సూర్యోదయం కావడానికి ఇంకా దాదాపు ఓ గంట వ్యవధి ఉంది. చాలా ఇళ్లల్లో ఇంకా జనం ముసుగుదన్ని నిద్ర పోతున్నారు. హేమంత రుతువు… చలి బాగానే ఉంది. కోటయ్యదాసు నిద్ర లేచాడు… చప్పుడు చెయ్యకుండా… పక్కనే నిద్ర పోతున్న భార్య కాంతమ్మకి నిద్రా భంగం కలుగుతుందేమోనన్న భయంలాంటి జాగ్రత్తతో మంచం ఏ కిర్రు చప్పుళ్లూ చెయ్యకుండా లేచాడు.
అతడు ఎంత జాగ్రత్త పడ్డా భార్య కాంతమ్మకి మెళుకువ రానే వచ్చింది, కానీ లేవలేదు. అరమోడ్పు కన్నులతో భర్తని చూసింది. అతడు దండెం మీదున్న తువ్వాలు తీసుకుని పెరట్లోకి వెళ్లాడు. ఆమె చప్పుడు చెయ్యకుండానే విసుక్కుంది. నిరాసక్తంగా పెదవీ విరిచింది. ఏమిటీ మనిషి తత్త్వం!?..పనికిమాలిన ఆ వారసత్వాన్నే పట్టుకు వేళ్లాడతాడు?..! అని మళ్లీ విసుక్కుంది.
కోటయ్యదాసు పెరట్లోకి వెళ్లి వేపపుల్ల విరుచుకుని దంతదావనం కానిచ్చి, నూతిలో చల్లటి నీళ్లు తోడుకుని స్నాన చేశాడు. అలా స్నానం చేస్తున్నంత సేపూ అతడు నోట్లో ఏవో మననం చేస్తూనే ఉన్నాడు. లోపలికొచ్చి తలుపు కిర్రు చప్పుడు చేయకుండా అతి జాగ్రత్తగా వేశాడు. గూట్లో ఉన్న దేవుడి ఫొటోముందు నిల్చుని ఓ రెండు నిముషాలు దండం పెట్టుకున్నాడు. డండెం మీదున్న తెల్లంచు ఎర్రపంచె తీసి కట్టుకున్నాడు. నుదుటన విభూది పెట్టుకున్నాడు. అలాగే మోచేతుల పైనా, కిందా కూడా విభూది తీర్చి దిద్దుకున్నాడు. ఆ పైన తిరునామం పెట్టుకున్నాడు. తలకి ఓ తెల్లటి తువ్వాలు గట్టిగా చుట్టుకున్నాడు. శుభ్రంగా తోమి గూట్లో పెట్టుకున్న రాగి పాత్రని తలమీద పెట్టుకున్నాడు. హరిదాసు ఆహార్యం పూర్తయింది.
ఆ మసక వెల్తురులోనే ఒకసారి తనకితాను తల మాత్రమే, అస్పష్టంగా కనిపించే అద్దంలో చూసుకున్నాడు. సంతృప్తిలాంటి ఓ చిరు నవ్వు అతడి పెదవుల మీద ఓ క్షణంపాటు నాట్యం చేసింది. మూలనున్న తంబూరా తీసుకుని భుజంమీద పెట్టుకుంటూ భార్య కాంతమ్మ మంచం దగ్గరికి వెళ్లి నెమ్మదిగా: “కాంతం… కాంతం…” అని పిలిచాడు. ఆమె కళ్లు తెరచింది.
“నే…వెళ్లొస్తా…” అన్నాడు. " …" అన్నదామె. మళ్లీ అంతలోనే లేస్తూ: “ఓ చ్చనం ఆగు…” అన్నది. కోటయ్యదాసు ఆగాడు. ఆమె గబగబా లేచి పక్కనున్న చిన్న గదిలోకెళ్లి ఓ చిన్న గిన్నె తెచ్చి అతడికి ఇచ్చి అన్నది: “ఏవన్నా తినమంటే తినవు… తినకూడదంటావ్… మైలున్నర నడిచెల్లి…ఆ ఊల్లో ఇల్లిల్లూ తిరిగి… మల్లీ నడిచొస్తావు… నీరసం వొస్తాది కదా… ఈ మజ్జిగ తాగెల్లు…”
భర్తని చూపిన ఆ ఆప్యాయతకి, అనురాగానికి కోటయ్యదాసు కరిగిపోయాడు. అమాంతం ఆమెను దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. కానీ తానిప్పుడు హరిదాసు వేషంలో ఉన్నాడు. కాదు…దీక్షలో ఉన్నాడు. ఆ గిన్నె అందుకుని దాదాపు గ్లాసున్నర పైగా ఉన్న ఆ మజ్జిగని తాగాడు. గూట్లో ఉన్న దేవుడికి మళ్లీ ఓ దండం పెట్టి, పక్కనే ఉన్న చిడతలు అందుకుని: “ఓ నమో నారాయణా…” అంటూ కీర్తన అందుకుని చిడతలు వాయిస్తూ, తంబూరా మీటుతూ బయల్దేరాడు కోటయ్యదాసు.
అలా వెళుతున్న భర్త… కోటయ్య దాసుని అభావంగా చూస్తూ రెండుచేతులూ జోడించింది కాంతమ్మ… ఆ జోడింపు దేవుడికో, భర్తకో ఆమెకే తెలీదు! ఇంకో నాలుగేళ్లు దాటితే కోటయ్య అరవయ్యోపడిలో పడతాడు. తాతముత్తాతల నుంచీ అతడిది హరిదాసుల కుటుంబం.
తన ముత్తాత, ఆ పైనాయన తరతరాలుగా ఆచరిస్తున్న వృత్తి పరమైన హరిదాస’ జానపద కళనే నమ్ముకున్నారు. భక్తితో, గౌరవంతో, దీక్షతో క్రమం తప్పకుండా హిందువుల పెద్ద పండగ అని పిలిచే సంక్రాంతికి ముందు ఇంచుమించు ధనుర్మాస ప్రారంభానికి అటూ ఇటూగా నెలపట్టే రోజు నుంచి నెల రోజుల పాటు హరిదాసులు గ్రామాల్లో తెల్ల వారు ఝాము నుంచీ హరినామ సంకీర్తనలతో సందడి చేయడం ఆయా ప్రాంతాలలో అనవాయితీగా వస్తున్న ఓ కళారూపం… ఆచారం!
వారు హరినామ సంకీర్తనలు పాడుతూ ఇంటింటికీ వెళ్లడం, ఆ ఇంటి వారు ఆ హరిదాసు నెత్తిమీదున్న గిన్నెలో తమకు తోచింది, సాధారణంగా బియ్యం వెయ్యడం… అలా బియ్యం వెయ్యడం చిన్న పిల్లలకి చాలా సరదా అయిన ఓ కార్యక్రమం. ఆ మాటకొస్తే హరికథలూ, బుర్రకథలూ, ఆబాలగోబాలాన్నీ కడుపుబ్బ నవ్వించే కొమ్మదాసరులూ, జంతర్మంతర్పెట్టెలూ, పిట్టలదొరా వగైరా ఎన్నో…ఇవన్నీ ఒకనాటి జానపద కళారూపాలే.
భారత, రామాయణ, భాగవత, పురాణ కథలూ ఇంకా అనేక స్త్రీల నోములు, వ్రత కథలూ, గాథలూ, చారిత్రక యుద్ధాలు ఈ జానపద కళాకారుల వల్లనే ఆనాడు ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. కాలక్రమేణా సామాజిక పరిణామాల నేపథ్యంలో సాంకేతిక परिజ్ఞాన వెల్లువలో ఈ కళారూపాలు క్రమంగా కనుమరుగయ్యాయి! వాటిలో హరికథలు మాత్రం అక్కడక్కడా నేటికీ బతికి బట్ట కడుతున్నాయి.
కోటయ్యలాంటి నిబద్ధతగల కళాకారులు మాత్రం ఎన్ని ఒడిడుకులు, చీత్కారాలు ఎదురవుతున్నా, వయసు మీదబడుతున్నా వారసత్వంగా…ఆస్తులు సంపాదించుకోలేకపోయినా… ఈ కళారూపాలను మాత్రం భారంగా మోస్తూనే ఉన్నారు. తన తరువాత తన కొడుకు వెంకటేశం ఈ వారసత్వ కళారూపాన్ని అందుకుంటాడని ఎంతగానో ఆశించాడు కోటయ్యదాసు. కానీ అతడు కాదన్నాడు.
‘ఇప్పుడెవడిక్కావాలియనీ… సినిమాలూ, టీవీలు, సెల్ఫోన్లూ వొచ్చేసి జనవంతా అటు పరుగెడతుంటే…ఈ భజన్లూ కీర్తన్లూ… యేటి నాన్నా ఇంటింటికీ యెల్లి అడుక్కోవడం?!’ అని తీసి పారేశాడు. కొడుకు మాటలకి తన భార్య కాంతమ్మా: ‘అవును… ఆడు మాస్టారుద్యోగం చేత్తన్నాడు…ఎందుకీ పని?’ అని కొడుకుని వెనకేసుకొచ్చింది. 'ఇది అడుక్కోండం కాదురా! జానపద కళ…ఆ విష్ణుమూర్తి కీర్తనలు జనంలోకి తీసికెళ్లడం… అని కోటయ్యదాసు ఆ హరిదాసు కళారూపాన్ని వివరించడానికి ప్రయత్నించినా వాళ్లు వినిపించుకోలేదు.
అంతేకాదు ‘నువ్వు చేత్తున్న టైలరింగు పని చాలు…వయసొచ్చింది కదా… ఇంగ మానెయ్యి నెత్తిమీద గిన్నెట్టుకుని అడుక్కోవడం…’ అని భార్య కాంతమ్మ చాలా కాలంగా పోరు పెడుతూనే ఉంది. వాళ్లే కాదు-ఇవన్నీ జానపద కళారూపాలే అని ఇప్పటికీ చాలా మందికి తెలీదుసరికదా ఊరూరా అనేక జానపద కళారూపాల్ని ప్రదర్శించే వాళ్లని ముష్టివాళ్లుగానే తేలిగ్గా చూస్తారు! తన కుటుంబ వారసత్వ సంపద అయిన ఈ ‘హరిదాస’ కళారూపం తనతోనే అంతరించిపోతుందన్న దిగులు ఈ మధ్య కోటయ్యదాసుని మనసులో దొలిచేస్తూనే ఉంది.
కానీ తన బాధని అర్ధం చేసుకునే వాళ్లు ఎవరూ ఇంట్లో లేరు. చాలాసార్లు తన కొడుకు వెంకటేశానికి చెప్పి చూశాడు. విసుక్కున్నాడు. చివరికి అంతెత్తున ఆగ్రహించి మళ్లీ ఎప్పుడూ తన దగ్గర ఈ ప్రస్తావన తీసుకు రావద్దని అరిచాడు. ఆరోజు కోటయ్యదాసు నిలువెల్లా కృంగిపోయాడు. ఓ రెండుమూడురోజులు అతడికి అన్నం తినబుద్ధి కాలేదు. కాంతమ్మ రెండు రోజులు భర్త అవస్థని చూడలేక విసుక్కుంది. తర్వాత నచ్చజెప్పింది… ‘ఆడన్నట్లు ఇప్పుడీ యేసాలూ గట్రా కడుపు నింపుతున్నాయా ఏమన్నానా? మీ తాత మీ నాన్నకిచ్చాడు. మీ నాన్న నీకిచ్చాడు…నువ్వు దీన్ని మోస్తన్నావు… కాలం మారిపోయింది కదయ్యా… ఆడు కాదంటన్నాడు… వొదిలెయ్యి… యేదీ యేటెల్లకాలం వుండదు గదా!’ అంటూ ఓదార్చింది.
‘అవును… ఉండదు…’ అని కోటయ్యదాసు సరిపెట్టుకున్నాడు. ప్రతి సంవత్సరం డిసెంబరు నెల వస్తోందంటే చాలు దిగులు గండెల్లో కెలకడం మొదలెడుతుంది. సంక్రాంతి పండగ వెళ్లేంత వరకూ ఆ దిగులు అలా కెలుకుతూనే ఉంటుంది. ఆరోజు తెల్లవారు ఝామునే కోటయ్యదాసు మామూలుగా హరిదాసు వేషంలో ఇంటి నుంచి ‘ఓం నమో నారాయణా…’ అంటూ కీర్తన అందుకుని బయల్దేరాడు.
పక్క ఊళ్లో రెండు గడపలు داటాక: 'నను బ్రోవమనీ చెప్పве సీతమ్మ తల్లీ… నను బ్రోవమని చెప్పవే… నా మాటా కాదంటూ నాకొడుకూ… ఈ బాటా వద్దంటూ నన్నొదిలీ పోతుంటే…నేనేటీ చేసేది రామచంద్రా… నను బ్రోవమనీ… టక్కున ఆగిపోయాడు కోటయ్యదాసు. ఏమిటి తాను పాడుతున్నది?! భక్త రామదాసువారి కీర్తన పాడుతూ… తన మనసులోని బాధని… ఆ కీర్తనలో కలిపేసి…ఎంత అపచారం చేసేడు తాను… అపచారం చేసేశాడు. రెండు చెంపలూ వాయించుకున్నాడు. ఉదయిస్తున్న సూర్య బింబానికి నమస్కరించాడు. అప్రయత్నంగా అతడి కళ్లు చెమ్మగిల్లాయి. తన మనసు ఎంతగా చెదరిపోయిందో అతడికి బాగా అర్ధమయిందప్పుడు. ఈ భారం తగ్గేది కాదని సమాధాన పడ్డానికి ప్రయత్నించాడు. సాధారణంగా హరిదాసులు ఇంటిదగ్గర కీర్తన పాడటం ప్రారంభించాక తిరిగి ఇంటికి వచ్చే వరకూ మధ్యలో ఎవరితోనూ మాట్లాడరు…ఏమీ పట్టించుకోరు…నెత్తిమీద గిన్నె బియ్యంతో నిండిపోతే ఎవరో ఒకరింట్లో ఆ నిండిన గిన్నెని ఖాళీచేసి, హరిదాసు తన దీక్ష చివరి రోజున ఆ బియ్యానికి మరి కొంత చేర్చి ఆ ఇంటి వారు ఇస్తారు. అయితే చెదరిన మనసుతో కోటయ్యదాసు ఆరోజు ఎక్కువ వీధులు తిరగలేకపోయాడు. రోజూకన్నా ముందుగానే ఇంటికి వచ్చేశాడు.
ఇంటికి రాగానే భార్య టీ ఇచ్చింది. స్కూలుకి వెళ్లడానికి తయారైన మనవడు కిరణ్ నవ్వుతూ తాతకేసి చూశాడు. నవ్వుతూ తాత దగ్గరికి వచ్చాడు. “బడికెళ్తన్నావురా కిరణూ?” మనవడిని అడిగాడు కోటయ్య.
“ఊ…” అంటూ వాడు తాత పక్కనున్న తంబుర తీసుకుని తీగలు మీటాడు. అవి టింగ్ టింగ్మని శబ్దం చేశాయి. మళ్లీ మీటాడు. శృతులకనుగుణంగా కోటయ్య మనవడి చెయ్యి పట్టుకుని తంబుర మీటించాడు. వాడు గలగలమని నవ్వేశాడు. “సాయంత్రం నేర్పు తాతా…” అన్నాడు.
“అలాగే లేరా…బడికెళ్లు నువ్వు…” అన్నాడు కోటయ్య మనవడి బుగ్గలు నిమురుతూ. తాతకి టాటా చెప్పి వాడు బడికెళ్లిపోయాడడు.
“కుర్రోడు మా హుషారైనోడే కాంతం…” వెళుతున్న మనవడినే చూస్తూ అన్నాడు కోటయ్య. కిరణ్ కిప్పుడు పదేళ్లు. ఐదో తరగతి చదువుతున్నాడు. అలా అప్పుడప్పుడు కోటయ్య దగ్గరికి రావడం, తంబూరా మీటడం, చిడతలు వాయించడం చేస్తూంటాడు. ‘యియన్నీ నీకెందుకురా…’ అని నానమ్మ కాంతం అంటూంటుంది. వాడి తల్లి, ఆ ఇంటి కోడలు అయిన పూర్ణమ్మ మాత్రం నవ్వుతూ చూస్తూంటుంది. సాధారణంగా ఆమెకి ఏమీ పట్టవు. రూపాయి ఆదాయం వచ్చే పనైతేనే ఆమె పట్టించుకుంటుంది తప్ప ఇతర విషయాలవైపు ఆమె కన్నెత్తి చూడదు. ఆమెదంతా అదో తత్త్వం అంటూంటుంది కాంతమ్మ.
తరాలు మారుతుంటే ఆచారాలు, వ్యవహారాలు, అన్నీ మారిపోతుంటాయి. ఏదీ శాశ్వతం కాదు. తాతలనాటి ఆచారాలు, మనవళ్ల తరానికి వచ్చేసరికి ఎంతగానో మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ‘మా చిన్నప్పుడిలా కాదురా…’ అని తాతలు అంటుంటే అదోలా నవ్వుకుంటున్నాం. ‘ఇప్పుడు కాలం మారిపోయిందిలే…’ అని సర్దిచెప్పేస్తున్నాం. తేలిగ్గా తీసిపారేస్తున్నాం. కానీ, కాలం మారిపోలేదు. కాలం అలానే ఉంది. చైత్రం… వైశాఖం… జనవరి… ఫిబ్రవరీ… అవే నెలలు తిరుగుతూనే ఉన్నాయి. మారింది మనుషుల తత్త్వాలు… ధోరణులు. భూగోళం నలుమూలల నుంచీ, నాలుగు దిక్కులకీ వీస్తున్న కొత్త గాలులు, తెస్తున్న కొత్త పోకడలు మన ధోరణులను మార్చేస్తున్నాయి. దానికి మనం ఆధునికం అనీ… కొత్త నాగరికత అనీ…ఏవేవో పేర్లు…మనకనుగుణంగా పెట్టేసుకుంటూ ఆ కొత్త దారులంట పరుగెడుతున్నాం… తప్పదు…మనిషి జీవితం ఓ చక్రభ్రమణం!
రాత్రి ఏడుగంటలప్పుడు పెరటిలో వేపచేట్టు క్రింద నులమంచం మీద పడుకుని ఆకాశంకేసి చూస్తూ ఆలోచనల అలజడిలో విసుగ్గా అటూ ఇటూ దొర్లుతున్న కోటయ్య దగ్గరకొచ్చాడు మనవడు కిరణ్. “ఏంట్రా… చదూకోడం అయిపోయిందా?” అనడిగాడు మనవడిని దగ్గరికి తీసుకుంటూ. "ఆఁ… అయిపోయింది… నాకు తంబూరా నేర్పుతానన్నావ్…’ అన్నాడు మనవడు కిరణ్.
“నేర్చుకుందూగాన్లేరా…” అన్నాడు కోటయ్య. “ఇప్పుడే నేర్పు…” మారాం చేశాడు కిరణ్. ఎప్పుడూ లేంది వాడలా మంకు పట్టు పట్టడం కోటయ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. “ఇప్పుడు కాదులే…” అన్నాడు. మనవడు ఊరుకోలేదు. “నాకు నేర్పు…” కాళ్లు నేలకేసి బాదుతూ అన్నాడు.
“అదికాదురా…అయినా ఇప్పుడు అది నీకెందుకు?.. నువ్వు బాగా చదూకోవాలగానీ…” “చదూకుంటున్నాగా…హెూం వర్కు చేసేశాను. తంబూరా నేర్పు…” వాడు అదే ధోరణిలో మారాం చేశాడు. “అడుగుతూన్నాడుగా…నేర్పండి… ఇప్పుడేటవుద్ది నేర్పితే…” కోడలు పూర్ణమ్మ అటుగా వెళుతూ అన్నది మామతో. ఆమెకేసీ ఆశ్చర్యంగా చూశాడు కోటయ్య. “ఆడు సరదా పడతన్నాడుగా… ఏదో నేర్పు…” అన్నది అక్కడే గట్టుమీద కూర్చుని బియ్యం ఏరుతున్న కాంతమ్మ.
తంబూరా మీదనో, తన వ్యాపకం మీదనో వాళ్లకి మోజు కానేకాదు… తన కొడుకు అడుగుతున్నాడని పూర్ణమ్మ, తన మనవడు సరదా పడుతున్నాడని కాంతమ్మ వాడికి నేర్పమని తనకి చెప్పారని కోటయ్య బాగానే అర్ధం చేసుకోగలిగాడు. అంత మాత్రం చేత అతడికి ఉత్సాహం తన్నుకు రాలేదు. తను ఇంకా కాదని కూర్చుంటే కిరణ్ చేసే యాగీ అంతా ఇంతా కాదని అతనికి తెలియంది కాదు. వాడు అడిగింది ఇవ్వాల్సిందే… చెప్పింది చెయ్యాల్సిందే. ముఖ్యంగా వెంకటేశం వాడికి అంత గారాబం చేశాడు. ఎందుకంటే వాడు చదువులో చాలా చురుకు! కోటయ్య మంచం మీదనుంచి లేచాడు తంబూరా తీసుకు రావడానికి.
“తంబూరా…నే తెస్తా…” అంటూ కిరణ్ పరుగెట్టుకెళ్లి తంబూరాని జాగ్రత్తగా మోసుకొచ్చాడు. మంచం మీద కూర్చున్నాడు. తంబూరాని అతడి వడిలో కోటయ్య పెడుతుంటే కాదని, తన తాత ఎలా భుజంమీద పెట్టుకుంటాడో అలాగే పెట్టుకున్నాడు కిరణ్… నువ్వు మొయ్యలేవురా…’ అని కోటయ్య అంటున్నావినిపించుకోకుండా. తంబూరా పడిపోకుండా ఒకచేత్తో తనూ పట్టుకుని, మనవడి చేతి వేళ్లు తీగలమీద మీటించడం నేర్పాడు కోటయ్య. కిరణికి సరదాగా అనిపించింది. తాను అలా మీటుతుంటే అవి పలికే శబ్దాలు అతడికి చాలా సరదాగానూ అనిపిస్తున్నాయి. తాతకేసి, నానమ్మకేసి, అమ్మకేసీ నవ్వుతూ చూశాడు.
“సాల్లే సంబడం…” అన్నది నానమ్మ నవ్వుతూ. పూర్ణమ్మ కొడుకుని ప్రేమగా చూసుకుంది…వాడు ఏపనైనా ఇట్టే నేర్చేసుకుంటాడు…’ అనుకుంటూ. ఆ దృశ్యం చూడ్డానికి వెంకటేశం అప్పుడు ఇంట్లో లేడు. అలా వాడిని చూసిన కోటయ్యదాసుకి వడలు పులకరించిపోయింది. కిరణ్ అలా తీగలు మీటుతూన్న వాడల్లా చటుక్కున లేచి తంబూరా గట్టిగా పట్టుకుని. తాత కోటయ్యదాసు నడుస్తున్నట్లు తంబూరా మీటుతూనే నడిచాడు. తంబూరాని ఎక్కడ పడేస్తాడోనని కోటయ్య కంగారు పడిపోయాడు.
“వొరేయ్…మనింట్లో ఓ చిన్న తంబూరా ఉండాలి… నేను చిన్నప్పుడు నేర్చుకోడానికి మా నాన్న తీసుకొచ్చాడు… ఉండు అదెక్కడుందో చూస్తా…” అంటూ మనవడి భుజంమీదున్న తంబూరాని తీసి మంచంమీద పెట్టి, భార్య కాంతమ్మ కేసి తిరిగి: “అదెక్కడుందే…అదే చిన్న తంబూరా…” అనడిగాడు.
“ఏవో…ఆ పాత సామాన్లకాడ పారేశాం…” కాంతమ్మ అన్నది. కోటయ్య అటుగా వెళుతుంటే: “ఇప్పుడయన్నీ కెలికి దాన్ని తిత్తావే…?” అన్నది. భార్య మాట వినిపించుకోలేదు కోటయ్య. ఆ పాత సామాన్లు తీసి, అడుగున పడున్న చిన్న తంబూరాని పైకి తీశాడు కోటయ్య. ‘ఈయనో పిచ్చి మాలోకం…’ అనుకుంది కాంతమ్మ. దాన్ని శుభ్రం చేశాడు. తెగిన తీగల్ని బిగించాడు. “బాగుంది…బాగుంది…” గెంతులేస్తూ అన్నాడు మనవడు కిరణ్. అది భుజంమీద పెట్టుకున్నాడు కిరణ్. ఇందాకట్లానే మీటుతూ ‘రామనామం… రామనామం…’ అని నోటికొచ్చింది పాడుతూ తాత కోటయ్యలాగానే అక్కడ కలయ తిరిగాడు…కోటయ్య మనసారా నవ్వుకున్నాడు. కాంతమ్మా, పూర్ణమ్మా కుర్రచేష్టలని సరదా పడ్డారు…
మర్నాడు ఆదివారం… మామూలుగా ఏడుగంటలు దాటితేగానీ నిద్ర లేవని కిరణ్ ఆరోజు తెల్లవారు ఝామున ఐదున్నర గంటలకే లేచి కూర్చున్నాడు. తన హరినామ సంకీర్తనా కార్యక్రమానికి సిద్ధమవుతున్న కోటయ్య దగ్గరికొచ్చి: “తాతా”…నేనూ వత్తా నీతో…" అన్నాడు కిరణ్. ఆ మాటకి కాంతమ్మ చటుక్కున మంచం మీదనుంచి లేచి మనవడి కేసి చూసింది.
“నానమ్మా…నేనూ యెడతా… నేనూ యెడతా…” అంటూ ఏడుపు లంకించుకున్నాడు. వాడు ఏదైనా మంకిపట్టు పడితే ఇల్లు పీకి పందిరి వేసేస్తాడని ఇంట్లో అందరికీ తెలిసిందే. వాడిగోలకి వెంకటేశం, పూర్ణమ్మా లేచొచ్చారు. “ఏట్రా? పొద్దునే నీ గోల?” అని వెంకటేశం విసుక్కున్నాడు కొడుకు మీద. “మీ నాన్నతో ఆడూ యెళతాట్ట…” కాంతమ్మ చెప్పింది. “యెక్కడికెళ్తావ్… యెదవకానా…” అన్నాడు వెంకటేశం. “యెల్లు యెదవా…నాల్గుమైల్లు నడిచే సరికి కాళ్లు పీక్కుపోతాయ్…” అన్నది పూర్ణమ్మ.
“నే నడుస్తా…నే యెలతా తాత్తోని…” కిరణ్ ఇంకా గట్టిగా ఏడుస్తూ అన్నాడు. వెంకటేశం ఒక్కటి తగిలించాడు. మరో దెబ్బ వెయ్యబోతుంటే కాంతమ్మ అడ్డం పడింది… “వొరే వెంకటేశం…ఆడు ఏదో సరదా పడతన్నాడు… నువ్వు బండిమీద తీసుకురా… ఆడిని ఓ రెండీధులు తిప్పుతాను… తీసుకు వెళ్లిపోదుగాని…” మధ్యేమార్గంగా చెప్పాడు కోటయ్య. “ఆ పని చెయ్యి ఆడు మళ్లీ యెలతాననడు…” పూర్ణమ్మ అన్నది. “అవున్రా… రెండీధులు తిరిగితే ఆడి మోజు తీరిపోద్ది…మళ్లీ యెలతాననడు…” కాంతమ్మ అన్నది. వాడి మాట కాదంటే ఎంత కొట్టినా, తిట్టినా వాడు ఆరోజంతా ఏడుస్తూనే ఉంటాడు. అది వాళ్లకి బాగా అనుభవమే… “యెల్లు యెదవా…” అన్నాడు వెంకటేశం…ఆ క్షణం అతడికి చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. టీవీలో దృశ్యాలు, పేపర్లలో వార్తలు… చాలా గుర్తుకొచ్చాయి. పెద్దపెద్ద జీతాలు తెచ్చుకునే ఐటి ఉద్యోగాలు వదులుకుని గ్రామాలలో వ్యవసాయం మీద దృష్టి పెట్టిన ఇంజనీర్లు, ఇతర ఐటి ఉద్యోగస్తుల వార్తలు గుర్తుకొచ్చాయి. ఇంకేమీ మాట్లాడలేదు. 'ఒక్కరోజు వెళ్లినంత మాత్రాన కొంపలేం మునిగిపోతాయి గనక …வாడి జీవితం ఏ బాటలో వెళ్లనుందో… చిన్న చిన్న అభిరుచుల్ని ఎందుకు కాదనాలి? కాదని ఆ చిన్నారి మనసుల్ని ఎందుకు గాయపర్చాలి?.. అనుకున్నాడు ఉపాధ్యాయ వృత్తిదారుడైన వెంకటేశం.
కొడుకు ఆ మాట అనడమే తరువాయి కోటయ్యదాసు గబగబా గదిలోకి వెళ్లి పెట్టి అడుగున ఉన్న చిన్న కండువాలు రెండు తీశాడు. మనవడికి పంచెలా కట్టాడు. తలకి చుట్టాడు. చేతులకి, నుదుటికీ విభూది పెట్టాడు. నెత్తిమీద చిన్న గిన్నె పెట్టాడు. చిన్న తంబూరా వాడి భుజాన పెట్టాడు. “వొరే…నీకు చిడతలు లేవుగానీ… ఇలా చిడతలు వాయించినట్టే అను…” అని చెప్పాడు కోటయ్య. మనవడు కిరణ్ని, కొడుకుని అలా చూసేసరికి తల్లిదండ్రులకీ, మనవడిని అలా చూడగానే నానమ్మ కాంతమ్మకీ ముచ్చటగా అనిపించింది. స్కూల్లో ఫ్యాన్సీడ్రెస్సు వేసినట్లు నిజంగానే ముచ్చటగా ఉన్నాడు కిరణ్… కోటయ్యదాసు మనవడు! బాల హరిదాసు!
“సెల్ఫోన్లో ఓ పాటో తియ్యి…” భర్తకి చెప్పింది పూర్ణమ్మ, వెంకటేశం రెండుమూడు వైపుల నుంచి ఫొటోలు తీశాడు. తీసిన ఫొటోలు తల్లిదండ్రులకీ, భార్యకి, కిరణ్ కి చూపించాడు. “భలే ఉన్నాడే బాల హరిదాసు!” కాంతమ్మ వాడి బుగ్గలు నిమిరి, మెటికలు విరిచింది. వీధిలో కోటయ్యతోబాటుగా తంబుర మీటుతూ ఏవో పాడుతూ వస్తున్న చిన్న హరిదాసుని చూసిన జనం భలేగా సంబర పడిపోయారు. పిలిచి మరీ వాడి గిన్నెలో బియ్యం వేశారు. మూడిళ్లకే గిన్నె నిండిపోతోంది. వాడిని చాలా మంది సెల్లో ఫొటోలు తీశారు. కొందరైతే వాడితో సెల్ఫీలు దిగారు. రెండు వీధులు తిరిగేసరికి వాడూ అలసిపోయాడు. ఊరంతా తిరిగి కోటయ్య ఎంత సంపాదిస్తున్నాడో… ఆ రెండు వీధులకే బాల హరిదాసు చలవతో అంతే సంపాదించేశాడు.
“యే…ఆడ్ని పిలిచి మరీ ఇచ్చారా?!” భర్త చెప్పిందంతా విని నిర్ఘాంతపోయింది కాంతమ్మ. మనవడిని దగ్గరికి తీసుకుని ముద్దులు కురిపించింది. ఏదో కలలో ఉన్నట్లు వెంకటేశం ఇటు కొడుకుని, అటు తండ్రిని చూస్తూన్నాడు. పూర్ణమ్మ ఇంత ఉప్పుకల్లు తీసుకొచ్చి కొడుక్కి దిష్టి తీసింది. అలసిపోయిన కిరణ్ నానమ్మ ఇచ్చిన పాలగ్లాసు అందుకుని గడగడా తాగేశాడు. వేషం మార్చుకుని పంచె కట్టుకుని వచ్చిన కోటయ్య మనవడి పక్కనే కూర్చున్నాడు. వాడి తలమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు. ‘చాలు… తన వేషం… వారసత్వంగా మనవడు… ఒక్కసారి వేశాడు… అది చాలు…’ అనుకున్నాడు. ఇప్పుడతడు గుండెల నిండా గాలి పీల్చుకుని సంతృప్తిగా వదిలాడు…

