ఏ కాలమైనా ఏలికల వైపు నిలబడే వాళ్లు, పాలితుల పక్షాన నిలిచే వారు రెండు రకాల రచయితలు ఉంటారు. రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయమని, బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూళలకిచ్చి ఆ పడుపు కూడు తిననని ఢంకా బజాయించి చెప్పిన సాహస కవులు నాడూ నేడూ ఉన్నారు.
ఆధిపత్య భావజాలాలు రాజ్యమేలే అణచివేతల యుగంలో పెత్తందారీ సమాజంలో ఎంతో మంది బాధితులు, పీడితులు. ఎప్పుడూ తమ వైపు మొగ్గు చూపని న్యాయం తరాజు. బానిసల యుగం అంతరించినా ఇంకా బానిసలగానే తొక్కి వేయబడుతున్న స్త్రీలు, దళితులు.
ఇలాంటి పరిస్థితుల్లో అన్యాయాలకు గురై, అక్రమాల చెరలో మగ్గుతున్న వారి పక్క నిలుస్తూ తమ అక్షరాలతో అగ్ని జ్వాలలు రగిలించే వారు కొందరు. అటువంటి వెన్నెముక కలిగిన కొందరు రచయితల రచనల సంకలనం “విభా ప్రభాతములు” . తెలుగు సాహిత్యంలో 13వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం వరకు వచ్చిన ప్రగతిశీల ధోరణులకు అద్దం పట్టిన పుస్తకం ఇది. మామూలుగా సంకలనాలు అంటే ఏదో ఒక ప్రక్రియకు మాత్రమే పరిమితమవుతాయి. కాని ఈ పుస్తకం కథ, కవిత, పద్యం, నవల, వ్యాసం, మొదలగు విభిన్న ప్రక్రియలకు చెందిన రచనల సమాహారం. ఓల్గా, కల్పనా కన్నా భిరాన్ ఈ సంకలన సంపాదకులు. సిరీశ్ సంపాదకులు గణేశ్ దేవి. ఎంతో విలువైన ఈ పుస్తకాన్ని ఓరియంట్ బ్లాక్ స్వాన్ వారు ప్రచురించారు. మరో విశేషమేమిటంటే Voice of Resistance పేరుతో ఈ పుస్తకం ఆంగ్లానువాదం కూడా ప్రచురించారు.
ఈ పుస్తకంలో మొట్టమొదటి రచన తిక్కన విరచిత పద్యం. కొందరి రచనలు నిత్య సత్యాలు. మనకి ఏ పనులు అయితే అయిష్టమో అలాంటి పనులు ఇతరుల పట్ల చేయకూడదని అర్థం ఇచ్చే “ఒరులేయవి” పద్యం అందరినీ అలరిస్తుంది. కవిత్వం కేవలం పురుషుల సొత్తేనని, స్త్రీలకు దానిలో వాటా లేదని శాసించిన రోజుల్లో అందరికీ సులభగ్రాహ్యమైన శైలిలో రామాయణం రచించి కవిత్వపు మల్లెలు పంచిన మొల్ల రామాయణంలో “సుడిగొని రామ పాదములు సోకిన” పద్యం ఆకట్టుకుంటుంది.
మూఢాచారాలను నిరసిస్తూ, కుల మత ద్వేషాలను ఎండగడుతూ, ఆటవెలదిలో అనంతరూపాన్ని చూపి మనుషులందరూ ఒకటేనని వేమన ప్రశ్నిస్తాడు:
మాలవాని నేల మరి మరి నిందింప
ఒడల రక్త మాంసమొకటి కాదె
వానిలోన మెలగు వాని కులంబేది
దుఃఖ భూయిష్టమైన మానవ జీవితాలలో ఆనందాల వెన్నెలలు ఒలకాలని కృష్ణశాస్త్రి ఆశావహంగా చెబుతాడు:
శీతవేళ రానీయకు
శిశిరానికి చోటీయకు
పూలకారు ఏనాటికీ పోనీయకు పోనీయకు
జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త!
ఈ కవిత మనసును ఆహ్లాద డోలికల్లో ఊగిస్తుంది.
“అడుగుజాడ గురజాడ” అని పేరు పొందిన గురజాడ, ముత్యాలసరము అనే కొత్త ఛందస్సును సృష్టించి ఇలా అంటాడు:
ఎల్ల లోకము ఒక్కయిల్లై
వర్ణభేదములెల్ల కల్లై
వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ
దిగంబర కవులలో ఒకడైన చెరబండరాజును తలుచుకుంటే గుర్తుకు వచ్చే కవిత:
దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది
ఎండిన స్థనాల మీదకి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
ఈ కవిత ఇప్పటికీ ప్రాసంగికత కోల్పోలేదు. ఆ ప్రశ్నల బాణం ఇప్పటికీ మన గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుంది.
కవిత్వమే జీవితమై శ్వాసిస్తున్న కవి శివారెడ్డి. “ఉరితీత”లో:
కొరత వేసిన కొయ్యలోంచి శ్రీనాధుడు మాట్లాడతాడా
శివారెడ్డి మాట్లాడతాడా
కొరతల్లేవని చెప్పే కొలువుకూటమిలో
లోలోపల నిన్ను ఉరితీసే కార్యక్రమం మొదలయిన వేళలో
అన్నిటికీ సిద్ధమై ఉందాం
అని కనబడని రాజ్యహింస గురించి బొమ్మ కట్టిన కవిత మన మనసును కలవరపరుస్తుంది.
జై జవాన్ జై కిసాన్ అని సైనికులతో పాటు రైతులకు జై కొడతారు కానీ అనేక సందర్భాల్లో అన్నం పెట్టే అన్నదాతల పైనే సాయుధ ప్రయోగం చేస్తారు పాలకులు. వరవరరావు “మేల్కొంటున్న పొలాలతో ఎన్కౌంటర్” కవితలో:
నీళ్లయిన నెత్తురు
కన్నీళ్లు అయిన నెత్తురు
తానే చింది
ప్రవహించడం
అనుభవిస్తున్నారు ఇప్పుడు
ఇప్పుడు తమ వసంతపు
వేసంగి పొలాలకు
నీళ్లు పెట్టడానికి
రైతాంగం సాయుధమవుతున్నది
అన్నప్పుడు మనసంతా చేదు తిన్నట్లు అనిపిస్తుంది.
తరతరాల నుంచి, యుగయుగాల నుంచి ఆధిపత్య కులాల చేతిలో దళితులు అవమానాలు పొందారు. ఆ అహంకారాన్ని నిరసిస్తూ దళిత కవిత్వ ఉద్యమం వచ్చింది. తన “కొత్త కల”లో ఎండ్లూరి సుధాకర్ ఇలా హెచ్చరిస్తాడు:
ఈ పంచభూతాల తోలువొలిచి
ఆకాశానికో మేకు
పాతాళానికో మేకు
సప్త సముద్రాల మీద
చర్మాన్ని నానబెట్టిన నీకు
ఆ సూర్యచంద్రులు చెరో చెప్పు కావలసిందే
పైడి తెరేష్ బాబు “చెవిటి పెద్ద మనుషులకో శంఖం”లో “ఒకే రక్తాన్ని పంచ రంగుల వర్ణ చిత్రంగా వక్రీకరించిందెవడని అడుగుతున్నా” అని ప్రశ్నిస్తాడు.
మద్దూరి నగేష్ బాబు తన ఆక్రోశాన్ని ఇలా అక్షరీకరిస్తాడు:
బురద మట్టిలో ఇరుక్కున్న గింజల్ని కూడా
సులక సూత్రంగా ఊడ్చే నువ్వు
ఈ కులాల కల్లంలో మిగిలిపోయిన
ఈ విషపు గింజల్ని నాకొదిలిపోయావంటే
ఖాజా “ఏకే కులం”లో ఇలా అంటాడు:
పాలిపోయిన దూది లాంటి పొగ
నన్ను కఫనై కమ్ముకుంటే
ఏక కులం కలిగిన మత పరీక్ష నాళికలోంచి
నేను ఏకే కులస్తుడిగా రెండో పుటక పుట్టాను
మహాకవి శ్రీశ్రీ “వ్యత్యాసం” కవిత ఎప్పటికీ అజరామరం:
అదృష్టవంతులు మీరు
వెలుగును ప్రేమిస్తారు
ఇరులను ద్వేషిస్తారు
మంచికీ చెడ్డకీ నడుమ
కంచు గోడలు ఉన్నాయి మీకు
“మేరా భారత్ మహాన్”లోని డొల్లతనాన్ని ఆనాడే ఎండగట్టిన అంత్యప్రాసల ఆరుద్ర కవిత “మన స్వతంత్రం మేడిపండు మన దరిద్రం రాచపుండు”, తాత్విక జీవనకవి బైరాగి “ఆడుకుంటున్న బాలిక”, తిలక్ “సైనికుడి ఉత్తరం”, “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అని తెలంగాణ వీణపై కవితలను మీటిన దాశరథి, “విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది” అని “అమరత్వం”లో మాట ఇచ్చిన శివసాగర్, దళితుల పక్షాన తన గళం నినదించిన బోయి భీమన్న “గుడిసెలు కాలిపోతున్నాయి”, కాళోజీ “పునరావృతి”, నండూరి సుబ్బారావు గారి “నమిలి మింగిన నా యెంకి”, జాషువా “గబ్బిలము”, బసవరాజు అప్పారావు గారి “ప్రేమ తత్వము” ఖండికలు కవిత్వం పట్ల అనురక్తిని కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు పూలచెండ్లు విసురుకున్నట్లు చక్కని సంభాషణలతో కథను నడిపించి తెలుగు భాషకు ప్రాణం పోసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి “అరికాళ్ళ కింద మంటలు", “స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి దానికి జ్ఞానం ఇవ్వాలి" అన్న చలం రాసిన స్త్రీకి “మొదటి మాట”, ఇప్పటికీ ప్రాధాన్యం కోల్పోని కనుపర్తి వరలక్ష్మమ్మ “చట్టసభల్లో మెజారిటీ మీదేగా”, ఒకప్పుడు దళిత స్త్రీలు రవికలు తొడుక్కొని వీధుల్లో నడవటమే నేరమైన ఘటనల గురించి కుసుమ ధర్మన్న"గుండెలదిరిపోయే ఘోరాలు", యజ్ఞం కథతో కథాభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న కారా మాస్టర్ గా అందరికీ పరిచితులైన కాళీపట్నం రామారావు గారి కథ “వీరుడు మహావీరడు", స్వీయ వ్యక్తిత్వం కోసం, ఉనికి కోసం పోరాడే కథానాయికలను సృష్టించిన పి.సత్యవతి గారి “పేరు లేని పిల్ల” రాయలసీమ ప్రాంత కరువు పరిస్థితులను రైతుల కష్టాలను చిత్రించిన సీమ రచయిత సింగమనేని నారాయణ “మకర ముఖం,” స్వాతంత్య్రానంతర దేశంలో నాలుగు అక్షరాలు నేర్చుకోవటానికి కూడా పోరాడవలసిన దళిత బాలికల జీవన చిత్రాన్ని చిత్రీకరించిన అక్కినేని కుటుంబరావు “సొరాజ్జెం”, ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించడం నేర్పి, హేతువాద రచయితగా పేరు పొందిన త్రిపురనేని రామస్వామి చౌదరి గారి “మను బృహస్పతుల సంవాదం” ఆలోచనలను మేల్కొల్పుతాయి. అరవైలలో రచయిత్రుల రచనలన్నీ ఇంటికీ, కుటుంబానికే పరిమితమయ్యాయి. ఆ సమయంలో సమాజంలోని సమస్యలపై తన దృష్టిని మళ్లించి శక్తివంతమైన రచనలు చేసిన వాసిరెడ్డి సీతాదేవి “రాబందులు- రామచిలకలు”, సమకాలీన న్యాయవ్యవస్థలోని అన్యాయాలను తన పదునైన కత్తుల్లాంటి అక్షరాలతో నిలదీసిన రాచకొండ విశ్వనాథశాస్త్రి “న్యాయం", దళిత జీవితాలలోని చీకట్లను వర్ణించిన ఉన్నవ లక్ష్మీనారాయణ “మాలపల్లి”, “మాకొద్దీ తెల్ల దొరతనము" అని తెల్ల వారిని ధిక్కరించిన గరిమెళ్ళ సత్యనారాయణ అన్యాయకాలము, “తొలి తెలుగు కథారచయిత్రి బండారు అచ్చమాంబ “ధన త్రయోదశి”, సురవరం ప్రతాపరెడ్డి “గ్యారాకద్దూ బారా కోత్వాల్”, కొడవటిగంటి కుటుంబరావు “కొత్త పద్ధతులు”, గోపీచంద్ “హిందూ పాతివృత్యం”, వట్టికోట ఆళ్వార్ స్వామి “ప్రజల మనిషి”, పొట్లపల్లి రామారావు “ఊరు అడవి” పాఠక హృదయాలను చైతన్యపరుస్తాయి.
80వ దశకంలో తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపిన స్త్రీవాద ఉద్యమం, తర్వాత వచ్చిన దళితవాదం, మైనారిటీవాదంలో ప్రభావం కలిగించిన రచనలు, ఆయా రచనలతో తమ బలమైన ముద్రలు వేసిన కవుల కవితలు చదివింప చేస్తాయి.
పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు ఎప్పుడూ రెండవ తరగతి పౌరులే. ఇక్కడ వ్యవస్థలో స్త్రీలంటే శరీరాలే. వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదు. దీనిని విమల మోర్తాల “దిగంబరుల ఊరేగింపు”లో ఇలా అంటారు:
మనం మగ పిల్లల్ని కనే మంచి తల్లులం
మనం పగలు పతివ్రతలం
మనం రాత్రి దుస్తుల్ని విప్పే వేశ్యలం
మనం ఎండకన్నెరుగని అసూర్యంపశ్యలం
మనం అంగాంగం పరిచే అర్ధనగ్న వ్యాపార సుందరులం
చరిత్రలో వీరులు, మహాపురుషులు ఎక్కువ మంది పురుషులే. మన ఇళ్లల్లో కూడా సాహసవతులైన స్త్రీలు అమ్మమ్మలు, నాయనమ్మలు ఉంటారు. “మావ్వ బడి”లో వాళ్ళ అవ్వ గొప్పతనాన్ని గురించి అనిశెట్టి రజిత చెబుతుంది:
ఆమె కండలను కరిగిస్తూ నెత్తురు మరిగిస్తూ
చెమట ధారలతో ప్రకృతిని అర్చించే పూజారిణిలా
తన వాళ్ల కడుపుకూటి కోసం
ఆకలి శత్రువుతో అనుదినం పోరాడుతున్న యోధురాలిగా
పితృస్వామ్య వ్యవస్థలో పతియే ప్రత్యక్ష దైవం అని అన్నారు. కంటికి కనబడే దేవుడనీ అన్నారు. “సర్ప పరిష్వంగం” కవితలో ఎం. హైమవతి ఇలా చెబుతుంది:
అంతా బాగానే ఉంటుంది
అప్పటివరకు
కామంతో నైతేనేమి
మోహంతో నైతేనేమి
ఈ లోకాన్నే మరిచిపోయిన
అమృత ఘడియలలో
అక్షర తూణీరం నుంచి
ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు
“జీతమెప్పుడిస్తారు”
ఆనందించాల్సిన సమయంలో అంకెల ప్రసక్తి తీసుకువచ్చి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేననీ, ఆఖరికి ఆ సమయంలో కూడా అంకెల ప్రసక్తి తెచ్చిన విషాదాన్ని ఈ కవిత వివరిస్తుంది. మూసపోసిన ధోరణులు, పాత పడికట్టు పదాలు, నిలువ నీరు లాంటి భావాలు కాకుండా, బడుగు జీవుల బతుకుల్లో కూడా కాసింత వెన్నెల కురవాలనీ, న్యాయం నక్షత్రాలు అప్పుడప్పుడైనా, అక్కడక్కడైనా వెలగాలని సమసమాజం రావాలని పరితపించే పాత, కొత్త రచయితల రచనలు అన్నింటినీ ఒకే చోట చదవడం బాగుంటుంది. 89 మంది ప్రతిఘటనా స్వరాలను ఒక చోటే చదవటం, మనసుకు విందు భోజనం ఆరగించినంత ఆనందం. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, మధురాంతకం రాజారాం, ముద్దుపళని, జాషువా, గంటేడ గౌరునాయుడు, గోరటి వెంకన్న, కత్తి పద్మారావు మొదలగు వారి రచనలు చదువుతుంటే వాళ్ళతో ముఖాముఖి మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. సుమారు 8 శతాబ్దాల సాహిత్యంలో ప్రభావవంతమైన రచనలను ఏర్చి కూర్చడం ఒక యజ్ఞం చేసినంత పని. ఈ బృహత్కార్యాన్ని నిర్వహించిన అందరికీ అనేకానేక అభినందనలు. తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఒక కరదీపిక. సాహితీ ప్రియులు ప్రతిఒక్కరూ చదవవలసిన పుస్తకం. ప్రతి విద్యాసంస్థ లైబ్రరీలో ఉండదగిన అవసరమైన సంకలనం.

