మన తెలుగువారి గొప్పదనం మనమే గుర్తించడం లేదనే విమర్శ అధికంగా వినపడుతూ ఉంటుంది. కొంత మంది గొప్ప వాళ్ళను గురించి తలుచుకుంటే ఇది నిజమేననిపిస్తుంది. జాతీయ పతాకం రూపొందించిన పింగళి వెంకయ్య పేరు తెలుగు వారిలోనే చాలా మందికి తెలియదు. స్వాతంత్ర్య దినోత్సవంనాడు కోట్లాది మంది జాతీయ పతాకానికి వందనం చేస్తారు. కాని ఆ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారిని తలుచుకునే వారెందరు ? ‌ అదే కోవకు చెందిన వ్యక్తి భమిడిపాటి రాధాకృష్ణ.

గణిత శాస్త్రవేత్తగా, జ్యోతిష్య వేత్తగా రాధాకృష్ణ చేసిన కృషి, పరిశోధనలు అసాధారణమైనవి. విదేశాలలో ఆవిర్భవించిన ఇంగ్లీషు క్యాలెండర్ పై తెలుగువాడైన రాధాకృష్ణ చేసిన పరిశోధన అంతర్జాతీయ స్థాయికి చెందినది. ప్రపంచంలో హిందూ క్యాలెండర్, ముస్లిం క్యాలెండర్, చైనీస్ క్యాలెండర్, జ్యూయిస్ క్యాలెండర్ మొదలైనవి ఎన్నో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ క్యాలెండర్ అనేక శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నది. అటువంటి క్యాలెండర్ ను అధ్యయనం చేసి భమిడిపాటి రూల్ ను, భమిడిపాటి క్యాలెండర్ ను రూపొందించడం ఆయన గొప్పదనం. వీటిని అర్థం చేసుకోవాలంటే క్యాలెండర్ చరిత్రను తెలుసుకోవాలి.

క్యాలెండర్ చరిత్ర

ఈ క్యాలెండర్ క్రీస్తు పూర్వం 45 వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కాలంలో స్థిర రూపం పొందింది. కనుక దీనిని రోమన్ క్యాలెండర్ అని, జూలియస్ క్యాలెండర్ అని కూడా అంటారు.

ఈ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 365 రోజులుగా నిర్ణయించారు. కాని సౌరమానం ప్రకారం సంవత్సరానికి రోజులు 365.25. ‌ దీనిని సవరించడానికి నాలుగేళ్లకు ఒకసారి లీప్ సంవత్సరాన్ని ఏర్పాటు చేశారు. ఈ లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి కి 29 రోజులు, సంవత్సరానికి 366 రోజులు ఉండేలా ఏర్పాటు చేశారు. ఇది ఇలా కొనసాగుతుండగా, క్యాలెండర్ ప్రకారం ఈక్వినాక్స్ (విషు వత్తులు) తేడా రావడంతో దీనిలో సైతం దోషం ఉన్నదని గ్రహించారు. సంవత్సరానికి 365. 25 రోజులుగా గాక 365.2422 రోజులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ తేడా వల్ల నాలుగు వందల సంవత్సరాలకు మూడు రోజులు ఎక్కువగా లెక్కించడం జరిగిందని గ్రహించారు. ఈ లోపాన్ని సవరించడానికి 400 తో నిశ్శేషంగా భావించబడే శతాబ్ది సంవత్సరాన్ని మాత్రమే ఇక మీదట లీప్ సంవత్సరంగా పరిగణించాలని నిర్ణయించారు. అంతవరకు ఉన్న దోషాన్ని సవరించడానికి 1582 అక్టోబర్ క్యాలెండర్ లో పది రోజులు తొలగించారు. అంటే 1582 అక్టోబర్ లో నాలుగవ తేదీ తరువాత 15వ తేదీ వస్తుంది. ఈ సవరణకు కేథలిక్ దేశాలు అంగీకరించాయి. గ్రీక్ చర్చ్, ప్రొటెస్టెంట్ దేశాలు దీనిని అంగీకరించలేదు. 1752లో గ్రేట్ బ్రిటన్ ఈ మార్పును అధికారికంగా ఆమోదించింది. దీని ప్రకారం 1752 సెప్టెంబర్ లో 11 రోజులు తొలగించారు. 1752లో సెప్టెంబర్ 2వ తేదీ తరువాత 14వ తేదీ వచ్చేలా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి దీనికి గ్రెగేరియన్ క్యాలెండర్ అనే పేరు వచ్చింది.

గ్రెగేరియన్ సవరణ తరువాత కూడా క్యాలెండర్ లో చిన్న దోషం మిగిలిపోయిందని గుర్తించారు. దీని ప్రకారం సంవత్సరానికి .0003 రోజు ఎక్కువ వస్తున్నదని గ్రహించారు. అంటే 3333 సంవత్సరాలకు, ఒక రోజు, 10,000 సంవత్సరాలకు మూడు రోజులు అదనంగా వస్తున్నాయని గుర్తించారు. ఈ దోషాన్ని సవరించడానికి 4000 సంవత్సరాన్ని, 8000 సంవత్సరాన్ని నాన్ లీప్ గా గుర్తించాలని కొందరు సూచించారు. కాని ఈ సూచనలలో శాస్త్రీయత, హేతుబద్ధత లోపించాయి.

భమిడిపాటి రూల్

క్రీస్తు శకం 1752లో గ్రెగేరీ సూచనలను పాటించడంతో క్యాలెండర్ లో అప్పటివరకు ఉన్న దోషాలు తొలగిపోయాయి. 1752 సంవత్సరాన్ని ప్రారంభంగా భావిస్తే 3333 సంవత్సరాలకు అంటే 5085 వ సంవత్సరం నాటికి ఒకరోజు అదనంగా వస్తుంది. దీనికి ముందు సంవత్సరం 5084 లీపు సంవత్సరం. కాని 5084 సంవత్సరాన్ని సాధారణ సంవత్సరంగా పరిగణిస్తే ఆ దోషం తొలగిపోతుంది. అంతేగాక ఇంగ్లీషు క్యాలెండర్ అప్డేట్ అయిపోతుందని భమిడిపాటి రాధాకృష్ణ సూచించారు. అంతేగాక 8416 వ సంవత్సరాన్ని, 11,748 వ సంవత్సరాన్ని లీప్ సంవత్సరాలుగా కాకుండా సాధారణ సంవత్సరాలుగా పరిగణిస్తే ఈ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందని రాధాకృష్ణ సూచించారు. ఆయన సూచనలు హేతుబద్ధంగా ఉన్నాయి. 5084 వ సంవత్సరాన్ని, 8416 వ సంవత్సరాన్ని, 11,748 వ సంవత్సరాన్ని సాధారణ సంవత్సరాలుగా పరిగణించాలనే సూత్రానికి భమిడిపాటి రూల్ అని పేరు పెట్టారు. ఇంగ్లీషు క్యాలెండర్ లో దోషాన్ని సవరించడానికి ఇంగ్లీషు వారి కంటే గొప్ప సలహాను ఇచ్చిన భమిడిపాటి రాధాకృష్ణను అంతర్జాతీయ మేధావిగా పేర్కొనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు.

భమిడిపాటి క్యాలెండర్

ఇంగ్లీషు క్యాలెండర్ పై తాను జరిపిన పరిశోధనా అంశాలను భమిడిపాటి క్యాలెండర్ అనే ఆంగ్ల గ్రంథంలో పొందుపరిచారు రాధాకృష్ణ. 70 పేజీల ఈ పుస్తకంలో బి. సి 45 సంవత్సరం నుండి ఎ. డి.5555 సంవత్సరం వరకు అన్ని సంవత్సరాల తేదీలకు వారాలు తెలుసుకోవడానికి పట్టికలను ఇచ్చారు భమిడిపాటి. ఒక చిన్న పుస్తకంలో 6000 సంవత్సరాలకు క్యాలెండర్ ను అందించిన భమిడిపాటి మేధాశక్తి అసాధారణం. అమోఘం.

ఈ పుస్తకం మూడవ సెక్షన్ లో పట్టిక అవసరం లేకుండానే ఏ సంవత్సరంలో ఏ తేదీన ఏ వారం వస్తుందో తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలను ఇచ్చారు భమిడి పాటి. వాటికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఒక చిన్న పుస్తకంలో క్యాలెండర్ కు సంబంధించిన ఇంత విజ్ఞానాన్ని అందించగల సామర్థ్యం భమిడిపాటి రాధాకృష్ణకు మాత్రమే సొంతం. అటువంటి భమిడిపాటి క్యాలెండర్ ను, భమిడిపాటి రూల్ ని ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

జ్యోతిష్య శాస్త్ర పరిశోధనలు

జ్యోతిష్య శాస్త్రంలో సైతం అసాధారణ పరిశోధనలు జరిపారు భమిడిపాటి. నాడీ జ్యోతిష్యంలో జాతక చక్రం ద్వారా జాతకుని పేరు చెప్పే విధానం ఉన్నదని భమిడిపాటి విన్నారు . ఆ విధంగా పేరు తెలుసుకోవడానికి ఆధారమైన సూత్రం ఏమిటో తెలియలేదు. నాడీ జ్యోతిష్య పండితులు చాలామందితో రాధాకృష్ణ చర్చలు జరిపారు. కాని దానికి సంబంధించిన సూత్రం ఏమిటో తెలియలేదు. జాతక చక్రం ద్వారా పేరు తెలుసుకునే మార్గం తెలియలేదు. కనుక ఒక మనిషి పేరు ద్వారా అతను పుట్టిన సమయాన్ని కనుక్కునే విధానాన్ని రాధాకృష్ణ రూపొందించారు. ఈ వివరాలను ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో భమిడిపాటి ఈ వ్యాస రచయుతకు తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో రాధాకృష్ణ చెప్పిన విశేషాలన్నీ స్థానిక ఒక దినపత్రికలో ప్రచురితమయ్యాయి.

భమిడిపాటి జీవిత విశేషాలు

గణిత శాస్త్రంలోనూ జ్యోతిష్య శాస్త్రంలోనూ, సినీ రంగంలోనూ ప్రఖ్యాతి చెందిన రాధాకృష్ణ జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాధాకృష్ణ 14-11-1929 వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఆయన తండ్రి భమిడిపాటి కామేశ్వరరావు నాటక రచయితగా లబ్ద ప్రతిష్టులు. హాస్య ప్రధానమైన రచనలు చేసి ఆయన హాస్యబ్రహ్మగా పేరు పొందారు. కామేశ్వరరావు వి. టి. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడుగాను, ఆ తరువాత ప్రధానోపాధ్యాయుడుగాను పనిచేశారు.

విద్యాభ్యాసం

రాధాకృష్ణ విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగింది. ఆయన బి. ఎస్. సి పట్టా పొందిన తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు చేశారు.

రచనా వ్యాసంగం

రాధాకృష్ణకు రచనా వ్యాసంగం తండ్రి నుంచి వారసత్వంగా లభించింది. ఆయన మూడు నాటకాలను, ఆరు నాటికలను వ్రాశారు. ఆయన వ్రాసిన’ కీర్తిశేషులు’ నాటకం అత్యంత ప్రసిద్ధి పొందింది. ఆ నాటకంలో ఒక పాత్ర ద్వారా నటుడు రావు గోపాల రావు ప్రఖ్యాతి పొందారు. అనంతరం రావు గోపాల రావు సినిమా రంగంలో ప్రవేశించి ‘నట విరాట్’ బిరుదును కూడా పొందారు.

సినీ రంగంలో రాధాకృష్ణ

ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు ప్రోత్సాహంతో రాధాకృష్ణ సినీ రంగంలో ప్రవేశించారు. దాదాపు 100 సినిమాలకు ఆయన కథలు, సంభాషణలు సమకూర్చారు. ఇన్ని రంగాలలో ప్రఖ్యాతి పొందిన రాధాకృష్ణ 2007వ సంవత్సరంలో రాజమండ్రిలో కన్నుమూశారు.

మూడు జాతీయ పండుగలు ఎప్పుడూ ఒకే వారం

మనం ప్రతి సంవత్సరం జరుపుకునే జాతీయ పర్వదినాలలో ముఖ్యమైనవి మూడు. అవి

  1. స్వాతంత్ర్య దినోత్సవం
  2. ఉపాధ్యాయ దినోత్సవం
  3. బాలల దినోత్సవం

ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన, ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5వ తేదీన, బాలల దినోత్సవం నవంబర్ 14వ తేదీన జరుపుకుంటాము. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున స్వాతంత్ర్య దినోత్సవాన్ని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని, జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం.

ప్రతి సంవత్సరం ఈ పర్వదినాలను మనం జరుపుకుంటున్నాము. కాని అవి ఏ వారం వస్తున్నాయో మనం పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ మూడు పర్వదినాలు ఒకే వారం వస్తాయి. ప్రస్తుత సంవత్సరం ఈ మూడు తేదీలు శనివారం నాడు వచ్చాయి. 2025 సంవత్సరంలో ఇవి మూడు శుక్రవారంనాడు వచ్చాయి. లీపు సంవత్సరాలలో సైతం ఈ ఆనవాయితీ కొనసాగుతుంది!!