రామాయణంలో ప్రముఖంగా చెప్పుకోవలసిన పాత్రలలో ఒకటి ఊర్మిళ. కానీ పెద్దగా ప్రస్తావించకపోవడం గమనార్హం. లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళను కూడా ఒక కథానాయకురాలిగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాముడితో కలిసి తన భర్త లక్ష్మణుడు అడవికి వెళ్ళడంతో పద్నాలుగు సంవత్సరాల పాటు తన జీవితాన్ని త్యాగం చేసింది ఊర్మిళ. ఆమె త్యాగం తెలిసి సీతాదేవి కూడా నివ్వెరపోయింది.
జనక మహారాజు దత్తకుమార్తె సీత. కానీ జనకుడి నిజమైన కుమార్తె ఊర్మిళ. జనకుడి తమ్ముడు కుశధ్వజుడి కుమార్తెలు మాండవి, శృతకీర్తి. భరతుడిని మాండవి, శతృఘ్నుడిని శృతకీర్తి వివాహమాడతారు.
అడవిలో సీతారాములు కుటీరంలో నిద్రపోతున్నప్పుడు కుటీరం బయట లక్ష్మణుడు నిద్రపోకుండా కాపలా ఉండాలని నిర్ణయించుకుంటాడు.
అప్పుడు నిద్రాదేవి లక్ష్మణుని నిద్రకు ఉపక్రమించే విధంగా చేయడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. అయితే లక్ష్మణుడి దృఢసంకల్పం వల్ల సఫలం కాలేకపోతుంది.
ఇక ఉండలేక నిద్రాదేవి లక్ష్మణుడితో “ఇదిగో చూడు. నువ్విలా పడుకోకుండా ఉండటానికి వీల్లేదు. నేను నిన్ను విడిచిపెట్టి పోవాలంటే నువ్వు నీ నిద్రను మరొకరికి ఇవ్వాల్సిందే. అప్పుడే నిన్ను విడిచిపెడతాను” అంది.
వెంటనే లక్ష్మణుడు “నువ్వు నా భార్య ఊర్మిళ వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి నా నిద్రను తీసుకోమను. అందుకామె కాదనక తప్పక ఒప్పుకుంటుంది” అంటాడు నిద్రాదేవితో.
నిద్రాదేవి "అలాగే"నని ఊర్మిళ వద్దకు వెళ్ళి లక్ష్మణుడి మాటలు తెలియజేస్తుంది.
అప్పుడు ఊర్మిళ భర్త పరిస్థితిని గ్రహించి అతని నిద్రనూ తానే స్వీకరిస్తుంది. అంటే ఊర్మిళ పద్నాలుగేళ్ళలో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతుంది.
ఇందువల్లనే రావణుడి కుమారుడు, కంటికి కనిపించకుండా యుద్ధం చేస్తున్న ఇంద్రజిత్తుని సంహరించడం లక్ష్మణుడికి సాధ్యమైంది.
అదెలాగంటే, ఇంద్రజిత్తుని హతమార్చాలి అనుకునే వ్యక్తి పద్నాలుగేళ్ళపాటు నిద్రపోకుండా రెప్పవాల్చక మేల్కొని ఉన్నవాడై ఉండాలనే ఓ దైవ నిబంధన ఉంది. లక్ష్మణుడు పద్నాలుగేళ్ళు నిద్రపోకుండా ఉండగలిగాడంటే అందుకు కారణం ఊర్మిళ. తన భర్త నిద్రను ఆమె స్వీకరించడం వల్లనే లక్ష్మణుడికి అది సాధ్యమైంది. ఇక్కడ ఊర్మిళ గురించి ఇంకొక విషయమూ చెప్పుకోవాలి.
రాముడితో కలిసి అరణ్యానికి వెళ్ళేముందు ఊర్మిళను కలిసి ఈ విషయం చెప్పడానికి వెళ్తాడు లక్ష్మణుడు. ఆ సమయంలో అయోధ్యనగరం శోకసంద్రంలో మునిగింది. కానీ ఊర్మిళ మాత్రం అందంగా సింగారించుకుని ఆభరణాలను ధరించి పాన్పుపై ఒయ్యారంగా కూర్చుని ఉండటం చూసి లక్ష్మణుడికి కోపమొస్తుంది. అంతేకాదు, రాజభోగాలను అనుభవించడం కోసమే పెళ్ళి చేసుకున్నానని, కనుక రాముడితో కలిసి లక్ష్మణుడు అడవికి వెళ్ళకూడదని పట్టుపడుతుంది ఊర్మిళ. దానితో లక్ష్మణుడు కోపావేశంతో ఊర్మిళను నానా మాటలూ అని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
లక్ష్మణుడు వెళ్ళిన మరుక్షణం ఊర్మిళ విలపిస్తుంది. లక్ష్మణుడు తనను ఏవగించాలనే తానలా నాటకమాడుతుంది. రాముడికి తన భర్త లక్ష్మణుడు చేయాలనుకున్న సేవలో ఎటువంటి ఆటంకమూ రాకూడదని, తనమీద ప్రేమ కించిత్ కూడా కలగకూడదన్నదే ఊర్మిళ అంతరంగం.
పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు వచ్చాక లక్ష్మణుడి నిర్లక్ష్య వైఖరిని గ్రహించిన సీత ఈ విషయమై ఊర్మిళను అడుగుతుంది. అయితే ఊర్మిళ ఏమీ చెప్పదు. గర్భిణి అయిన సీత కంట తడి పెట్టడంతో ఊర్మిళ మనసు కరిగి నిజం చెప్తుంది. వనవాసానికి వెళ్ళే ముందు తనకు, భర్త లక్ష్మణుడికి మధ్య జరిగిన ఘర్షణను చెప్తుంది. ఆ మాట విన్న సీత వేయి సీతలు వచ్చినా ఒక ఊర్మిళకు సాటి రారని కొనియాడుతుంది.
తనను రథంలో తీసుకుపోయి అరణ్యంలో దింపడానికి వచ్చిన లక్ష్మణుడితో సీత ఊర్మిళ త్యాగాన్ని గురించి చెప్తుంది. తనను రాముడు విడిచిపెట్టినట్టు నువ్వు ఊర్మిళను విడిచిపెట్టకూడదని లక్ష్మణుడితో అంటుంది సీత. అప్పుడు లక్ష్మణుడికి ఊర్మిళ మీద గౌరవం ఏర్పడుతుంది. తన నిర్లక్ష్య వైఖరికి బాధపడతాడు. సీత వద్ద అనుజ్ఞ తీసుకుని అనంతరం లక్ష్మణుడు అతివేగంతో అయోధ్యకు వెళ్ళీవెళ్ళడంతోనే తన భార్య అనే విషయాన్ని సైతం పక్కన పెట్టి ఊర్మిళ కాళ్ళపై పడతాడు. ఆమె పాదాలను గట్టిగా పట్టుకుని లక్ష్మణుడు విలపిస్తాడు. తన తప్పిదాన్ని చెప్పి బాధపడతాడు. క్షమించమంటాడు.
మన జీవితంలోనూ మనకు తెలీకుండా ఊర్మిళలా కొందరు సాయం చేసిన వాళ్ళుంటారు. అది చివరి వరకూ మనకు తెలీకుండా పోవచ్చు. అందుకని ఎవరినైనా తొందరపాటుతో అపార్థం చేసుకోకుండా, ఆచితూచి వ్యవహరించడం విజ్ఞుల లక్షణం. లేనిపక్షంలో తర్వాత తెలిసి ఎంత పశ్చాత్తాప పడినా ఫలితం ఉండదు.

