మహాకవి గురజాడ జన్మించి ఇప్పటికి 163 సంవత్సరాలు. భౌతిక కాయాన్ని వీడి 110 సంవత్సరాలు. నేడు రచయితలు విస్త్తృతంగా ప్రక్రియా వైవిధ్యంతో సాహిత్య రచనలు చేస్తున్నారు. సాహిత్యంలో భిన్న ప్రయోగాలు చేస్తున్నారు. విమర్శ కొత్త పుంతలు తొక్కుతోంది.

ఇటువంటి నేటి సాహిత్య ప్రపంచంలో గురజాడ రచనలకు ప్రాసంగికత ఉన్నదా? అంటే చాలా ఉన్నది. కొందరు మహాకవుల రచనలు వారి కాలంతోనే మరుగున పడిపోవు. వారి భావజాలం తరతరాలకు స్పూర్తిదాయకంగానే ఉంటుంది. వెన్ను తట్టి ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అటువంటి రచనలు గురజాడవి.

కన్యాశుల్కం అనే సమగ్ర నాటకం, ఐదు ఆణిముత్యాల్లాంటి కథలు, కొన్ని కవితలు, ఇంకా కొన్ని వ్యాసాలు, పరిశోధనాత్మక రచన డిసెంట్ పత్రం ఇవే గురజాడ మనకు ఇచ్చి వెళ్లిన సాహిత్య సంపద. లభ్యమవుతున్న మిగిలినవి రెండు అసంపూర్ణ నాటకాలు. అవి కొండుభట్టీయం, బిల్హణీయం. రాయాలనుకుని, ఆరోగ్యం సహకరించక రాయలేకపోయిన రచనా ప్రణాళికలు అనేకం! గురజాడ రాసినవి తక్కువ. సమాజంపై అవి చూపిన ప్రభావం ఎక్కువ. “రాసి కన్న వాసి మిన్న’’ అనే నానుడి గురజాడ విషయంలో మేధావులందరూ ఎప్పుడో ఆమోదించిన అంశం.

గురజాడ 1862 సెప్టెంబర్ 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. చీపురుపల్లిలో అక్షరాభ్యాసం, అనంతరం రెండేళ్లు చదువు సాగింది. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, రచనా వ్యాసంగం, అన్నీ విజయనగరంలోనే! విజయనగరం అంటే గురజాడ! గురజాడ అంటేనే విజయనగరం! అంటే తెలుగు వారి మనస్సులలో ఈ భావన స్థిరమైపోయింది.

హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే 1882లో గురజాడ “కుకు” అనే కవిత ఆంగ్లంలో రచించారు. అప్పుడు ఆనందగజపతితో కలిగిన పరిచయం దినదిన ప్రవర్థమానమై సుదీర్ఘ కాలం కొనసాగింది. 1883లో ‘సారంగధర’ అనే ఇంగ్లీష్ పద్య కావ్యాన్ని రచించారు. ఇది పలువురి ప్రశంసలు పొందింది. అంటే గురజాడ రచనా వ్యాసంగం ఇంగ్లీషు రచనతోనే ప్రారంభమైంది.

గురజాడ అనగానే మనకు మొట్టమొదట గుర్తుకు వచ్చేది తెలుగువారి గుండె తలుపులను తట్టి లేపే రచన ‘కన్యాశుల్కం’. ఇందులోని సంభాషణలు, వాక్యాలు మనం ఇప్పుడు కూడా నిత్య జీవితంలోను, ప్రసంగాలలోనూ సందర్భానుసారంగా ఉటంకిస్తున్నామంటే దీని సార్వకాలికత ఏమిటో అర్థమవుతుంది.

కన్యాశుల్కం ఇతివృత్తాన్ని నాటకంగా మలచటం లోనే గురజాడ సామాజిక దృక్పథం, సాహిత్య ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది. స్త్రీ విద్య ఇంకా ప్రాచుర్యంలోకి రాని, పఠనాశక్తి అంతగా అలవడని ఆ రోజుల్లో స్త్రీల సమస్యలను వారి ముందుంచి వారిని చైతన్యవంతులను చేయటానికి ప్రదర్శన యోగ్యమైన నాటకరంగ మొక్కటే తగినదని భావించారు. అంతేకాదు, అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచించారు. విజయనగరంలో ప్రదర్శించ దలచుకున్న నాటకం కాబట్టి ఆ ప్రాంత మాండలికంలో రచించారు. ఏది ఎవరి కోసం ఉద్దేశించిన రచనో అది వారికి అందకపోతే ఇంక ఆ సాహిత్యానికి ప్రయోజనం ఏముంటుంది?

ఆనాటి సమాజంలోని ఆచార వ్యవహారాలు, మూఢ నమ్మకాలపై విశ్వాసం, సంఘ సంస్కరణ జరుగుతున్న తీరు తెన్నులు, ఇంగ్లీషు చదువుపై మోజు, ప్రజల జీవన విధానం, విజయనగరంలోని అయ్యకోనేరు, బొంకుల దిబ్బ వంటి ఎన్నో స్థలాలు ఒకటేమిటి నాటి సమాజ సమగ్ర స్వరూపాన్ని కన్యాశుల్కం అద్దం పట్టింది.

గురజాడ రచించిన ఐదు కథలూ ఐదు ఆణిముత్యాలు. అప్పటికీ ఇప్పటికీ సమస్యల స్వరూపం వేరు కావచ్చు. కాని స్త్రీలు తమ సమస్యలను తామే ఎలా పరిష్కరించుకోవాలో గురజాడ రచనలు తెలియజేస్తాయి. “స్త్రీలు చదువుకోవాలి. మేల్కోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరిగి రచించాలి” ఇది గురజాడ సందేశం!

నేడు స్త్రీలు గొప్ప చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత చదివినా, ఎన్ని నేర్చినా స్త్రీలు అసమానతలకు, అన్యాయాలకు గురవుతూనే ఉన్నారు. సమాజంలో స్త్రీకి రక్షణే కరువుగా ఉంది. గురజాడ నేర్పించిన విద్యలు జీవన విద్యలు. దిద్దుబాటులో కమలిని, పూర్ణమ్మ, కన్యక ఖండికలలోని స్త్రీలు తమ సమస్యలు తామే పరిష్కరించుకుని, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుపుతారు.

ఎల్ల లోకము ఒక్క ఇళ్ళై వర్ణ బేధాలు లేని సమాజాన్ని గురజాడ కాంక్షించారు. మతములన్నీ రూపు మాసి జ్ఞానమొక్కటే నిలిచిపోవాలని ఆశించారు. అనేక వైరుధ్యాలతో అతలాకుతలమవుతున్న నేటి సమాజానికి గురజాడ ఈ కవితా పంక్తులు స్పూర్తి కాకుండా ఎలా ఉంటాయి?

మానవ సంబంధాలకు స్నేహం ప్రాతిపదిక కావాలని వారి రచనలన్నింటిలో గురజాడ చెప్పారు. అవి నేటి సమాజానికి ఎంతో అవసరం. స్త్రీ పురుష సంబంధాలను గురించి గురజాడ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో ఉదాత్తమైనవి. ఆ కాలానికి చాలా కొత్తవి. నేటి తరానికి ఎంతో అవసరమైనవి.

“ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును” అన్నారు గురజాడ ‘కాసులు’ ఖండికలో. ఇది ఎంత గొప్ప భావన! ప్రేమతో, స్నేహంతో ఎటువంటి వారిలోనైనా మార్పు తీసుకురావచ్చు.

గురజాడ దేశభక్తి గేయం భారత దేశానికి ఆర్థిక ప్రణాళిక నిచ్చింది. నిజమైన దేశభక్తి అంటే ఏమిటో నిర్వచించింది. “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే ఈ పంక్తులు ఎంత ప్రసిద్ధి పొందాయంటే, ఈ ఖండిక రచన జరిగి 113 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కవులు, రచయితలు, రాజకీయ నాయకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు తమ ప్రసంగాలలో ఉటంకిస్తూనే ఉన్నారు.

గురజాడ విజయనగరం మహారాజా కళాశాలలో అధ్యాపకులుగా పని చేశారు. తన బోధనతో ఎందరో విద్యార్థులను ప్రభావితం చేశారు. ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం అనే పరోక్ష విద్యార్థికి లేఖల ద్వారా చెప్పిన విషయాలు సాహిత్య పాఠాలు లాంటివి.

ఉపాధ్యాయులు ఆదర్శప్రాయులుగా ఉండాలి, మహోన్నత శీలం, వ్యక్తిత్వం, గుణ సంపద ఉండాలని గురజాడ అనేవారు. ఉపాధ్యాయుల వ్యక్తిత్వం ఉన్నతమైనదైతే వారిని అనుసరిస్తూ విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని వికసింప జేసుకుంటారు. “ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఉండవలసిన కళ బోధన” అన్నారు. అందులో నిరంతరం నైపుణ్యం పెంచుకుంటూ ఉండాలనే గురజాడ మాటలు నేటి ఉపాధ్యాయులకు శిరోధార్యాలు.

విద్యారంగంలో మాతృ భాష ప్రాధాన్యాన్ని గురించి గురజాడ చెప్పిన విషయాలు నేటి విద్యారంగానికి ఎంతో ఉపకరిస్తాయి. విద్యార్థులు వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేయటం వల్ల వ్యాకరణ జ్ఞానం రాదు, భాషా పరిశీలన వల్ల మాత్రమే వస్తుంది అన్నారు. కాని, ఇప్పటికీ విద్యార్థులు వ్యాకరణ సూత్రాలనే వల్లె వేస్తున్నారు.

గురజాడది ఎంత ముందు చూపు!

సౌదామిని అనే అసంపూర్ణ నవలలో వారు, స్త్రీలు వంట చాకిరీ నుంచి విముక్తి పొందాలంటే వంట చేయటాన్ని నిషేధించాలి. ఆహారం దుకాణం నుంచి తెచ్చుకోవాలి, దీని వల్ల వాళ్లకు సమయం ఆదా అవుతుంది. స్త్రీ తిరగబడాలి. పాశవిక శక్తి నెదుర్కోవటానికి ఆమె ఖడ్గ విద్యలు నేర్చుకోవాలని అన్నారు. ఇవి ఆనాటికి ఊహించలేని భావాలు. ఈనాటికి, ఇప్పుడిప్పుడే చాలా వరకు ఆచరణలోకి వస్తున్న అంశాలు. గురజాడ రచనలకు నేడే కాదు ఎప్పటికీ ప్రాసంగికత ఉంటుందని చెప్పటానికి ఇంతకంటే ఇంకేం కావాలి? మానవ జీవితంలో మానవత్వం, స్నేహం, ప్రేమ విలువను గురజాడ నొక్కి చెప్పారు. ఎవరి జీవితాన్ని వారే చక్కబరచుకోవాలని, అన్యాయానికి తలవంచకూడదని చెప్పారు. ఈ అంశాలు ఎప్పటికీ అందరికీ అవసరమే!