భారత క్రికెట్ వెలిగిపోతోంది. మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లుతోంది. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత దశాబ్దకాలంగా విశ్వక్రికెట్ భారత్ చుట్టూనే పరిభ్రమిస్తోంది. భారత్ లేని అంతర్జాతీయ క్రికెట్ ను ఊహించడం అసాధ్యమనిపిస్తోంది…

భారత క్రికెట్లో గత పుష్కరకాలంగా స్వర్ణయుగం నడుస్తోంది. పురుషుల, మహిళల విభాగాలలో భారత జట్లు ఆసియా, విశ్వవిజేతలుగా నీరాజనాలు అందుకొంటుంటే… బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ప్రపంచీకరణతో క్రికెట్ వైభోగం!

భారత ఉపఖండ దేశాలతో పాటు…కామన్వెల్త్ దేశాలలోనూ అత్యంత జనాదరణ పొందుతున్న క్రికెట్ గతంలో ఎన్నడూలేనంతా విశ్వవ్యాపితమవుతోంది. ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి) నిర్వహించే టెస్టు, వన్డే, టీ-20 ప్రపంచకప్ టోర్నీలతో పాటు ఆసియా క్రీడల్లోనూ పతకం అంశంగా గుర్తింపు తెచ్చుకొని…ఒలింపిక్స్ దిశగా అడుగులు వేస్తోంది. లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగే 2027 ఒలింపిక్స్ ప్రధాన క్రీడాంశాలలో ఒకటిగా హోదా సంపాదించింది. ప్రపంచకీరణ పుణ్యమా అంటూ భారత క్రికెట్ దశ, దిశ ఒక్కసారిగా మారిపోయాయి. భారత ఉపఖండ దేశాలలో అత్యధికమంది అభిమానులున్న క్రీడగా మాత్రమే కాదు… అత్యధిక ఆర్జన కలిగిన క్రీడగానూ క్రికెట్ గుర్తింపు సంపాదించింది. బహుళజాతి కంపెనీల ఉత్పత్తుల ప్రచార వాహకంగా క్రికెట్ ప్రముఖపాత్ర పోషిస్తూ వివిధ క్రికెట్ సంఘాలకు వందల కోట్ల రూపాయల వర్షం కురిపిస్తూ కల్పవల్లిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో క్రికెట్ ను నియంత్రిస్తూ, అభివృద్ధికి పాటుపడుతున్న ఐసీసీకి మాత్రమే కాదు…భారత క్రికెట్ కు చిరునామాగా ఉన్న బీసీసీఐకి సైతం వందల కోట్ల రూపాయలను క్రికెట్ ఆర్జించిపెడుతోంది.

అగ్రస్థానంలో బీసీసీఐ…

ఓ అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ ఇటీవలే వెలువరించిన నివేదిక ప్రకారం… భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ) ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. ఐపీఎల్ నిర్వహణ, ప్రసార హక్కుల విక్రయం ద్వారా లభించే వందల కోట్ల రూపాయలతో పాటు ఐసీసీ ఆదాయంలో లభించే వాటాతో కలుపుకొని బీసీసీఐ ఇబ్బడిముబ్బడిగా ఆర్జిస్తోంది. భారత క్రికెట్ బోర్డు నికర ఆస్తుల విలువ 18వేల 760 కోట్ల (2.2 బిలియన్ డాలర్లు) రూపాయలుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో క్రికెట్ ఆస్ట్ర్రేలియా కొనసాగుతోంది. మొత్తం 79 మిలియన్ డాలర్లు ( సుమారు 674 కోట్ల రూపాయల) నికర ఆదాయంతో రెండో అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా నిలిచింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 593 కోట్ల రూపాయల నికర ఆర్జనతో మూడు, 469 కోట్ల రూపాయలతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నాలుగు, 435 కోట్ల రూపాయలతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐదుస్థానాలలో ఉన్నాయి. టెస్టు హోదా పొందిన మిగిలిన ఐదు దేశాల క్రికెట్ బోర్డుల్లో 406 కోట్ల రూపాయలతో దక్షిణాఫ్రికా ఆరు, 329 కోట్లతో జింబాబ్వే క్రికెట్ బోర్డు ఏడు, 173 కోట్ల రూపాయలతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఎనిమిది స్థానాలలోనూ, 129 కోట్ల రూపాయలతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తొమ్మిది, 77 కోట్ల రూపాయలతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పది స్థానాలలో ఉన్నాయి. ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ అండ్ వేల్స్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మొత్తం నికర విలువ, రాబడి కంటే భారత క్రికెట్ బోర్డు ఆస్తులు, రాబడి విలువే ఎక్కువ.

క్రికెట్ కు అతిపెద్ద గ్లోబల్ మార్కెట్…!

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో బీసీసీఐకి రాబడి వివిధ రూపాలలో వెల్లువెత్తుతోంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత జనాదరణ పొందిన లీగ్ గా, అత్యధికమంది అభిమానులున్న లీగ్ గా ఉండడంతో ఐపీఎల్ రాబడి సీజన్ సీజన్ కూ అంచనాలకు మించి పెరిగిపోతూ వస్తోంది. గత ఆరేళ్ల కాలంలో బీసీసీఐ ఆదాయం 3600 కోట్ల నుంచి 9వేల 600 కోట్ల రూపాయలకు పెరిగింది. క్రికెట్ కే అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ గా గుర్తింపు పొందిన భారత్ చుట్టూనే అంతర్జాతీయ క్రికెట్ పరిభ్రమిస్తూ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే ప్రతి మూడు ప్రపంచకప్ టోర్నీలలో ఒకటి భారత్ వేదికగానే నిర్వహిస్తూ వస్తున్నారు. భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు స్టేడియాలు కిటకిటలాడిపోవడం, ప్రత్యక్షప్రసారాల వీక్షణ కోసం టీవీల ముందు కోట్లాదిమంది గుమికూడడం సాధారణ విషయమే.

క్రికెట్ పిచ్చి అంతా ఇంతాకాదు…

ప్రపంచంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్న దేశం భారత్ మాత్రమే. ఆరేళ్ల పిల్లల నుంచి ఆరు‌పదుల పెద్దల వరకూ క్రికెట్ కు వీరాభిమానులే. దేశంలో ఎన్నిరకాల క్రీడలున్నా క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. ఫ్రాంచైజీ క్రికెట్ తో వివిధ రూపాలలో ఏటా కాసులవర్షం కురవడం ఆరంభమయ్యింది. దీంతో …దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు సైతం… ఐపీఎల్ పుణ్యమా అంటూ రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతూ వస్తున్నారు. 2019 సీజన్ నాటికి 3648 కోట్ల రూపాయలుగా ఉన్న బీసీసీఐ ఆదాయం ఆ తర్వాతి మూడేళ్ల కాలంలో 300 శాతం పెరిగిపోయింది. 2020 నుంచి 2022 మధ్యకాలంలో 6000వేల కోట్ల రూపాయల మేరకు అదనపు ఆదాయం సమకూరినట్లు బీసీసీఐ గణాంకాలు చెబుతున్నాయి. బోర్డు ఆదాయం 3వేల 648 కోట్ల నుంచి రికార్డు స్థాయిలో 9వేల 629 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. భారత్ లోని కోట్లాదిమంది అభిమానుల క్రికెట్ పిచ్చిని సొమ్ము చేసుకోవడంలో ఐసీసీ, బీసీసీఐ సఫలమయ్యాయి. పెద్దమనుషుల క్రీడ క్రికెట్ ను ఎలా లాభసాటి వ్యాపారంగా మార్చవచ్చునో ఐసీసీ సహకారంతో బీసీసీఐ చేసి చూపించింది. భారత క్రికెటర్లు, టీమిండియా జట్లు అభిమానుల కోసం కాకుండా బ్రాడ్ కాస్టర్ల ( స్టార్ స్పోర్ట్స్, సోనీ సిక్స్ లాంటి మీడియా సంస్థల ) కోసమే క్రికెట్ సిరీస్ లు ఆడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. 2016, 2017 సీజన్లలో ప్రసారహక్కులు, టీమ్, సిరీస్, దుస్తుల స్పాన్సర్ షిప్ ద్వారా 2100 కోట్ల రూపాయల చొప్పున బీసీసీఐ ఆర్జించింది.

ప్రసారహక్కుల ఆదాయం ఎవరికి ఎంతెంత?

ప్రపంచంలోనే అత్యంత ఆదాయం ఆర్జించే స్పోర్ట్స్ లీగ్ ల్లో రెండోస్థానంలో నిలిచిన ఐపీఎల్ 2027 సీజన్ వరకూ విక్రయించిన ప్రసారహక్కుల ద్వారా 48వేల 390 కోట్ల రూపాయలు ఆర్జించింది. మీడియా హక్కుల విక్రయం ద్వారా తనకు సమకూరిన ఆదాయంలో ఒక్కో ప్రాంచైజీకి 3వేల కోట్ల రూపాయలు వాటాగా పంచారు. 24వేల 195 కోట్ల రూపాయలను క్రికెటర్లకు, బీసీసీఐకి అనుబంధంగా ఉన్న వివిధ క్రికెట్ సంఘాలకు అందించారు. మిగిలిన 74 శాతంలో 4 శాతాన్ని సిబ్బంది వేతనాల కోసం వెచ్చించారు. మిగతా 70 శాతం మొత్తాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రికెట్ సంఘాలకు చెల్లిస్తారు. మొత్తం రూ.6,290 కోట్లను దేశవాళీ, అంతర్జాతీయ క్రికెటర్లకు, రూ.16,936 కోట్లను బీసీసీఐ అనుబంధ రాష్ట్ర సంఘాలకు కేటాయించారు.

క్రికెట్ సంఘాలకూ నిధుల వరద…

2019లో వినోద్ రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పాలకమండలి…బీసీసీఐ అనుబంధ క్రికెట్ సంఘాలకు 680 కోట్ల రూపాయలు నిధులు పంచితే…గంగూలీ హయాంలో అది కాస్త ఐదురెట్ల మేరకు పెరిగింది. వివిధ రూపాలలో దేశంలోని వివిధ క్రికెట్ సంఘాలకు 3వేల 295 కోట్లరూపాయల నిధులు అందించారు. 2023-2027 కాలానికి ఐపీఎల్ ప్రసారహక్కులు, డిజిటల్ మీడియా హక్కులను ఈ-వేలం ద్వారా విక్రయించడమే తమ ఆదాయం గణనీయంగా పెరగటానికి కారణమని బీసీసీఐ చెబుతోంది. కేవలం ప్రసారహక్కుల విక్రయం ద్వారానే 48వేల 390 కోట్ల రూపాయలు సమకూరడం విశేషం. దీనికితోడు సరికొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు వచ్చి…ఐపీఎల్ లో చేరడంతో 12 వేల 715 కోట్ల రూపాయలు సమకూరాయి.

క్రికెట్ రోబోలు… భారత క్రికెటర్లు!

భారత క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌లోనే భాగ్యవంతులు. ఏడాది పొడగునా క్రికెట్ ఆడుతూ రెండు చేతులా ఆర్జిస్తున్న మొనగాళ్లు. అయితే… శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ల నాయకత్వంలో ఆడుతున్న భారత క్రికెటర్లు సైతం శ్రమదోపిడీకి గురవుతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేని ప్రయివేటు ఉద్యోగుల జాబితాలో చేరిపోయారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి చేతిలో బంగారు బాతులుగా మిగిలారు. అహరహం శ్రమిస్తూ…పగలనకా రాత్రనకా క్రికెట్ ఆడేస్తూ…భారత క్రికెట్ నియంత్రణ మండలి పాలిట బంగారుబాతులుగా మారిన టీమిండియా క్రికెటర్లు తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదంటూ తమలో తాము మదనపడిపోతున్నారు. ప్రయివేటు రంగ ఉద్యోగుల మాదిరిగా శ్రమదోపిడీకి గురయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు. భారత క్రికెట్ బోర్డు ఆడమంటే ఆడే మరబొమ్మలుగా, క్రికెట్ రోబోలుగా తయారయ్యారు. … క్రికెట్ ఆటకు గతంలో ఓ సీజన్ అంటూ ఉండేది. అయితే…ప్రపంచీకరణ పుణ్యమా అంటూ ఈ పెద్దమనుషుల క్రీడ కాస్త బహుళజాతి సంస్థల వ్యాపార ప్రచార వాహకంగా మారిపోడంతో నెలకో టూరు, మూడువారాలకో సిరీస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గతంలో ఏడాదికి 105 నుంచి 120 రోజులు వరకూ మాత్రమే భారత క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడుతూ ఉండేవారు. అయితే 2017 సీజన్ నుంచి అదికాస్త 120 రోజుల నుంచి 140 రోజులకు పెరిగిపోయింది. నిరంతరం ఆడుతున్న క్రికెట్ తో ఆటగాళ్లు తరచూ గాయాలకు గురికావడం, డస్సిపోవడం ఈమధ్య కాలంలో పరిపాటిగా మారింది. 2018 వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఫ్యూచర్ టూర్ కార్యక్రమం ప్రకారం భారత క్రికెటర్లు ఏడాదికి సగటున 50 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇదీచాలదన్నట్లు…ఏడు వారాల ఐపీఎల్ సీజన్…ఆటగాళ్లను పీల్చిపిప్పి చేయటం సాధారణ విషయమే. ఒక్కమాటలో చెప్పాలంటే …ఓవైపు రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ లాంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలు, మరోవైపు అంతర్జాతీయ సిరీస్ లు, ఐపీఎల్ తో టీమిండియా క్రికెటర్లు…క్రికెట్ రోబోలుగా మారిపోయారు. బీసీసీఐ ఆడమన్నట్లుగా ఆడే మరబొమ్మలుగా తయారయ్యారు.

క్రికెటర్ల శ్రమ దోపిడీ…

భారత క్రికెట్ నిబంధనల ప్రకారం వివిధ రూపాలలో బీసీసీఐకి ఏటా వచ్చే మొత్తం ఆదాయంలో 26 శాతం క్రికెటర్లకు ఇవ్వాల్సి ఉండగా…కేవలం 8 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటోంది. క్రికెటర్ల శ్రమను నిలువునా…ఘరానాగా దోచుకొంటోంది. క్రికెటర్లను ఓవైపు పీల్చిపిప్పి చేస్తూ సంపాదించిన వేలకోట్ల రూపాయల ఆదాయంలో…చాలా భాగాన్ని వివిధ క్రికెట్ సంఘాలు, బోర్డు పెద్దలు దుబారా చేయటాన్ని, విలాసాలకు ఖర్చు చేయటాన్ని…సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ పాలకమండలి ఇప్పటికే బయటపెట్టింది. క్రికెటర్లకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అందేలా చేయటానికి పాలకమండలి తగిన చర్యలు చేపట్టింది. దేశవాళీ క్రికెటర్లు, మహిళా క్రికెటర్లకు సైతం మ్యాచ్ ఫీజులు అనూహ్యంగా పెరిగాయి.

ఉపశమనం సాధ్యమేనా?..

2019 నుంచి ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం ద్వారా భారత అంతర్జాతీయ క్రికెటర్లకు తగిన విశ్రాంతి, ఉపశమనం లభించేలా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఏడాదికి 50 మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా 2019 సీజన్ నుంచి ఏడాదికి 32 మ్యాచ్ లు మాత్రమే ఆడేలా కార్యక్రమం ఖరారు చేయాలన్న పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఉన్న 140 రోజుల అంతర్జాతీయ క్రికెట్ ను…80రోజులకు కుదించాలని కూడా నిర్ణయించింది. దీనికితోడు ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు…15 రోజులపాటు విశ్రాంతి ఉండేలా కూడా చర్యలు చేపట్టింది. ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చితే…శుభ్ మన్ గిల్, రాహుల్, విరాట్ కొహ్లీ లాంటి అసాధారణ ఆటగాళ్ల జీవితకాలం మరింతగా పొడిగించుకొనే అవకాశం ఉంటుంది. కీలక ఆటగాళ్ల గాయాల చికిత్స కోసం సైతం బీసీసీఐ ఏటా వందకోట్ల రూపాయలకు పైగా వ్యయం చేస్తోంది. భారత క్రికెటర్ల కష్టం, అభిమానుల వెర్రిని సొమ్ము చేసుకొంటున్నఐసీసీ, బీసీసీఐలు పలు రకాల పన్నుల రూపంలో భారత ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు చెల్లించడం కొసమెరుపు. ఏదిఏమైనా…ప్రస్తుత ప్రపంచ క్రికెట్ ను తన మార్కెట్, అభిమానుల బలంతో బీసీసీఐ శాసిస్తోందంటే అతశయోక్తి కాదు.