మహాభారతంలో పాండవులు అందరికీ భార్య ద్రౌపది అని మనకు తెలుసు. కాని పాండవులకు విడి విడిగా భార్యలు ఉన్నారా ? ఉంటే వారి పేర్లు ఏమిటి ? వారికి పిల్లలు ఉన్నారా? ఉంటే వారి చరిత్ర ఏమిటి ? అనే సందేహాలు చాలా మందికి కలుగుతాయి. ఈ సందేహాలు అన్నింటికి సమాధానాలు భారతంలో ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

ధర్మరాజుకు ద్రౌపది కాకుండా మరో భార్య ఉన్నది. ఆమె పేరు దేవిక. స్వయంవరం ద్వారా ఆమె ధర్మరాజుకు భార్య అయింది. ఈ దంపతుల కుమారుడు యౌధేయుడు.

భీమునికి ద్రౌపది కాకుండా మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. వారి పేర్లు హిడింబ, జరంధర. వీరిలో హిడింబ రాక్షస కాంత. ఆమె హిడింబాసురుని సోదరి. లక్క ఇంటి అగ్ని ప్రమాదం నుండి బయట పడిన అనంతరం హిడింబాసురుని సంహరించి హిబింబను వివాహమాడాడు భీముడు. ఆమెకు కమలపాలిక అనే మరో పేరు కూడా ఉన్నది. భవిష్యత్ చెప్పడంలో ఆమె నేర్పరి. హిడింబ, భీముల కుమారుడు ఘటోత్కచుడు. మహాభారత యుద్ధంలో కర్ణుని శక్తి బాణంతో మృతి చెందాడు ఘటోత్కచుడు. ఇక జరంధర, భీముల కుమారుడు సర్వగుడు.

అర్జునునికి ద్రౌపది గాక మరో ముగ్గురు భార్యలు ఉన్నారు. వారి పేర్లు సుభద్ర, ఉలూచి ( ఉలూచికి ఉలూపి అని మరొక పేరు ఉన్నది ) చిత్రాంగద. వారిలో శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర ఒకరు . సుభద్రార్జునుల కుమారుడు అభిమన్యుడు. భారత యుద్ధంలో ద్రోణుడు పన్నిన పద్మ వ్యూహంలో చిక్కుకొని అభిమన్యుడు దుర్మరణం చెందాడు. ఉలూచి నాగ కన్య. ఆమె కుమారుడు ఇరావంతుడు. ఇతడు భారత యుద్ధంలో అలంబుసుని చేతిలో మృతి చెందాడు. మణిపురం రాజు చిత్రవాహనుడు. అతని కుమార్తె చిత్రాంగద. అర్జునుడు తీర్థ యాత్రలు చేసిన సందర్భంలో ఆమెను వివాహమాడాడు. వారి కుమారుడు బభృవాహనుడు. పుత్ర సంతానం లేని తనకు బభృవాహనుని దత్తత ఇవ్వవలసిందిగా అర్జునుని కోరతాడు చిత్రవాహనుడు. అతనికి దత్తుడైన బభృవాహనుడు అనంతరం మణిపురానికి రాజు అయ్యాడు. దత్తుడు కావడం వల్ల బభృవాహనుడు భారత యుద్ధంలో పాల్గొన లేదు.

తన కుమారుడు అయిన భీష్ముని మరణానికి కారణమైన అర్జునుడు యుద్ధంలో మృతి చెందుతాడని గంగ శాపం ఇస్తుంది. అయితే, కుమారుని చేతిలో మృతి చెందితే అర్జునుడు మళ్ళీ బ్రతకగలడని ఆమె ఒక మినహాయింపు ఇస్తుంది. ఈ విషయం ఉలూచికి తెలుసు. అశ్వమేధ యాగం చేస్తున్న బభృవాహనుని అర్జునుని పైకి ఉసిగొల్పుతుంది ఉలుచి. ఆ సందర్భంలో ఇరువురికి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడు మృతి చెందుతాడు. సంజీవని మణి సహాయంతో అర్జునుని తిరిగి బ్రతికిస్తుంది ఉలూచి. అంటే ఉలుచి చాకచక్యం వల్ల అర్జునుడు తిరిగి బతికాడు.

నకులుని మరో భార్య పేరు కరేణుమతి. ఆమె కుమారుడు నిరమిత్రుడు. సహదేవుని రెండవ భార్య పేరు విజయ. ఆమె కుమారుడు సుహోత్రుడు.

ద్రౌపదికి ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుల ద్వారా వరుసగా ప్రతివింద్యుడు,శ్రుత సోముడు, శ్రుతి కీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు అనే కుమారులు జన్మించారు. ద్రౌపది సంతానానికి ఉప పాండవులు అని పేరు. వీరు భారత యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడారు. వీరంతా భారత యుద్ధం చివరి రోజున పాండవ శిబిరంపై అశ్వత్ధామ జరిపిన దాడిలో మృతి చెందారు. ఈ దాడిలో ధ్రుపదుని కుమారులు శిఖండి, ధ్రృష్టద్యుమ్నుడు సుమారు ఒక అక్షౌహిణి పాంచాల సైన్యం మృతి చెందడం జరిగింది.

పాండవుల అనంతరం వారి మనుమడు, అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు హస్తినాపురానికి రాజు అయ్యాడు.

బ్రహ్మజ్ఞాని కృపాచార్యుడు

మహాభారతంలో కృపాచార్యునిపై సామాన్యుల దృష్టి ప్రసరించదు. ధర్మరాజు వలె ఆయన కథానాయకుడు కాదు. భీముని వలె శారీరక బలానికి ప్రతీక కాదు. అర్జునుని వలె పరాక్రమానికి ప్రతీక కాదు. శ్రీకృష్ణుని వలే పాండవుల విజయానికి సారథి కాదు. దుర్యోధనుని వలె భారత యుద్ధానికి ప్రధాన కారకుడు కాదు. కర్ణుని వలే భారతానికి తల అనిపించుకోలేదు. శకుని వలె కౌరవ పాండవ వివాదానికి ఆజ్యం పోయలేదు. దుశ్శాసనుని వలె దుర్యోధనుని దురాలోచనలను అమలు పరచలేదు. భీష్మ ద్రోణుల వలె మహాభారత యుద్ధంలో కీలక పాత్ర వహించలేదు. శిఖండి, ధృష్టద్యుమ్నుడు వలే భీష్మ ద్రోణుల అంతానికి కారకుడు కాలేదు. భారతంలో కృపాచార్యుడు ప్రముఖుడు కాకపోయినా ప్రత్యేక వ్యక్తిత్వం కలవాడు. ఆయన ప్రత్యేకతలను ఇప్పుడు పరిశీలిద్దాం.

బ్రహ్మజ్ఞాని

కృపాచార్యునికి అతని తండ్రి శరద్వంతుడు బ్రాహ్మణుల వద్ద వేదాలు నేర్పించి బ్రహ్మ జ్ఞానిగా తీర్చిదిద్దాడని మహాభారతం చెబుతుంది. ఆయన ప్రవర్తన బ్రహ్మ జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. కృపాచార్యునికి రాగద్వేషాలు లేవు. ఆయన ద్వంద్వాలకు అతీతుడు. మహాభారతంలో స్వార్థం లేని ఓకే ఒక వ్యక్తి కృపాచార్యుడు. నిగర్వి, నిర్లిప్తుడు, నిర్వికారుడు. బ్రహ్మచారి కనుక భవబంధాలలో చిక్కుకోలేదు. తన బావ గారైన ద్రోణాచార్యునికి భీష్ముడు తన కంటే ఉన్నత పదవి ఇచ్చి గౌరవించినా కృపాచార్యుడు అసూయ పడలేదు. ద్రోణుని పట్ల కాని, భీష్ముని పట్ల కాని ఎప్పుడు అవిధేయత ప్రదర్శించలేదు. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకున్న సందర్భం ఎక్కడా కనిపించదు. హద్దు మీరి ప్రవర్తించడం కాని, మాటలాడటం కాని ఆయన స్వభావం కాదు.

అపురూప సన్నివేశం

కృపాచార్యుని ప్రత్యేకతకు సాక్ష్యంగా నిలిచే అపురూప సన్నివేశం ద్రోణ పర్వంలో దర్శనమిస్తుంది. అశ్వత్థామ మరణించాడన్న వార్త వినగానే ద్రోణుడు యోగమార్గంలో ప్రాణ త్యాగం చేసి జ్యోతి రూపంలో ఆకాశానికి ఎగసి బ్రహ్మ లోకానికి చేరుకున్నాడు అని ధృతరాష్ట్రునికి సంజయుడు తెలిపాడు. అద్భుతమైన ఈ అపురూప సన్నివేశాన్ని తాను, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, కృపాచార్యుడు మాత్రమే దర్శించగలిగినట్లు సంజయుడు వివరించాడు. వ్యాసుని అనుగ్రహంతో భగవద్గీతను స్వయంగా విన్న పుణ్యాత్ముడు సంజయుడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. అర్జునుడు భక్తుడు, శ్రీకృష్ణుని శిష్యుడు. ధర్మానికి ప్రతిరూపం ధర్మరాజు. కనుక వీరు ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించగలిగారు. కృపాచార్యుడు కూడా ఈ దృశ్యాన్ని చూడ గలిగారంటే ఆయన ఎంతటి పుణ్యాత్ముడో అర్థం చేసుకోవచ్చు.

నిస్సంగత్వం

కృపాచార్యుని ఉత్తమ గుణాలలో నిస్సంగత్వం (డిటాచ్ మెంట్) ఒకటి. కౌరవుల ఉప్పు తిన్నందుకు వారి తరపున యుద్ధం చేశాడు. కాని కౌరవుల పాపకృత్యాలను ఎన్నడూ సమర్ధించలేదు. అలాగని వారిని ద్వేషించలేదు. యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. కాని ఎవరి వినాశనాన్ని కోరుకోలేదు. కౌరవ పాండవ వివాదంలో తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా వ్యవహరించాడు. కాని అవసరమైన చోట హితవు చెప్పడం మానలేదు. కర్ణుని మరణానంతరం పాండవులతో ఇకనైనా సంధి చేసుకోమని దుర్యోధనునికి హితవు చెప్పాడు కృపాచార్యుడు. నువ్వు నా హితం కోరి ఈ సలహా ఇచ్చావని కృపాచార్యుని మెచ్చుకున్నప్పటికీ, దుర్యోధనుడు దానిని పాటించలేదు. తన మాటను తిరస్కరించినా కృపాచార్యుడు ఆగ్రహించ లేదు. అర్ధరాత్రి పాండవులపై దాడి చేయాలన్న అశ్వత్థామ పథకాన్ని కృపాచార్యుడు ఆమోదించలేదు. తన మాటను అశ్వత్థామ ఖాతరు చేయకపోయినా కృపాచార్యుడు విచారించలేదు. అంతటి నిర్వికారుడు ఆచార్యుడు.

ముందుచూపు, మాట నేర్పరితనం

ఎంతటి నిర్లిప్తుడైనా ముందు చూపు, మాట నేర్పరితనం కృపాచార్యునిలో పుష్కలంగా ఉన్నాయి. ఉత్తర గోగ్రహణ సమయంలో ఈ విషయం బహిర్గతమవుతుంది. పాండవుల జాడ తెలుసుకోలేక తన గూఢచారులు తిరిగి వచ్చినందుకు దుర్యోధనుడు విచారించాడు. తదుపరి కర్తవ్యం గురించి సభలోని వారిని సలహా అడిగాడు దుర్యోధనుడు. ఆ సమయంలో కృపాచార్యుని సలహా యుక్తియుక్తంగా ఉన్నది. ఇంకా సమర్థులైన గూఢచారులను పంపాలని కృపాచార్యుడు సూచించాడు. అంతేగాక పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కావస్తున్నది. అది పూర్తి కాగానే వారు రాజ్య భాగం అడగవచ్చు. లేదా యుద్ధానికి సిద్ధపడవచ్చు. కనుక మనం ఇప్పటి నుండే బలగాలను సమీకరించుకోవాలని మరో సలహా ఇచ్చాడు కృపాచార్యుడు. పాండవులతో సంధి చేసుకోవడం ఉత్తమమని మరో సూచన కూడా చేశాడు. ఈ సలహాలు అన్ని తదుపరి వ్యూహాలకు చెందినవే. పాండవుల జాడ కనిపెట్టడం నీ తరం కాదనే హెచ్చరిక కూడా కృపాచార్యుని మాటలలో పరోక్షంగా వినిపించింది.

తొలి గురువు

కృపాచార్యుడు తన తండ్రి వద్ద యుద్ద విద్యలు నేర్చుకున్నాడు. కౌరవులకు, పాండవులకు తొలి గురువు కృపాచార్యుడే. పాండవుల మనుమడైన పరీక్షిత్తుకు కూడా గురువు కృపాచార్యుడే కావడం విశేషం. తాతలకు, ముని మనుమనికి కూడా విద్య నేర్పే అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది.

బ్రహ్మజ్ఞానం, సంయమనం, నిర్వికారం మొదలైన సుగుణాల వల్ల కృపాచార్యుడు జీవితంలో ఎన్నడూ పతనం కాలేదు. అభివృద్ధి పథంలో పయనించే వారికి ఈ సుగుణాలు భూషణాలు.