ఓ రోజు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అది ఇంకు పెన్నుతో రాయాలనిపించడం. అదేమిటి పెన్నుతో రాయడమూ ఓ విషయమేనా అని అనుకోవచ్చు. అవును, నా వరకైతే అంతేమరి.

ఆ ఆలోచన పుట్టిన ఆ మిట్ట మధ్యాహ్నం పెన్ను కోసం ఓ దుకాణానికి వెళ్ళాను.

ఇంకు పెన్ను ఉందా అని అడిగాను.

అతను నన్ను పై నుంచి కిందకు, కింది నుంచి పైకి విచిత్రంగా చూసాడు నా ఆలోచనల మాదిరిగా.

ఒక్కటే ఒక్కటి ఉందంటూ దుమ్ము దులిపి పాతబడిపోయిన ఓ పెన్ను ఇచ్చాడు షాపతను.

సరే, ఓ ఇంకు బాటిల్ కూడా ఇవ్వండన్నాను.

ఇంకు లేదండీ…పెన్ను మాత్రమే ఉందనడంతో, అయితే పెన్ను వద్దని అక్కడి నుంచి బయటకు వచ్చి ఓ బస్టాండ్ పక్కనే ఉన్న దుకాణానికి వెళ్ళాను. ఆ దుకాణంలో అదేం విచిత్రమో గానీ పెన్ను లేదు… ఇంకు బాటిల్ ఉంది. సరేనని అది తీసుకుని చూస్తే 1998 నాటిదని సీసా మీద ఉన్న కాగితంలో ముద్రించి ఉంది. వద్దనుకుని ఇవతలకు వచ్చేశాను. కొంత దూరం నడిచి ఓ పెద్ద స్టేషనరీ దుకాణంలోకి అడుగుపెట్టాను. అక్కడ ఇంకు సీసా, పెన్ను రెండూ ఉన్నాయి.

రెండు పెన్నులు, ఓ ‘బ్రిల్’ ఇంకు సీసా కొన్నాను. దుకాణంలోనే ఓ పెన్నులో సిరా పోయించుకున్నాను. మహదానందంగా ఇంటికి వచ్చాను. కథ, కవిత అంటూ ఏదీ రాయలేదు. సిరాతో నింపుకున్న పెన్నుతో కొన్ని నామాలు రాసి చూసుకున్నాను. ముచ్చటేసింది ఆ అక్షరాలను చూస్తుంటే.

నిజంగానే ఇంకు పెన్నుతో రాయడంలో ఓ ఆనందం ఉంది. అది మాటల్లో చెప్పలేనిది. విద్యార్థి దశలో ఎన్నో తరగతి నుంచి ఇంకు పెన్నుతో రాయడం మొదలుపెట్టానో తెలీలేదు. బాల్ పాయింట్ పెన్ను మాత్రం నేను ఉద్యోగంలో చేరిన తర్వాతే. కాలేజీ వరకూ కూడా రాయడానికి ఇంకు పెన్నే నా ఆయుధం. నేను చదువుకున్న రోజుల్లో మూడు వంతుల పెన్నులకు బ్రాండ్ పేరంటూ ఏదీ ఉన్నట్టు గుర్తు లేదు. అయిదు నుంచి ఏడు రూపాయలలోపు మంచి పెన్నులు దొరికేవి. ఒక రూపాయకు రెండు గోల్ట్ కలర్ నిబ్బులు లభించేవి. క్యామిలిన్ పెన్ను తొమ్మిది రూపాయలన్నట్టు గుర్తు. ఓ అట్టె పెట్టెలో వరుసగా ఉంచి ఓ ప్లాస్టిక్ కవర్ కప్పేవారు. పెన్ను మొదట్లో ఓ గాజు ముక్క కిటికీలా ఉండేది. అందులోకి చూస్తే ఇంకు ఎంత ఉందో తెలిసేది. అప్పట్లో నాకు తెలిసిన ఓ తాపీ మేస్త్రీ దగ్గర ఓ చెక్క రంగు పెన్ను ఉండేది. దానిని చూడటం అప్పట్లో నాకదో కాలక్షేపం.

కొన్ని దుకాణాలలో లావుగా ఉండే పెన్నులు లభించేవి. లావు పెన్నులంటే నాకెంతో ఇష్టం.

ఇంకు పెన్నుతో చాలాసేపు రాస్తే బొటన వేలితో పాటు మరొక వేలు నొప్పి పెట్టేది. మా ఇంటికి దగ్గర్లో ఓ మార్వాడి పిల్లాడు మాత్రమే అప్పట్లో హీరో పెన్నులు వాడేవాడు.

పెన్నులో ఇంకు పోయడం అనేది కంట్లో డ్రాప్స్ వేయడం లాంటిది. పెన్నులో ఇంకు వేసేందుకు ఓ ఫిల్లర్ అవసరం. ఆ ఇంకు ఫిల్లరు గాజుముక్కతో చేసిందే, తర్వాత ప్లాస్టిక్ ఫిల్లరుగా మారింది. ఇప్పుడు తుపాకీకి గుండు అమర్చేటట్టు క్యాట్రిడ్జ్ అమ్ముతున్నారు. (క్యాట్రిడ్జ్ అంటే ఇవి చిన్న ప్లాస్టిక్ ట్యూబ్స్ లా ఉంటాయి. వీటిని పెన్ లోపల నేరుగా అమర్చుకోవచ్చు (plug and play). సిరా అయిపోయాక పాత కార్ట్రిడ్జ్ తీసి కొత్తది వేసుకోవాలి)

బాగా అనుభవం ఉన్న వారైతే మాత్రమే సీసాతోనే పెన్నులో ఇంకు పోసేవారు. అదొక కళ. కానీ ఎంతో జాగ్రర్తగా పోయాలి. లేకుంటే ఇంకు కారిపోతుంది.

చదువుకుంటున్న రోజుల్లో బ్లూ ఇంకునే వాడేవాడిని. అప్పుడప్పుడూ బ్లాక్ ఇంక్ కూడా వాడేవాడిని. బ్రిల్ ఇంక్ అప్పట్లో బాగా ప్రసిద్ది. చెల్ పార్క్ నలుపు, నీలం కలిసిన ఇంకు కాస్తంత భిన్నంగా ఉండేది. టార్కాయిస్ నీలం ఇంకుతో రాయడమంటే అప్పట్లో నాకెంతో ఇష్టంగా ఉండేది. అయితే దానితో రాస్తే పరీక్షల్లో మార్కులు వేసే వారు కారని, పరీక్షలప్పుడు దానిని ఉపయోగించేవాడిని కాను.

ఇంకులకు మంచి మంచి పేర్లు ఉండేవి. రాయల్ బ్లూ, పర్మెనెంట్ బ్లాక్, లారల్ రోస్, టార్కాయిస్ బ్లూ ఇలా రకరకాల ఇంకులు దొరికేవి. పెన్ను మూత పెట్టకుండా వదిలేస్తే ఇంకు ఎండిపోయి రాసేది కాదు. మళ్ళీ దానిని రాసేలా చేయడం ఓ పెద్ద తంతు అప్పట్లో. ఒక బ్రాండ్ ఇంకు వాడేవారు మరొక బ్రాండ్ ఇంకుతో రాసే వాళ్ళు కాదు.

ఒక్కొక్కప్పుడు ఇంకు పోసిన వెంటనే పెన్ను రాయదు. కాస్త మొండికేస్తుంది. సరైన కోణంలో సరిగ్గా పట్టుకుంటేనే పెన్ను రాస్తుంది. లేదా పెన్నుని విదల్చాలి. ఆ విదిల్చినప్పుడు సిరా అటూ ఇటూ ఉన్నవారి మీద పడకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. లేకుంటే గొడవలైపోయేవి. ఒక్కసారి దారిలోకి వచ్చిందంటే ఆ తర్వాత మనం ఏం చెప్పినా విని రాసుకుంటూ పోతుంది పెన్ను. చాలా రోజులు వాడిన పెన్నుని ఎవరైనా అడిగితే ఇవ్వడానికి మనసొచ్చేది కాదు.

పెన్నుని కడిగి తుడిచి పెట్టడం ఓ పెద్ద పని. ప్రధానమైన పని కూడా. ఆదివారాలు ఇందుకోసం కేటాయించేవాడిని. అదీ ఒక కళే. తగినంత వేడి నీటిలో దానిని నానబెట్టి ఆ తర్వాత ఓ బట్టతో పెన్నుని తుడవాలి. ఎండిన తర్వాత పెన్నులో ఇంకు పోసి రాయడం మొదలు పెట్టాలి.

చేతికి గాయం తగిలి రక్తం కారితే వెంటనే నోట్లో వేలుని పెట్టుకునేలా, వేలికి ఇంకు అంటుకుంటే వెంటనే తలకు రాసుకోవడం ఓ అలవాటు. అప్పట్లో జుత్తు నల్లగా ఉండడానికి ఇది కూడా ఓ కారణమనిపించేది. ఎంత మంచి పెన్ను అయినా వేళ్ళకు, జేబు దగ్గర ఇంకు మరక పట్టేది. కొన్నిసార్లు ఇంకు కారుతున్న చోట దారం చుట్టే వాడిని. ఒక్కొక్కప్పుడు తెరవడానికి వీలుకాకుంటే నోటితో కొరికి తెరిచేవాడిని. అలా చేసినప్పుడు పెదవులకు ఇంకు అంటుకునేది.

పెన్నుని బాగు చేయడానికి జామెట్రీ బాక్సులో ఎప్పుడూ ఏదో ఒక గుడ్డ ఉండేది. అలాగే చాక్ పీస్ ఉండేది. పెన్ను రాయనప్పుడు చాక్ పీసు మీద నిబ్బు ఉన్న భాగాన్ని పెట్టే వాడిని. అది సిరా పీల్చేది. ఇంకు పెన్నుతో రాస్తే చేతి రాత బాగుంటుందని అప్పట్లో ఓ నమ్మకం. అంతేకాకుండా స్కూల్లో పెన్నులను మరొకందుకు కూడా వాడే వాళ్ళం. మనకన్నా లావుగా ఉన్న ఒకతనిని కొట్టలేని పక్షంలో అతని వీపు మీద ఇంకు చల్లేవాళ్ళం. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీన సగం తరిగిన బంగాళదుంప ముక్కకు సిరా పూసి ఏఏఫ్ (ఏప్రిల్ ఫూల్) అనే అక్షరాలు రాసి దానితో వీపు మీద కొట్టడం ఓ సరదా. ఇంతకూ ఫౌంటెన్ పెన్ను తయారు చేసిందెవరనే విషయంతో ఈ నాలుగు మాటలకు ముగింపు పలుకుతాను.

అవసరమే ఏదన్నా చెప్పిస్తుంది…తయారు చేయిస్తుంది అనే మాటకు ఈ ఫౌంటెన్ పెన్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లూయి వాటర్ మన్ అనే అతను 1883 ప్రాంతంలో న్యూయార్కులో ఓ బీమా బ్రోకర్. ఓ కాంట్రాక్టుపై సంతకం చేయడానికి అతను ఓ కొత్త పెన్ను కొన్నాడు. కానీ అది సరిగ్గా రాయలేదు. దానితో అతను తన సోదరుడి వర్క్ షాపులో సొంతంగా ఓ ఫౌంటెన్ పెన్ను తయారు చేశాడు. దానికి కొన్ని రోజులకే పేటెంట్ హక్కులు కూడా సంపాదించాడు. 1901లో వాటర్ మాన్ మరణించిన తర్వాత ఆయన సమీప బంధువు ఫ్రాంక్ డి. వాటర్ మన్ ఈ పెన్నుల తయారీ వ్యాపారాన్ని విస్తరించాడు. అతను ఏడాదికి మూడున్నర లక్షలకు పైగా పెన్నులు అమ్మడం విశేషం.

బాల్ పాయింట్ పెన్ సృష్టికర్త ఎవరు?

బాల్ పాయింట్ పెన్ సృష్టికర్తగా హంగేరీ-అర్జెంటీనాలకు చెందిన లాస్జ్లో బిరో పేరు చెపుతారు గానీ, ఈ పెన్ అంతకన్నా పురాతనమైనదే.

అమెరికాకు చెందిన జాన్ జే లౌడ్ 1888లో బాల్ పాయింట్ పెన్‌పై మొట్టమొదటి పేటెంట్ హక్కు పొందారు. వృత్తి రీత్యా లాయర్ అయిన లౌడ్… చెక్క, తోలు లాంటి కఠినమైన ఉపరితలాలపై కూడా రాయడానికి వీలుగా ఉండే ఇంకు పెన్ కావాలనుకున్నారు. దాని కోసం గుండ్రంగా తిరిగే స్టీల్ బాల్‌ను రూపొందించారు. దానిని ఒక ఒరలో రాయడానికి వీలుగా అమర్చారు.

“నేను కనిపెట్టింది ఫౌంటెన్ పెన్ కన్నా మెరుగైంది. కఠినమైన ఉపరితలాలపై రాయడానికి అనువుగా ఉండేది” అని దీని పేటెంట్ కోసం పెట్టిన దరఖాస్తులో లౌండ్ వివరించారు.

పెన్నుతో రాయాలన్న ఒక్క ఆలోచన నన్ను గతంలోకి తీసుకుపోయి కొన్ని మాటలు చెప్పించిందిలా.