ఆంగ్ల సాహిత్యంలోనే కాక ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన అత్యుత్తమ సాహితీవేత్త విలియం షేక్‌స్పియర్. నటుడిగా, నాటక రచయితగా, కవిగా, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంగ్లాండ్ జాతీయ కవిగా, ‘బార్డ్ ఆఫ్ అవెన్’ అని గౌరవంగా ఆయనను పిలుస్తారు. అవెన్ అనే దానిని నదీ ప్రాంతపు కవిగా, ప్రతిభాశాలిగా ఆయనకు ఇచ్చిన బిరుదుగా భావించవచ్చు. నేటికీ ఆయన రాసిన నాటకాలు ప్రపంచ ఆర్ట్ థియేటర్స్ లో ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. 16వ శతాబ్ది కాలం నాటి నాటకాలు నేటికీ పాఠకుల మన్ననలు పొందుతూ, కళాశాలల్లో పాఠ్యాంశాలుగా వస్తున్నాయి.

విలియం షేక్‌స్పియర్ 1564 ఏప్రిల్ 23 న ఇంగ్లాండ్ లోని అవెన్ నదీతీరంలో ఉన్న ‘స్ట్రాట్ ఫోర్డ్ -అపాన్-అవెన్’ అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి జాన్ షేక్‌స్పియర్ తోలు గ్లోవ్స్ వ్యాపారం చేస్తూ, టౌన్ మేయర్ గా పని చేశారు. తల్లి మేరీ ఆర్డెన్ ఒక సంపన్న రైతు కుటుంబానికి చెందిన మహిళ.

షేక్‌స్పియర్ స్థానిక ‘కింగ్ ఎడ్వర్డ్ VI న్యూ స్కూల్’ లో లాటిన్, గ్రీక్, రోమన్ భాషల క్లాసికల్ సాహిత్యం చదివాడు. కాని ఆయన ఏ యూనివర్సిటీలోను ఉన్నత విద్యను అభ్యసించలేదు.

1582 లో 18 ఏళ్ల వయసులో షేక్‌స్పియర్ తన కంటే 8 ఏళ్లు పెద్దదైన ‘అన్నేహాత్వే’ ని వివాహం చేసుకున్నారు. వారికి ‘సుసానా’ అనే కుమార్తె, తర్వాత హామ్నెట్, జుడిత్ అనే కవలలు పుట్టారు. 11 ఏళ్ల వయసులో కొడుకు చనిపోయాడు. బహుశా ఈ సంసారిక ఒడిదుడుకుల జీవితం వల్ల ఆయన బయటకు రాకపోవడంతోనేమో, 1585 నుండి 1592 మధ్యలో ఆయన గురించిన చారిత్రక సమాచారం లేదు. ఆ కాలాన్ని చరిత్రకారులు ‘ది లాస్ట్ ఇయర్స్’ అన్నారు.

కొన్ని ఆసక్తి కల కథనాల ప్రకారం షేక్‌స్పియర్, భూస్వామి సర్ థామస్ లూసీకి చెందిన ఎస్టేట్ లో దొంగతనంగా జింకలను వేటాడాడని, అది బయట పడడంతో, ఒకవేళ న్యాయస్థానం వేసే శిక్షను తప్పించుకోవడానికని ఊరు విడిచి, లండన్ పారిపోయాడని, దారిలో కలిసిన ఒక నాటక సమాజంతో ప్రయాణించాడని కొందరి భావన. ప్రారంభంలో, లండన్ లోని నాటక థియేటర్ ల వద్ద నాటకం చూడటానికి వచ్చే, ప్రేక్షకులైన ధనికుల, ‘గుర్రాల కాపలా కాసే’ పనిని చేసేవాడని, అలా నెమ్మదిగా నాటకరంగంలో ప్రవేశించాడన్న కథ మాత్రం కొద్దిగా నమ్మశక్యంగా ఉంది. ఏది ఏమైనా ఆ ఏడు ఏళ్ల అజ్ఞాత కాలంలో ఒక మామూలు మనిషి నుంచి గొప్ప సాహిత్యవేత్తగా షేక్‌స్పియర్ ఎదిగాడు.

1590 లండన్ లో తొలిదశ నాటకరంగ ప్రయాణంలో అనేక తీవ్ర సమస్యలను, ఆటుపోట్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాడు. ఆ రోజుల్లో లండన్ నాటకరంగాన్ని కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న మేధావులు శాసిస్తూ ఉండేవారు. సామాన్యుడు, విశ్వవిద్యాలయ చదువులేనివాడైన షేక్‌స్పియర్ మేధావులకు నచ్చలేదు. “ఒక అనామక కాకి ఇతరుల ఈకలతో అందంగా కనపడాలని చూస్తోంది”, అని ప్రముఖ రచయిత రాబర్ట్ గ్రీన్ ఒక కరపత్రంలో షేక్‌స్పియర్ ని అవహేళన చేస్తూ రాశాడు.

1592-1594 మధ్య కాలంలో లండన్ లో ప్లేగు వ్యాధి సోకడంతో ధియేటర్లు మూతపడి సంపాదన లేక షేక్స్పియర్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడు నాటకాలు నిలుపుదల చేసి వీనస్ అండ్ అడోనిస్ లాంటి సానెట్లు, సుదీర్ఘ కవితలు రాయడం మొదలు పెట్టాడు ఆయన. 16 వ శతాబ్దిలో ఎలిజబెథన్ కాలంలో నాటకాలలో స్త్రీ పాత్రలను, స్త్రీలు ధరించడం నిషేధం. అందుకే 12-15 ఏళ్ల మగ పిల్లల చేత ఆ వేషాలను వేయించేవారు. అప్పట్లో ఆయన వేరే వారితో కలిసి ‘గ్లోబ్ ధియేటర్’ నాటక రంగస్థలాన్ని థేమ్స్ నది ఒడ్డున నిర్మించారు. దాని పై భాగం చాలా వరకు తెరిచి ఉంటుంది. అందుకని లోపల ప్రేక్షకుల ఈలలు, తాగి మాట్లాడే వారి మాటలు, బయట వాహనాల మోతలతో ధ్వని కాలుష్యం వల్ల, ఆ రోజుల్లో మైకులు, స్పీకర్ లు లేని కారణంగా నటులు గట్టిగా అరవవరసి వచ్చేది. అయినా ప్రేక్షకులు కేరింతలు కొడుతూ చూసేవారు.

‘గ్లోబ్ థియేటర్’ గురించి కూడా ఆసక్తి కల కథనాలు ఉన్నాయి. షేక్‌స్పియర్ డ్రామా కంపెనీ మొదట ‘ది థియేటర్’ అనే వేదికపై నాటకాలు వేసేవారు. కాని ఆ స్థలం లీజు విషయంలో యజమానితో పేచీ వచ్చి, లీజు గడువు లోపల స్థలం ఖాళీ చేయాల్సిందేనని ఆయన గట్టిగా పట్టుపట్టాడు. వెంటనే షేక్‌స్పియర్, ఆ యజమాని ఊళ్లో లేని సమయం చూసి, రాత్రికి రాత్రే, ఆయన, నటుల బృందం కొంతమంది వడ్రంగుల సహాయంతో విపరీతమైన చలిని కూడా లెక్క చేయకుండా, థియటర్ కట్టడాన్ని చెక్కలు, దూలపు మొద్దులను వేటికవి విడదీసి థేమ్స్ నది అవతల ఒడ్డుకు చేర్చారు. ఆ పాత చెక్కలతో 1599 లో గ్లోబ్ థియేటర్ నిర్మించారు.

ఆ థియేటర్ నిర్మాణం వల్ల ఆయనకు విపరీతమైన సంపద, సమాజంలో గౌరవ, హోదాలు పెరిగాయి. గ్లోబ్ థియేటర్ ఇరవై కోణాలు కలిగి ఉంది. 1613లో ఒకసారి, ఇంకోసారి 1642లో నాటక ప్రదర్శన జరుగుతూ ఉండగా, ఒక సన్నివేశంలో ఫిరంగిని పేల్చగా వచ్చిన నిప్పు రవ్వలతో థియేటర్ మొత్తం కాలి బూడిదైంది. షేక్‌స్పియర్ చనిపోయాక ఆ థియేటర్‌ని అధికారంలో ఉన్న ప్యూరిటన్లు శాశ్వతంగా మూయించారు.

తర్వాత 1997లో పాత దానికి అతి సమీపంలో ‘షేక్‌స్పియర్ గ్లోబ్ థియేటర్’, పాత నమూనాతో ఆయన జ్ఞాపకార్థం నిర్మించారు. ఇప్పుడు నిత్యం వేలాది పర్యాటకులు ఆ థియేటర్ ని, ఆయన నాటకాలను, తప్పకుండా వీక్షిస్తూ ఉంటారు.

ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని విమర్శించే నాటకాలను నిషేధించేవారు. దానికి మాస్టర్ ఆఫ్ రెవల్స్ అని ప్రత్యేక అధికారిని నియమించి, అలాంటి వారికి కఠిన శిక్షలు విధించేవారు.

షేక్‌స్పియర్ నాటకం - రిచర్డ్

ఆయన కెరీర్ లో రిచర్డ్ నవల ప్రమాదకర వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఎలిజబత్ రాణిని సింహాసనం నుండి దింపడానికి ‘అర్ల్ ఆఫ్ ఎసెక్స్’ ప్రభువు కుట్ర పన్నే సన్నివేశం ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రభువు తిరుగుబాటు విఫలమై అతనికి మరణశిక్ష పడింది. షేక్‌స్పియర్ ను కూడా విచారించగా, మేం డబ్బు కోసం చేశాం, కుట్రతో సంబంధం లేదని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డాడు. వెంటనే ఆ సన్నివేశాన్ని నిషేధించారు. అలాగే, కింగ్ లియర్ నాటకంలో, జార్జ్ III నిజంగా పిచ్చివాడు కావడంతో, రాజును అవమానించేలా ఉందని, పూర్తిగా నిషేధించారు.

ఆయన చనిపోయాక నిషేధాన్ని అప్పటి ప్రభుత్వం తొలగించింది. అలాగే, మేక్ బెత్ లో, జేమ్స I రాజుగా ఉన్నప్పుడు, నాటకంలో చూపించిన చేతబడులు, మంత్రాల సన్నివేశాలు రాజుకు నచ్చకపోవడంతో ఆ నాటకాన్ని ఐదేళ్లు నిషేధించారు.

ఇలా ఎన్నో ప్రయాసలకోర్చి షేక్‌స్పియర్ మెుత్తం 38 నాటకాలు, 154 సానెట్ (14లైన్ల పద్యాలు) వ్రాశారు. నాటకాలు డైలాగ్స్ రూపంలో వుంటే దానికి కొంత చిత్తుప్రతి రూపంలో మధ్య వివరణ ఆయన స్నేహితులు చేసి ముద్రించి ‘ఫస్ట్ ఫోలియో’ గా ప్రచురించారు. ఇక సానెట్లు ప్రేమ, కాలం, మరణం ప్రకృతి, ఇంకా మానవీయ కోణాలను స్పృశిస్తూ వ్రాసే హృద్యంగా వుండే లయ బద్ధమైన కవితలు.

హ్యామ్లెట్ నాటకంలోని ఒక ఆదరణ పొందిన వాక్యం (“To be, or not to be, that is question”) జీవించాలా లేక మరణించాలా, ఇదీ ప్రశ్న. మనిషి తీవ్ర మానసిక క్షోభకు గురైనపుడు మనిషి వేసుకునే ప్రశ్న ఇది. ఇది ఆయన రాసిన ప్రసిద్ధ వాక్యం.

యాజ్ యు లైక్ ఇట్ నాటకంలో, (“All the World is a stage, and all the men and women merely players”) ఈ ప్రపంచం ఒక నాటక రంగస్థలం, ఇక్కడ పురుషులు, స్త్రీలు కేవలం నటులు మాత్రమే. కాబట్టి అంతా మనమే చేస్తున్నామనే భ్రమపడకు, మనమంతా మన పాత్రలను పోషించి వెళ్లిపోయే నటులం మాత్రమే, జీవన సత్యాన్ని తెలిపే వాక్యం.

జూలియస్ సీజర్

ఈ నాటకంలో (“Cowards die many times before their deaths, the valiant never taste of death, but once”) పిరికివాళ్లు అసలు చనిపోక ముందే చాలాసార్లు చస్తారు, ధైర్యవంతులు, జీవితంలో ఒకసారే మరణాన్ని రుచి చూస్తారు.

రోమియో అండ్ జూలియట్ నాటకంలో, (“What is in a name? That which we call a rose by another name would smell as sweet”) పేరులో ఏముంది గులాబీని ఏ పేరుతో పిలిచినా దాని సువాసన మారదు కదా, వ్యక్తుల గుణగణాలు ముఖ్యం కానీ, పేర్లు, కులాలు కాదు అని జూలియట్ చెప్పిన డైలాగ్ ఇది.

“ఎ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్ నాటకంలో (“The course of true love never did run smooth”) నిజమైన ప్రేమ, సాఫీగా సాగదు. అంటే ప్రేమ ప్రయాణంలో అడ్డంకులు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని మనం సమర్థవంతంగా దాటగలగాలి.

సానెట్ కవితలో (“Thou art thy mother’s glass and she in thee”) ఒక అందమైన యువకుని ఉద్దేశించి రాసినది. నీవు నీ తల్లికి అద్దంలాంటి వాడివి. నిన్ను చూసినపుడు ఆమె తన యవ్వన కాలాన్ని గుర్తుకి తెచ్చుకుంటుంది. నీవు పెళ్లి చేసుకోకుండా నీ అందాన్ని నీతో ముగించకు నీలాంటి ఇంకో అందమైన రూపాన్ని సృష్టించే సమయం ఆసన్నమైనది.

మరో కవితలో వాక్యం (“Shall I compare thee to a summer”s day? Thou are more lovely and more temperate”) నిన్ను ఆహ్లాదకరమైన వేసవి రోజుతో పోల్చనా?, కానీ నువ్వు ఆ వేసవి రోజు కంటే అందమైన దానివి. ఇంగ్లాండ్, చలి దేశం కనుక వేసవి కాలం అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే ప్రియురాలిని షేక్‌స్పియర్ వేసవి రోజుతో పోల్చాడు.

మరో ప్రముఖ కవిత సానెట్ 116లో (“Love alters not with his brief hours and weeks, but bears it out even to the edge of doom”) నిజమైన ప్రేమ అనేది రోజులు, వారాలు మారినంత మాత్రాన మారిపోదు. అది ప్రపంచం లేదా సృష్టి అంతమయ్యే వరకు స్థిరంగా నిలిచి ఉంటుంది. కాలంతో పాటు మారనిదే నిజమైన ప్రేమ అని ఆయన కవిగా నిర్వచించాడు. ఇవన్నీ 5 శతాబ్దాల ముందు రాసిన మూల పురుషుడు షేక్‌స్పియర్.

ఆయన రాసిన నాటకాలలో 17 సుఖాంతాలు, 10 విషాదాంతాలు, చారిత్రక నాటకాలు. ఇంగ్లాండ్ రాజుల నిజ జీవితాలకు సంబంధించినవి 10 లేదా 11 ఉన్నాయి.

ఆ కాలంలో బ్రిటీష్, గ్రీకు, రోమన్ చరిత్రలకు ఆధారాలు అందుబాటులో లేనప్పుడు, షేక్‌స్పియర్ నాటకాలు కొంతవరకు ఆధారాలుగా నిలిచాయి.

ఆయన చివరి రచనలు, తాను ఒక్కడే రాసిన నాటకం ‘ది టెంపెస్ట్’ (1611) ఈ నాటకంలో ముఖ్య పాత్ర తన శక్తులను వదిలేసి సెలవు తీసుకుంటుంది. ఇది షేక్‌స్పియర్ నాటకరంగానికి స్వయంగా పలికిన వీడ్కోలుగా విమర్శకులు భావించారు. ఇదిగాక జాన్ ఫ్లెచర్ అనే యువ రచయితతో కలిసి ‘హెన్రీ VIII’, ‘ది టూ నోబుల్ కిన్స్ మెన్’, మూడవది ‘కార్డెనియో’ రచించారు. చివరిది కాలగర్భంలో కలసి పోయిన రచన, ప్రస్తుతం లభించడం లేదు.

విలియం షేక్‌స్పియర్ 1616 ఏప్రిల్ 23 న సరిగ్గా తాను పుట్టిన రోజున 52 వ ఏట తన స్వంత ఊరులో తీవ్ర జ్వరంతో బాధపడుతూ మరణించాడు. ఆయన స్నేహితులు ఆయన రచలను సేకరించి ‘ఫస్ట్ ఫోలియో’ పేర ముద్రించి ప్రపంచానికి అందించారు. అందుకే షేక్‌స్పియర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఆంగ్ల సాహితీ లోకంలో ఇప్పటికీ మెరిస్తున్న ధృవ తార.