున్నారు. పైవాదనలోని నిజం ఎంత? మద్యం అమ్మకాలు లేకపోతే దేశం గొడ్డు పోతుందా? అనే విషయాలను ఇప్పుడు విచారిద్దాం.

మద్యపానం, మద్యం అమ్మకాలు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మారుతుంది తప్ప పతనం కాదు. ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి నెలకు 1000 మద్యపానానికి వినియోగిస్తున్నాడనుకుందాం. మద్యం అమ్మకాలను నిషేధిస్తే ఏం చేస్తాడు ? ఆ వెయ్యి రూపాయలు ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగిస్తాడు. ఏ వస్తువును కొనుగోలు చేసినా ఎంతో కొంత మొత్తం పన్ను రూపంలో ప్రభుత్వానికి అందుతుంది. ఒకవేళ ఆ వెయ్యి రూపాయలను సినిమా చూడడానికి ఖర్చు చేస్తే అందులో కొంత సొమ్ము వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి చేరుతుంది. అలాగాక ఆ వెయ్యి రూపాయలు బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుంది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడతాయి. ఒకవేళ మద్య నిషేధం వల్ల ఆదా అయిన సొమ్మును ఆస్తులు కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తే రిజిస్ట్రేషన్ చార్జీలు, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. కనుక మద్యం నిషేధం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుందని వాదించడం ప్రజలను మభ్యపెట్టడమే. ఈ సత్యాన్ని గ్రహించి మన నాయకుల మాయమాటలలో పడకుండా ఉండటం విజ్ఞుల లక్షణం.

అయితే, ఒక్కసారిగా సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయడం నష్టం కావచ్చు. కనుక ముందుగా మధ్య నియంత్రణ చర్యలు చేపట్టవచ్చు. దీని ద్వారా ప్రజలు ఆదా చేసే సొమ్మును సద్వినియోగం చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. పతనం కాదు. మద్యం అమ్మకాలను, వినియోగాన్ని నియంత్రిస్తే దేశానికి, సమాజానికి సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. శారీరకంగా, ఆర్థికంగా సామాన్య ప్రజలకు కలిగే నష్టాన్ని మద్య నియంత్రణ చర్యల ద్వారా అరికట్టవచ్చు. మద్యపానం వల్ల పెరిగే నేర ప్రవృత్తిని కూడా దీనివల్ల నియంత్రించవచ్చు. కనుక అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవడం అవసరం. తద్వారా ఉత్తమ సమాజాన్ని ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు.

మద్యాన్న పూర్తిగా నిషేధించడం ప్రభుత్వం వల్ల సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో, ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. మద్య నియం త్రణ కానీ, నిషేధం కానీ ప్రజలు సహకరించనిదే ముందుకు సాగదు. ప్రభుత్వం, ప్రజలు బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కనుక సంపూర్ణ మధ్య నిషేధం దిశగా దేశాన్ని నడిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి