ప్రపంచ, భారత క్రికెట్ వర్గాలలో ఈమధ్య తరచూ వినిపిస్తున్నపేరు వైభవ్ సూర్యవంశీ. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని 15 ఏళ్ల ఈ బీహారీ కుర్రాడు పలు అరుదైన రికార్డులతో చాటి చెప్పాడు.
భారత క్రికెట్ ఓ నిరంతర ప్రవాహం. వచ్చేనీరు వస్తుంటే… పోయే నీరు పోతుంది అన్నట్లుగా గత తొమ్మిది దశాబ్దాలుగా వచ్చే ఆటగాళ్లు వస్తుంటే పోయే ఆటగాళ్లు తెరమరుగైపోతూనే ఉన్నారు. అయితే కలకాలం భారత క్రికెట్ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకొన్న ఆటగాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు. తెలుగుతేజం, భారత క్రికెట్ తొలి కెప్టెన్ కర్నల్ కఠారి కనకయ్య నాయుడు నుంచి నవతరం కెప్టెన్ శుభ్ మన్ గిల్ వరకూ ఎందరో తమ విలక్షణమైన ఆటతీరు, అసాధారణ రికార్డులతో తమకంటూ ఓ ప్రత్యేకస్థానం సాధించుకోగలిగారు.
సీకె నాయుడు, దిలీప్ సర్దేశాయి, వినూ మన్కడ్, విజయ్ మర్చెంట్, లాలా అమర్ నాథ్, విజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, కపిల్ దేవ్, అనీల్ కుంబ్లే, మహ్మద్ అజరుద్దీన్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లు పెద్దమనుషుల క్రీడ క్రికెట్ నే సుసంపన్నం చేయడం ద్వారా భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచిపోయారు.
తరానికి ఒక్కడుగా…ఒకే ఒక్కడుగా…
స్వాతంత్ర్యానికి పూర్వం (1932) నుంచే టెస్టు క్రికెట్ లో పాల్గొంటూ వస్తున్న భారత్ లో తరానికి ఒక్కో గొప్పఆటగాడు వెలుగులోకి వచ్చినా, 200కు పైగా టెస్టుమ్యాచ్ లు, 400కి పైగా వన్డే మ్యాచ్ లతో శతశతకాలతో రెండు దశాబ్దాలపాటు అసాధారణ సేవలు అందించడం ద్వారా మాస్టర్ సచిన్ టెండుల్కర్ ‘భారత క్రికెట్ దేవుడి’ హోదాను సంపాదించుకోగలిగాడు. 16 ఏళ్ల చిరుప్రాయం నుంచే భారత క్రికెట్ కు కీలక ఆటగాడిగా నిలిచిన మాస్టర్ సచిన్ రికార్డులనే తిరగరాయటానికి బీహారీ పసికూన వైభవ్ సూర్యవంశీ తహతహలాడుతున్నాడు.
క్రికెట్ చరిత్ర, వారసత్వం ఏమాత్రం లేని బీహార్ నుంచి భారత క్రికెట్ లో దూసుకొచ్చిన ‘సమస్తిపూర్ డైనమైట్’ వైభవ్ సూర్యవంశీ. 13 సంవత్సరాల చిన్నవయసులోనే వయసుకు మించిన పరిణతితో ఆడుతూ జైపూర్ ఫ్రాంచైజీ దృష్టిని మాత్రమే కాదు…భారత్ క్రికెట్ నియంత్రణ మండలి వర్గాలను సైతం ఆకర్షించాడు.
కోటీ 10 లక్షల రూపాయల కాంట్రాక్టుతో…
ఉత్తర బీహార్ లోని సమస్తిపూర్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ తన తండ్రి సంజీవ్ ప్రేరణ, ప్రోత్సాహంతో కేవలం పదేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టాడు. అందిన బంతిని అందినట్లుగా అత్యంత బలంగా బాదడంలో మేటిగా నిలిచాడు. సబ్- జూనియర్, జూనియర్ స్థాయిల్లో వయసుకు మించిన ప్రతిభ కనబరచడం ద్వారా నేరుగా బీహార్ రంజీజట్టులోకి ప్రవేశించాడు. 13 ఏళ్ల చిరుప్రాయంలోనే జైపూర్ ఫ్రాంచైజీ కళ్లలో పడ్డాడు. ఈ చిన్నోడిలోని అపార ప్రతిభాపాటవాలను ముందుగానే గుర్తించిన అప్పటి రాజస్థాన్ రాయల్స్ ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్, ఇతర శిక్షకులు సానబెట్టి రాటుతేలేలా చేయటంలో సఫలమయ్యారు. 14 సంవత్సరాల చిరుప్రాయంలోనే కోటీ 10 లక్షల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టు సాధించిన పిన్న క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఎడమచేతి వాటం ఓపెనర్ గా, బంతిని బలంగా, గ్రౌండ్ నలుమూలలకూ పంపించగల బ్యాటర్ గా సూర్యవంశీ అతి స్వల్పకాలంలోనే గుర్తింపు సంపాదించాడు. అండర్ -19 ఆసియా కప్, జూనియర్ (అండర్ -19) ప్రపంచకప్ టోర్నీలలో ఈ బీహారీ బాంబర్ సత్తాచాటుకొన్నాడు. 2026 ఐపీఎల్ సీజన్ కోసం సూర్యవంశీకి 10 కోట్ల రూపాయల కాంట్రాక్టును జైపూర్ ఫ్రాంచైజీ అందచేసింది. గత 19 సీజన్ల ఐపీఎల్ చరిత్రలోనే కాదు…టీ-20 లీగ్ ల చరిత్రలోనే అతి భారీ (10 కోట్ల రూపాయల) కాంట్రాక్టు పొందిన పిన్న క్రికెటర్ గా వైభవ్ రికార్డుల్లో చేరాడు.
నాలుగు మ్యాచ్ ల్లోనే 200 పరుగులు…
కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన సూర్యవంశీ 2025 సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ ల్లో 206.5 స్ట్ర్రయిక్ రేట్, 36.00 సగటుతో 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, ఓ అర్ధశతకం ఉన్నాయి. 24 సిక్సర్లు, 18 బౌండ్రీలు నమోదు చేశాడు. 14 సంవత్సరాల 23 రోజుల వయసులో ఐపీఎల్ శతకం సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన క్రికెటర్ గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు.
తన 15వ పుట్టినరోజు జరుపుకొన్న కొద్దిరోజులకే ప్రారంభమైన 2026 సీజన్ పోరులో వైభవ్ విశ్వరూపమే ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్…జట్లు ఏవైనా, జస్ ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, ట్రెంట్ బౌల్ట్…బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండరీల జోరు, సిక్సర్ల హోరుతో పరుగుల సునామీ సృష్టించాడు. 2026 సీజన్ మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లోనే రాజస్థాన్ రాయల్స్ విజయపరంపర కొనసాగించగలిగిందంటే అది కేవలం సూర్యవంశీ దూకుడైన బ్యాటింగే అని చెప్పక తప్పదు.
వరుస విజయాలతో జోరుమీదున్న చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్ లో సూర్యవంశీ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగుల స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. సూర్యవంశీ ఆటతీరు, తొణుకుబెణుకు లేకుండా ఎదురుదాడికి దిగిన వైనం చూసి అపార అనుభవం కలిగిన విరాట్ కొహ్లినే అబ్బురపడిపోయాడు.
సూర్యవంశీ అవార్డుల వైభవం…
ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నిలిచినా…రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం వ్యక్తిగత రికార్డులను కొల్లగొట్టడం ద్వారా తానే అసలుసిసలు విజేతగా చాటుకొన్నాడు.
అతి తక్కువ బంతులు ఎదుర్కొని 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి, అత్యంత పిన్నవయస్కుడైన ఐపీఎల్ క్రికెటర్ గా వైభవ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
545 బంతుల్లో 1000 పరుగులు సాధించిన యాండ్రీ రస్సెల్ రికార్డును వైభవ్ 440 బంతుల్లోనే సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
2026 సీజన్లో సాధించిన ఎనిమిది హాఫ్ సెంచరీలలో ఐదింట కేవలం 15 బంతుల్లోనే సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. మూడుసార్లు సెంచరీకి చేరువగా వచ్చి 90 స్కోర్లలోనే అవుటయ్యాడు.
పవర్ ప్లే ఓవర్ల(1-6) లోనే వైభవ్ 521 పరుగులు సాధించడం ద్వారా ఐపీఎల్ చరిత్రనే తిరగరాయగలిగాడు. ఐపీఎల్ -2026 సీజన్లో అత్యధిక పరుగులు ( 776 ) సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ తో పాటు సూపర్ స్ట్ర్రయికర్, సూపర్ సిక్సెస్, అత్యంత విలువైన, వర్థమాన ఆటగాడి అవార్డులను సొంతం చేసుకొన్నాడు. మొత్తం మీద ఐపీఎల్ 19వ సీజన్ సూర్యవంశీ బ్యాటింగ్ వైభవానికి ప్రతీకగా నిలిచింది.
సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ …
భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించిన అత్యంత పిన్నవయస్కుడైన క్రికెటర్ గా సచిన్ పేరుతో ఉన్న36 ఏళ్ల రికార్డును వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు. 16 ఏళ్ల వయసులో భారత జట్టులో సచిన్ చోటు సంపాదిస్తే… వైభవ్ 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించడం ద్వారా సరికొత్త చరిత్రకు తెరలేపాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 సిరీస్ ల్లో పాల్గొన్న వైభవ్… జింబాబ్వేతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో పూర్తిస్థాయిలో రాణించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ సిరీస్ లో భారత్ 3-0 విజయం సాధించడంలో సూర్యవంశీ ప్రధానపాత్ర పోషించాడు. రెండు అర్ధ శతకాలతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకొన్నాడు. తన 16వ పుట్టినరోజుకు ముందే రెండు అంతర్జాతీయ అర్ధ శతకాలు సాధించిన కుర్రక్రికెటర్ గా సూర్యవంశీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
వన్డే జట్టులో చోటుకు వైభవ్ తహతహ…
వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ జట్టులో చోటుకు వైభవ్ గురిపెట్టాడు. ఫరూక్ ఇంజనీర్ లాంటి క్రికెట్ పండితులు సైతం అసాధారణ ప్రతిభ కలిగిన వైభవ్ కు వన్డే జట్టులో సైతం చోటు కల్పించాలని, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ సహ ఓపెనర్ గా ఆడించాలని బీసీసీఐ ఎంపిక సంఘానికి సలహా ఇచ్చారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ ను రెండో డౌన్లో ఆడించడం ద్వారా వైభవ్ కు ఓపెనర్ గా స్థానం కల్పించవచ్చునని చెబుతున్నారు.
20 ఓవర్లలో ముగిసిపోయే ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో సత్తా చాటుకొన్న వైభవ్ కు 50 ఓవర్ల వన్డే మ్యాచ్ ల్లోనూ తగిన అవకాశాలు కల్పిస్తే పూర్తిస్థాయిలో రాణించడం ఏమంత కష్టం కాబోదు. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తూ, ఆట పట్ల ప్రేమతో, అంకితభావంతో సాధన చేయగలిగితే క్రికెట్ ( టీ-20, వన్డే, టెస్టు ) మూడు ఫార్మాట్లలోనూ రేపటితరం భారత సూపర్ స్టార్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యవంశీ బ్యాటింగ్ వైభవమే భారత క్రికెట్ వైభవం కావాలని మీ, మా, మన ‘కదంబం’ తరపున కోరుకుందాం.

