21 ఏళ్ళ ప్రస్థానంపై సమీక్ష

మనదేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఈ అక్టోబర్ 12 వ తేదీకి 21 సంవత్సరాలు పూర్తి అవుతాయి. గడచిన రెండు దశాబ్దాలలో సమాచార హక్కు చట్టం మన సమాజంపై చూపిన ప్రభావం ఎంత? ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం (ఇండియా)లో పౌరులు ఆ చట్టం ద్వారా ఏమైనా లబ్ధి పొందారా? చట్టంలో పొందుపరిచిన విధంగా పౌరులకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత కనిపిస్తున్నదా? తాము కోరుకున్న సమాచారాన్ని పౌరులు పొందగలుగుతున్నారా?

నేపథ్యం

ఏ ప్రజాస్వామిక దేశంలో అయినా రాజకీయ పార్టీల తీరుతెన్నులు, వారు మేనిఫెస్టో రూపంలో చేసే వాగ్దానాలు నచ్చి ఓటు ద్వారా పౌరులు నేతలకు అధికారం కట్టబెడతారు. అలా చేపట్టిన పాలనతో నేతలు చట్టబద్ధమైన పాలన కొనసాగిస్తారు, కొనసాగించాలి కూడా. అదే విధంగా తాము కట్టే పన్నుల ద్వారానే పౌరులు ప్రభుత్వాలకు ఆర్థిక బలాన్ని చేకూరుస్తారు. ఆ పన్నుల ద్వారా సమకూరిన సొమ్ము, తాము మేనిఫెస్టోలో పొందుపరచిన సంక్షేమ కార్యక్రమాలకు, ఇతర అభివృద్ధి పనుల ఖర్చుల కోసం సరిపోనప్పుడు, ఇతర ఆదాయ మార్గాలు, కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటుల రూపంలోను, ఇతర ఆర్థిక సంస్థల నుండి ఋణ సదుపాయం పొంది ఆ లోటును పూడ్చుకుంటాయి. ఈ ఋణాలు తరువాతి కాలంలో పౌరులే తీర్చాల్సి వస్తుంది.

అంటే… అటు ఓటు ద్వారా అధికారం, ఇటు నోటు ద్వారా ఆర్థిక బలం పాలకులకు పౌరులే సమకూరుస్తున్నారు.

మరి ఆ విధంగా అందుకున్న పాలనాధికారాన్ని పాలకులు పౌరుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం, కొత్త ప్రాజెక్టుల కోసం, కొత్త జల వనరుల కోసం, ప్రజల విద్యా, వైద్య, ఆరోగ్య సౌకర్యాల కోసం, సామాజిక భద్రత కోసం, జీవన ప్రమాణాల మెరుగు కోసం, మంచి పథకాల కోసమే వినియోగిస్తున్నారా? లేదా? అనే సందేహం రావడం సహజం.

ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే ధనం ఏ పథకాలకు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు? సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారుకే అందుతున్నాయా? మౌలిక వసతుల కల్పనకై చేస్తున్న ఖర్చు ఎంత? విద్య కోసం వాస్తవంగా ఎంత ఖర్చు అవుతున్నది? ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఏ మేరకు ఉన్నది… ఇవన్నీ ఒక పౌరుడుగా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది కదా!

ఈ వాస్తవాన్ని ముందుగా గుర్తించినవి ఐరోపా దేశాలు. స్వీడన్ ప్రభుత్వం 1766 లోనే “ఫ్రీడం ఆఫ్ ప్రెస్ ఆక్ట్” చట్టాన్ని చేసి తమ పాలనలోని పారదర్శకతను ప్రజల ముందు ఉంచింది. 20 వ శతాబ్దంలో ప్రాచ్య దేశాలు ఈ తరహా చట్టాలు చేయడానికి స్ఫూర్తిగా నిలిచాయి.

1923 సంవత్సరంలో వలస పాలకులు చేసిన “అధికారిక రహస్యాల చట్టం” స్వాతంత్ర్య సిద్ధి తరువాత 2005 వరకు కొనసాగింది. పౌరులు ఏ సమాచారం అడిగినా ఆ బూచీని చూపించేవారు. అధికారులు ఏ సమాచారమూ తెలియజేసేవారు కాదు.

1990 ప్రారంభంలో మనదేశంలోని కొందరు మేధావులకు, సామాజిక కార్యకర్తలకు భారతదేశం స్వతంత్రమైన తరువాత కూడా ఆనాటి అధికారిక రహస్యాల చట్టం ఇంకా ఎందుకు అమలులో ఉండాలి? స్వపరిపాలనలో కూడా ప్రభుత్వ పాలనలో రహస్యాలు ఎందుకు ఉండాలి? పరిపాలన ఎలా జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఎందుకు ఉండకూడదు? లాంటి ఆలోచనలు కలిగాయి. అప్పటికే రెండు మూడు కేసులలో కోర్టులు పౌరులు కోరిన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని ఆయా కేసులకు సంబంధించి తీర్పులు చెప్పాయి.

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీమతి అరుణా రాయ్ ఈమె ఐ. ఏ. ఎస్. అధికారిణి. 1974 లో రాజీనామా చేసి ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. “మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్” అనే సంస్థను స్థాపించి రైతు కూలీల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ వారితో మమేకమై జీవించారు. నిఖిల్ డే, శక్తి సింగ్ తదితర సామాజిక కార్యకర్తలు ఆమెకు అండగా నిలిచారు.

“మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్” వారు, ప్రభుత్వం నిర్వహించే “గ్రామీణ ఉపాధి హామీ పథకం” ద్వారా కూలీలకు చేసే చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గ్రహించారు. కూలీ చెల్లింపు వివరాలు అధికారిక పత్రాల్లో నమోదు చేసిన వాటికి, వాస్తవ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు తెలుసుకున్నారు. కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరుగుతూ “జన్ సున్ వాయ్” నిర్వహించేవారు. ఆ విధంగా కూలీలు పొందిన వాస్తవ వేతనం ఎంత అనేది తెలుసుకునేవారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కువ వేతనాలు నమోదు చేస్తున్నట్లు గమనించారు. దీనితో “హమారా పైసా – హమారా హక్” (డబ్బు మాది – తెలుసుకునే హక్కు మాకు ఉంది) అనే నినాదంతో ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమంతో పాటు పాలనలో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవడం పౌరుల హక్కు అనే నినాదం మొదలైనది. ఈ పోరాట స్ఫూర్తితో “ప్రజా సమాచార హక్కు జాతీయ ఉద్యమం” (NCPRI) ప్రారంభమైంది. ఎందరో సామాజిక కార్యకర్తలు, మేధావులు, న్యాయ నిపుణులు మద్దతు ప్రకటించారు. ఈ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం “సమాచార హక్కు స్వేచ్చ” చట్టాన్ని 2002 వ సంవత్సరంలో తీసుకువచ్చింది. కాని అది సమగ్రంగా లేదని అందరూ భావించారు.

2004 లో “యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియెన్స్” (యూ. పీ. ఏ) ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ చైర్ పర్సన్ గా “జాతీయ సలహా మండలి” ఏర్పాటు చేశారు. శ్రీమతి అరుణా రాయ్, డాక్టర్ ఎం. ఎస్. స్వామినాథన్, డాక్టర్ జయప్రకాష్ నారాయణ (లోక్ సత్తా), మాధవ్ గాడ్గిల్ తదితర సామాజిక కార్యకర్తలతో పాటు అనేక మంది బ్యూరోక్రాట్లు, ప్లానింగ్ కమిషన్ సభ్యులు, న్యాయ నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ సలహా మండలిలో సభ్యులుగా ఉండేవారు.

ఈ సలహా మండలి చొరవతోనే మన దేశంలో “సమాచార హక్కు చట్టం – 2005”, “విద్యా హక్కు చట్టం”, “మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం”, “ఆహార భద్రతా చట్టం” ఏర్పాటు అయ్యాయి.

2025 ప్రారంభంలో సమాచార హక్కు చట్ట ముసాయిదా ప్రతిని జాతీయ సలహా మండలి సభ్యులు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఆ ముసాయిదా ప్రతిని బిల్లు రూపంలో ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. చర్చల తరువాత దానిని ఆమోదించి రాజ్యసభకు పంపారు. అక్కడ కూడా ఆమోదం పొందిన తరువాత 2005 జూన్ 15 వ తేదీన రాష్ట్రపతి ఆమోదముద్రతో బిల్లు చట్ట రూపం దాల్చింది. ఆ రోజు నుంచి నూట ఇరవయ్యవ రోజున అంటే అక్టోబర్ 12 వ తేదీన సమాచార హక్కు చట్టం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటివరకు అమలులో ఉన్న అధికారిక రహస్యాల చట్టంపై సమాచార హక్కు చట్టం పై చేయి సాధించింది.

చట్టంపై అవగాహన

“సమాచార హక్కు చట్టం – 2005” మన దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత చేసుకున్న చట్టాల్లో అత్యుత్తమైనదిగా చెప్పుకోవచ్చు. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు ప్రభుత్వాలకు “ఓటు ద్వారా అధికారాన్ని – నోటు ద్వారా ఆర్థిక పరిపుష్టిని” కలిగిస్తున్న పౌరులకు “పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం” గురించిన సమాచారం ఒక హక్కుగా ఈ చట్టం ద్వారా లభిస్తున్నందుకు సమాజంలోని అన్ని వర్గాల వారు ఎంతో ఆనందపడ్డారు.

మనం తయారు చేసుకున్న సమాచార హక్కు చట్టం, అప్పటికి ఇతర దేశాలలో అమలులో ఉన్న ఈ తరహా చట్టాల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నదనే అభిప్రాయం ఉండేది. ఈ చట్టం ప్రకారం భారత పౌరుడు ఎవరైనా సరే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో జరిగిన నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, ఆయా శాఖల నిర్మాణం, అధికారుల, ఉద్యోగుల వివరాలు, వారి జీత భత్యాలు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలు మొదలైన వివరాలను తెలుసుకునే అవకాశం కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే చట్టసభలకు ప్రభుత్వం ఏ సమాచారాన్ని అందిస్తుందో దానిని సామాన్య పౌరులు కూడా తెలుసుకునే అవకాశం లభించినట్లయింది.

సమాచార హక్కు చట్టం 6 చాప్టర్లు, 31 సెక్షన్ లతో ఉన్న చిన్న చట్టం.

అధ్యాయం I — ప్రాథమికం (Sections 1–3)

చట్టం పేరు, అమలు పరిధి, ప్రారంభం.

ముఖ్య నిర్వచనలు: “సమాచారం,” “ప్రజా సంస్థ,” “సమాచార హక్కు” మొదలైనవి. భారతదేశమంతటా వర్తింపు (జమ్మూ & కాశ్మీర్ మినహా, enactment సమయంలో).

అధ్యాయం II — సమాచార హక్కు & ప్రజా సంస్థల బాధ్యతలు (Sections 4–11)

పౌరులకు సమాచారం పొందే హక్కు కల్పిస్తుంది. ప్రజా సంస్థలు రికార్డులు నిర్వహించడం, సమాచారాన్ని ముందుగానే ప్రచురించడం, అభ్యర్థనపై అందించడం వంటి బాధ్యతలు వహించాలి. అభ్యర్థన విధానం, సమయ పరిమితులు, ఫీజులు, మినహాయింపులు వివరాలు.

అధ్యాయం III — కేంద్ర సమాచార కమిషన్ (Sections 12–14)

కేంద్ర సమాచార కమిషన్ (CIC) స్థాపన. నియామకం, పదవీకాలం, సేవా నిబంధనలు.జాతీయ స్థాయిలో RTI అమలు పర్యవేక్షణ.

అధ్యాయం IV — రాష్ట్ర సమాచార కమిషన్లు (Sections 15–17)

ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర సమాచార కమిషన్ (SIC) ఏర్పాటు. CIC తరహాలోనే నియామకం, పదవీకాలం, అధికారాలు.రాష్ట్ర స్థాయిలో RTI అమలు.

అధ్యాయం V — కమిషన్ల అధికారాలు, విధులు, అప్పీలు (Sections 18–20)

CIC, SICలకు ఫిర్యాదులు, అప్పీలు స్వీకరించే అధికారం. సమాచారం వెల్లడించమని ఆదేశించడం, జరిమానాలు విధించడం, అమలు నిర్ధారించడం. రెండు స్థాయిల అప్పీలు:

మొదటి అప్పీల్ → నియమిత అధికారి వద్ద. రెండవ అప్పీల్ → సమాచార కమిషన్ వద్ద.

అధ్యాయం VI — ఇతర అంశాలు (Sections 21–31)

సత్ప్రయత్నంతో చేసిన చర్యలకు రక్షణ. ప్రభుత్వానికి నియమాలు రూపొందించే అధికారం.

అమలు సులభతరం చేసే నిబంధనలు. చట్టం సజావుగా నడవడానికి అవసరమైన ఇతర నిబంధనలు.

ఈ చట్టం అమలుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడే ప్రజలకు ఈ చట్టాన్ని చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్ట శిక్షణా కార్యాచరణ చేపట్టింది. అధికార యంత్రాంగం నుంచి, పౌర సమాజం నుంచి కొందరు వ్యక్తులకు చట్టంపై పూర్తి అవగాహన పెంపొందించడం కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ శిక్షణ పొందిన వారు పౌర సమాజంలో వివిధ వర్గాల వారికి సమాచార హక్కు చట్టంపై అవగాహనా తరగతులు నిర్వహించాలి. సమాచార హక్కు చట్ట శిక్షణ తరగతులు పూణే నగరంలోని “YASHADA” (Yaswantrao Chavan Academy of Development Administration) సంస్థ లో జరిగాయి. ఈ వ్యాస రచయిత కూడా చట్టం అమలులోకి వచ్చిన తొలినాళ్ళలో అక్కడ శిక్షణ పొందారు. ఆ శిక్షణకు కావలసిన పరిశోధన, సాహిత్యం, ఇతర అవసరాలన్నీ హైదరాబాద్ నగరంలోని “CGG” (Center for Good Governance) వారు సమకూర్చారు. పూణేలో శిక్షణ అందించడంతో బాటు “సమాచార హక్కు చట్ట రిసోర్స్ పర్సన్స్” గుర్తింపునిచ్చారు.

సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కలగాలంటే… చట్టంలో పొందుపరచిన కొన్ని ముఖ్య అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. సమాచార హక్కు చట్టం ప్రభుత్వ కార్యాలయాలను, సంస్థలను, వ్యవస్థలను “పబ్లిక్ అథారిటీ” పేరుతో వ్యవహరించింది. ప్రతి “పబ్లిక్ అథారిటీ” లోనూ చట్టం ద్వారా సమాచారం పొందడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయనను “పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్” (ప్రజా సమాచార అధికారి) అని పిలుస్తారు. ఆ పై అధికారులలో ఒకరు “మొదటి అప్పీలేట్ అధికారి” గా ఉంటారు. “రెండవ అప్పీలేట్” గా రాష్ట్ర సమాచార కమిషన్ ఉంటుంది.

సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోసం దరఖాస్తు చేసే పౌరుడు ఆ దరఖాస్తును ప్రజా సమాచార అధికారి పేరుతోనే పంపాలి లేదా స్వయంగా అందించాలి. మరికొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాము.

సమాచారం అంటే ఏమిటి: ఏదైనా ఒక నిర్ణయం జరిగిపోయి ఆ నిర్ణయం ఫైల్, రికార్డు, మెయిల్, కంప్యూటరు ఫైల్ రూపంలో నిక్షిప్తమై ఉండాలి.

సమాచారం కోసం పంపే దరఖాస్తులో తమకు కావలసిన సమాచారాన్ని కోరాలి అంతేగాని ఊహాత్మక ప్రశ్న రూపంలో ఉండకూడదు. ఉదాహరణకు “మా గ్రామం లో రహదారి ఎందుకు నిర్మించలేదు?” అని అడిగితే సమాధానం దొరకదు. ఎందుకు నిర్మించలేదో ఏ కార్యాలయంలోనూ రికార్డు చేసి ఉంచరు కదా! “మా గ్రామంలో రహదారి నిర్మించడానికి మీ వద్ద ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచారా? ఉంటే… వాటి సమాచారాన్నిమాకు ఇవ్వండి” అని అడిగితే బాగుంటుంది.

సమాచారం కోసం మీరు పంపిన దరఖాస్తు ప్రజా సమాచార అధికారికి అందిన రోజు నుంచి ముప్ఫై రోజుల్లో మీకు సమాచారం అందిస్తారు. ఇచ్చిన సమాచారం మీకు సంతృప్తిని కలిగించకపోతే లేదా అసంపూర్తిగా ఉన్నదని భావిస్తే మొదటి అప్పీలేట్ అధికారికి మీ అభ్యంతరాలను రాత పూర్వకంగా తెలియజేయవచ్చు. వారి దగ్గర నుండి కూడా సరైన స్పందన లేకపోతే చివరిగా రెండవ అప్పీలేట్ అయిన రాష్ట్ర సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదని భావిస్తే… రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయవచ్చు. దానిని స్వీకరించాల వద్దా అనేది అ కేసుకు ఉన్న ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

అసలు పౌరుడు సమాచారాన్ని దరఖాస్తు చేసి తెలుసుకోవలసిన అవసరం లేకుండానే చట్టం లోని సెక్షన్: 4.1(బి) ప్రకారం ప్రతి “పబ్లిక్ అథారిటీ” వారు తమ కార్యాలయ స్థాపన, పని వివరాలు, సిబ్బంది, వారి వేతనాలు, చేపట్టి అమలు పరచిన పథకాలు, కేటాయింపబడిన బడ్జెట్ తదితర వివరాలన్నీ సమగ్రంగా అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని నవీకరించాలి. అక్కడ అందుబాటులో లేని ఏదైనా ఇతర సమాచారాన్ని మాత్రమే పౌరుడు దరఖాస్తు చేసి తెలుసుకోవాలి అన్నది చట్టం యొక్క మౌలిక లక్ష్యం. ఇది ఎక్కడా సక్రమంగా అమలు జరగలేదు.

ప్రస్తుత స్థితి

మనదేశంలో చట్టాలన్నీ కాగితాల మీద మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అనే అపవాదు ఉన్నది. దీనిని పూర్తిగా ఆమోదించలేము. అలాగని కొట్టివేయలేము కూడా. సుపరిపాలన కోసం, పాలనలో అవినీతి కట్టడి కోసం, పాలకుల జవాబుదారీతనం కోసం, వినియోగదారుల రక్షణ కోసం గతంలో ఎన్నో శక్తివంతమైన చట్టాలు ఉన్నప్పటికీ అవి కోరలు లేని కాగితపు పులులుగానే మిగిలిపోయాయి. అదే కోవలోకి సమాచార హక్కు చట్టం చేరిపోయిందని ఆ చట్టం కోసం తపించిన ఎందరో సామాజిక కార్యకర్తలు నిరుత్సాహ పడుతున్నారు.

ఇందులో వాస్తవం లేకపోలేదు. కారణాలు అనేకం ఉండవచ్చు. మనదేశం పరిస్థితి ఏమిటంటే… పౌరులలో, పాలకులలో, అధికారులలో చట్టాల పట్ల సరైన అవగాహన లేకపోవడం మన దురదృష్టం. ఒక్కొక్కరిదీ ఒక్కో దారి.

ప్రస్తుతం సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఈ చట్టం పట్ల వివిధ వర్గాల వారి అవగాహన ఎలా ఉందో ఒక పరిశీలన చేద్దాం.

అ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: “తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి” అన్న చందంగా చట్టం చేసేశాం అది అమలు జరుగుతున్నదో లేదో మాకేమి సంబంధం అన్నట్లుగా ఉంటాయి. సమాచార కమీషనర్ల నియామకాలు చాలినన్ని చేయడం లేదని, అందుబాటులో ఉన్నవి మాత్రం “తమ వారికే” దక్కించుకుంటారనే విమర్శలు ఉన్నాయి. వారి పనితీరుపై విమర్శలు, ఫిర్యాదులు ఏమాత్రం పట్టించుకోరని, సమాచార కమీషన్ ను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని. ఏమాత్రం సందు దొరికినా చట్టాన్ని నిర్వీర్యం చేసే ఏ అవకాశాన్నీ వదులుకోరనే ఆరోపణలు ఉన్నాయి .

ఆ) అధికార యంత్రాంగం: ఈ చట్టాన్ని తమ నెత్తి మీద రుద్దిన అధిక పని భారంగా అత్యధిక మంది భావిస్తారు. చిరాకు పడతారు. కొందరు కంగారు పడతారు. చట్టం వచ్చి రెండు దశాబ్దాలు దాటినా “తమదిగా” చేసుకోలేక పోయారు. చట్టం మౌలిక లక్ష్యం ప్రకారం అందుబాటులో ఉన్న సమాచారాన్ని పౌరులకు చేరవేయడం తమ కనీస బాధ్యత అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇదొక తలనొప్పి వ్యవహారంగా భావిస్తున్నారు. దానికీ కారణాలు లేకపోలేదు… మన కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుంది. పౌరుడు కోరిన సమాచారం అందివ్వడానికి నానా యాతనా పడాల్సిన పరిస్థితి.

ఇ) పౌరులు: పౌర సమాజం ఎంతో కాలంగా కావాలని ఎదురు చూసిన చట్టం ఇది. అవినీతిని వెలికి తీయడానికి ఉపయోగపడే గొప్ప ఆయుధంగా ఎక్కువమంది భావించడం వాస్తవం. “కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు” గా కొందరు చట్టాన్ని భావించారు. సమాచారం అడగడం మన హక్కు అన్న ధ్యేయంతో అవసరం ఉన్నదీ, లేనిదీ అని చూడకుండా వందల కొద్దీ సమాచార పత్రాలు అడగడం ఒక అలవాటుగా చేసుకున్న వారు కూడా ఉన్నారు. అవసరమైన సమాచారాన్ని పొంది దానిని విశ్లేషించి పాలనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెలికి తీసి నలుగురితో పంచుకోవడం అనే విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. మరికొందరు పాత్రికేయుల ముసుగులో ప్రజాప్రయోజనాలకోసం సమాచారం కోరకుండా, అధికారులను బెదిరించి తమ స్వంత పనులు చేయించుకోవడానికే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏతావాతా తెలిందేమిటంటే … కొందరు స్వార్థపరుల ఈ వైఖరి అటు అధికార యంత్రాంగంలోనూ, పాలకుల్లోనూ ఈ చట్టంపై చులకన భావం ఏర్పడడానికి దోహదపడింది.

ముగింపు

అంతమాత్రం చేత మనదేశంలో చట్టం పూర్తిగా నీరుకారి పోయిందని అనుకోలేము. 2002 లో వచ్చిన ‘సమాచార హక్కు స్వేచ్ఛ చట్టం’ ఆ దరిమిలా వచ్చిన సమాచార హక్కు చట్టం 2005 అమలు తరువాత వ్యవస్థలలో కొన్ని మార్పులు జరిగిన మాట వాస్తవం. అప్పటి వరకు సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు మన దృష్టికి చట్టం ద్వారా ముందుకు వచ్చాయి. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల, నేరచరిత్రల వెల్లడి, 2 జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అవినీతి వ్యవహారం బట్టబయలు. ముంబై లో ఆదర్శ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన కుంభకోణం, ఎలెక్ట్రోల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు చేపట్టిన విరాళాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఈ చట్టం వచ్చిన తరువాతే ప్రజా ప్రతినిధుల జీతాభత్యాల వివరాలు అధికారికంగా ప్రజలకు తెలిసింది.

ఇప్పటికీ సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ఉందని మనదేశంలో 80 శాతం మందికి తెలియదు. చాలా మంది చదువుకున్న వారికి కూడా ఈ చట్టంపై అవగాహన లేకపోవడం శోచనీయం. ఈ చట్టాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఎంతో కృషి జరిగింది. చట్టం వచ్చిన కొత్తలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 100 స్వచ్చంద సంస్థల సమాహారంగా ఏర్పడ్డ “యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆర్. టీ. ఐ” (UF-RTI) లాంటి సంస్థలు చట్టాన్ని ప్రజలకు చేరువ చేయడానికి విశేష కృషి చేశాయి. వ్యక్తులుగా ఈ చట్టం అమలుకోసం పోరాడిన వారు, అవినీతికి ఎదురు నిలచి దానికి కారకులైన వారిని బహిరంగంగా నిలబెట్టిన ఘటనలలో కొందరు కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. ఇది చాలా విచారించవలసిన విషయం. ఒక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయమని కోరుతున్న పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఏ సమాజమైన సిగ్గుపడాల్సిన విషయం.

ఏది ఏమైనా ఒక మంచి చట్టాన్ని గురించి ప్రజలందరూ తెలుసుకోవాలి. మంచి సమాజాన్ని భావితరాలకు అందించే నిర్విరామ కృషి ప్రస్తుత తరం చేయక తప్పదు. ఇప్పటి వరకూ ప్రపంచంలో 130 దేశాల్లో సమాచార హక్కు లాంటి చట్టాలు అమలులో ఉన్నాయి. వీటిలో కొన్ని దేశాలలో సమాచారాన్ని పౌరులకు అందించడంలో ముందంజలో ఉన్నాయి. మనదేశం కూడా వాటి సరసన చేరాలని కోరుకుందాం.