పత్రికాధిపతి, రాజకీయ వ్యాస రచయిత, మత సామరస్యం కోసం పాటుపడిన అభ్యుదయ భావ సంపన్నుడు చిలకమర్తి లక్ష్మి నరసింహం కలం నుంచి వెలువడిన అపూర్వ హాస్య నవలా తరంగం ‘గణపతి’. తెలుగు పాఠక లోకం ముఖంపై నవ్వుల పువ్వులు విరబూయించే నవల ఇది.

ఇందులో మూడు తరాల కథలున్నాయి. కానీ హీరో మాత్రం గణపతే. ఆయన పితామహుడు పప్పుభోట్ల పాపయ్య. ఆయన భార్య పిచ్చమ్మ. పునహ (పూనా) పట్టణం పెద్దది కావడం వల్ల చేతినిండా పని పాపయ్యకి. అదే అనాథ ప్రేత సంస్కారం. వల్లకాడులోనే తిండి తిప్పలు, శవ దహనం. రాత్రిళ్ళు మూరెడు చుట్టలు కాలుస్తుంటే దూరం నుంచి జనం కొరివిదెయ్యం తిరుగుతోందని భయపడేవాళ్ళు. పెళ్లయ్యాక పాపయ్య కొన్ని కారణాల వల్ల ముందు రాజమండ్రి, తరువాత మందపల్లి వెళ్లక తప్పలేదు.

వారి కొడుకే గంగాధరం. ఆయన భార్య సింగమ్మ. కాకినాట్టొ ఎవరి నోట్లోకైనా గుక్కెడు నీళ్లు పోతున్నాయంటే అది గంగాధరుడి చలవే. సార్థక నామధేయుడు. అతడి నీళ్ల కావిడి రాకకోసం జనం వెంపర లాడిపోయేవాళ్ళు. నీళ్ల కావిడులు మోస్తూ అపర భగీరదుడీలా కనిపించేవాడు. వాళ్ళ ముద్దుల కొడుకే మన హీరో గణపతి. అతడి స్వరూపాన్ని చిలకమర్తివారు వర్ణిస్తూ ‘కొండముచ్చు ఆకారం, ముఖంపై మసూచి గుంటలు, కుడికన్ను మెల్ల దాంట్లో కాయ, దొడ్డికాళ్ళు, గుజ్జురూపం, పెద్దబొజ్జ, ఒంటి నిండా రోమాలు’.

గణపతికి నాలుగేళ్ల వయసులో గంగాధరం కైలాసానికి చేరాడు. సింగమ్మ తమ్ముడు నాగన్న ఇంటికి పుత్రుడితో సహా చేరింది. ఇక మన గణపతికి బడి అన్నా, చదువు అన్నా చచ్చేంత భయం. బడి ఎగొట్టడానికి ఆడే నాటకాలు అన్నీ ఇన్నీ కావు. కడుపు నొప్పి అని చాలాసార్లు, నూతిలో బండ పడేసి చచ్చాడని ఇంకోసారి, మాస్టారికి రోగం అని… ఎన్నోసార్లు అతడు చెప్పే అబద్దాలకు అంతూ పొంతూ లేదు. మాష్టారికి రోగం వచ్చి చస్తే నీకు కోళ్లు బలిస్తా అని దేవతలకు మొక్కులు మొక్కేవాడు.

పదేళ్ల గణపతికి నాలుగు కాళ్ళున్న గుర్రం ఎక్కాలన్న కోరిక ఎక్కువైంది. గుర్రం దొరకలేదు. దొరికిన నాలుగు కాళ్ళ గాడిద నెక్కాడు. గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టాలి, పాపం గాడిదకేం పెట్టక్కర్లా అని గాడిదకే ఓటేశాడు. దొంగిలించి తెచ్చుకున్న చడావులు (చెప్పులు), రజకుణ్ణి అడిగి తెచ్చిన ఉత్తరీయం, నోట్లో గుప్పు గుప్పుమనే చుట్టతో ఊరంతా తిరిగాడు. బరువు మోయలేని గాడిద కింద పడేస్తే మేనమామ కొడతాడని చాకలి బాన కిందకు దూరాడు.

డబ్బు కోసం బతికున్న తల్లి చచ్చిందని, మాసికమని, చచ్చిన తండ్రి ఆబ్దికమని, మరోసారి తిరుపతి మొక్కు అని అబద్దాలు కోకొల్లలుగా చెప్పేవాడు. చెయ్యని పిచ్చి పనులు లేవు, ఆడని అబద్దాలు లేవు. రాజమహేంద్రవరంలో వున్నప్పుడు గిరజాల జుట్టు కావాలని భజంత్రీ వారి చేత బుర్రగొరిగించుకుని ఆముదం మర్దించినా ఫలితం సున్నా.

బతకడానికి తాతగారిలా బ్రాహ్మాణార్థాలే మిన్నని, అందునా చావులకే మొగ్గు చూపాడు. అక్కడ కార్యక్రమాల్లో పెట్టే బట్టలు నచ్చక తోటి బృందాన్ని కూడగట్టి కోటులు, అందునా నచ్చిన రంగులు ఇవ్వనిదే కార్యక్రమాలకు రాబోమని సత్యాగ్రహం చేస్తే, కార్యానంతరం యజమానులు కట్టకట్టి మన నాయకుడికి దేహశుద్ధి చేశారు.

18 ఏళ్ళు మీదకొచ్చి పెళ్ళిపై గాలిమళ్ళి మేనమామ కూతురు నాలుగేళ్ల పిల్లనిమ్మని గోల చేశాడు. అత్త ఎదురు తిరిగిందని, ఆమె పరువు తియ్యాలని అన్నం తక్కువ పెడితే కడుపు మాడుస్తోందని, ఎక్కువ పెడితే అమ్మవారికి కుంభం తోడుతోందని ఊరూ వాడా యాగీ చేశాడు. మేనమామ శత్రువుతో చేతులు కలిపి, వాడి దురాలోచనతో మేనమామ కూతురిని ఎత్తుకెళ్లి తాళి కట్టాడు. అత్త ఆ తాళిని తెంచి పారేస్తే గొడవ చేశాడు. మేనమామ ఇంట్లోంచి గెంటెస్తే “మా ఆస్తి విరిగిన కుర్చీ, పగిలిన జాడీ, తుప్పు పట్టిన చెంబు, మొద్దుబారిన ఇనుప గరిటే అప్పనంగా వేసుకుందామనుకున్నావే” అని వాదిస్తాడు.

మహాదేవశాస్త్రి అనే దూరపు బంధువు ఆశ్రయాన్ని పొంది ఆయన సలహాతో "బడి"ని పెడతాడు. ఇక అక్కడ మాస్టారు రూపంలో పిల్లల పాలిటి యముడి అవతారం ఎత్తాడు గణపతి. అతడు విధించే శిక్షలు నరకంలో కంటే భయంకరం. తల్లిదండ్రులు ఇదేమిటి అని అడిగితే “మా గురువులు వాతలు పెట్టేవారు. కట్టేసి ముంత పొగ పెట్టేవారు. తల గోడకేసి కొట్టేవారు. వాటితో పోలిస్తే తక్కువే” అని పోల్చేవాడు.

దాశరధి శతకంలో “శ్రీ రఘురామ చారు తులసీ దళ ధామ” అనే పద్యం అర్థాన్ని ఒక విద్యార్థి అడిగితే గణపతి ఇలా చెబుతాడు. శ్రీరాములవారికి ఒకసారి పైత్యం ముదిరితే చారు పెట్టించుకున్నారు. అందులో కరివేపాకు బదులు తులసాకులు (తులసీ దళ ధామ) వేసి పొంగించారు. ఆ చారు సమస్త శ్రమను పోగొట్టి బహు శృంగారంగా (శృంగార గుణాభిరామ) ఉందట. అది తాగిన రాములవారికి బోల్డంత సౌర్యం (త్రిజగన్నుతా సౌర్య లలామ) వచ్చింది. అంతేకాదు కఫం (దూర్వార కబంధ రాక్షస విరామ) పోయింది. ఆ చారు తారక మంత్రంలా కల్మషాన్ని (జగజ్జన కల్మ షార్నవో తారక రామ) కొట్టేసింది. జనమంతా నవ్వినా అది తన గొప్పదనమే అని విర్రవీగుతాడు గణపతి.

మరో పిల్లాడు జ్వరం అంటే ఏమిటని అడిగితే అన్నీ తనకే తెలిసినట్లు గణపతి ఇలా చెబుతాడు. “మన కడుపులో బొడ్డు దగ్గర ఒక దీపం ఉంటుంది. అది భగ్గుమని పెద్దదవుతుంది. అప్పుడు వేడి పుడుతుంది. దాని వల్ల చర్మం వేడెక్కుతుంది. అప్పుడు కడుపులో మంట వస్తుంది. దీపం వేడి తగ్గితే జ్వరం తగ్గుతుంది” అని.

మరో కొంటె పిల్లాడు మీకు అన్నీ తెలుసుగా! ఉరుములు, మెరుపులు, పిడుగులు అంటే ఏమిటి అంటే “దేవుడు ఓ బండి మీద ఆకాశంలో తిరుగుతాడు. బండి చప్పుడే ఉరుములు. బండి శీల ఊడి కిందపడితే అది పిడుగు. బండి గుర్రాల డెక్కల చప్పుడు రాపిడి వల్ల మంటలొస్తుంటే అవి మెరుపులు. వానంటే దేవుడి చెమట” అని చెబుతాడు.

ఒక రోజు ఓ అర్భక బాలుడు తాను అడిగిన దానికి సమాధానం చెప్పలేదని చావగొడితే వాడు కళ్ళు తేలేసాడు. ఊరివాళ్ళు భయపెడితే పారిపోయి ఇంట్లో అటకెక్కి ఆవకాయ జాడీ పక్కన పడుకున్నాడు. ఇంటావిడ ఆవకాయ కోసం వస్తే గురక విని కొండముచ్చని అదిలిస్తే పారిపోతాడు. ఊరి చివర అరుగు మీద నిద్రపోతూ రెండు రోజులైనా లేవకపోతే, పోయాడని అందరికీ కబురెట్టి పాడె కడతారు. వల్లకాడులో ఆఖరి నిముషంలో కదిలి అందరినీ భయపెడతాడు.

బతకడానికి చివరికి వంటవాడి అవతారం ఎత్తి లోకల్ ఫండ్ ఇన్‌స్పెక్టర్ గారింట్లో చేరతాడు. ఎవరికీ ఎంత వండాలో తెలియక వృధా చేయడమే కాక, తనే ముందు తినేసి యజమానికి అరకొర మిగులుస్తాడు. అన్నం కలిపే గరిట లేక వేపపుల్లను వాడి ఇదే దొరికిందని దబాయిస్తాడు. పప్పులో ఉప్పు కలపక, ఉప్పులో పప్పు కలిపి యజమాని ఆగ్రహానికి గురవుతాడు.

ఆ వూళ్ళో కొబ్బరి చెట్టుకు ఎలుకలు పట్టి పిందెలు రాలిపోతున్నాయని, ఉపాయం ఆలోచించానని అందరికి చెప్పి ఆశ్చర్య పరుస్తాడు. మర్నాడు అందరూ చూసేసరికి కనిపించిన దృశ్యం… ఓ పిల్లి మెడలో తాడు కట్టి ఆ చెట్టుకి వేలాడుతోంది. అంతా నెత్తినోరు బాదుకున్నారు. దోషమన్నారు. ఓ బంగారు పిల్లిని చేయించి దానమివ్వాలన్నారు. డబ్బుకోసం అందరూ చందాలకు పరుగెట్టారు.

గణపతి చేసిన పిచ్చిపనులు ఇన్ని అన్నీ కావు. వాటిని చిలకమర్తివారు హాస్యంగా, వ్యంగ్యంగా చూపారీ నవలలో. ఒకసారి తల్లి అపస్వరంతో పాటలు పాడుతోందని ఆగ్రహించిన గణపతి ఆమెకి పిచ్చిపట్టిందని, వైద్యంలో భాగంగా తల గొరిగించి బుర్ర చీల్చి నిమ్మరసంతో మర్దన చేయిస్తే పిచ్చి తగ్గుతుందని అలా చేసి బిందెలకొద్ది నీళ్లు నెత్తిన అభిషేకిస్తారు.

తీర్థయాత్రల కెళ్ళిన సింగమ్మ పాపం అనుకోకుండా కన్ను మూస్తుంది. ఇంటిపట్టున లేకుండా తిరిగే గణపతికి ఈ విషయం తెలీదు పాపం. చివరి అంకంలో పెళ్ళికి సిద్ధం అవుతాడు గణపతి. భైరవ దీక్షితులు అనే పెద్దమనిషికి 40 వరహాలిచ్చి కన్య మెడలో తాళి కడతాడు. నాలుగు రోజుల తర్వాత కాపురాన్ని గురించి కలలు కంటున్న గణపతి ముందు ఓ యువకుడు, కానిస్టేబుల్ వచ్చి “దీక్షితులు నిన్ను మోసం చేసాడని, నీ భార్యకి మొదటి మొగుడు ఈ యువకుడే” అన్న బాంబు పేలుస్తాడు. దీక్షితులను పోలీస్ అరెస్ట్ చేస్తున్నప్పుడు గణపతి వాళ్ళ కళ్ళు కప్పి పారిపోతాడు. తరువాత అతడేమయ్యాడో తెలియదు.

తెలుగు సాహిత్యంలో ఒక చక్కని హాస్య రచనగా ‘గణపతి’ నవల సాహిత్యం ఉన్నంత కాలం బతికుండే నవల. పాఠకుల నోళ్ళల్లో, మదిలో చిరస్థాయిగా మిగిలే నవల. అలసట చెందిన హృదయాలకు హాయిని కలిగించే నవల.