క్రికెట్…మూడు రకాలు. క్రికెట్ కు మూడు ముఖాలు. దేని ప్రత్యేకత దానిదే. అయితే…ధూమ్ ధామ్ టీ-20, 50 ఓవర్ల వన్డే, ఐదు రోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్ ఫార్మాట్లలో ఏది గొప్ప అన్న అంశమై క్రికెట్ వర్గాలలో ఎడతెగని, ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది…

క్రికెట్… కేవలం మూడక్షరాల ఆట మాత్రమే కాదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల కలయిక. పరుగులు, వికెట్లు, క్యాచ్ లు, శతకాలు, ఫోర్లు, సిక్సర్ల సమాహారం. గత 15 దశాబ్దాలుగా… కాలానుగుణంగా, అభిమానుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ నిత్యనూతనంగా ఉంటూ వస్తున్న జనసంమోహక క్రీడ. భారత ఉపఖండ దేశాలలో… ప్రధానంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలలో ఒకటైన భారత్ లో ఉన్నంతమంది క్రికెట్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలలో లేరంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో ప్రస్తుత ప్రపంచ క్రికెట్ భారత చుట్టూనే పరిభ్రమిస్తూ వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే భారత్ లేని అంతర్జాతీయ క్రికెట్ ను ఊహించడం అసాధ్యం.

జాతీయపిచ్చిగా మారిన క్రికెట్…

భారత్ లో ఎన్నో రకాల క్రీడలున్నా క్రికెట్టే అత్యధిక జనాదరణ పొందిన, అత్యధికమంది అభిమానులున్న క్రీడగా కొనసాగుతూ వస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ, మహిళల నుంచి పురుషుల వరకూ ఈ బ్యాటూ, బంతాట అంటే చెప్పలేని అభిమానం. సాంప్రదాయ టెస్టుమ్యాచ్ లు జరిగితే ఒకప్పుడు స్టేడియాలు కిటకిటలాడేవి. అయితే… ప్రస్తుత కాలంలో 50 ఓవర్ల వన్డే, 20 ఓవర్ల ధూమ్ ధామ్ టీ-20 మ్యాచ్ లు, సిరీస్ లు, లీగ్ లు జరుగుతున్నాయంటే చాలు స్టేడియాలు కిక్కిరిసిపోడం, ప్రత్యక్షప్రసారాల వీక్షణ కోసం టీవీల ముందు గుమికూడిపోవడం సాధారణ విషయాలుగా మారిపోయాయి. మనదేశంలో క్రికెట్ పిచ్చి ఎంతగా ఉందంటే… ఒలింపిక్స్ లో భారత్ కు ఎనిమిది బంగారు పతకాలు సంపాదించి పెట్టిన హాకీ క్రీడనే మించిపోయి… క్రికెట్టే ప్రస్తుతం అనధికారిక జాతీయక్రీడ హోదాలో అంతై…ఇంతై…అంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ వస్తోంది. ఆంగ్ల పాలకులతో భారత భూభాగంలోకి అడుగుపెట్టిన క్రికెట్ ను నాటి (నవానగర్, బరోడా, విజయనగరం) రాజవంశాలు పెంచి పోషిస్తూ వచ్చాయి. స్వాతంత్ర్ర్యానికి పూర్వమే భారత నియంత్రణ మండలి ఏర్పడటమే కాదు… కాలపరీక్షకు నిలబడి… ఆర్థిక సమస్యలు, ఆటుపోట్లు తట్టుకొని ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ సంఘంగా రూపుదిద్దుకొంది. సువిశాల భారత్ లో క్రికెట్ అభివృద్ధికి ఎనలేని కృషిచేయటమే కాదు… అంతర్జాతీయ క్రికెట్ కే చుక్కానిగా నిలిచింది. క్రికెట్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం వందల కోట్ల రూపాయలను మంచినీటి ప్రాయంగా ఖర్చు చేసే స్థితికి ఎదిగింది. 1970 దశకం వరకూ తగిన వనరులు లేక, ఐసీసీ విదిల్చిన అరకొర నిధులతోనే నెట్టుకొంటూ వచ్చిన బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి)…ప్రపంచీకరణ పుణ్యమా అంటూ పుంజుకోగలిగింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తో భారత క్రికెట్ దిశ, దశ ఒక్కసారిగా మారిపోయాయి. 1983 లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారిగా ప్రుడెన్షియల్ వన్డే ప్రపంచకప్, 2007లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ఐసీసీ ప్రారంభ టీ-20 ప్రపంచకప్, రోహిత్ శర్మ కెప్టెన్ గా ఐసీసీ మినీ ప్రపంచకప్, హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో 2025 ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ ను భారత జట్లు గెలుచుకోవడంతో… ప్రపంచంలోనే సాటిలేని మేటి క్రికెట్ శక్తిగా భారత్ గుర్తింపు సంపాదించింది. ప్రపంచ క్రికెట్ కు అతిపెద్ద మార్కెట్ గా భారత్ నిలవడంతో ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా లాంటి క్రికెట్ బోర్డులు బీసీసీఐని అనుసరించక తప్పలేదు.

తెలుగోడి సారథ్యంలో భారత్ తొలిటెస్టు…

1877లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్ర్రేలియా- ఇంగ్లండ్ జట్ల మథ్య జరిగిన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ తో క్రికెట్ జైత్రయాత్ర ప్రారంభమయ్యింది. ప్రధానంగా బ్రిటీష్ పాలిత (న్యూజిలాండ్, భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా, నమీబియా, కరీబియన్ ద్వీపాలు(వెస్టిండీస్)కు మాత్రమే క్రికెట్ పరిమితం కావలసి వచ్చింది. ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా యాషెస్ సిరీస్ పేరుతో ద్వైపాక్షిక టెస్టు సిరీస్ ల్లో పాల్గొంటూ ఉండేవి. ఆ తరువాత న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు సైతం టెస్టుమ్యాచ్ ల్లో తలపడుతూ ఉండేవి. భారత్ మాత్రం తన మొట్టమొదటి అధికారిక టెస్టు మ్యాచ్ కోసం 1932 వరకూ వేచి చూడవలసి వచ్చింది. ఎంతటి గొప్ప ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. టెస్టు క్రికెట్లో భారత ప్రయాణం సైతం అలుపెరుగని ప్రయాణంలానే సాగింది. స్వాతంత్ర్ర్యానికి పూర్వమే టెస్టు క్రికెట్లో తొలి అడుగువేసిన భారత్ గత 94 సంవత్సరాల కాలంలో అనూహ్యంగా ఎదిగిపోయింది. పలు అరుదైన రికార్డులు, అసాధారణ ఘనతలతో తనకు తానే సాటిగా నిలిచింది. తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్య నాయుడు కెప్టెన్ గా భారత్ తన మొట్టమొదటి టెస్టుమ్యాచ్ ను ఇంగ్లండ్ ప్రత్యర్థిగా క్ర్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఢీ కొంది. ఆ తర్వాత నుంచి భారత్ మరి వెనుదిరిగి చూసింది లేదు. గత 94 సంవత్సరాల కాలంలో భారత్ 600 టెస్టులు ఆడిన మూడోజట్టుగా, సాంప్రదాయ టెస్టు క్రికెట్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది.

1932 లార్డ్స్ నుంచి 2026 గాల్ వరకూ…!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారత్ మరో అరుదైన మైలురాయిని చేరింది. గాల్ వేదికగా శ్రీలంకతో జరిగిన 2026 సిరీస్ తొలిమ్యాచ్ ద్వారా 600 టెస్టు మ్యాచ్ లు ఆడిన ఆసియా తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది. మూడు ముఖాల క్రికెట్లో దేని ప్రత్యేకత దానిదే. ఐదు రోజులు… నాలుగు ఇన్నింగ్స్… రోజుకు కనీసం 80 ఓవర్లుగా సాగే సాంప్రదాయ టెస్టు క్రికెట్ నే అసలు సిసలు క్రికెట్ గా చెబుతూ ఉంటారు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన 50 ఓవర్ల వన్డే, 20 ఓవర్ల ధూమ్ ధామ్ టీ-20ల కంటే ఆధిక్యత చేతులు మారుతూ ఐదురోజులపాటు సాగే టెస్టు సమరాన్నే క్రికెటర్లు, క్రికెట్ ప్రేమికులు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. క్రికెటర్ల సత్తాకు, నైపుణ్యానికి, నేర్పు, ఓర్పులకు పరీక్షగా నిలిచే టెస్టు క్రికెట్ కు 14 దశాబ్దాల చరిత్రే ఉంది. అయితే… అందులో భారత్ కు సైతం 94 సంవత్సరాల అస్థిత్వం ఉంది. తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్య( సర్ సీకె) నాయుడు నాయకత్వంలో భారత జట్టు లండన్ లోని చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా… 1932 జూన్ 25న …ఇంగ్లండ్ ప్రత్యర్థిగా తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాతి నుంచి పడుతూ లేస్తూ తన ప్రయాణం సాగించిన భారత్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. సర్ సీకె నాయుడు, మహ్మద్ నిస్సార్, విజయ్ మర్చెంట్, లాలా అమర్ నాథ్ , వినూ మన్కడ్, పంకజ్ రాయ్, దిలీప్ సర్దేశాయ్, పాలీ ఉమ్రీగర్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, అబీద్ అలీ, అజిత్ వడేకర్, సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, ఫరూక్ ఇంజనీర్, మొహిందర్ అమర్ నాథ్, బిషిన్ సింగ్ బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట్రాఘవన్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, అనీల్ కుంబ్లే, మహ్మద్ అజారుద్దీన్, ద్రావిడ్, రవి శాస్త్ర్రి, గంగూలీ, పూజారా, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ, సెహ్వాగ్ , విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ ల నుంచి నేటితరం కెప్టెన్ శుభ్ మన్ గిల్ వరకూ ఎందరో ఎందరెందరో గొప్ప గొప్ప క్రికెటర్లు తమ అసాధారణ ఆటతీరుతో భారత టెస్టు క్రికెట్ ను సుంపన్నం కావించారు.

అరుదైన, అపురూప రికార్డులు…

భారతజట్టు గత 94 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకూ ఆడిన 601 టెస్టుమ్యాచ్ ల్లో ఎన్నో అపురూపమైన రికార్డులు ఉన్నాయి. భారత టెస్టు చరిత్రలో తొలి శతకం సాధించిన మొనగాడు లాలా అమర్ నాథ్ ( 1933 ) కాగా…ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన తొలి ఫాస్ట్ బౌలర్ గా మహ్మద్ నిస్సార్ ( 1932 ) రికార్డుల్లో చేరారు. భారత జట్టు తన తొలి టెస్టు విజయం నమోదు చేయటానికి రెండు దశాబ్దాలపాటు వేచి చూడవలసి వచ్చింది. 1952 ఫిబ్రవరిలో ఇంగ్లండ్ పై భారత్ తన మొట్టమొదటి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. తన మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయాన్ని పాకిస్థాన్ ప్రత్యర్థిగా 2-1తో నమోదు చేసింది. విదేశీగడ్డపై తొలి సిరీస్ విజయం కోసం 1968 వరకూ వేచి చూసింది. తన అరంగేట్రం సిరీస్ లోనే 774 పరుగులతో సంచలనం సృష్టించిన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ 10వేల పరుగులు సాధించిన తొలి టెస్టు క్రికెటర్ గా, ఓపెనర్ గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

భారత క్రికెట్లో ‘సచిన్ శకం’!

16 సంవత్సరాల చిరుప్రాయంలోనే భారత టెస్టు జట్టులోకి అడుగుపెట్టిన సచిన్ టెండుల్కర్ ఆ తర్వాత రెండు దశాబ్దాలపాటు భారత క్రికెట్ మూలవిరాట్టుగా నిలిచాడు. 200 టెస్టుమ్యాచ్ లు ఆడి 51 శతకాలతో 15వేల 921 పరుగులు సాధించిన ఒకే ఒక్కడిగా, టెస్టు క్రికెట్ ఎవరెస్టుగా, భారత క్రికెట్ దేవుడిగా మాస్టర్ సచిన్ నీరాజనాలు అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారత తొలి క్రికెటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడు. బౌలర్లలో 434 వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ కపిల్ దేవ్ కాగా… ఒక ఇన్నింగ్స్ లో 10 కి 10 వికెట్లు పడగొట్టిన మొనగాడిగా అనీల్ కుంబ్లే (10- 74) ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. తొలి హ్యాట్రిక్ సాధించిన ఆఫ్ స్పిన్నర్ ఘనతను హర్భజన్ సింగ్ దక్కించుకొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం ద్వారా భారత్ టెస్టు ఎవరెస్టును అధిరోహించగలిగింది. ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ లో, ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియాలో, దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలో, న్యూజిలాండ్ ను న్యూజిలాండ్ లో ఓడించి సిరీస్ లు నెగ్గిన తొలి ఆసియాజట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

మూడవజట్టుగా భారత్…

శ్రీలంకతో రెండు మ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భాగంగా గాల్ వేదికగా జరిగిన తొలిటెస్టు బరిలో నిలవడం ద్వారా భారత్ …టెస్టు చరిత్రలో 600 మ్యాచ్ లు ఆడిన మూడో జట్టుగా రికార్డుల్లో చేరింది. ఇంగ్లండ్(1097), ఆస్ట్ర్రేలియా(883)జట్లు ఇప్పటికే 600 టెస్టుల మైలురాయిని చేరితే…వాటి సరసన చేరిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. భారత మొట్టమొదటి టెస్టులో ఓ తెలుగు ఆటగాడు సీకె నాయుడు నాయకత్వం వహిస్తే…భారత్ ఆడిన 100వ టెస్టులో మన్సూర్ అలీఖాన్ పటౌడీ, 600వ టెస్టులో శుభ్ మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించారు. భారత అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్ రికార్డు విరాట్ కొహ్లీ పేరుతో ఉంది. కొహ్లీ నాయకత్వలో భారత్ ఆడిన 68 టెస్టుల్లో 40 విజయాలు నమోదు చేసింది. గత 94 సంవత్సరాల కాలంలో భారత టెస్టు జట్టులో చోటు సంపాదించిన ఆటగాళ్లలో స్పిన్నర్ మానవ్ సుతార్ సంఖ 319 కావడం విశేషం. ముందొచ్చిన చెవుల కన్నా…వెనకొచ్చిన కొమ్ములువాడి అన్నట్లుగా సాంప్రదాయ టెస్టు క్రికెట్ ను ఆ వెనుక వచ్చిన వన్డే క్రికెట్ …దాని వెనుక వచ్చిన టీ-20 క్రికెట్ మించిపోయాయి. అయినా…ఐదు రోజుల టెస్టు క్రికెట్ నే ఆటగాళ్ల నుంచి క్రికెట్ పండితులు, విమర్శకులు, విశ్లేషకులూ మాత్రం అసలు సిసలు క్రికెట్ గా పరిగణిస్తున్నారు. టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) సైతం తన వంతుగా టెస్టు లీగ్ ను నిర్వహిస్తూ వస్తోంది. రానున్నకాలంలో టెస్టు మ్యాచ్ లు ఆడే క్రికెటర్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగాలని, టెస్టు క్రికెట్లో భారత ప్రయాణం ఘనవిజయాలు, అసాధారణ రికార్డులతో అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుందాం.