క్రీడలు వేరు… రాజకీయాలు వేరు. భిన్నమైన ఈ రెండు రంగాలు కలసిపోతే విజయాలు, రికార్డులు, అరుదైన ఘనతలు పక్కకు పోయి వివాదాలు తెరమీదకు వస్తాయి.
భారత క్రీడారంగంలో ప్రస్తుతం ఏ క్రీడను చూసినా ఏమున్నది గర్వకారణం…నిత్యం ఏదో ఒక వివాదం అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. చివరకు జాతీయ క్రీడ హాకీని సైతం ‘జెర్సీరంగు’ వివాదం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది…
ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన భారత్ లో నవతరానికి క్రీడారంగమే ప్రధాన వ్యాపకంగా ఉంటూ వస్తోంది. అత్యంత జనాదరణ పొందిన క్రీడ క్రికెట్ నుంచి జాతీయ క్రీడ హాకీ వరకూ కోట్లాదిమంది అభిమానుల మనోరంజక క్రీడలుగా నీరాజనాలు అందుకుంటున్నాయి. సీజన్లతో సంబంధం లేకుండా టెస్టు, వన్డే, టీ-20 సిరీస్ ల పరంపరతో సాగిపోయే క్రికెట్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. అయితే, వివాదాలకు అతీతంగా సాగిపోయే హాకీ సైతం గత కొద్దిరోజులుగా ఓ అసాధారణ వివాదానికి కేంద్రబిందువుగా ఉంటూ వస్తోంది.
1928 నుంచి 2024 వరకూ…
స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే భారత్ కు మరోపేరుగా నిలుస్తూ వస్తున్న హాకీ క్రీడ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. బ్రిటీష్ సిపాయిల ద్వారా మనదేశంలో అడుగుపెట్టిన హాకీ క్రీడకే భారత్ పర్యాయపదంగా, చిరునామాగా, మరోపేరుగా నిలుస్తూ వస్తోంది. సాంప్రదాయ పచ్చిక మైదానాలలో అంతర్జాతీయ హాకీ పోటీలు జరిగినంతకాలం భారత్ కు ఎదురేలేకపోయింది.
1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ వరకూ జరిగిన హాకీ సమరంలో భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిది బంగారు పతకాలు సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచింది.
భారత హాకీ పితామహుడు మణికట్టు మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్, హార్మిక్ సింగ్, అజిత్ పాల్ సింగ్, గణేశ్, గోవింద, అశోక్ కుమార్, అస్లాం షేర్ ఖాన్, మెర్విన్ ఫెర్నాండేజ్, పర్గత్ సింగ్, దిలీప్ టిర్కే, తోయిబా సింగ్, ముకేశ్ కుమార్, మన్ ప్రీత్ సింగ్, శ్రీజేష్, హార్మన్ ప్రీత్ సింగ్ లాంటి ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్ల అంకితభావం, అసాధారణ ప్రతిభతో భారత హాకీ తన సుసంపన్నమైన వారసత్వాన్ని, విజయపరంపరను కొనసాగిస్తూ వస్తోంది.
1970 దశకం తరువాత అంతర్జాతీయ హాకీలో వచ్చిన పెనుమార్పులతో ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడిన భారత్ పుంజుకుని తన అస్థిత్వాన్ని కాపాడుకున్నతీరు అపూర్వమే అన్నా అతిశయోక్తికాదు. సాంప్రదాయ పచ్చిక మైదానాల స్థానంలో సింథటిక్ (సూపర్ టర్ఫ్, ఆస్ట్ర్రో టర్ఫ్) మైదానాలు రావడంతో యూరోప్, ఆస్ట్ర్రేలియా దేశాల ఆధిపత్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆసియా దిగ్గజాలు భారత్, పాకిస్థాన్ ఆధునిక హాకీని ఒంటపట్టించుకోవడానికి అంతులేని పోరాటమే చేయవలసి వచ్చింది.
41 ఏళ్ల విరామం తరువాత తొలిపతకం…
ఒలింపిక్స్ హాకీలో అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలు గెలుచుకున్న భారత్ 1980 తరువాత మరో పతకం సాధించడానికి నాలుగు దశాబ్దాలపాటు వేచిచూడవలసి వచ్చింది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో చివరిసారిగా స్వర్ణపతకం సాధించిన భారత్ 2022 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సొంతం చేసుకోవడం ద్వారా 41 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. అంతేకాదు…ఆ తరువాత జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో సైతం భారత్ కాంస్య పతకాన్ని నిలుపుకోవడం ద్వారా హాకీలో తన ఒలింపిక్స్ పతకాలను 13కు పెంచుకోగలిగింది.
గత 98 సంవత్సరాల కాలంలో జరిగిన వివిధ ఒలింపిక్స్ లో భారత్ సాధించిన మొత్తం 13 హాకీ పతకాలలో 8 స్వర్ణ, ఒకే ఒక్క రజత, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. మరే ఒలింపిక్ క్రీడలోనూ భారత్ ఇంత భారీసంఖ్యలో బంగారు పతకాలు గెలుచుకోలేకపోయింది.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతూ వస్తోంది. 1975 హాకీ ప్రపంచకప్ లో తొలిసారిగా విశ్వవిజేత టైటిల్ నెగ్గిన భారత్ 2026 ప్రపంచకప్ హాకీలో సైతం తన అదృష్టం పరీక్షించుకోబోతోంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ సమరంలో భారత్ తనకు అచ్చివచ్చిన సాంప్రదాయ నీలిరంగు జెర్సీ( దుస్తుల) లను పక్కనబెట్టి కాషాయరంగు జెర్సీలతో సమరానికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.
'రంగు’లోనే ఉంది అంతా!
ప్రతి అంశాన్ని వివాదాస్పద కోణంలో చూడటం మన వ్యవస్థ ప్రధాన లక్షణంగా మారింది. చివరకు హాకీ సైతం దానికి మినహాయింపు కాలేకపోయింది. దశాబ్దాల తరబడి భారత క్రీడాకారులు, జట్లు అంతర్జాతీయ క్రీడల్లో నీలిరంగు జెర్సీలనే ధరించి పాల్గొంటూ వస్తున్నారు. ఇటీవలే స్కాట్లాండ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందం సైతం నీలిరంగు జెర్సీలనే ఉపయోగించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ తో ముగిసిన వన్డే, టీ-20 సిరీస్ లలో పాల్గొన్న భారత క్రికెట్ జట్టు సభ్యులు సైతం నీలిరంగు దుస్తులనే ధరించారు.
అంతేకాదు,క్రీడలు ఏవైనా వివిధ దేశాల జాతీయ జట్ల క్రీడాకారులు ధరించే దుస్తుల రంగు ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా తమ జాతీయపతాకం రంగులతో కూడిన జెర్సీలనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే…భారత జాతీయ జట్లు మాత్రం స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే జాతీయపతాకంలో లేని నీలిరంగును తమ జెర్సీలుగా ధరిస్తూ వస్తున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ వర్గాలలో నీలిరంగు దుస్తులు ధరించే భారత జట్టును ‘మెన్ ఇన్ బ్లూ’ గా పిలుస్తూ ఉంటారు. జాతీయ జట్లు ధరించే జెర్సీలతో కేవలం క్రీడాకారులకు మాత్రమే కాదు…కోట్లాదిమంది క్రీడాభిమానులకూ భావోద్వేగ అనుబంధం ఉంటుంది. అయితే, భారత జాతీయ హాకీజట్ల జెర్సీలను సాంప్రదాయ నీలిరంగు నుంచి కాషాయరంగుకు హఠాత్తుగా మార్చడం కలకలమే రేపింది. జాతీయహాకీని కాషాయికరణ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సైతం హాకీ జెర్సీల రంగును మార్చడం క్రీడల్లో రాజకీయాలను జొప్పించడమేనంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఎవరి వాదన వారిది…!
ఒలింపిక్స్ లో భారత్ కు రికార్డుస్థాయిలో ఎనిమిది బంగారు పతకాలు అందించిన ఒకే ఒక్క క్రీడ హాకీ. అందుకే హాకీని జాతీయ క్రీడగా చెబుతూ ఉంటారు. అధికారికంగా హాకీ భారత జాతీయక్రీడ కాకున్నాకోట్లాదిమంది క్రీడాభిమానుల దృష్టిలో జాతీయక్రీడగానే కొనసాగుతోంది. ప్రపంచ, ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయక్రీడల స్థాయిలో భారతజట్టు ఏ ఘనత సాధించినా, ఎన్ని పతకాలు గెలుచుకొన్నా నీలిరంగు జెర్సీలను మాత్రమే ధరించి సాధించింది. నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు వేదికగా త్వరలో జరిగే ప్రపంచ పురుషుల, మహిళల హాకీ పోటీలలో పాల్గొనే భారతజట్లు సాంప్రదాయ నీలిరంగు జెర్సీలకు బదులు కాషాయం రంగు జెర్సీలని ధరించి పాల్గొనబోతున్నాయి. జాతీయ హాకీ సమాఖ్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత హాకీ మాజీ కెప్టెన్లు వీరేంద్ర రస్కినా, పర్గత్ సింగ్ తప్పుపడుతున్నారు. భారత హాకీ అంటే సాంప్రదాయ నీలిరంగు జెర్సీలను ధరించిన జట్టు మాత్రమేనని, కాషాయరంగుకు జెర్సీలను మార్చవలసిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడుతున్నారు. హాకీకి సైతం కాషాయరంగు పులుమటాన్ని మించిన విషాదం మరొకటి లేదని భారత హాకీ మాజీ కెప్టెన్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్వే పర్గత్ సింగ్ ప్రశ్నిస్తున్నారు. 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచే భారతజట్టు నీలిరంగు జెర్సీలను ధరిస్తూ వస్తోందని, స్వాతంత్ర్యానంతరమూ ఇదే రంగు జెర్సీల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోందని…అయితే గతంలో ఎన్నడూలేని విధంగా కాషాయరంగుకు జెర్సీలను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ హాకీ ఇండియా పెద్దలను నిలదీస్తున్నారు.
నవీన్ పట్నాయక్ విచారం…
జాతీయ హాకీ పునరుజ్జీవనం కోసం దశాబ్దకాలం పాటు కృషిచేసిన ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం హాకీకి కాషాయరంగు పులమటాన్ని తప్పుపడుతున్నారు. దశాబ్దకాలం పాటు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాతీయక్రీడ హాకీ బాగుకోసం 150 కోట్ల రూపాయల సాయం… స్పాన్సర్ షిప్ రూపంలో అందించానని, కేంద్ర ప్రభుత్వం హాకీ అభివృద్ధి కోసం పైసా విదల్చలేదని గుర్తు చేశారు. భారత హాకీ వ్యవహారాలలో రాజకీయాలు తగవని, దుస్తుల రంగు మార్చడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదంటూ విచారం వ్యక్తం చేశారు. ఒడిషా ప్రభుత్వం చొరవ, పూనిక, త్యాగం కారణంగానే నాలుగు దశాబ్దాల విరామం తరువాత భారత హాకీజట్టు ఒలింపిక్స్ లో వరుసగా రెండు పతకాలు సాధించిన వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని, చేతనైతే హాకీ అభివృద్ధికి పాటుపడాలని రాజకీయాలు చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
సాంకేతిక సమస్యలతోనే రంగు మార్పు…
మరోవైపు…హాకీజట్ల జెర్సీల రంగును కాషాయానికి మార్చడాన్ని’హాకీ ఇండియా’ అధ్యక్షుడు దిలీప్ టిర్కే సమర్థించుకున్నారు. కేవలం సాంకేతిక కారణాలతోనే జెర్సీల రంగును కాషాయానికి మార్చాల్సి వచ్చిందని, ఇందులో రాజకీయం ఏమీలేదంటూ వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ హాకీ మైదానాల వర్ణం నీలిరంగులో ఉండటం, భారతజట్టు జెర్సీలు సైతం నీలిరంగులోనే ఉండడంతో ప్రత్యక్షప్రసారాల సమయంలో పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయని, జట్ల సభ్యులు, శిక్షకులు, సహాయక బృందం ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పారు. తనకు సైతం జెర్సీల ఆవిష్కరణకు కొద్దిగంటల ముందే ఈ విషయం తెలిసిందని వాపోయారు.
‘నీలి’ మేఘాలలో…‘కాషాయ’ కెరటాలలో…
భారత జాతీయ పతాకంలోని రంగులలో ఒకటైన కాషాయాన్ని జట్టు జెర్సీలకు వాడితే తప్పేంటంటూ హాకీ ఇండియా ప్రతినిధి ప్రశ్నించారు. జెర్సీల రంగు మార్చే ముందు సంబంధిత వర్గాలతో సమగ్రంగా చర్చించామని, జట్టు అవసరాల మేరకు మాత్రమే జెర్సీ రంగులో మార్పులు చేపట్టినట్లు తెలిపారు. హాకీని హాకీలానే చూడాలని, రాజకీయరంగు పులమరాదంటూ విజ్ఞప్తి చేశారు. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సైతం జెర్సీరంగు మార్పు తమకు ఆమోదమేనని, ఆటతీరు ముఖ్యం కానీ, దుస్తుల రంగు ప్రధానం కాదని, అంతర్జాతీయహాకీలో గత కొన్ని సంవత్సరాలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలలో జట్ల జెర్సీల రంగు మార్పు కూడా ఒకటి అని తన వంతుగా వివరణ ఇచ్చారు. ఆగస్టు 14 నుంచి నెదర్లాండ్స్ వేదికగా జరిగే 2026 ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య నెదర్లాండ్స్ తో పాటు భారతజట్టు సైతం కాషాయరంగు జెర్సీలు ధరించిన జట్టుగా నిలువబోతోంది. గత 98 సంవత్సరాలుగా నీలి, తెలుపురంగు జెర్సీలు ధరిస్తూ వచ్చిన భారతహాకీ జట్లు కాషాయరంగు జెర్సీలను సైతం ఉపయోగించడం ద్వారా జాతీయపతాకంలోని రెండో రంగును సైతం వాడినట్లు అవుతుంది.
ఇంతకూ హాకీ జాతీయక్రీడేనా…?
ఒలింపిక్స్ లో భారత్ బంగారు క్రీడ హాకీని శతకోటి భారత క్రీడాభిమానులు ఇప్పటికీ జాతీయక్రీడగానే భావిస్తున్నారు. వివిధ రాష్ట్ర్రప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే
పలు రకాల ప్రవేశ, పోటీ పరీక్షలలో జాతీయక్రీడ ఏదంటూ గత కొద్దిసంవత్సరాలుగా ఓ ప్రశ్న తప్పనిసరిగా ఉంటూ రావడం, జవాబుగా హాకీనే అంటూ సమాధానం ఇవ్వటం అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ కు…జాతీయ క్రీడ అంటూ ఏదీలేదని అధికారికంగా నిర్దారణ అయ్యింది. 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ వరకూ భారత్ అత్యధికంగా హాకీ క్రీడలోనే ఎనిమిది బంగారు పతకాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో …భారత్ కు ఒలింపిక్స్ లో అత్యధిక స్వర్ణపతకాలు సంపాదించి పెట్టిన హాకీనే జాతీయక్రీడగా పరిగణిస్తూ వచ్చారు. ఇంతగా ప్రచారం జరుగుతున్నా…గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పెదవి విప్పలేదు.
అయితే…ఆర్టీఏ చట్టం పుణ్యమా అంటూ…భారత్ కు జాతీయ క్రీడ అనేది ఏదీలేదనేది వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర్రలోని ధూలే జిల్లాకు చెందిన ఓ పాఠశాల అధ్యాపకుడు భారత జాతీయ క్రీడ ఏదంటూ…ఆర్టీఏ ద్వారా ప్రభుత్వ వివరణ కోరారు. దీంతో …భారత్ కు జాతీయక్రీడ అంటూ ఏదీలేదంటూ…కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ నుంచి బదులు వచ్చింది. దేశంలో అన్నిరకాల క్రీడలను ప్రోత్సహించడం కోసమే జాతీయక్రీడగా ఇప్పటి వరకూ ఏ క్రీడనూ నిర్ధారించలేదని వివరణ ఇచ్చింది.
ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగాను, హాకీని జాతీయక్రీడగా పరిగణిస్తూ…ప్రభుత్వం ఏటా…హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి రోజున జాతీయ క్రీడాపురస్కారాలను ప్రదానం చేసే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే, జాతీయ క్రీడ అంటూ అధికారికంగా ఏదీలేని దేశంగా
భారత్ మిగిలిపోవడం శోచనీయం.
భూటాన్ లాంటి చిన్నదేశానికి విలువిద్య జాతీయక్రీడగా ఉంటే…స్పెయిన్ కు బుల్ ఫైట్, పొరుగుదేశం పాకిస్థాన్ కు కబడ్డీ జాతీయ క్రీడలుగా ఉన్నాయి.
భారత్ లో హాకీ జాతీయక్రీడ అన్న భావన అందరిలో పాతుకుపోయినా…అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడగా, అనధికారిక జాతీయక్రీడగా క్రికెట్ చెలామణిలో ఉంది.
ప్రభుత్వం అధికారికంగా హాకీని జాతీయక్రీడగా ప్రకటించకున్నానాటినేటితరం క్రీడాభిమానులు మాత్రం ఈ కళాత్మక క్రీడనే జాతీయక్రీడగా పరిగణిస్తున్నారు.
హాకీ క్రీడకే మరోపేరుగా నిలిచిన భారత్ ప్రపంచ, ఒలింపిక్స్, ఆసియాక్రీడలు, ఇతర అంతర్జాతీయ పోటీలలో ఘనవారసత్వాన్నికొనసాగించాలి.
గత తొమ్మిది దశాబ్దాలుగా అంతర్జాతీయ హాకీ వర్గాలలో ’ నీలిదళంగా’ నీరాజనాలు అందుకొన్న భారతహాకీ జట్లు ప్రస్తుత 2026 ప్రపంచకప్ హాకీ పోటీల నుంచిక ‘కాషాయ దళం’ రూపంలో సంచలన విజయాలు, అరుదైన ఘనతలు సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

