కేంద్ర విద్యా శాఖా మంత్రి శ్రీ‌ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నీట్ పరీక్ష తాలూకు ఆందోళనలకు తెర పడింది. ప్రభుత్వంతో కాక్రోచ్ ప్రతినిధులు చర్చలకు ముందే మంత్రి రాజీనామా చేయడంతో వివాదం ముగిసింది. ఇది యువత విజయంగా కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) సంబరాలు చేసుకుంది. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలదే విజయమని ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి.మరో రెండు డిమాండ్లు నెరవేర్చే వరకూ తాము వేచి ఉంటామని సీజేపీ ప్రకటించింది. నీట్ పరీక్షా పత్రం లీకేజితో కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని, పోలీసులపై విచారణ జరపాలని కాక్రోచ్ జనతా పార్టీ( సీజేపీ) డిమాండ్ చేస్తున్నది. విద్యా వ్యవస్థ ప్రక్షాళనే తమ అంతిమ లక్ష్యంగా ఆ పార్టీ పేర్కొన్నది. ఇది యువత విజయమని సామాజిక కార్యకర్త వాంగ్ చుక్ హర్షం వ్యక్తం చేశారు.

36 రోజులుగా జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.“ఏ ఒక్క విద్యార్ధి భవిష్యత్ దెబ్బతినకూడదన్నదే నా సంకల్పం” అని ప్రధాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నీట్ పరీక్షా పత్రం లీక్ తో విద్యా వ్యవస్థ విఫలమైనదని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతాపార్టీ ప్రారంభించిన ఉద్యమం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. గత వారం రోజులుగా పార్లమెంట్ సమావేశాలు నీట్ ప్రశ్నాపత్రం లీకేజి రగడతో సజావుగా సాగ లేదు. వరుస వాయిదాల పర్వాలు నడిచాయి. నీట్ పరీక్షా పత్రం లీకేజిపై పార్లమెంట్లో చర్చించాలని,కేంద్ర విద్యా మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నిరసన ర్యాలీ చేసింది. వేలాది మంది విద్యార్ధులు,యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. లాఠీచార్జి బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న కాక్రోచ్ లలో అసాంఘిక శక్తులు ప్రవేశించి విధ్యంసం సృష్టించారని పోలీసులు ఆరోపించారు. విద్యార్ధులు అనే జాలి దయా లేకుండా లాఠీలతో తలలు పగులగొట్టారని, పదుల సంఖ్యలో ఆందోళనకారులకు గాయాలు తగిలాయని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. వీరిపై పెల్లెట్ గన్స్,షాట్ బ్యాటన్లు ప్రయోగించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూరం నుంచి వీటిని ప్రయోగించారని అంటున్నా, అవి చాలా ప్రమాదకరమైనవనే ఆరోపణలు వచ్చాయి.ఈ సంఘటనలో గాయపడిన వారు ఉన్నారు. గతంలో జమ్ముకాశ్మీర్ లో ఘర్షణల సందర్భంలో కూడా ఉపయోగించారని , అయితే, అప్పటీలో అది వివాస్పదం కావడంతో ప్లాస్టిక్ బుల్లెట్లు వాడుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీలో వాటిని ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు, ఆందోళనకారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారంటూ విడుదలైన వీడియోలు కలకలం సృష్టించాయి. ఆందోళనకారులకు మద్దతుగా సామాజిక కార్యకర్త వాంగ్ చుక్ నిరాహారదీక్ష చేశారు. విద్యార్ధుల పై పోలీసులు,కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీలు రాహుల్,ప్రియాంక ఆధ్వర్యంలో పార్లమెంట్ కు నిరసన ర్యాలీ చేశాయి. విద్యా శాఖా మంత్రి రాజీనామా చేయాలని, పార్లమెంటులో నీట్ పరీక్షా పత్రం లీకేజీ పై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక అరెస్ట్ కూడా జరిగింది.వారి అరెస్ట్ లపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి . కాగా, పోలీసులు కాక్రోచ్ లపై కేసులు నమోదు చేశారు. అసాంఘిక శక్తులు కాక్రోచ్ సమూహంలో చేరి విధ్యంసం సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు పెట్టారు. చివరకు పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం దిగి వచ్చినా, విద్యామంత్రి రాజీనామా చేయాలని, రాజీనామా తరువాతే చర్చ అని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. విద్యార్ధులపై కేసులు ఉపసంహరిస్తే తాను నిరాహారదీక్ష విరమిస్తానని వాంగ్ చుక్ చెప్పినా ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదు. లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని, దానిని సరిదిద్దడం కోసమే మళ్లీ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేశామని, దానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిన అవసరం లేదని కేంద్రం సమర్ధించుకుంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎవరికి వారు తమ పంతమే నెగ్గాలని పట్టుపట్టాయి . నీట్ పరీక్షా పత్రం లీకేజీతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని,వారి ప్రాణాలు తీసుకువస్తారా అని, జరిగిన సంఘటనలకు ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రతిపక్షాలు, ,కాక్రోచ్ పార్టీ ప్రశ్నించాయి. విద్యావ్యవస్థ పూర్తిగా విఫలం అయినందుకు జవాబుదారీతనం కోరుతున్న విద్యార్థులు,యువతపై లాఠీచార్జి అమానుషమని ప్రతిపక్షాలు, కాక్రోచ్ పార్టీ విమర్శించాయి. ప్రతిపక్ష ఎంపీలు నల్ల బాడ్జీలతో పార్లమెంటుకు హాజరయ్యారు. విద్యార్ధులపై పోలీసుల దమనకాండకు హోంమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాహుల్ ఇంటి వద్ద ఇండియా కూటమి పార్టీలు సమావేశమై అక్కడి నుంచి రాజ్ ఘాట్ వరకూ ర్యాలీ నిర్వహించాయి. గాంధీ మహాత్ముడి సమాధి వద్ద కొవ్వోత్తులు వెలిగించారు.

ఇదిలావుండగా, విద్యార్ధులపై పోలీసుల దమనకాండపై విచారించాలని సుప్రీంకోర్టు,ఢిల్లీ హైకోర్టులలోని న్యాయవాదులు కోరగా సుప్రీం కోర్టు సీజే జస్టీస్ సూర్యకాంత్ అందుకు నిరాకరించారు. ఢిల్లీ హైకోర్టు కూడా పోలీసులపై వచ్చిన ఆరోపణపై విచారణకు నిరాకరించింది. న్యాయవ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలంటే విచారణ చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేశారు. కాగా, జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతాపార్టీకి చెందిన విద్యార్ధి,యువతకు రోజురోజుకూ ఢిల్లీ ప్రజల మద్దతు పెరిగింది. స్వచ్ఛందంగా ప్రజలు జూమోటో,స్విగ్వీల ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ ఆందోళనకారులకు ఆహారం అందించారు. మరికొందరు స్వయంగా వచ్చి మద్దతు పలికారు. తల్లిదండ్రులు,సినీ ప్రముఖులు కూడా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థులకు మద్దతు ఇచ్చారు. జంతర్ మంతర్ చుట్టూ ఉన్న మెట్రో స్టేషన్లను మూసి వేయడం, ఇంటర్నెట్ ఆపివేయడంపై కూడా విమర్శలు వచ్చాయి.

ఎట్టకేలకు ధర్మేంధ్ర ప్రధాన్
రాజీనామాతో ఆందోళన సద్దుమణిగింది. ఏది ఏమైనా విద్యామంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతాపార్టీకి యువతలో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ప్రభుత్వం కూడా సీజేపీతో చర్చల్లో సానుకూల వైఖరి ప్రదర్శించడం వల్ల వివాదం సమసిపోయింది. మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి. సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశిద్దాం.