తగ్గుతున్న జననాలు… మారుతున్న సమాజం… భవిష్యత్ భారతానికి మౌన హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో మూడో, నాల్గో సంతానానికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించాలనే ఆలోచన ఒక సాధారణ రాజకీయ ప్రకటన మాత్రమే కాదు. అది భవిష్యత్ భారత జనాభా నిర్మాణంపై పెరుగుతున్న ఆందోళనకు సంకేతం.
ఒకప్పుడు “జనాభా నియంత్రణ” ప్రభుత్వాల ప్రధాన నినాదం.
ఇప్పుడు “జనాభా తగ్గుదల” కొత్త చర్చగా మారుతోంది.
ఇది కాలచక్రం తీసుకొచ్చిన విచిత్రమైన మలుపు.
“మేమిద్దరం… మాకిద్దరు” అంటూ దశాబ్దాల పాటు సాగిన ప్రచారాలు ప్రజల మనసుల్లో అంతగా నాటుకుపోయాయి కాబట్టి, పిల్లలను కనగలిగే స్థోమత ఉన్న కుటుంబాలు కూడా “ఇద్దరితో చాలు” అనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు అదే ప్రభుత్వాలు — “ఇంకా పిల్లలను కనండి” అని పరోక్షంగా చెప్పే పరిస్థితి ఏర్పడుతోంది.
కానీ అసలు ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది:
ఇప్పటికే ఇద్దరు పిల్లలకే పరిమితమైన కుటుంబాలు…
అధిక ఖర్చులతో జీవిస్తున్న సమాజం…
సిజేరియన్ ప్రసవాలు పెరిగిన వైద్య వాస్తవం…
ఉద్యోగ ఒత్తిళ్లతో నలిగిపోతున్న దంపతులు…
ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మూడో, నాల్గో బిడ్డ కోసం ముందుకు వస్తారా?
ఈ ప్రశ్నకు సమాధానం కేవలం 70000 ప్రోత్సాహకం కాదు.
సమాజం మొత్తం మారిపోయిన జీవనశైలిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకప్పుడు పెద్ద కుటుంబాలు… ఇప్పుడు చిన్న కుటుంబాలు
గ్రామీణ భారతంలో ఒకప్పుడు ఐదుగురు, ఆరుగురు పిల్లలు సాధారణ విషయం. కొన్ని కుటుంబాల్లో పది మంది పిల్లలు కూడా ఉండేవారు. అప్పుడు జీవితం వేరుగా ఉండేది.
వ్యవసాయ ఆధారిత కుటుంబాలు
సంయుక్త కుటుంబ వ్యవస్థ
తక్కువ జీవన ఖర్చులు
సహజ ఆహారం, సహజ జీవనశైలి
పిల్లలను కుటుంబ బలంగా భావించే దృక్పథం
అప్పుడు పిల్లలు “బాధ్యత” కంటే “ఆస్తి”గా కనిపించేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
నేటి కుటుంబం అంటే:
అణు కుటుంబం
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు
చిన్న ఇళ్లు, భారీ అద్దెలు
పిల్లల విద్యపై లక్షల ఖర్చు
ఆరోగ్య భయాలు
ఒత్తిడితో నిండిన పట్టణ జీవితం
వ్యక్తిగత స్వేచ్ఛ, కెరీర్, లగ్జరీ జీవనంపై అధిక ఆకర్షణ
ఈ పరిస్థితుల్లో “ఇంకో బిడ్డ” అనే ఆలోచనే చాలా మందికి భయంగా మారుతోంది.
ఇక తగ్గుతున్న ఫెర్టిలిటీ – రాష్ట్రాల మధ్య వ్యత్యాసం::
భారతదేశమంతా ఒకే పరిస్థితిలో లేదు.
ఇప్పటికీ మంచి జననాల రేటు ఉన్న రాష్ట్రాలున్నాయి.
బీహార్ , ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ, మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు…
ఈ రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ ఎక్కువగా ఉండడానికి కారణాలు:
గ్రామీణ జీవనశైలి, తొందర వివాహాలు, సంయుక్త కుటుంబ వ్యవస్థ, పిల్లలను ఆర్థిక బలంగా భావించడం, తక్కువ నగరీకరణ, సంప్రదాయ కుటుంబ విలువలు
అదే సమయంలో దక్షిణ భారత రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో జననాల రేటు వేగంగా పడిపోతోంది.
దక్షిణ భారతంలో పిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతోంది?
- అధిక విద్య – ఆలస్య వివాహాలు
ముఖ్యంగా మహిళల విద్య పెరిగింది.
దాంతో:
ఆలస్య వివాహాలు, కెరీర్ ప్రాధాన్యత, కుటుంబ ప్రణాళిక, గర్భధారణ ఆలస్యం ఇవి సహజంగానే పిల్లల సంఖ్యను తగ్గిస్తున్నాయి.
2 నగరీకరణ – ఒంటరి జీవితం
పట్టణ జీవితం పెద్ద కుటుంబాలకు అనుకూలం కాదు.
చిన్న ఇళ్లు
అధిక అద్దెలు
ట్రాఫిక్ ఒత్తిడి
సమయం లేకపోవడం
సహాయం చేసే పెద్దలు దూరం కావడం
ఇవి కుటుంబ విస్తరణకు అడ్డుకట్ట వేస్తున్నాయి.
- పిల్లల పెంపకం ఖర్చు
ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలకు:
అంతర్జాతీయ పాఠశాలలు
మంచి వైద్యం
ప్రత్యేక శిక్షణలు
సౌకర్యవంతమైన జీవితం
అందించాలని కోరుకుంటున్నారు.
దాంతో “ఎక్కువ పిల్లలు” అనే ఆలోచన కంటే “నాణ్యమైన పెంపకం” అనే ఆలోచన ముందుకు వస్తోంది.
- ఉద్యోగ జీవితం – కుటుంబానికి దూరం
ప్రస్తుతం కార్పొరేట్, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగాల్లో:
10-12 గంటల పని
రాత్రి షిఫ్టులు
మానసిక ఒత్తిడి
స్క్రీన్ జీవితం
కుటుంబ సమయం లేకపోవడం
ఇవి దాంపత్య జీవితానికే సవాలుగా మారుతున్నాయి.
ఆధునిక జీవితం – శరీరానికీ, మనసుకీ మౌన దెబ్బ
ఈ తరం ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది.
చేతిలో ఫోన్ ఉంది…
కానీ మనసులో ఒంటరితనం పెరుగుతోంది.
రోజంతా:
మొబైల్
సోషల్ మీడియా
వర్చువల్ సంబంధాలు
ఇవి నిజమైన కుటుంబ బంధాలను నెమ్మదిగా బలహీనపరుస్తున్నాయి.
ఫలితంగా:
నిద్రలేమి
హార్మోన్ అసమతుల్యత
ఒత్తిడి
ఊబకాయం
ఫెర్టిలిటీ సమస్యలు
ఇవి పట్టణ జీవితంలో సాధారణమవుతున్నాయి.
మమత, ఆప్యాయత, సరసం, కుటుంబ చలాకీతనం క్రమంగా తగ్గిపోతోంది.
“కుటుంబం” అనే భావన కంటే “వ్యక్తిగత జీవితం” అనే భావన బలపడుతోంది. అది చివరికి ఆరోగ్యంపైనా… ఆనందంపైనా ప్రభావం చూపుతోంది.
సిజేరియన్ సంస్కృతి – భవిష్యత్ తరాలకు ప్రశ్న
ఇప్పుడు ప్రసవాల్లో అధిక శాతం సిజేరియన్ ద్వారా జరుగుతోంది.
ఒకటి లేదా రెండు ఆపరేషన్ల తర్వాత, మళ్లీ గర్భధారణపై భయం
వైద్యులు హెచ్చరికలు, ఆరోగ్య సమస్యలు, అధిక ఖర్చులు.
ఇవి చాలామందిని రెండో బిడ్డ తర్వాత ఆగిపోయేలా చేస్తున్నాయి.
సహజ ప్రసవం ఇప్పుడు అరుదుగా మారుతోంది.
కొన్ని చోట్ల “నార్మల్ డెలివరీ” కంటే “సిజేరియన్” సులభ మార్గంగా మారిపోయిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
వైద్యం సేవా రంగమా? వ్యాపార రంగమా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి
డబ్బు ఇస్తే పిల్లలు పెరుగుతారా?
మూడో బిడ్డకు ముప్పై వేలు…
నాలుగో బిడ్డకు నలభై వేలు…
ప్రభుత్వ ప్రోత్సాహం ఒక సంకేతం కావచ్చు.
కానీ అది సమస్యకు పూర్తి పరిష్కారం కాదు.
ఎందుకంటే ఒక బిడ్డను కనడం ఒక్కరోజు విషయం.
కానీ పెంచడం మాత్రం 20-25 సంవత్సరాల బాధ్యత.
ప్రజలు ఇప్పుడు అడుగుతున్న అసలు ప్రశ్నలు ఇవి:
పిల్లల భవిష్యత్ ఏమిటి?
మంచి విద్య ఇవ్వగలమా?
ఉద్యోగాలు ఉంటాయా?
ఆరోగ్య భద్రత ఉందా?
తల్లిదండ్రులకు సమయం ఉంటుందా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా సమాజాన్ని మార్చడం కష్టం.
ప్రపంచం ఇప్పటికే ఎదుర్కొంటున్న ప్రమాదం
జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
వృద్ధుల సంఖ్య పెరుగుతోంది
యువత తగ్గిపోతోంది
పని చేసే జనాభా క్షీణిస్తోంది
కార్మిక లోటు పెరుగుతోంది
దీంతో ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
భారతదేశం కూడా అదే దిశగా వెళ్లకూడదంటే ఇప్పుడే జాగ్రత్తలు అవసరం. మరి పరిష్కారం ఏమిటి?
“పిల్లలను కనండి” అని చెప్పడం ఒక్కటే పరిష్కారం కాదు.
ముందుగా సమాజం ఆరోగ్యంగా మారాలి.
అవసరమైన మార్పులు తెచ్చుకోవాలి.
కుటుంబ విలువలు బలపడాలి
పిల్లలు “భారం” కాదనే భావన రావాలి
ఆరోగ్యకర జీవనశైలి పెరగాలి
సమయానికి నిద్ర, వ్యాయామం అలవాటు కావాలి
మొబైల్ వినియోగం తగ్గాలి
మానసిక ప్రశాంతత పెరగాలి
అంతేకాదు:
ఉద్యోగ–కుటుంబ సమతుల్యత
మహిళలకు ప్రసూతి అనంతర మద్దతు
వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు
కుటుంబ సమయానికి ప్రాధాన్యత
అవసరం లేని సిజేరియన్‌లపై నియంత్రణ
ఇవి అత్యంత అవసరం.
ప్రభుత్వ భరోసా లేకుండా పెద్ద కుటుంబాలు రావు
కేవలం నగదు ప్రోత్సాహకాలతో జనాభా పెరగదు.
భరోసా ఉన్న సమాజంలోనే జననాలు సహజంగా పెరుగుతాయి.
చివరికి సమాజానికి ఇవ్వాల్సిన కావలసిన సందేశం
ఈ రోజు భారతదేశం ఒక కీలక మలుపు దగ్గర నిలిచింది.
ఒకవైపు తగ్గుతున్న జననాలు…
మరోవైపు పెరుగుతున్న జీవన ఖర్చులు…
ఒకవైపు ఆధునిక సౌకర్యాలు…
మరోవైపు పెరుగుతున్న ఒంటరితనం…
అందుకే ఇప్పుడు ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఎంతో ముఖ్యం. నిజానికి ఇది ఒక సందేశం:
“పిల్లల సంఖ్య పెరగాలి” అన్నదానికంటే
“కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా నిలవాలి” అన్న ఆలోచనే ముఖ్యమైనది.
సమాజం ఆరోగ్యంగా ఉంటేనే జనాభా సమతుల్యత సహజంగా వస్తుంది.
లేకపోతే భవిష్యత్తులో…
ఇళ్లు పెద్దవిగా ఉండొచ్చు…
సౌకర్యాలు మరింతగా పెరగొచ్చు…
కానీ ఆ ఇళ్లలో పిల్లల నవ్వులు తగ్గిపోవచ్చు.
సంతాన నియంత్రణ వైపు దశాబ్దాల పాటు నడిపించిన సమాజాన్ని ఇప్పుడు తిరిగి అధిక సంతాన దిశగా మలచగలమా?
ప్రభుత్వాల ప్రోత్సాహకాలు ప్రకృతిని, ప్రజల మనస్తత్వాన్ని మళ్లీ పాత దిశగా తీసుకెళ్లగలవా?
అది కాలమే చెప్పాలి.
కానీ ప్రభుత్వ 70 వేల ప్రోత్సాహక ప్రకటన ఓ కీలకమైన సమాధానానికి ముందు చూపుతో వేసిన ఎర.
అందుకే నందో రాజా భవిష్యతి.