కన్యాశుల్కం అంటే పెళ్లి చేసుకుంటున్న వరుడు వధువుకు ఇచ్చే కట్నం. ఇది వరకట్నం కన్నా ప్రాచీనమైనది. వరుడు, అతని కుటుంబం వధువుకు పెళ్లి సమయంలో లేదా ముందు పారితోషికం రూపంలో ఇచ్చే డబ్బు, ఆస్తి, సంపదను కన్యాశుల్కం అంటారు. భారతీయ కుటుంబాల్లో ఈ దురాచారం వేళ్లూనుకొని ఉండేది. ఇది భారత్‌తో పాటు ఆసియా దేశాలు, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ఖండంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది.

ఇస్లాంలో కూడా కన్యాశుల్కం ఆచారం ఉంది. వరుడు వధువుకు కట్నం (మహర్) ధారాళంగా ఇవ్వాలని ఖురాన్ (2:136)లో ఉంది. వధువుకు కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయడానికి వీలులేదని ఖురాన్ చెబుతోంది. అలాగే, ఇచ్చిన కట్నం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోకూడదు. ఇప్పటికీ సౌదీ అరేబియాలో కన్యాశుల్కం ఆచారం వేరే రూపంలో ఆచరణలో ఉంది.

సాహిత్య విప్లవం - వ్యావహారిక భాషా చైతన్యం

తెలుగు లోగిళ్లలో కన్యాశుల్కం వల్ల జరుగుతున్న అనర్థాలను మహాకవి గురజాడ అప్పారావు నాటకంగా రచించారు. వ్యావహారిక భాషలో రచించిన ఈ నాటకం సమకాలీన సామాజిక సమస్యలను ఎత్తి చూపింది. వ్యావహారిక భాషలో రాసిన గురజాడ కన్యాశుల్కం గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమానికి చేయూత నిచ్చింది. అది తెలుగు సాహిత్య లోకంలో ధృవతారగా నిలచి ప్రసిద్ధి చెందడమే కాక, కన్యాశుల్కం దురాచారంగా గుర్తించి ప్రభుత్వం రద్దు చేసే వరకూ వెళ్లింది. ఈ నాటకంలో బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వేశ్యా వృత్తి వంటి దురాచారాలను గురజాడ వ్యంగ్యంగా పాత్రల ద్వారా చూపించారు.

సాహిత్యం కేవలం పండితులకే కాదు, పామరులకు సైతం అర్థం కావాలని, సమాజ మార్పుకు భాష ఒక ఆయుధంగా మారాలని గురజాడ నమ్మారు. అందుకే గ్రాంథిక భాషను పక్కనబెట్టి, నాటి సమాజంలో ప్రజలు మాట్లాడుకునే నిత్య జీవిత భాషకు పట్టం కట్టారు. ఆనాటి బ్రాహ్మణ అగ్రహారాల భాషను, మధురవాణి మాట్లాడే సంభాషణలను, గిరీశం వాడే ఇంగ్లీష్-తెలుగు మిశ్రమ భాషను యథాతథంగా వాడి నాటకానికి సజీవత్వాన్ని తెచ్చారు.

ప్రచురణా చరిత్ర - రంగస్థల ప్రస్థానం

గురజాడ కన్యాశుల్కంలో సమాజంలోని విభిన్న మనస్తత్వాలు గల పాత్రలు ప్రతిబింబిస్తాయి. ఈ నాటకంలో ప్రధాన పాత్రలు: అగ్నిహోత్రావధాన్లు, లుబ్దావధాన్లు, రామప్పపంతులు, కరటక శాస్త్రి, మధురవాణి, గిరీశం, బుచ్చమ్మ, సౌజన్యరావు, వెంకటేశం. కన్యాశుల్కం నాటకం 1892లో రాసి, అదే సంవత్సరం విజయనగరంలో మొదటి ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత 1897లో తొలి కూర్పు ప్రచురితమైంది. రెండోసారి రాసిన ఇదే నాటకంలో పాత్రల ప్రాధాన్యతలో రచయిత మార్పులు చేశారు. 1909లో రెండోసారి ప్రచురించిన నాటకమే ప్రజాదరణతో ప్రసిద్ధి చెందింది. ఈ కూర్పులో సంభాషణల నైపుణ్యం, వ్యావహారిక భాషాశైలి, కొన్ని పాత్రలు తీసివేయడం, కొన్ని చేర్చడం, సంభాషణల్లో హాస్యం పాలు పెంచడం, రచయిత దృక్పథం, పరిమితిలో వచ్చిన మార్పులు కూడా ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా మధురవాణి పాత్ర నిడివి పెంచారు. ఆ పాత్రను చౌకబారు వేశ్య నుంచి వివేకం, నీతి వంటి లక్షణాలతో ఉదాత్తంగా తీర్చిదిద్దారు.

1892లో మొదట ఈ నాటకం విజయనగరం మహారాజా ఆనంద గజపతి ప్రోత్సాహంతో ‘జగన్నాథ్ విలాస నాటక సమాజం’ వారు ప్రదర్శించారు. అప్పటికి కన్యాశుల్కం పుస్తక రూపంలో ప్రచురణ కాలేదు. రెండోసారి గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం నిడివి పెద్దది కావడం, సుదీర్ఘమైన స్వగతాలు, బహు పాత్రలు, రచయిత కేవలం ప్రదర్శన దృష్టితోనే కాకుండా సాహిత్యపరమైన లోతులతో రచన చేయడంతో రంగస్థలంపై ప్రదర్శన కష్టంగా మారింది. ఫలితంగా దాదాపు 15 సంవత్సరాలు ఈ పూర్తి రూపం ప్రదర్శనకు నోచుకోలేదు. కానీ ప్రచురణ రూపంలో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పాత్రలు ప్రజల నోళ్ళల్లో నానడం ప్రారంభించాయి.

1924లో తెనాలిలో పూర్తి నాటకాన్ని ఆనాటి ప్రముఖ రంగస్థల నటులు ప్రదర్శించారు. తరువాత సినిమాలో సావిత్రి మధురవాణి పాత్ర వేసి పేరు తెచ్చుకున్నారు. అలాగే, రంగస్థలంపై స్థానం నరసింహారావు, అయితం రాజకుమారి మధురవాణి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. 1932లో సాహితీ వేత్త అబ్బూరి రామకృష్ణారావు ఈ నాటకాన్ని కుదించి ప్రదర్శనకు అనుకూలంగా రాశారు. దానితో ఆంధ్రదేశమంతా 1000 ప్రదర్శనలకు పైగా జరిగాయి. జేవీ సోమయాజులు, జేవీ రమణమూర్తి, ఎంఆర్ కృష్ణ వంటి నటులు, దర్శకులు తమ శైలిలో మార్చుకుని ప్రదర్శించారు. పెమ్మరాజు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో అమెరికాలో పలు ప్రాంతాల్లో ఈ నాటకం ప్రదర్శన జరిగింది. 1939లో విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రదర్శించారు. టెలివిజన్లో పూర్తి నాటకాన్ని చిత్రీకరించడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గిరీశం పాత్రలో, సావిత్రి మధురవాణిగా, సి.ఎస్.ఆర్. అగ్నిహోత్రావధాన్లుగా పి.పుల్లయ్య దర్శకత్వంలో అద్భుతమైన చలనచిత్రంగా కూడా ఇది రూపుదిద్దుకుంది.

సామాజిక రుగ్మతలపై వ్యంగ్యాస్త్రం

ఇది భ్రష్టు పెట్టిన మానవ స్వభావాలను ఆవిష్కరించిన సాంఘిక నాటకం. జుగుప్స కలిగించే సంఘ కట్టుబాట్లు, తెలుగు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సంస్కృతిని గురజాడ కళ్ళ ముందు ఉంచారు. ప్రధాన ఇతివృత్తం సంఘ సంస్కరణ. అప్పట్లో ధనదాహంతో చిన్నపిల్లల్ని ముసలివాళ్లకు ఇచ్చి పెళ్లి చేసేవారు. దానితో వారికి కాపురానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే వైధవ్యం సంభవించేది. కన్యాశుల్కం తీసుకోవడం, అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లకి అమానుషంగా పెళ్లి చెయ్యడం వెనుక కేవలం ధనదాహమే కారణం.

పెద్దమనిషిగా నటిస్తూ ఆచరణలో అనేక పాపాలు చేస్తున్న రామప్పపంతులు పాత్రను గురజాడ అద్భుతంగా చిత్రీకరించారు. ఆనాటి సమాజంలో ఇలాంటి దొంగ పెద్ద మనుషులు, దొంగ సాక్షులు అనేకమంది ఆడపిల్లల తండ్రులకు ధనాశ చూపి చిన్నతనంలోనే వారి జీవితాలతో ఆడుకునే వారు.

మన సంస్కృతిలో పేరుకుపోయిన కన్యాశుల్కం రుగ్మతను రూపుమాపేలా సాంఘిక సంస్కరణ అనే కథావస్తువు నాటకంలో చొప్పించి, నివారణ ఎంత అవసరమో చెప్పిన ఘనత గురజాడదే. నేడు కన్యాశుల్కం లేదు, దాని స్థానంలో వరకట్నం వచ్చింది. అయినా ఈనాటికీ ఈ నాటకం ప్రజాదరణ పొందుతూనే ఉందంటే, నాటకాన్ని ఒక సజీవ సాహిత్య ప్రక్రియగా గురజాడ ఆవిష్కరించడమే కారణం. సమాజంలో రుగ్మతులు, రామప్ప పంతులు వంటి నకిలీ పెద్దమనుషులు ఉన్నంత వరకూ కన్యాశుల్కం నాటకానికి తిరుగులేదు. ఆధునిక నాటక సాహిత్యానికి ఇది విజ్ఞాన సర్వస్వంగా నిలుస్తుంది.

పాత్రల అంతరంగ విశ్లేషణ:-

గిరీశం:

ఆధునిక కపటత్వానికి ప్రతీక. కన్యాశుల్కం నాటకంలో గిరీశం వట్టి కోతలరాయుడు, మోసగాడు. తప్పుల తడక ఆంగ్లాన్ని సంస్కృతంలో మిళితం చేసి మాట్లాడడం అతని ప్రత్యేకత. సంఘ సంస్కర్తగా నటిస్తూ అమాయకులను మభ్యపెడతాడు. గిరీశం పాత్రలో గురజాడ తెలుగు, ఇంగ్లీషు కలగాపులగంగా చేసి వ్యవహార భాషలో హాస్యాన్ని పండించాడు.

“డ్యామిట్ కథ అడ్డం తిరిగింది”

“లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనేగానీ పల్లెటూళ్లలో ఎంతమాత్రం పనికిరావు”

“పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టున్”

“మనవాళ్లు వట్టి వెధవాయలోయ్”

“ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటేగాని పొలిటీషియన్ కానేరడు”

వంటి సంభాషణలు తెలుగు వాళ్ల నోళ్లలో సామెతలుగా మారిపోయాయి. మాండలీకాలు కూడా పాత్రలతో ప్రయోగింపజేశారు. కళింగాంధ్ర మాండలీకాల్లో గుంటవెధవ, కనిష్టీబు, నాను ఉంది, వగుస్తున్నారు, కొసాకి విను, ఆబోరుండదండి వంటివి మచ్చుతునకలు.

అగ్నిహోత్రావధాన్లు ఇంటికి చేరి ఆయన కుమారుడు వెంకటేశానికి ట్యూషన్ చెప్పే నెపంతో, ఆ ఇంటి పెద్ద కుమార్తె, బాల విధవ బుచ్చెమ్మను గిరీశం లేపుకుపోతాడు.

మధురవాణి:

మధురవాణి ఒక వేశ్య. నాటకంలో అత్యంత కీలకమైన పాత్ర. అందం, మంచితనంతో పాటు మాటకారితనం, తెలివితేటలు ఆమె సొంతం. ఎదుటివారిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంది. ఆమెలో గొప్ప నైతిక విలువలు, మానవత్వం కనిపిస్తాయి. నాటి సమాజంలో వేశ్యలను హీనంగా చూసే రోజుల్లో, గురజాడ ఆమె పాత్ర ద్వారా సమాజంలోని పెద్దమనుషుల ముసుగులను తొలగించారు. చివరిలో గిరీశం బండారం బయటపెట్టి, లుబ్దావధాన్లను రక్షించి సమాజంలో మార్పుకు శ్రీకారం చుడుతుంది. “నా అంతరాత్మ నా మాట వినడం లేదు” అంటూ ఆమె ప్రదర్శించే నైతికత అద్భుతం. గురజాడ సృష్టించిన ఈ పాత్ర పరిధిని మించి రాణించిందని విమర్శకుల మాట. మధురవాణిని మొదట సామాన్య వేశ్యగా చూపించిన గురజాడ, రానురానూ ఆమెను ఎంతో ఉదాత్తంగా మార్చారు.

రామప్పపంతులు, అగ్నిహోత్రావధాన్లు:

స్వార్థానికి, అహంకారానికి రూపాలు

రామప్పపంతులు కుటిల ఆలోచన కలవాడు. అవకాశవాద, కపట బుద్ధితో నమ్మిన వారిని మోసగించవచ్చని నమ్మేవాడు. మాట మీద నిలబడేవాడు కాదు. ధనాశ మెండుగా ఉండడంతో మధురవాణి వ్యూహంలో చిక్కి దొరికిపోయాడు. మరోవైపు అగ్నిహోత్రవధాన్లు వేద వేదాంగాలు చదివినవాడు, అమాయక బ్రాహ్మణుడు. అయినప్పటికీ, తీవ్రమైన ధనాశపరుడు, మూర్ఖపు సనాతన ఆచారపరుడు. అహంకారంతో తన కుటుంబ జీవితాన్ని, కూతుళ్ల జీవితాలను నాశనం చేసుకునే పితృస్వామ్య వ్యవస్థకు అతడు సజీవ సాక్ష్యం.

కరటకశాస్త్రి, సౌజన్యరావు:

సంస్కరణాభిలాషులు

కరటకశాస్త్రి తన మేనకోడలి (సుబ్బి) పెళ్లి తప్పించేందుకు శిష్యునికి (మహేశ్వరం) ఆడ వేషం వేయించి, తాను గుంటూరు శాస్త్రులుగా పేరు మార్చుకుని, మధురవాణి సహాయంతో పెళ్లిపీటల మీద కూర్చోబెడతాడు. సంప్రదాయ సమాజంలో ఉంటూనే సమాజాన్ని మోసం చేయడానికి అదే సంప్రదాయాన్ని నాటకీయంగా వాడుకున్న చతురుడు కరటకశాస్త్రి. సౌజన్యరావు న్యాయవాది, ఆదర్శవాది. మొదట్లో గిరీశం పెద్దమనిషి అని నమ్మినా చివరకు అతని నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. మధురవాణి ఉదాత్తవాదిగా మారడం వెనుక సౌజన్యరావు పవిత్రమైన ప్రవర్తన, వ్యక్తిత్వం ఉన్నాయని రచయిత పరోక్షంగా చెప్పారు.

లుబ్దావధాన్లు,బుచ్చెమ్మ:

వ్యవస్థ బాధితులు

లుబ్దావధాన్లు 70 ఏళ్ల ముసలివాడు. అగ్నిహోత్రావధాన్లు తన రెండో కుమార్తె సుబ్బిని కన్యాశుల్కం తీసుకుని లుబ్దావధాన్లుకు ఇచ్చి పెళ్లి చేయబోయాడు. అప్పటికే పెద్ద కుమార్తె బుచ్చెమ్మను కన్యాశుల్కం తీసుకుని ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయడంతో ఆమె విధవ అయింది. చివరికి గిరీశం బారి నుండి బుచ్చెమ్మను కాపాడి, ఆమెను శరణాలయానికి (సౌజన్యరావు సంరక్షణలోకి) పంపడంతో నాటకం ముగుస్తుంది. తనకు తానుగా చెడు చేయని లుబ్దావధాన్లు, మేనకోడలు సుబ్బిని కాపాడిన కరటకశాస్త్రి, అగ్నిహోత్రావధాన్లు రెండో భార్య (లేదా మీనాక్షి) వంటి పాత్రలు నాటకానికి బలాన్ని ఇస్తాయి.

విమర్శకుల దృష్టిలో కన్యాశుల్కం

ప్రముఖ విమర్శకుడు సర్దేశాయి తిరుమలరావు కన్యాశుల్కం నాటకంలో పాత్రలను మంచి, చెడుల కలయిక ఆధారంగా అద్భుతంగా విభజించారు. మనిషిలోని మంచిచెడుల కలయికలో మంచితనం ఎక్కువగా ఉన్న పాత్రలుగా మధురవాణి, బుచ్చెమ్మ, కరటకశాస్త్రి, సౌజన్యరావులను ఆ కోవలోకి చేర్చారు. అలాగే చెడు, మంచిల కలయికలో కీడు ఎక్కువగా ఉన్న పాత్రలుగా గిరీశం, రామప్పపంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్దావధాన్లను పేర్కొన్నారు.

ఇక ‘సుబ్బి’ పాత్ర రంగం మీదకు రాకుండానే నాటకం అంతా ఆ పాత్ర చుట్టూనే తిరిగేలా గురజాడ అద్భుతమైన నాటకీయతను కల్పించారు. అలాగే, వెంకటేశం పాత్ర ద్వారా నాటి ఆంగ్ల విద్యా విధానంలోని లోపాలను, బట్టీయం కొట్టే పద్ధతులను హాస్యాస్పదంగా చూపిస్తూనే ఆలోచింపజేశారు.

ముగింపు – కాలాతీత సత్యం

గిరీశం పాత్ర నాటకం ఆసాంతం కనిపించినా ఆ పాత్రకు ఒక స్థిరమైన ఆశయం ఉన్నట్టు కనిపించదు. తాను చేసే ప్రతి పని తప్పు అని తెలిసే చేస్తాడు. ఇతరులని ఏడిపించి, వేడుకుని, భయపెట్టి దారిలోకి తెచ్చుకునే లౌక్యుడిగా రచయిత సృష్టించారు. చివరకు “డ్యామిట్! కథ అడ్డం తిరిగింది” అని నాటకం నుంచి నిష్క్రమించినా, నేటి సమాజంలో ఇలాంటి గిరీశాలు, రామప్ప పంతులు వంటి పాత్రలు మనకు అడుగడుగునా ఐటీ కారిడార్ల నుండి రాజకీయ వేదికల వరకు కనిపిస్తూనే ఉంటాయి.

వందేళ్ల క్రితమే సమాజంలో ఇలాంటి మనుషులను, వారి కుహనా సంస్కరణ తత్త్వాన్ని గుర్తించి “వాళ్లు వట్టి వెధవాయలోయ్” అని పాత్రల రూపంలో చూపించిన మహాకవి గురజాడ అప్పారావు నిజంగానే ప్రాతఃస్మరణీయుడు. కన్యాశుల్కం కేవలం ఒక నాటకం కాదు, అది తెలుగు సమాజపు అంతశ్చేతనను మేల్కొలిపిన ఒక సామాజిక విప్లవం!