ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులను గత రెండుదశాబ్దాలుగా తన అసాధారణ ఆటతీరు, అపురూప విజయాలు, అనితర సాధ్యమైన రికార్డులు, నమ్మశక్యంకాని గోల్స్ తో ఓలలాడించిన అర్జెంటీనా సమ్మోహక ఆటగాడు లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు అతికష్టం మీద వీడ్కోలు పలికాడు…
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన జనసమ్మోహక క్రీడ ఫుట్ బాల్ లో అర్జెంటీనా ‘మాంత్రికుడు’ లయనల్ మెస్సీ శకం ముగిసింది. గత రెండు ప్రపంచకప్ ( 2022, 2026 ) టోర్నీలలోనూ కేవలం తన అసాధారణ ప్రతిభతో అర్జెంటీనాను ఫైనల్స్ చేర్చడంతో పాటు…ఓసారి విశ్వవిజేతగా నిలిపిన మెస్సీ 39 సంవత్సరాల వయసులో…భారమైన మనసుతో అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి నిష్క్ర్రమిస్తున్నట్లు ప్రకటించడంతో కోట్లాదిమంది అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఫుట్ బాల్ కోసమే పుట్టిన ఆటగాడు…
క్రీడలు ఏవైనా అరుదైన, అసాధారణ క్రీడాకారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలు తలపడే ఫుట్ బాల్ క్రీడను తలచుకోగానే పీలే, గరించా, మారడోనా, ప్లాటిని, జినేదిన్ జిదాన్ , రోనాల్డినో, రొనాల్డో, మారియో కాంపెస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ఆ పరంపరలో భాగంగా అర్జెంటీనాలోని ఓ నిరుపేద కుటుంబం నుంచి ప్రపంచ ఫుట్ బాల్ లోకి దూసుకొచ్చిన మొనగాడే లయనల్ మెస్సీ. తన పాసింగ్ నైపుణ్యానికి వేగాన్ని, సమయస్ఫూర్తిని జోడించి ప్రత్యర్థి ఆటగాళ్లు, గోల్ కీపర్లను బోల్తా కొట్టించి కళ్లు చెదిరే గోల్స్ సాధించడంలో మెస్సీకి మెస్సీ మాత్రమే సాటి. ప్రత్యర్థి జట్లను మాత్రమే కాదు…ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సైతం తన ఆటతీరుతో మంత్రముగ్దులిని చేస్తూ వచ్చిన మెస్సీ నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘనతలు అన్నీఇన్నీకావు. గత రెండుదశాబ్దాల అంతర్జాతీయ ఫుట్ బాల్ ను చూస్తే మనకు కేవలం ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు మాత్రమే కనిపిస్తారు. వారిలో పోర్చుగీసు థండర్ క్రిస్టియానో రొనాల్డో ను మించిన మొనగాడు ఎవరంటే అర్జెంటీనా వండర్ లయనల్ మెస్సీ అని మాత్రమే చెప్పాలి.
అర్జెంటీనాకు అరుదైన ప్రపంచకప్…
ఫుట్ బాల్ మైదానంలో పాదరసంలా కదులుతూ, ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించడం ద్వారా మెరుపుగోల్స్ సాధించడమే కాదు…సహ ఆటగాళ్లు గోల్స్ చేయటానికి తగిన అవకాశాలు కల్పించడంలో మెస్సీకి మెస్సీ మాత్రమే సాటి. అంతేకాదు… స్పాట్ కిక్ లు, పెనాల్టీలను గోల్సుగా మలచడంలో మెస్సీ ప్రతిభ అపారం, అపూర్వం కూడా. అర్జెంటీనా సాకర్ దిగ్గజాలు మారియో కాంపెస్, డియాగో మారడోనాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మెస్సీ తన జాతీయజట్టుకే ఆయువుపట్టుగా నిలిచాడు. కేవలం తన ప్రతిభతోనే 2022 పీఫా ప్రపంచకప్ ను తొలిసారి అందించాడు. మారడోనా తరువాత అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన ఘనత కేవలం మెస్సీకి మాత్రమే దక్కుతుంది. 2026 పీఫా ప్రపంచకప్ లో సైతం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలిచిన తన జట్టును ఫైనల్స్ కు చేర్చినా… విజేతగా నిలుపలేకపోయాడు. అర్జెంటీనాను వరుసగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్ కు చేర్చిన రికార్డుతో పాటు 2022లో విజేతగాను, 2026లో రన్నరప్ గాను నిలపడం ద్వారా ఫుట్ బాల్ ఆటగాడిగా తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలిగాడు. 2005 నుంచి 2026 వరకూ అర్జెంటీనాకు 207 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 125 గోల్స్ సాధించాడు. దక్షిణ అమెరికా ఫుట్ బాల్ చాంపియన్లకు ఇచ్చే ‘కోపా’ అమెరికా కప్ ను సైతం… చిరకాల ప్రత్యర్థి బ్రెజిల్ ను ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అర్జెంటీనాకు ఒక మెగా టైటిల్‌ను అందివ్వడంలో మెస్సీ ప్రధానపాత్ర పోషించాడు.
రెండుసార్లు గోల్డెన్ బాల్ …
ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో అత్యుత్తమ, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డును ఒకటి కాదు…రెండుసార్లు అందుకున్నాడు. గతంలో ఇదే ఘనత సాధించిన దిగ్గజ ఆటగాళ్లు పీలే, మారడోనాల సరసన నిలిచాడు. 2014 ప్రపంచకప్ లో తొలిసారిగా గోల్డెన్ బాల్ అవార్డుకు ఎంపికైన మెస్సీ…ఆ తర్వాత ఎనిమిదేళ్లకు రెండోసారి అదే ఘనత సాధించగలిగాడు. ఖతర్ వేదికగా జరిగిన 2022 ప్రపంచకప్ లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలపడంతో పాటు గోల్డెన్ బాల్ అవార్డును సైతం కైవసం చేసుకోగలిగాడు. అర్జెంటీనా మూడోసారి ప్రపంచ టైటిల్ అందుకోవడంలో తనవంతు పాత్ర నిర్వర్తించాడు. అర్జెంటీనా తరపున ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన తొలి అర్జెంటీనా ప్లేయర్ గా లయనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఐదు ( 2006, 2014, 2018, 2022, 2026 ) ప్రపంచకప్ టోర్నీలలో తన దేశం తరపున గోల్స్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్ గా అవతరించాడు.
రికార్డులే రికార్డులు…
సబ్- జూనియర్ స్థాయిలోనే అర్జెంటీనాకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన మెస్సీ…ఓ అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా నిలదొక్కుకోడానికి పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. నాణ్యమైన ఫుట్ బాల్ బూట్లు కొనే స్థోమతు లేని కుటుంబం నుంచి వచ్చి…వేలకోట్ల రూపాయల ఆర్జనతో పేదరికానికే సవాలు విసిరాడు. క్లబ్ స్థాయి ఫుట్ బాల్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు సంపాదించిన మెస్సీ…దశాబ్దకాలం పాటు అర్జెంటీనాకు వెన్నెముకగా నిలిచాడు. మెస్సీ లేని అర్జెంటీనాను ఊహించలేమన్న స్థితికి ఎదిగాడు. సాకర్ దిగ్గజం , బ్రెజీలియన్ ఆల్ టైమ్ గ్రేట్ పీలే, సమకాలీన ఫుట్ బాల్ లో మేటి క్రిస్టియానో రొనాల్డో పేర్లతో ఉన్న పలు అరుదైన రికార్డులను సైతం మెస్సీ తిరగరాయటం ద్వారా చరిత్ర సృష్టించాడు. యూరోపియన్ సాకర్ లా లీగాలో బార్సిలోనా క్లబ్ కు ఆడుతున్న మెస్సీ ఇప్పటి వరకూ పోర్చుగల్ స్ట్ర్రయికర్ క్రిస్టియనో రొనాల్డోతో కలసి పంచుకొన్న రికార్డును అధిగమించాడు. 35 సార్లు హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ద్వారా రొనాల్డో పేరుతో ఉన్న 34 హ్యాట్రిక్ ల రికార్డును తెరమరుగు చేశాడు. అంతేకాదు…గత 14సీజన్లుగా యూరోపియన్ సాకర్ లీగ్ లో సీజన్ కు పదికి పైగా గోల్స్ చొప్పున సాధిస్తూ వచ్చిన ఏకైక ఆటగాడు మెస్సీ మాత్రమే కావడం విశేషం.
1000 మ్యాచ్ ల్లో 789 గోల్స్…
2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో జరిగిన పోటీ ద్వారా బరిలోకి దిగిన మెస్సీ తన కెరియర్ లో 1000వ మ్యాచ్ ఆడటం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. అర్జెంటీనా జట్టులో సభ్యుడిగా మాత్రమే కాదు…లీగ్ ఫుట్ బాల్ లో వివిధ క్లబ్ లకు ప్రాతినిథ్యం వహించడం ద్వారా మెస్సీ వెయ్యిమ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ లో గత పుష్కరకాలంగా అత్యుత్తమంగా రాణిస్తూ వస్తున్న లయనల్ మెస్సీ ప్రస్తుత ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ వరకూ ఆడిన మొత్తం 1000 మ్యాచ్ ల్లో 789 గోల్స్ సాధించాడు.
అవార్డుల మొనగాడు …
ప్రపంచ అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్లకు ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ’ బాలెన్ డీ ఓర్ ’ అవార్డును మెస్సీ ఏడోసారి సాధించి వారేవ్వా అనిపించుకొన్నాడు. 34 సంవత్సరాల వయసులో ఈ పురస్కారాన్ని అందుకోడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ అవార్డు కోసం వివిధజట్లకు చెందిన మొత్తం 30 మంది విఖ్యాత ఆటగాళ్లు తలపడగా… రాబర్ట్ లెవాండోస్కీ, జోర్గిన్హో లాంటి మేటి స్టార్లను అధిగమించి మెస్సీనే విజేతగా నిలిచాడు. గతంలో 2009, 2010,2011, 2012,2015, 2019 సీజన్లలో ప్రపంచ అత్యుత్తమ సాకర్ ప్లేయర్ అవార్డులను అందుకొన్న ఘనత మెస్సీకి ఉంది. బార్సిలోనా క్లబ్ తరపున ఆడిన మెస్సీ 48 మ్యాచ్‌ల్లో 38 గోల్స్ సాధించాడు. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటగాడిగా స్పానిష్ క్లబ్ జట్టు బార్సిలోనాను యూరోపియన్ అగ్రశ్రేణిజట్లలో ఒకటిగా నిలిపాడు. ఒకే క్లబ్ తరపున అత్యధికంగా 643 గోల్స్ సాధించిన బ్రెజిల్ దిగ్గజం పీలే రికార్డును మెస్సీ అధిగమించాడు. 1956-1974 మధ్యకాలంలో సాంటోస్ క్లబ్ కు ఆడిన పీలే మొత్తం 757 మ్యాచ్ ల్లో 643 గోల్స్ నమోదు చేస్తే…బార్సిలోనా క్లబ్ కు ఆడిన మెస్సీ 749వ మ్యాచ్ ఆడుతూ తన 644వ గోలు నమోదు చేయడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు.
ఏడాదికి వెయ్యి కోట్లు…
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యధిక ఆర్జన, భారీ కాంట్రాక్టు అందుకొన్న ఆటగాడి ఘనతను సైతం మెస్సీ సొంతం చేసుకొన్నాడు. ప్రొఫెషనల్ క్రీడాచరిత్రలోనే అత్యంత భారీ కాంట్రాక్టు అందుకొన్నఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. వందకోట్లు, రెండు వందల కోట్లు కాదు…ఏకంగా 4వేల 920 కోట్లరూపాయల కాంట్రాక్టు అందుకొని తనకుతానే సాటిగా నిలిచాడు. మొత్తం నాలుగు సీజన్లకు కలిపి మెస్సీకి బార్సిలోనా క్లబ్ రికార్డుస్థాయిలో 55,52,37,619 యూరోల మొత్తాన్ని చెల్లించింది. ఈ కాంట్రాక్టు మన రూపాయలలో.4 వేల 920 కోట్లకు సమానం. అయితే…బార్సిలోనా క్లబ్ తో తన రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని ప్రస్తుతం పారిస్ లోని పారిస్ సెయింట్ జర్మెయిన్(పీఎస్‌జీ) జట్టుకు మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇన్ స్టా పోస్టుకు 90కోట్లు…!
లయనల్ మెస్సీ సాకర్ ఆట ద్వారా మాత్రమే కాదు…సోషల్ మీడియా ద్వారాను కళ్లు చెదిరే మొత్తం ఆర్జిస్తున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో ఒక్కోబ్రాండెడ్ పోస్టింగ్ కు 90 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా తమను గుడ్డిగా ఆరాధించి, అభిమానించే ఫ్యాన్స్ అభిమానాన్ని సైతం సొమ్ము చేసుకోడంలో మెస్సీ సఫలమయ్యాడు. ఖతర్ వేదికగా జరిగిన 2022 ఫిఫా ప్రపంచకప్ పుట్ బాల్ టోర్నీలో కెప్టెన్ గా అర్జెంటీనాకు ట్రోఫీ అందించడంతో మెస్సీ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా మెస్సీని అనుసరించే అభిమానుల సంఖ్య సైతం రాత్రికి రాత్రే పెరిగిపోయింది. ఇప్పటి వరకూ సోషల్ మీడియా రారాజుగా వెలుగొందుతూ వచ్చిన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను ప్రపంచకప్ విజయం ద్వారా మెస్సీ అధిగమించాడు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా మెస్సీని అనుసరించేవారి సంఖ్య ఒక్కసారిగా 4 కోట్లకు పెరిగిపోయింది. గతంలో టీవీలు, ఆన్ లైన్ ద్వారా తనను అనుసరించే అభిమానులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్న రొనాల్డోను మెస్సీ 2022 ప్రపంచకప్ విజయంతో మించిపోయాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెస్సీ ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్లు దాటిపోయింది. ప్రపంచకప్ ఫైనల్ సమయంలో మెస్సీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆదివారం ఒక్కరోజే మెస్సీని సరికొత్తగా అనుసరించేవారి సంఖ్య 50 లక్షల సంఖ్యను దాటిపోయింది. ఆ తర్వాతి 30 రోజుల్లో మెస్సీని రోజుకు 2 కోట్ల మంది సోషల్ మీడియా ద్వారా అనుసరిస్తూ రావడం ఓ రికార్డు.
పీఎస్జీ కాంట్రాక్టుతో మరింతగా…
యూరోపియన్ క్లబ్ లీగ్ లో 18 సీజన్లపాటు బార్సిలోనా క్లబ్ కు ఆడిన మెస్సీ పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ లో చేరడంతో సరికొత్తగా 2కోట్ల మంది ఫాలోవర్లు వచ్చి మెస్సీ పక్షాన చేరారు. ప్రపంచకప్ విజయం అనంతరం మెస్సీ అందుకొన్న ఫిఫాకప్ తో ఓ ఫోటోను…వరల్డ్ చాంపియన్స్ అంటూ స్పానిష్ లో టాగ్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకొన్నాడు. ఈ పోస్ట్ కు 48 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మొదటి 20 గంటల్లో 48 మిలియన్లుగా ఉన్న లైక్ ల సంఖ్య ఆ తర్వాత మరింతగా పెరిగిపోయింది. 2019 లో ఎగ్ పేరుతో షేర్ చేసిన ఓ ఫోటోకు 56 మిలియన్ల లైక్ లు వచ్చాయి. లూయి వ్యూటన్ బ్రాండ్ ప్రచారం కోసం మెస్సీ- రొనాల్డో కలసి చెస్ ఆడుతూ గత నెలలో పంచిన చిత్రానికి సైతం విపరీతమైన లైక్ లు వచ్చాయి. ఈ చిత్రాన్ని రొనాల్డో షేర్ చేస్తే 42 మిలియన్ లైక్ లు రాగా…మెస్సీ షేర్ చేసిన సమయంలో 32 మిలియన్ లైక్ లు మాత్రమే రావడం విశేషం.
కోట్ల రూపాయలుగా మారుతున్న అభిమానం…
క్రీడారంగంలో ఎండార్స్ మెంట్ల ద్వారా అత్యధికంగా 127 మిలియన్ డాలర్లను లెబ్రాన్ జేమ్స్ ఆర్జిస్తుండగా…లయనల్ మెస్సీ 122 మిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం అడిడాస్, బుడ్ వీజెర్, మాస్టర్ కార్డ్, పెప్సీకో, సోషియాలకు ప్రచారకర్తగా మెస్సీ వ్యవహరిస్తున్నాడు. ఫుట్ బాల్ స్టార్ గా వందల కోట్ల రూపాయల వార్షిక కాంట్రాక్టుతో పాటు… సోషల్ మీడియా ద్వారా రెండు చేతులా ఆర్జిస్తూ వేలకోట్ల రూపాయల సంపదను కూడగట్టుకోగలుగుతున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో ఒక్కో బ్రాండెడ్ పోస్టింగ్ ఉంచినందుకు లయనల్ మెస్సీ మన రూపాయలలో అక్షరాల 90 కోట్లకు పైనే వసూలు చేస్తున్నాడు. 16 సంవత్సరాల చిరుప్రాయంలో తన తొలి ప్రపంచకప్ ఆడిన మెస్సీ 39 సంవత్సరాల వయసులో ఆరో ప్రపంచకప్ ఆడుతూ… ఆఖరి రెండు ప్రయత్నాలలో విన్నర్, రన్నరప్ ట్రోఫీలు అందుకోగలిగాడు. మెస్సీ కేవలం వివిధ గ్లోబల్ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఏడాదికి 50 మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నాడు. ఫుట్ బాల్ చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప దిగ్గజ ఆటగాళ్లున్నా… లయనల్ మెస్సీది ఓ అరుదైన ఘనత. ఆటకు మెస్సీ వీడ్కోలు పలికినా… ఫుట్ బాల్ ఉన్నంతకాలం చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడిగా మిగిలిపోతాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను తన ఆటతీరుతో సమ్మోహన పరుస్తూ వచ్చిన మెస్సీ రిటైర్మెంట్ జీవితం ఫుట్ బాల్ కు మేలు చేసేదిగా సాగిపోవాలని కోరుకొందాం.!

