ఊహ తెలియకుండానే అమ్మ ఆలనకు దూరమై, అల్లరి చిల్లరగా తిరుగుతూ, చదువు అంతగా అబ్బని బుడతడు అంతర్జాతీయ స్థాయిలో జగత్ జట్టీగా మన్ననలు అందుకోవడం అపూర్వం. చలన చిత్రాలలో చూపించే విన్యాసాలకు మించి ఆయన ప్రదర్శించారనడం ఈ తరానికి అబ్బురమనిపించవచ్చు. ఆయనే తెలుగు బిడ్డ… కోడి రామమూర్తి నాయుడు… ‘తిండి కలిగితే కండ కలదోయ్/కండగలవాడే మనిషోయ్’ అన్న మహాకవి గురజాడ మాటలకు నిలువెత్తు నిదర్శనం. ఇంతకీ ఆయన శాకాహార ప్రియులు.
ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాటి కుగ్రామం వీరఘట్టంలో వెంకన్ననాయుడు దంపతులకు జన్మించిన రామమూర్తి అనంతర కాలంలో ఇంగ్లండ్ బకింగ్ హ్యామ్ ప్యాలెస్‌లో ఐదవ జార్జి చక్రవర్తి సమక్షంలో తన శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించి వారిని విస్తుగొలిపారు. ఆ విద్య అభ్యసన, ప్రదర్శన, దాని వెనుక ఆయన కఠోర పరిశ్రమ, దాని పట్ల అంకితభావం ఎన్నదగినవి. ఆంజనేయుడి భక్తుడిగా, సీతారాం బాబా శిష్యుడిగా యోగ విద్యను నేర్చారు. ప్రతి మంగళ, శనివారాలు ప్రత్యేక పూజలు చేసేవారు.
కుమారుడిని బాగా చదివించాలన్నది తండ్రి వెంకన్ననాయుడు తాపత్రయం. రామమూర్తికి చదువంటే అయిష్టం. పైగా తోటిపిల్లలతో నిత్యం ఏదో ఒక గొడవ పడేవాడు.ఒకసారి ఇంటి నుంచి అడవిలోకి పారిపోయి వారం తరువాత ఒక పులి పిల్లను చంకనెత్తుకొని మరీ వచ్చాడు. దానిని గ్రామమంతా తిప్పి చూపాడు. చిన్నప్పుడే తల్లి కాలం చేయడం, భయభక్తులు లోపించడంతో విసిగి పోయిన తండ్రి, విజయనగరంలో పోలీసు శాఖలో పనిచేస్తున్న తమ్ముడు నారాయణ స్వామి నాయుడు దగ్గరకు పంపారు. అక్కడే రామమూర్తి భవిష్యత్‌కు బీజం పడింది. మల్లవిద్యలో తొలిపాఠాలు నేర్చాడు. స్థానికంగా ‘పహిల్వాన్’ అనే బిరుదు సాధించడంతో ఆయన అభిరుచిని గ్రహించిన పినతండ్రి ఆ దిశలో ప్రోత్సహించారు. నాటి మదరాసు సైదాపేటలోని వ్యాయామ పాఠశాలలో చేర్పించారు. ఏడాది శిక్షణ తరువాత వ్యాయమ ఉపాధ్యాయ పట్టాతో విజయనగరం తిరిగి వచ్చి, అక్కడి కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరారు. తన విధులు నిర్వర్తిస్తూనే, వాయు, జలస్తంభన విద్యను ప్రదర్శించేవారు. అంతటితో తనివి తీరలేదు. పొట్టి పంతులు అనే మిత్రుడి సహకారంతో సర్కస్ కంపెనీ (1911) ప్రారంభించారు.అందుకు తుని రాజావారి సంపూర్ణ సహకారం లభించింది.
సర్కార్ జిల్లాలతో పాటు నాటి నిజాం రాష్ట్రంలోనూ ప్రదర్శనలు ఇచ్చి, మరుసటి ఏడాది నుంచి దక్షిణ భారతదేశంలో ప్రదర్శనలు ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఆంధ్ర భాషా నిలయం నిర్వాహకులు ఆయనను ‘జగదేకవీర’ బిరుదుతో సత్కరించారు. మైసూర్ మహారాజు గజారోహణ సత్కారం చేశారు. తమ సంస్థానంలో ఉంటూ, యువతకు మల్ల యుద్ధ శిక్షణ ఇవ్వాలన్న కోరికను రామమూర్తి మృదువుగా తిరస్కరించారు. కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగోర్ స్థాపించిన ‘విశ్వభారతి’లో ప్రదర్శన ఇచ్చారు.
తిలక్, మాలవ్యా ప్రశంసలు
లోక్‌మాన్య బాలగంగాధర్ తిలక్ ఆహ్వానం మేరకు రామమూర్తి నాయుడు పూణే వెళ్లి సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. దానికి ముగ్ధుడైన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తండ, మల్ల రాజతిలక’ బిరుదులు ఇచ్చారు.అలహాబాద్‌లో జాతీయ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చి పండిట్ మదన్ మోహన్ మాలవ్యా మన్ననలు అందుకున్నారు. మాలవ్యా నుంచి ‘కలియుగభీమ’ బిరుదు అందుకున్నారు. అంతేకాదు ఇరువురి మధ్య చాలా సాన్నిహిత్యం ఏర్పడి, అనంతర కాలంలో రామమూర్తి వారణాసిలోని మాలవ్య నివాసంలో ఏడాది పాటు అతిథిగా ఉన్నారు.
అంతర్జాతీయంగా…
విదేశాలలో ప్రదర్శనలు ఇవ్వాలన్న తిలక్, మాలవ్యాల సూచనను శిరోధార్యంగా భావించారు రామమూర్తి. తమ బృంద సభ్యులతో యూరప్ వెళ్లారు. బకింగ్ హ్యామ్ ప్యాలెస్‌లో ఆయన ప్రదర్శనకు బ్రిటన్ చక్రవర్తి, రాణి అబ్బురపడి, ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ‘ఇండియన్ హెర్క్యులిస్’ బిరుదుతో సత్కరించారు. రామమూర్తి ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, జపాన్, చైనా, నాటి బర్మాలో ప్రదర్శనలు ఇచ్చారు. సర్కస్ ద్వారా నాడే లక్షల రూపాయలు ఆర్జించిన ఆయన అందులో చాలా వరకు వితరణ చేశారు. స్వరాజ్య సమర ఉద్యమానికి తన వంతు ఆర్థిక సాయం అందించారు. భారత జాతీయ సంస్కృతీ వారసత్వ సంస్థ (INTACH) జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీరఘట్టంలో రామమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
గగుర్పొడిచే విన్యాసాలు
రామమూర్తి కేవలం రెండు పదుల వయసులోనే గుండెల మీద టన్నున్నర బరువును పెట్టుకొని ప్రదర్శించారు. తరువాత మూడు టన్నుల బరువు మోయగలిగారు. ఛాతికి ఉక్కు గొలుసులు బిగించుకొని, ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచి వేసేవారు. ఏనుగును ఛాతిపై ఎక్కించుకొని కనీసం అయిదు నిమిషాల పాటు నిలిపేవారు. రెండు కారులకు కట్టిన గొలుసులను భుజాలకు తగలించుకొని, వాటి వేగాన్ని నియంత్రించేవారు. నాటి వైస్రాయ్ లార్డ్ మింటో, ఆయన ప్రదర్శనలకు తన్మయుడై తానే స్వయంగా పరీక్షించాలనుకొని, తన కారుని ఆపాలని కోరాడు. ఆయన అందులో కూర్చొని నడిపేందుకు ప్రయత్నించగా, తాళ్లతో కారును భుజానికి కట్టుకొన్న రామమూర్తి అది సెంటీమీటర్ కూడా కదలకుండా అడ్డుకున్నాడు.
తీరని కల
తెలుగు నాట గొప్ప వ్యాయామ కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆయన కల సాకారం కాలేదు. చాలా మంది విశిష్ట వ్యక్తుల మాదిరిగానే రామమూర్తి చరమ దశ విషాదంగానే ముగిసింది. నాటి ఒరిస్సా సంస్థానాధీశుల ఆశ్రయం పొందారు. కాలికి సోకిన రాచపుండుకు శస్త్రచికిత్స అవసరమైంది. మత్తుమందు తీసుకొనేందుకు నిరాకరించారు. అప్పుడూ ఆయన యోగాభ్యాసాన్నే నమ్మారు. ఆయన కాలు తొలగించవలసి వచ్చింది. జయవీర హనుమాన్, కలియుగభీమ, ఇండియన్ హెర్క్యులస్, ఇండియన్ శాండో, వీరకంఠీరవ, జగదేకవీర, మల్లరాజు, మల్ల మార్తాండ లాంటి బిరుదులు సొంతం చేసుకొన్న ఆయన కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నప్పుడు అరవయ్యో ఏట (ఫిబ్రవరి 16,1942) కాలం చేశారు.
ప్రఖ్యాత నాటక కర్త కాళ్లకూరి నారాయణరావు తమ ఆప్తమిత్రుడి గురించి ‘సాధుపథ సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి’ అన్నారు.

