మెహెర్ బాబా గజల్ కవితలు

రచయిత…యామిజాల జగదీష్

నేను మద్రాసులో చదువుకుంటున్నరోజులలో మెహర్ బాబా గురించి కొన్ని విషయాలు మా కాలేజీ లైబ్రరీలో ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్లో చదివాను. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు చదివానేమో. కాని బాబాపై ఎక్కువ దృష్టి మళ్ళించలేదు.

అయితే, కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ లో బెస్ట్ బుక్ సెంటర్ (పాత పుస్తకాలు అమ్మే దుకాణం)లో నాకు మెహర్ బాబా గజల్ కవితల పుస్తకం తెలుగులో కనిపించడంతోనే కొనేసుకున్నాను. పుస్తకం పేరు “ధూళిగా మార్చే ప్రేమ పథం”. తెలుగులో అనువాద కర్త - దీవి సుబ్బారావుగారు. ఈయనను నేనెరుగుదును. అంటే చూడటం వరకే. పాత్రికేయులు జి. కృష్ణ గారి ఇంటికి వచ్చిపోతున్న రోజుల్లో దీవి సుబ్బారావుగారిని చూసేవాడిని. కొన్నిసార్లు వారి మధ్య జరిగే సంభాషణలూ వినేవాడిని.

ఏదో అనుకోనిదేదో జరిగినంత ఆనందం కలిగింది తెలుగులో బాబా గజల్ కవితల పుస్తకం దొరకడం. ఇంటికి మహదానందంగా వచ్చి పుస్తకం పూర్తిగా చదివాను.

2008 లో ఎన్.వి.వి. సత్యనారాయణగారు ఈ పుస్తకాన్ని ముద్రించారు.

ఇందులో 361 గజల్ కవితలతో పాటు మెహర్ బాబావారి జీవిత విశేషాలూ ఉన్నాయి. ప్రతి భావమూ విశేషమే.

మెర్వన్ షెరియార్ ఇరానీ 1894లో మహారాష్ట్రలోని పూనాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు జొరాష్ట్రియన్ మతానికి చెందిన వారు. ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభించిన తర్వాత ఆయన ఐదుగురు ఆధ్యాత్మిక గురువులను కలిశారు. ఆయన కాలేజీలో ఉండగానే ఓ గొప్ప సంఘటన జరిగింది. అది హజరత్ బాబా జాన్ ను కలవటమే. ఆమె ఓ సనాతన ముస్లిం మహిళ. ఆమెతో మెహర్ బాబాకు భగవంతుడి సాక్షాత్కారం కలిగింది. మానవ రూపంలో ఉన్న భగవంతుడిగా ఆయన తనను తాను గుర్తుంచుకొనేటట్లు చేసింది. ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి ఆకర్షితులై కొందరు శిష్యులుగా చేరారు. వాళ్ళే ఆయనకు మెహర్ బాబా అని పేరు పెట్టారు. మెహర్ అంటే “దయ గల” అని అర్థం. “బాబా” అంటే తండ్రి అని అర్థం.

హఫీజ్, షేక్ స్పియర్, పి.బి. షెల్లీ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివిన మెహర్ బాబాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.

అనంతరం ఉపాసినీ మహారాజ్ తో ఏడేళ్ళు ఉన్న తరువాత మెహర్ బాబా 1922 లో తన శిష్యులతో కలిసి ముంబైలో మన్సిల్ - ఇ - మీమ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఆయన భాష ప్రేమభాష

1925 నుంచి తన తుదిశ్వాస విడిచే వరకూ దాదాపు నలభై నాలుగేళ్ళపాటు ఆయన మౌనదీక్ష పాటించారు. చేతి సైగలతోనూ, ఇంగ్లీష్ అక్షరమాల ఉన్న పలక ద్వారా ఆయన తన అభిప్రాయాలను తెలిపేవారు. వాటిని ఆయన శిష్యులు మామూలు భాషలోకి తర్జుమా చేసేవారు.

భగవంతుడు మనందరిలోనూ ఉన్నాడని, దేనికీ ఆందోళన చెందకూడదని ఆయన చెప్పేవారు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ దీవించేవారు. ఇవన్నీ కూడా ఆయన సైగల ద్వారానే తెలియజెప్పేవారు.

అప్పుడప్పుడు రైల్లో ప్రయాణం చేసేవారు.కొన్నిసార్లు బహుదూరం నడిచేవారు.

1959 లో మెహర్ బాబా ఓ ట్రస్టుని ప్రారంభించారు. ఈ ట్రస్ట్ తరఫున ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఆయన తమ జీవితంలో రెండు సార్లు తీవ్ర ప్రమాదానికి గురయ్యారు.

ఆయన తన 75వ ఏట అంటే 1969లో తనువు చాలించారు.

మెహర్ బాబా అందజేసిన గజల్ కవితలకు దీవి సుబ్బారావుగారి అనువాదాలు కొన్ని…

1

నీవు ఎడారి నీవు ఇసుక రేణువు నీవు చంద్రుడు నీవు సూర్యుడు నీవు బిందువు నీవు నీరు నీవు సముద్రం నీవు ఒడ్డు

2

ప్రపంచంలో నాలా ప్రేమించే వారు లేరు నీలా ప్రేమించబడేవాడు లేడు. అయితే నీవు తప్ప ఇంకెవ్వరూ ఉండని తన్మయత్వపు ప్రపంచం ఎక్కడ ఉంది?

3

నీ ప్రేమ మహాసాగరంలో దూకడం ఇంకా నేను నేర్చుకోలేదు ఒడ్డున ఎన్నో కష్టాలు కాచుకుని వున్నవి, ఈదటానికి ధైర్యం చాలటం లేదు.

4

నీవు నా పాటవి నా ప్రాణానివి అయినా గాని నీ కొరకు నేను వెదికే ముందు అనంతమైన నా అస్తిత్వాన్ని నేను తెలుసుకోవాలి

5

ప్రియుడా, నీ ప్రేమలో నేను పూర్తిగా మరణించాను. మాటా పలుకూ లేకుండా నా సమాధిలో నిదురపోతున్నాను.

6

నీ ప్రేమ మూలంగా నేను ప్రపంచానికి పూర్తిగా పనికి రాకుండా పోయాను దాని దృష్టిలో నేను పనికి రానందుకే ఇప్పుడు నేను పూర్తిగా నీకు ఉపయోగానికి వచ్చాను

7

బాధంటే ఏమిటో నిజంగా ఎవరికైనా తెలుసా? ప్రతిక్షణం మరణిస్తున్నాను తిండి తిన లేను నిద్రపోలేను ప్రియుని నుండి ఎడబాటు నన్ను చంపుతున్నది

8

నా కన్నీళ్ళు నిన్ను కదల్చలేవు. కాని ప్రియుడా దుమ్ముగా మారిన నా అహంకారపు కన్నీళ్ళ మాటేమిటి? నీవు అనంతమైన క్రూరుడివి పూర్తిగా రాతిగుండె వాడివి

9

ప్రియుడా నీవు నన్ను ప్రపంచానికి పనికి రాకుండా చేశావు కాని నా మధుమత్తుత వల్ల నీకు కొంచెమైనా పనికి వస్తున్నాను

10

మధువు నేను కోరలేదు దయతో వాడే నాకిచ్చాడు ఏమి దయ! వట్టిపోయిన బ్రతుకు వాడి పాదాల దగ్గర అర్పణమైంది