ఉత్తరాంధ్ర ప్రజల కడగండ్లపై ‘కంచరాన’ అక్షర శరాలు
ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కవుల కలాలు బలమైనవి. వారి అక్షరాలు పదునైన ఆయుధాలు. గురిపెట్టిన శిల కోలలు. అన్యాయాన్ని ప్రతిఘటించే అగ్ని కణాలు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన అలాంటి ఒక కవితా కెరటం కంచరాన భుజంగరావు. ఇతని ‘నీటి గింజల పంట’ ఉత్తరాంధ్ర ప్రజల బ్రతుకు చిత్రాల మాలిక. వరుణుడి కరుణ కరువై పంటలు పండని మెట్ట నెలల్లో రైతులు, సముద్రం మీద వేటకు వెళ్లే జాలరులు, జీవితమంతా కలసి నడుస్తానన్న సహచరుడు మధ్యలోనే వీడిపోతే కన్నీటి గీతాలుగా మిగిలిన ఒంటరి స్త్రీలు, తాము తినే బియ్యపు గింజల మీద తమ పేర్లు కనబడక వలసదారి పట్టిన కష్టజీవులు… ఇలా ఎన్నెన్నో కన్నీటి గాథల పరంపర ఈ యువకవి కవితా ప్రస్థానం.
మబ్బులు మొఖం చాటేసినప్పుడు, నేల గొంతు ఎండి పగుళ్లు బారినప్పుడు, నాగలి పాదాల నిండా చిందిన రక్తం చారికలు… అని అక్కడి రైతుల విషాద జీవితాన్ని ‘నీటిగింజల పంట’ లో కరుణరసాత్మకంగా వర్ణిస్తాడు కవి.
ఒకప్పుడు రైతుకు పొలం తన సొంత ఫలమే. కానీ ఇప్పుడు ఆ పొలం తనది కాదు. తనిప్పుడు రైతు కూడా కాదు. పరాయి పొలంలో పనిచేసే రైతు కూలీగా దిగజారేలా చేశారు. ఉత్తరాంధ్ర నింగిలో ఊరికే విలాసంగా షికారు చేసే మేఘాలే ఎక్కువ. పంటలు పండని దైన్యంలో కూడా నిరాశపడని రైతు, ఎలాగూ పంటలు పండవు గదా అని విశ్రాంతిగా ఎన్నడూ కూర్చోడు. తన రెక్కల కష్టం మీదే ఆధారపడతాడు. సూర్యుడి కన్నా ముందే లేచి చెమట చుక్కల సేద్యం చేస్తాడు. ఇక్కడ నాగావళి, వంశధార వంటి నదులు ప్రవహిస్తున్నా … వర్షాధారపు మెట్ట భూములు, వానలు కురవక పగుళ్లు బారిన పొలాలు, హఠాత్తుగా విరుచుకు పడే తుఫాన్లు, అవి సృష్టించే విధ్వంసం… ఈ పరిస్థితులను పాఠకుల కళ్లకు కట్టినట్టు చూపించే కవిత్వం ఇది. ఎంతటి అననుకూల సమయంలో కూడా చెమట పిట్టల్లా కష్టాన్నే నమ్ముకునే అమాయకులైన రైతులున్న నేల ఇది. అందుకే ఇక్కడ శ్రమ దోపిడీ హెచ్చు. అందుకే ఇక్కడి నుండి హెచ్చుగా వలస పోయే చెమట చుక్కలు చవక. ఇంత జరుగుతున్నా వాళ్లను ముందుకు నడిపించే నాయకులు కొరవడడం ఈ నేల దౌర్భాగ్యం. ఈ వర్తమాన స్థితినంతా కళ్ళకు కట్టినట్లు చిత్రించింది ‘కంచరాన’ కవిత్వం.
“నీటి గింజల పంట” అనే కవిత పాఠకునిలో ఏకకాలంలో ఒక ఉద్వేగం, విషాదం కలిగిస్తుంది. ఏ కవితకైనా వస్తు శిల్పాలు ముఖ్యం. కళింగాంధ్ర రైతును వస్తువుగా తీసుకొని చక్కని శిల్పంతో ఈ కవితను చెక్కాడు కవి. గాజు వస్తువు కొరియర్ పార్సిల్, తుఫాను కర్మాగారపు అలల పోటు లాంటి కొత్త కొత్త పద చిత్రాలు పొదిగాడు. వెలుతురు మీగడ, గుండె గిన్నె, చెమట పిట్ట మొదలైన రూపకాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. స్పష్టత, గాఢత జమిలిగా ఇమిడి ఉన్న మూలంగా ఈ కవిత పాఠకుని గుండెను మెలిపెడుతుంది.
ఇక యుద్ధం గురించి ‘కంచరాన’ వ్యాఖ్యానం చూస్తే మానవ మనుగడ కోసం యుద్ధాలను నివారించడం ఎంత ముఖ్యమో బోధపడుతుంది. చరిత్ర పుటల నిండా మాయని చెరగని యుద్ధపు మరకలే. విరామ చిహ్నం లేని వాక్యం యుద్ధం. ఆనాటి కురుక్షేత్రం నుండి ఈనాటి పాలస్తీనా వరకు ఆరని యుద్ధ జ్వాలలే. ఎడతెరిపిలేని యుద్ధాల గురించి ఈ కవి కార్చిన కన్నీటి బొట్టు జేగురురంగు కన్నీటి బొట్టు కవిత.
యుద్ధం ఎప్పుడూ కన్నీటి కాలమే. టాల్ స్టాయ్ “వార్ అండ్ పీస్” రాసినా, శ్రీనాథుడు పోరు వలన కలిగే నష్టాల గురించి ‘పల్నాటి యుద్ధం’ లో చెప్పినా… ఆగనిది యుద్ధం. రగులుతున్న రావణకాష్టం యుద్ధం. ఎవరు ఎన్ని చెప్పినా పాలస్తీనాలో యుద్ధం జరుగుతూనే ఉంది. మానవుని రణదాహం తీరనిది. పసిపాపలు చదువుకునే పాఠశాలల మీద, రోగులకు ప్రాణం పోసే ఆసుపత్రుల మీద బాంబులు వేస్తూనే ఉన్నారు. ఆయుధాల దాడులలో అమరులైన వారెందరో! ఈనాడు వ్యవసాయ క్షేత్రాలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. యుద్ధంలో ఎప్పుడూ ప్రాణాలు కోల్పోయేది సామాన్య ప్రజలే. యుద్ధం ముగిసి పోయాక పాలించేది రాజులే. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయాక, ఆ నెత్తుటి చిత్తడిలో నుంచి నడిచి వచ్చి, సింహాసనాలను అధిష్టించి, మీసాలు మెలేసేది పాలకులే.
మామూలుగా కన్నీరు ఉప్పగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ కన్నీటి రంగు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? రవికి లేని కన్ను కవికి ఉంటుంది. కాబట్టి కన్నీటి బొట్టు జేగురు రంగులో ఉంటుందని, ఆ కన్నీటి బొట్టే యుద్ధమని ఈ కవితలో చెప్తున్నాడు కవి.
ఈ నేల అంతా శవాల గుట్టలే. అంతటా ప్రవహించేది నెత్తుటి ఏరులే. పరాయి దేశం మీదకు యుద్ధం చేయడానికి అయినా, తనను తాను రక్షించుకోవడానికి అయినా కారణం దొరికి తీరుతుంది. కానీ ఎవరికి ఎప్పుడు చావు ముంచుకొస్తుందోనని భయపడే ప్రజల శోకాన్ని కొలవడానికి పనికి వచ్చే తూనికరాళ్లే ఇక్కడ దొరకవని కవి బాధపడతాడు. పరస్పర ద్వేషాలతో ఈ భూమిని రణరంగంగా మార్చిన సమరాలకు స్వస్తి పలకడం ఆధునిక యుగ లక్షణం కావాలంటాడు. యుద్ధోన్మాదుల్ని జయించడం తక్షణ కర్తవ్యం అని కవి ప్రబోధిస్తున్నాడు.
యుగాలుగా కొంతమంది యుద్ధోన్మాదుల వలన నేల తల్లి బాధపడుతూనే ఉంది. ఈ హింస ఇష్టం లేని ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. మట్టి బెడ్డల గుండెపై, నెత్తుటి తలగడ మీద తలవాల్చి, శవపేటికల చుట్టూ పూచిన సంతాప దుక్కుల్ని శాసిస్తోంది నేల - అంటూ దుఃఖానికి చాలా కొత్తదైన అక్షర రూపం ఇస్తున్నాడు ఈ కవి ‘కంచరాన’.
ఈ కవి ఎప్పుడూ అన్యాయానికి గురవుతున్న తన ప్రాంతం గురించి, ప్రజల గురించి బాధపడుతుంటాడు. ఉత్తరాంధ్ర ప్రాంతం కవి ‘కంచరాన’కు సొంత నేల. అది పూర్వపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలుగా ఉన్న ప్రాంతం. దశాబ్దాలుగా దగా పడిన నేల. ఉత్తరాంధ్రకు ఉత్తర హద్దు, ఒడిశా రాష్ట్ర సరిహద్దు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతం. శ్రీకాకుళం అంటే పోరాటాల పురిటిగడ్డ అని ప్రతీతి. విశాఖపట్నం సాగర తీర సుందర నగరం కాగా, విజయనగరం అంటే గజపతులు పాలించిన రాజరికపు సొగసులని తెలిసిందే కదా.
కానీ అక్కడి సామాన్యుల బతుకు యాతన కటిక చేదుమయం. విశాఖపట్నం తీరం తుఫానుల నిలయం. విజయ నగరం శ్రీకాకుళం జిల్లాలు కూడా తుఫాను బాధిత ప్రాంతాలు. వీటన్నిటికన్నా భయంకరమైనది ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి. కిడ్నీ జబ్బులతో కునారిల్లుతున్న శాపగ్రస్త నేల ఉద్దానం.
ఉద్దానం గ్రామాల్లో ప్రజలు నడి వయసు నుండే కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. కిడ్నీ రోగుల భవిష్యత్తు అగమ్యగోచరం. ఎన్ని కుటుంబాలు ఈ వ్యాధి మూలంగా వీధిన పడుతున్నాయో లెక్కలేదు.
గుప్పెడు మెతుకుల కోసం వలస బాట పట్టే బతుకు లొకవైపు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మగ్గిపోయే డయాలసిస్ పేషెంట్లు మరోవైపు. ముప్ఫై ఏళ్ల కిందటి వరకు, ఈ ప్రాంతం కూడా ఆరోగ్యవంతంగా పచ్చగా ఉండేది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఊళ్లకు ఊళ్లే పీనుగుల పెంటగా మారిపోయాయి. కిడ్నీలు చెడిపోవడం వలన డయాలసిస్ కోసం వారానికి రెండుసార్లు సమీప పట్టణాలకు ప్రయాణం కట్టక తప్పని స్థితి వారిది. కవిటి మండలంలో కొన్ని గ్రామాల్లో అయితే ఇంచుమించు ఇంటికొకరుగా ఇలాంటి రోగులున్న పరిస్థితి.
మరో పార్శ్వం చూస్తే, కడుపులోకి గుప్పెడు మెతుకులు వెళ్లాలంటే ఏ దుబాయికో, కువైటుకో వలస వెళ్లక తప్పని బతుకులు. భర్త ఒకచోట, భార్య ఒక చోట. దుర్భరమైన జీవితం వారిది.
ఒకప్పుడు కిడ్నీ జబ్బుల ఆనవాలు లేనప్పుడు ఆరోగ్యకరమైన ఉద్దానం ఎట్లా వుందో, ఇప్పుడు ఎట్లా ఉందో, ఆ వ్యాధికి శిధిల చిత్రంగా మారిపోయిన తీరు ఎలా ఉందో చక్కని పద చిత్రాలతో కనుల ముందు ఆవిష్కరిస్తాడు కవి.
వ్యాధి సోకక ముందు ఊరు ఏడు పిక్కల శనక్కాయలా ఉండేదట. మామూలుగా వేరుశెనగ కాయలో రెండు పిక్క లుంటాయి. మహా అయితే మూడు పిక్కలుంటాయి. కానీ అప్పుడు ఏడు పిక్కల శనక్కాయలా వైభవ దశలో ఉండేదంటాడు. ఆ ఏడు పిక్కలు ఉద్దాన ప్రాంతం 7 మండలాలకు (ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపు కొత్తూరు) సూచనగా వాడారన్నమాట. ఒకప్పుడు జీడి మామిడి తోటలు, కొబ్బరి చెట్లతో ఒక హరితవనంలా ఉండేది ఉద్దానం. అగస్తి చెట్లు ప్రతి పెరట్లో చిలకల నెలవులై ఉండేవి. వేటకి వెళ్ళినప్పుడు జాలరి వలల్లో చేపలు కొల్లలు. ప్రతిరోజు తలమీద చేపల గంపతో కేవిటమ్మ (చేపలు అమ్మే మహిళ) ఊళ్లోకి వచ్చేది. అంతటా సంతోషం సంబరం.
ఏ విలోమ రుతువు ఇక్కడ అడుగు పెట్టిందో తెలియదు. ఆ బంగారం లాంటి ప్రాంతం కళ తప్పింది. ప్రతిపల్లె పీనుగుల పెంటగా, ప్రతి ఊరు పుచ్చిపోయిన జీడి పండులా అయ్యింది. ప్రతి ఇల్లు చివికిపోయిన చింతకాయ అయిపోయింది. నిటారుగా నిలబడాల్సిన వాళ్లు నులక మంచాలకు అతుక్కుపోవడానికి కారణం పనితీరు సరిగా లేక శీలావతి చిక్కుడు గింజల్లా మారిపోయిన మూత్ర గండాలేనని ఎరుక కలిగిస్తాడు కవి. ఆ ఊళ్ళ విషాద చిత్రాన్ని రూపు కట్టి చూపిస్తాడు. చావు డప్పులు మోగుతున్న వీధుల్లో ఊరేగే సంధ్యచీకటి లాంటి సాయంకాలం గురించి ప్రస్తావిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళతో వ్యాపారం చేసే మనుషులు ఉంటారు. ఇక్కడి నిరుపేదల ఆస్తుల్ని చవకగా కొట్టేయాలని చూస్తారు. వాళ్ళ చెమట చుక్కలు కారు చౌక. తాకట్టు పెట్టిన యంత్రాలు అక్కడి వారి శరీరాలు. చెన్నై, గోవా, కాండ్ల, వీరావల్ తీరాల్లో వలలో చిక్కుకున్న పడవ కాసిన వెన్నెల వాళ్ళ యవ్వనం అని వర్ణిస్తాడు.
ఉద్దానం ప్రజల బాధామయ జీవన చిత్రాలను చాలా శక్తివంతంగా చిత్రీకరించిన కవిత ఇది.
ఈ కవితలో ఉద్దానం ప్రజల వ్యాధిగ్రస్తతకు, అసహాయతకు చలించిపోయి పాలకవర్గ నిర్లక్ష్యాన్ని, వ్యాపార వర్గాల స్వార్థ పరత్వాన్ని ఎండగడతాడు. స్థానికంగా పండే పంటలను, గింజలను ఉపమానాలుగా, రూపకాలుగా తీసుకోవడం వలన ఈ కవితకు అదనపు శక్తి చేకూరింది. పాఠకుల గుండెల్లో గాఢమైన అనుభూతి కలిగిస్తుంది ఈ కవిత.
‘నవ్వు మరచిన నేల’ అన్న శీర్షిక కూడా ఈ కవితకు నూరుపాళ్ళు న్యాయమైన ఎంపిక.
కవులు ఎప్పుడూ రెండు రకాలు. ప్రజా కవులు, పాలకవర్గపు కవులు. అన్యాయాలను అక్రమాలను నిరసిస్తూ ప్రశ్నిస్తూ పీడితుల పక్షాన నిలబడ్డవాడే ప్రజా కవి. అలాంటి కవిత్వం పది కాలాలపాటు నిలుస్తుంది. అలాంటి ఒక ప్రజల కవే ‘కంచరాన’ అని నిరూపించిన కవిత ఇది.
కంచరాన కవితల్లో ఒక ప్రత్యేకమైన కవిత గండికోట. ఇది యాత్రా కవిత. 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనల్ని కాలయంత్రంపై వెనుకకు తీసుకు వెళ్లి ఆనాటి గండికోట చిత్రాలను చూపిస్తాడు కవి. కోటల్ని జయించాలన్నా, దేశాల్ని జయించాలన్నా సైనికులే యుద్ధాలు చేస్తారు. ఆ సైనికులు ఎప్పుడూ సామాన్య ప్రజలే. వాళ్ల శవాల మీద సామ్రాజ్యాల నిర్మాణం జరుగుతుంది. ఈ కవితలో ఎర్రమల కొండలను, ఆ కొండగుట్టల కందకాల అందాలను చూస్తున్నప్పుడు కవి గుండెల్లో ఏదో తెలియని అలజడి. కోనేటి నీళ్లలో అతనికి కత్తులకంటిన నెత్తురు కడిగిన నీళ్లు కనిపించాయి. ఇంత ఎత్తైన బలిష్టమైన కోట కట్టడానికి, దాన్ని కాపాడటానికి ఎన్ని వేల మంది వీరులు బలయ్యారో అని ఊహించినపుడు ఇక్కడ ఎన్ని చావుల ఎండ కురిసిందో - అనడం కవికన్ను చారిత్రక దృష్టికి పరాకాష్ట. కత్తుల కోనేటిలో నెత్తురు కడిగిన నీళ్లు యుద్ధాల గొంతు తడపడానికే చాల్లేదు అన్న కవితాత్మక వ్యక్తీకరణ చదివి అబ్బుర పడతాం.
మామూలుగా అందరూ ఎత్తైన కోట గోడలు, లోతైన కందక నిర్మాణాలను చూసి ఆ నిర్మాణ చాతుర్యానికి మురిసి ముగ్ధులవుతారు. ఇక్కడ ‘కంచరాన’ కవి చూపు చాలా ప్రత్యేకం. ఆ అందాల వెనుక సామాన్యుల చావుల గురించి, వారి శ్రమ గురించి ఆలోచిస్తాడు. అందుకే పర్యాటకులుగా అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ కవిత చదివితే అదే ఆలోచన పొందడం తథ్యం. ఎంత ఆలోచించదగిన కవిత రాశాడో కదా అనిపిస్తుంది. దేన్నైనా పైపైన చూడడం కాదు లోతుల్ని చూడాలి, వాటి సారాంశాన్ని గ్రహించాలి అని తెలియజెప్పే కవిత ఇది.
కవికి ఎప్పుడూ అనావృష్టితో పంటలు పండని తన ప్రాంతం గురించే బాధ. అక్కడి పేద ప్రజల గురించి, రైతుల గురించి, శ్రామికుల గురించి వేదన. ‘నాగధార’ కవితలో అక్కడ పరిస్థితులనూ, జీవితాన్నీ లోతుగా విశ్లేషిస్తాడు ‘కంచరాన’. వంశధార, నాగావళి లాంటి నదులున్నా ఉత్తరాంధ్ర వర్షాభావ ప్రాంతాల్లో సరిగ్గా పంటలు పండవు.
అక్కడ ఊరించే మబ్బులే కానీ అన్నీ కురవని మబ్బులే. అక్కడి పొలాల్లో అప్పుల పంటలే పండుతాయి కనుక ఆకలి పేగుల నోటికి ముద్ద అందదు అంటాడు. బొడ్లో ఎప్పుడూ వలసకత్తిని దోపుకునే కళింగాంధ్ర చెమట బొమ్మలను నాగధార పదాల్లో బొమ్మకట్టించాడు. గుక్క పట్టి ఏడుస్తున్న పిల్లాడి దాహం తీర్చకుండా, పిట్టలా ఎగిరిపోయింది నాగధార అంటాడు కవి. ఆ పిల్లాడు మరెవరో కాదు ఎండిపోతున్న నారుమడి, నీటి తడి అందని పంటపొలం. పొలాల వైపు కన్నెత్తి చూడకుండా సముద్రం ఒడిలోకి సాగిపోతున్న నదిని చూసి దుఃఖితుడౌతున్నాడు. ఎక్కడ చూసినా నాగధార కన్నీటి చారలే.
మనదేశంలో మామూలుగా ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తుంటాయి. ప్రతి ఎన్నికల్లో ఈ నదుల మీద వంతెనలు కడతామని, ఆనకట్టలు నిర్మిస్తామని హామీలు గుప్పిస్తారు. కానీ చాలామట్టుకు శుష్క వాగ్దానాలు, శూన్య ప్రవచనాలే. పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాదు.
ఈ కవిత నిండా ఉత్తరాంధ్ర బతుకు చిత్రాలున్నాయి. ఏళ్ళు గడుస్తున్నా ప్రగతి శూన్యం. నదులున్నా సాగునీరు అందని దైన్యం. ప్రజల జీవితాలను మెరుగుపరిచే మెరుగైన ప్రణాళికలకు అరకొర విదిలింపులు. వ్యవసాయం మూలపడి విరిగిన నాగళ్ళు, పనుల కోసం యువకులు వలస బాట పట్టడం, ఊళ్ళలో వృద్ధులు మాత్రమే ఇంటి కాపలాగా మిగిలిపోవడం లాంటివి దయనీయంగా చిత్రించ బడ్డాయి. నిత్యం ఎంతో మంది ప్రజలు వలస వెళుతున్నా చూసీ చూడనట్లుండే పాలకవర్గ నిర్లిప్తతను ఎత్తి చూపడం కనిపిస్తుంది. రాతి గుట్టల మధ్య రాజహంసలా సాగిపోతుందని అనుకుంటాం. కానీ మట్టి మిత్రుల మీద కొంచెం కూడా జాలి చూపని రాతి గుండెల్ని నాగధార తిట్టుకుంటూ దోవంతా గొణుగుతూనే ఉంటుందంటాడు కవి. వలసదారుల రద్దు కోసం కలలు గంటూనే ఉంది నాగధార అనే కటిక నిజాన్ని గొప్ప టెక్నిక్ తో చెప్తాడు కవి.

ఇక ‘పూరీడుపిట్ట పాట’ కవితలో దుఃఖ గానం ఒక వైపు, ఆత్మవిశ్వాస ప్రకటన మరో వైపు కనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి, మానవ తప్పిదాలకు బలైపోయే సామాన్యుల విషాద జీవన గాథ అంతర్లీనంగా వినిపిస్తుంది. యుద్ధాల్లోనూ, బతుకు యుద్ధాల్లోనూ భర్తలను పోగొట్టుకొని ఒంటరి పోరాటం చేస్తున్న కళింగ మహిళ జీవన చిత్రం ‘పూరీడు పిట్ట పాట’. ఈ కవిత ఉత్తరాంధ్ర మాండలికంలో రాసిన కవిత. పూరీడు పిట్ట ఒక ప్రసిద్ధి చెందిన పక్షి. ఈ కవితలో నాయకి పూరీడుపిట్ట కోసం వెతుక్కుంటూ ఉంటుంది. కానీ అది ఎక్కడా కనబడదు. ఆ పిట్టను తలుచుకొని తన మామతో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ మామ జీవించి ఉన్నప్పుడు ఈ పిట్టను చూసి పాట పాడేవాడనీ, దసరాకు అందరూ పాలపిట్ట ముఖం చూస్తారు కానీ తను మాత్రం పూరీడుపిట్టనే చూడాలి అనుకుంటుంది. మామకు మనసిచ్చాను అని చెప్పుకుంటుంది. ఇప్పుడు ఆ పాటా లేదు, ఆ పాట పాడిన మామా లేడు. అయినా జీవన సంగ్రామానికి భయపడలేదు. ఒంటరి ఆడదాన్ననీ, దుక్కీ, దుఃఖమూ తప్పనిదాన్ననీ చెప్తుంది. నేను పొలంలో దిగితే పొద్దు వెనక్కి పరిగెత్తాలి అని తన శ్రమశక్తి గురించి నమ్మకంగా ఒక ప్రకటన చేస్తుంది. తను గాదిలో వేసిన గింజల్లా రూపాయి కాసవుతుందని నమ్ముతుంది.
ఆకారంలో పూచిక పుల్లంత ఉన్నా గానీ ఆమెలాంటి బొట్టు చెరిగిన ఆడోళ్ళందరూ గొప్ప సాహసగత్తెలు. లక్షల మంది మగవాళ్ళను పోగొట్టుకున్న కళింగ యుద్ధం నాటి నుండి ఇదే వరస అంటుంది. ఒంటరి వాళ్ళమైనా మేం దేనికీ బెదరం. గుండె బలంతో ఒంటరిగానైనా బండి నెట్టుకొని ముందుకు పోతాం అని గుండెల మీద చేయ్యేసి ధైర్యంగా చెప్తుంది కళింగాంధ్ర మహిళ.
చాలామంది చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసు కుంటారు. చిన్న వయసులో భర్తల్ని పోగొట్టుకున్న కళింగ స్త్రీలు మాత్రం ఏమాత్రం భయపడకుండా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను కాచుకుని కుటుంబాలని ఒంటరిగా ఒడ్డు చేరుస్తుంటారు.
ఒంటరి కళింగ మహిళల సాహస గాథను చారిత్రక మూలాల నుండి పట్టి చూపిన కవిత ఇది.
మరీ ముఖ్యంగా సాహిత్య పల్లకీ మీద ఊరేగే కోయిలకు కాకిని దళిత కవులు ప్రత్యామ్నాయంగా నిలిపారు. పూరీడుపిట్ట కళిగాంధ్ర ప్రాంతంలో కనిపించే చిన్న పిట్ట. దీనిని ఈ కవితలో కళిగాంధ్ర బహుజన స్త్రీలకు ప్రతీకగా తీసుకున్నారు. ఈ వర్ణన ఒక ప్రగతిశీల ఆలోచనా పరుడైన కవి ఆధునిక దృష్టికి నిదర్శనం.
ఈ 21వ శతాబ్దం డిజిటల్ ప్రపంచం. ఆడ, మగ వృద్ధులు, యువకులు అందరూ సెల్ కు, కంప్యూటర్ కు బానిసలే. తింటూ, తాగుతూ, నడుస్తూ బండి నడుపుతూ ఎప్పుడూ అరచేతిలో మొలిచిన మరో అవయవం లాంటి స్మార్ట్ ఫోన్ చేతిలో బందీలు గానే కనిపిస్తారు. “వర్చువల్ వాగులో ఒంటరి పక్షి” అనే కవితలో మనుషుల మధ్య తడి లేనితనాన్ని వర్ణిస్తున్నాడు కవి ‘కంచరాన’. స్నేహం, ప్రేమ, ఆప్యాయతలకు దూరంగా మనిషి ఒంటరిగా మిగిలిపోవడాన్ని చిత్రిస్తున్నాడు.
ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు స్మార్ట్ ఫోన్లు. ఎవరి ఫోన్ లో వాళ్లు బిజీ. ‘సర్వేంద్రియాణాం స్మార్ట్ ఫోన్ ప్రధానం’ అనుకుంటూ తలో దిక్కు ఎవరికి వారు మునిగిపోయాక కలిసి మెలిసి ఉండలేని గాచ్చారం నేను అంటాడు కవి. ఏదీ అక్కర లేనట్టు, దేనిపైనా మక్కువ లేనట్టు, మనసులో ఒక సుడి తిరుగుల తుఫాను కన్ను అని సెల్ఫోన్ తప్ప దేనిమీద ఆసక్తి, అభిరుచి లేనితనాన్ని వర్ణిస్తున్నాడు. ఇది కోరి కల్పించుకున్న ఒంటరితనం. దీని నుండి బయటపడితే బహిరంతర లోకాలని సాంత్వన పరచడానికి ఈ ప్రకృతి సదా సిద్ధంగా ఉందని అభయమిస్తున్నాడు. ఊబిలో కూరుకు పోతున్నట్లు స్మార్ట్ ఫోన్లో మునిగిపోయిన వారు దాన్నుంచి బయటపడితే, ఆ వ్యసనాన్ని వదులుకుంటే అందమైన ప్రపంచం ఆహ్వానిస్తుందని అంటున్నాడు. నీలి తెరల్లో నవ్వుల్ని వెతుక్కుని ఎమోజీలా స్పందించే తడిలేని భావోద్వేగం నేను లాంటి ప్రతీకాత్మక వాక్యాలతో ఈ కవిత పాఠకుల గుండెలపై బలమైన ముద్ర వేస్తుంది.
‘కంచరాన’ కవితలు ఉత్తరాంధ్ర ప్రజల కన్నీటి కథలే కాకుండా, సమకాలీన ప్రపంచాన్ని ప్రతిఫలించే చిత్రాలు. సమాజంలో సగమై ఉన్నా అధికారంలోనూ, పాలనలోనూ దేనిలోనూ సమానం కాలేని స్త్రీలు, అంతం లేని యుద్ధాలు, పచ్చనోట్లకు బానిసలైన మానవులు వీటన్నిటి గురించి ఈ కవి కలత చెంది కవిత్వం అవుతాడు. “ఆమె అస్తిత్వం అంతకు మించి…” అనే కవితలో పురుషాధిక్యతను స్త్రీ ఎత్తి చూపడాన్ని సంభాషణాత్మకంగా కొత్త రూపంలో కవిత చేశాడు. మార్క్స్ గొప్పతనాన్ని “మార్క్స్ వర్తమానం” అనే కవితలో చిత్రించాడు. ఇలా విభిన్న వస్తువుల్ని తన కవిత్వంలో కొత్తగా విశ్లేషించడం ‘కంచరాన’ ప్రత్యేకత.
నిత్యజీవితంలో మనకు అనేకమంది వికలాంగులు, అంధులు కనిపిస్తారు. చాలామంది కన్నా అంధులు బాగా పాడతారు. వారి పాట కచేరీలు ఆపాత మధురాలు. అలాంటి ఒక కచేరిని “మృదుల నేత్ర గానం” అనే కవితలో వినిపిస్తాడు కవి. ముసుగులేమీ లేకుండా, స్పష్టంగా ఆ అంధగాయకులు తమ గురించి తాము చెప్పుకుంటున్నట్టు కవిత నడుస్తుంది. పాటలనూ, ఆటుపోట్లనూ ఒకేలా స్వరపరిచే పంచమస్వరాల కువకువలో, తెరిచీ తెరవని మృదుల నేత్రులం అన్న మాట లోతెంతో ఆలోచిస్తే ఔరా అనిపిస్తుంది. లూయి బ్రెయిలీ శిష్యులం మేము, హెలెన్ కెల్లర్ వారసులం అని చెప్తారు ఆర్కెస్ట్రా బృంద సభ్యులు. సప్త స్వరాల సమ్మిళితమైన సంగీతాన్ని ఏడు పాదాల్లో చక్కగా, చిక్కగా, సరికొత్తగా అభివ్యక్తి నవ్యతతో పలికించాడు కవి. ఈ కవిత అల్లిక విషయంలో కవి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాడు. కవిని అభినందించకుండా ఉండలేం. నిషాద, దైవత, పంచమ, మధ్యమ, గాంధార, రిషభ, షడ్జమ స్వరాల లహరులు వినిపించి పాఠకులను మైమరిపిస్తాడు.
నిత్యం కవిత్వంతో మమేకమై కవిత్వమే ప్రాణమైన కవి ఇతడు. ఏ వస్తువునైనా కవిత్వం చేయగల రసవిద్య ఎరిగిన కవి. కంచరాన భుజంగరావు ఆధునిక మానవ జీవన సంక్లిష్టతలను ప్రతిబింబించే మంచి కవితలు రాశాడు. ఎవరి గురించి రాయాలో, ఎలా రాయాలో, ఎందుకు రాయాలో, ఎప్పుడు రాయాలో తెలిసిన కవి. మరెన్నో కవితా సంపుటాలు రచించి, తెలుగు కవిత్వంలో తన స్థానాన్ని, సంతకాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నాను.
చదువరుల సౌలభ్యం కోసం…
-
అగస్తి చెట్టు అంటే:- పెళుసుగా ఉండే వంట చెఱకు కోసం వాడే చెట్లు. ఉత్తరాంధ్ర పల్లెల్లోని పెరట్లో ఉంటాయి. (ఉదా:- బాదం, ములగ మొదలైనవి, పెళుసు చెట్లు)
-
పూరేడు పిట్ట అంటే:- కౌజుపిట్ట జాతికి చెందినది. కౌజుపిట్ట కన్నా రెండింతల పరిమాణంలో చిన్నది. దీనిని ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువారు ‘గుండ్రీపిట్ట’ అంటారు. తూర్పు కనుమలు ఈ అడవిపిట్టలకు నెలవు. శీతాకాలంలో గింజలు ఆహారంగా తినడానికి పొలాల్లోకి వస్తాయి. వేటగాళ్ళు, మాంసాహారులు వీటిపై ఎక్కువ మక్కువ చూపడం వల్ల ఇవి కూడా అంతరించే దశలో ఉన్నాయి.
-
జేగురు రంగు అనగా:- ఎరుపు రంగు (లేదా) రక్తం రంగు

