ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ‘ఆసియా క్రీడల పండుగ’ కు… జపాన్ ప్రారిశ్రామిక నగరాలు అయిచీ- నగాయోలలో రంగం సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకూ జరిగే ఈ బహుముఖ క్రీడాసమరం బరిలోకి భారత్… భారీ లక్ష్యాలు, కొండంత ఆశతో దిగుతోంది…

భారత్… ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలలో ఒకటి. 140 కోట్ల జనాభాలో అత్యధిక శాతం యువజనులే. యువశక్తే ప్రధాన బలంగా 20వ ఆసియా క్రీడల సమరానికి 492 మంది అథ్లెట్ల భారీ బృందంతో సమాయత్తమయ్యింది. గత ఆసియా క్రీడలకంటే మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగుతోంది.

45 దేశాల క్రీడా సమరం ‘ఏషియాడ్’…

క్రీడలు ఎన్నో రకాలు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రికా గేమ్స్, లాటిన్ అమెరికా గేమ్స్, ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు, ఆసియా క్రీడలు, శాఫ్ (సార్క్ ) గేమ్స్, పాన్ అమెరికన్ గేమ్స్…ఇలా ఎన్నిరకాలుగా ఉన్నా…ఏ క్రీడల ప్రత్యేకత వాటిదే. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ క్రీడల పండుగలో…అతిపెద్ద ఖండ దేశాల నడుమ జరిగే ఆసియా క్రీడలకు ప్రత్యేక స్థానమే ఉంది. 45 దేశాలకు చెందిన 17 వేల మంది అథ్లెట్లు , అధికారులు తలపడనున్న ఈ క్రీడల పరంపర 1951 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. ప్రపంచ యుద్ధాలు, ఇతర రాజకీయ కారణాలతో ఒలింపిక్స్ నిర్వహణ పలుమార్లు నిలిచిపోయినా…ఆసియా క్రీడలు మాత్రం 1951 నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నాయి.

ఆసియా క్రీడల్లో భారత్ ఎక్కడ?

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 1951 నుంచి క్రమం తప్పకుండా ఆసియా క్రీడల్లో పాల్గొంటూనే వస్తోంది. ఆసియా దేశాల క్రీడా సమరం రూపకల్పన, నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్న భారత పరిస్థితి పతకాల వేటలో మాత్రం రెండడుగులు ముందుకు నాలుగడగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది. చైనా, జపాన్, కొరియా దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేసేంత బలంగా తయారు కాలేకపోతోంది. 1951, 1982 ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చినా క్రీడా ప్రమాణాలు, పతకాల సాధనలో మాత్రం వెనుకబాటుతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2018 ఆసియా క్రీడల పతకాల పట్టిక 8వ స్థానంలో నిలిచిన భారత్ …2022 ఆసియా క్రీడల్లో మాత్రం మెరుగైన ఫలితాలు సాధించగలిగినా ఆసియా క్రీడాశక్తిగా నిలువ లేకపోయింది. 1951 నుంచి 2023 వరకూ జరిగిన మొత్తం 19 ఆసియా క్రీడలలో పాల్గొంటూ వచ్చిన భారత్ ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారైనా పతకాల పట్టిక మొదటి రెండు స్థానాలలో నిలువ లేకపోయింది. 17వ ఆసియా క్రీడలు ముగిసే వరకూ భారత్ మొత్తం 139 స్వర్ణాలతో సహా 616 పతకాలు మాత్రమే సాధించగలిగింది. ఆసియా క్రీడల్లోకి భారత్ కంటే ఆలస్యంగా ప్రవేశించిన చైనా 1342 స్వర్ణాలతో సహా 2,895 పతకాలు సాధిస్తే…జపాన్ 257 స్వర్ణాలతో సహా 2,850 పతకాలు, దక్షిణ కొరియా 696 స్వర్ణాలతో సహా 2,063 పతకాలు సాధించి…ఆసియా మొదటి మూడు అగ్రశ్రేణి దేశాలుగా నిలిచాయి. 2014 ఆసియా క్రీడల పతకాల వేటలో 8వ స్థానానికి పడిపోయిన భారత్… ఆ తర్వాత నాలుగేళ్లకు జరిగిన 17వ ఆసియా క్రీడల్లో 11 స్వర్ణాలతో సహా మొత్తం 57 పతకాలతో పతకాల పట్టిక 4వ స్థానంలో చోటు దక్కించుకోగలిగింది. జకార్తా వేదికగా ముగిసిన 18వ ఆసియా క్రీడల్లో 18 స్వర్ణాలతో సహా మొత్తం 70 పతకాలు మాత్రమే సాధించిన భారత్ కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే తన పతకాల సంఖ్యను 107కు పెంచుకోగలిగింది.

19వ ఆసియా క్రీడల్లో భారత్ సంచలనం…

చైనా వేదికగా ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. హాంగ్జు వేదికగా జరిగిన ఈ క్రీడల్లో భారత్ మొత్తం 28 స్వర్ణ, 38 రజత, 41 కాంస్యాలతో సహా 107 పతకాలతో వారేవ్వా! అనిపించుకొంది. క్రీడాకారుల పట్టుదల, నేర్పు, ఓర్పు, అంకితభావాలకు ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత జత కలవడంతో భారత్ పతకాల పంట పండించుకోగలిగింది. గత 71 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 107 పతకాలతో భారత్ పతకాల పట్టిక నాలుగో స్థానంలో సగర్వంగా నిలిచింది. చైనా వినువీధిలో 28సార్లు మువ్వన్నెల జెండా రెపరెపలకు తోడు జాతీయ గీతాలాపనతో భరతజాతి మెరిసి మురిసింది. శత పతకాల లక్ష్యాన్ని చేరటానికి భారత్ 7 దశాబ్దాలపాటు వేచిచూడాల్సి వచ్చింది. 1951 ప్రారంభ ఆసియా క్రీడల పతకాల పట్టిక రెండోస్థానంలో నిలిచిన భారత్…1962 జకార్తా గేమ్స్ లో 3వ స్థానం సంపాదించింది. ఆ తరువాత అత్యుత్తమంగా ప్రస్తుత క్రీడల్లో మాత్రమే 4వ స్థానం సంపాదించగలిగింది. ఇప్పటి వరకూ జరిగిన మొత్తం 19 ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన బంగారు పతకాలు 206గా ఉండటం విశేషం.

భారత మహిళలా…మజాకానా!

చైనా వేదికగా ముగిసిన 19వ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించడంలో మహిళా అథ్లెట్లు తమవంతు బాధ్యత నిర్వర్తించారు. పురుషులకు తాము ఏమాత్రం తీసిపోమని భారత మహిళా అథ్లెట్లు తమ అపురూప విజయాలతో చాటి చెప్పారు. మొత్తం 38 రకాల క్రీడాంశాలలో జరిగిన 45 దేశాల ఈ పోటీలలో భారత్ 655 మంది అథ్లెట్ల భారీ బృందంతో బరిలో నిలిచింది. భారత బృందంలో 330 మంది మహిళా అథ్లెట్లు సైతం ఉన్నారు.

మహిళా అథ్లెట్ల వాటా 46 పతకాలు …

గత 18 ఆసియా క్రీడల్లో ఎన్నడూ లేని విధంగా భారత మహిళా అథ్లెట్లు పలు అపురూప విజయాలు సాధించారు. సంవత్సరాల తరబడి ఎదురుచూసిన పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్ సాధించిన మొత్తం 107 పతకాలలో మహిళలు సాధించినవే 46 పతకాలు ఉన్నాయి. మిక్సిడ్ విభాగంలో పురుష అథ్లెట్లు భాగస్వాములుగా మరో 9 పతకాలను మహిళా అథ్లెట్లు గెలుచుకొన్నారు.

తెలుగు రాష్ట్రాల అథ్లెట్ల అరుదైన ఘనత…

భారత అథ్లెట్లు సాధించిన మొత్తం 28 బంగారు పతకాలలో తెలుగు రాష్ట్రాల సూపర్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం సాధించినవే మూడు స్వర్ణాలు ఉన్నాయి. కాంపౌండ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత, టీమ్ విభాగాలతో పాటు మిక్సిడ్ విభాగంలో సైతం జ్యోతి సురేఖ బంగారు పతకాలు సాధించింది. గాంగ్జు ఆసియా క్రీడల్లో అత్యధికంగా మూడు బంగారు పతకాలు సాధించిన భారత మహిళగా, ఇద్దరు భారతో అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది. హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ పిస్టల్ షూటింగ్ విభాగంలో ఓ స్వర్ణంతో సహా మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకుంది. అత్యధిక పతకాలు (4) సాధించిన ఇద్దరు భారత అథ్లెట్లలో ఈషా సింగ్ ఒకరిగా నిలిచింది.

అపురూపం టేబుల్ టెన్నిస్ రజతం…

ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత మహిళలు తొలి పతకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. మహిళల డబుల్స్ లో ముఖర్జీ సిస్టర్స్ సుతీర్థ- ఐహిక సెమీఫైనల్లో చైనా జోడీ పై సంచలన విజయంతో రజత పతకం అందుకున్నారు. మహిళల 5 వేల మీటర్ల పరుగులో ఆఖరి 30 మీటర్ల దూరంలోనే జపాన్ కు చెందిన ప్రత్యర్థి రిరికాను అధిగమించడం ద్వారా పారుల్ చౌదరి బంగారు పతకం సొంతం చేసుకున్న తీరు క్రీడాభిమానులకు కలకాలం గుర్తుండి పోతుంది. మహిళల జావలిన్ త్రోలో అను రాణి బంగారు పతకం సాధిస్తే… క్రికెట్ , కబడ్డీ అంశాలలో సైతం భారత మహిళా జట్లు స్వర్ణాలు గెలుచుకోగలిగాయి. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అధితి అశోక్ రజత పతకంతో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆసియా క్రీడల మహిళల గోల్ఫ్ చరిత్రలోనే వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది. బంగారు ఆశలతో హాకీ బరిలోకి దిగిన భారత జట్టు కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విశాఖ రన్నర్ కు రజతం…

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేస్ లో విశాఖపట్నం రన్నర్ జ్యోతి ఎర్రాజీ రజత పతకం గెలుచుకొంది. చదరంగం మహిళల టీమ్ విభాగంలో భారత్ కు రజతం దక్కింది. గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. మహిళా బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గితీరుతుందని భావించిన నిఖత్ జరీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లవ్లీనా బోర్గెయిన్ ఫైనల్ చేరినా రజత పతకంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తే… మహిళా అథ్లెట్లు అంతకు మించి అత్యుత్తమంగా రాణించడం ద్వారా తమ ప్రత్యేకతను చాటుకోగలిగారు.

2026 గేమ్స్ బరిలో భారీ బృందంతో భారత్…

గత ఆసియా క్రీడల్లో సాధించిన 107 పతకాల రికార్డును తిరగరాయాలన్న లక్ష్యంతో భారత్ 492 మంది అథ్లెట్ల బృందంతో సమాయత్తమయ్యింది. భారత అథ్లెట్ల బృందంలో పురుషులు 265మంది కాగా మహిళా అథ్లెట్లు 227 మంది ఉన్నారు. మొత్తం 35 రకాల క్రీడాంశాలలో భారత అథ్లెట్లు పతకాల వేటకు దిగుతున్నారు. జావలిన్ త్రోలో ప్రపంచ మేటి నీరజ్ చోప్రా మోకాలి గాయంతో క్రీడలకు దూరమైనా… ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ మొత్తం 73 మంది సభ్యులతో పోటీకి దిగుతోంది. 35 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు. పురుషుల, మహిళల హాకీ విభాగాలలో 40 మంది, షూటింగ్ లో 30, క్రికెట్ లో 30, కబడ్డీలో 24, రోయింగ్ లో 22, సెపక్ తక్రాలో 21, బ్యాడ్మింటన్ లో 20, ఫెన్సింగ్ లో 20, కుస్తీలో 16 మంది అథ్లెట్లు భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జపాన్ ఒలింపిక్స్ సంఘం ఆతిథ్యంలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకూ జరిగే ఈ ఏషియాడ్ లో భాగంగా మొత్తం 43 రకాల క్రీడల్లో 45 దేశాలకు చెందిన క్రీడాకారులు పురుషుల, మహిళల టీమ్, వ్యక్తిగత విభాగాలలో తలపడబోతున్నారు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు మరో పేరైన జపాన్ …ప్రస్తుత ఆసియా క్రీడల కోసం వందల కోట్ల రూపాయల వ్యయంతో క్రీడా గ్రామాన్ని నిర్మించడానికి బదులు… 5వేల మంది విడిది కోసం ఓ ఇటాలియన్ క్రూయిజ్ లైనర్ ( కోస్టా సెరెనా)ను ఏర్పాటు చేయడం సరికొత్త చరిత్రకు తెరలేపింది.

వీరి పైనే ‘బంగారు’ ఆశలు…

భారత్ కు ఖచ్చితంగా బంగారు పతకం అందించగలడు అనుకున్న నీరజ్ చోప్రా అందుబాటులో లేకపోవడంతో బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు, షూటర్ మను బాకర్, బాక్సర్లు లవ్లీనా బోర్గేయిన్, అమన్ షెరావత్ ల పైన వ్యక్తిగత పతకాలు, పురుషుల, మహిళల హాకీ, క్రికెట్, కబడ్డీ విభాగాలలో టీమ్ బంగారు పతకాల ఆశలు కేంద్రీకృతమై ఉన్నాయి. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్లు నేరుగా పాల్గొనాలంటే ప్రస్తుత ఆసియా క్రీడల్లో స్వర్ణ విజేతలుగా నిలవాల్సి ఉంది. బెంగళూరులో గత కొద్దివారాలుగా నిర్వహించిన సన్నాహక శిబిరాలలో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందం అంచనాలకు మించి రాణించడం ద్వారా గత ఏషియాడ్ లో సాధించిన 107 పతకాల రికార్డును అధిగమించాలని కోరుకుందాం.