భారత అథ్లెట్లు, క్రీడాకారులు గత నెలరోజుల్లో జరిగిన పలు అంతర్జాతీయ క్రీడల్లో పలు అరుదైన రికార్డులతో మెరుపులు మెరిపించారు. జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో మాత్రమే కాదు…సమర్‌ ఖండ వేదికగా ముగిసిన చదరంగ ఒలింపియాడ్ లో భారత జట్లు, క్రీడాకారులు టీమ్, వ్యక్తిగత విభాగాలలో పలు అరుదైన రికార్డులతో దేశానికే గర్వకారణంగా నిలిచారు…

అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత అథ్లెట్లు, క్రీడాకారులు గత కొద్ది వారాలుగా తమ అపురూప విజయాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరిగిన 2026- ప్రపంచ ఒలింపియాడ్ నుంచి జపాన్ లోని అయిచీ- నగోయా నగరాలలో జరిగిన 20వ ఆసియా క్రీడల వరకూ భారత జట్లకు, వ్యక్తిగతంగా క్రీడాకారులు, అథ్లెట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

ప్రపంచ అత్యుత్తమ చదరంగ దేశంగా భారత్…

ఉజ్బెక్ నగరం సమర్ ఖండ్ వేదికగా 12 రోజులపాటు జరిగిన 46వ చదరంగ ఒలింపియాడ్ పురుషుల, మహిళల విభాగాలలో భారత జట్లు విశ్వవిజేతలుగా తమ హోదాను నిలుపుకోలేకపోయినా ప్రపంచ మొదటి మూడు అత్యుత్తమ జట్లలో నిలువగలిగాయి. పురుషుల టీమ్ విభాగంలో గత ఒలింపియాడ్ లో బంగారు పతకం సాధించిన భారత జట్టు సభ్యులు ఈసారి మాత్రం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత విజేతగా మహిళల బరిలో నిలిచిన భారత జట్టు కాంస్య పతకంతో సంతృప్తి చెందవలసి వచ్చింది. మొత్తం 11 రౌండ్ల పోరులో ఐదుగురు సభ్యుల ( గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరగేసి, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ , గుకేశ్ దొమ్మరాజు, విధిత్ గుజరాతీ) భారత జట్టు రజత విజేతగా నిలిచింది. మహిళల టీమ్ టైటిల్ కోసం జరిగిన పోరులో కోనేరు హంపి, దివ్య దేశ్ ముఖ్, సవిత శ్రీ, వైశాలి సభ్యులుగా పోటీకి దిగిన భారత్ కు కాంస్య పతకం మాత్రమే దక్కింది. టీమ్ విభాగాలలో రెండు పతకాలు సాధించిన భారత్ కు పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలతో పాటు అత్యుత్తమ చదరంగ దేశం అవార్డులు లభించాయి. అత్యుత్తమ క్రీడాకారులకు ఇచ్చే అవార్డులను భారత గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, సవిత గెలుచుకొన్నారు. గత మూడేళ్లుగా ప్రపంచ చదరంగంలో నిలకడగా రాణిస్తున్న భారత్ కు పురుషుల అత్యుత్తమ జట్టుకు ఇచ్చే నోనా గప్రిన్ దష్ విలీ ట్రోఫీని, అత్యుత్తమ చదరంగ సమాఖ్య అవార్డులను ఇచ్చి గౌరవించారు. 2024 బుడాపెస్ట్, 2022 చెన్నై చదరంగ ఒలింపియాడ్ లతోపాటు ప్రస్తుత ఒలింపియాడ్ లోనూ మొదటి మూడు అత్యుత్తమ జట్లలో నిలిచినందుకు భారత్ కు ఈ గౌరవం దక్కింది. రష్యా, ఉజ్బెకిస్థాన్, చైనా, కజకిస్థాన్, జర్మనీ, అమెరికా, స్పెయిన్, హంగెరీ లాంటి మేటి జట్లను భారత్ అధిగమించి ప్రపంచ చదరంగ సరికొత్త శక్తిగా గుర్తింపు సంపాదించుకొంది.

వన్డే క్రికెట్లో భారత్ సరికొత్త రికార్డులు…

ధూమ్ ధామ్ టీ-20, యాభై ఓవర్ల వన్డే క్రికెట్లో టాప్ ర్యాంకింగ్ జట్టుగా ఉన్న భారత్ ఈ రెండు విభాగాలలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతోంది. ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన టీ-20 పోరు బంగారు పతకాన్ని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు నిలుపుకోగలిగింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 19 పరుగులతో అధిగమించడం ద్వారా వరుసగా రెండోసారి స్వర్ణపతకం అందుకొంది. మహిళ విభాగంలో సైతం భారత్ కు ఎదురేలేకపోయింది. ఇక…పురుషుల వన్డే క్రికెట్లో భారత జట్టుతో పాటు మాజీ కెప్టెన్లు, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ పలు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మొదటి రెండు వన్డేలలో భారత బ్యాటర్లు శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఫోర్ల జోరు, సిక్సర్ల హోరుతో చెలరేగిపోయారు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఓ సెంచరీతో పాటు డబుల్ సెంచరీ, విరాట్, రోహిత్ చెరో శతకంతో మెరుపులు మెరిపించారు. అత్యంత వేగంగా వన్డేల్లో ద్విశతకం సాధించిన బ్యాటర్ గా శుభ్ మన్ గిల్, అత్యంత వేగంగా 15వేల వన్డే పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కొహ్లీ, వన్డేలలో అత్యధిక సిక్సర్లు సాధించిన ఓపెనర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. గౌహతీ వేదికగా ముగిసిన రెండో వన్డేలో రోహిత్- శుభ్ మన్ ల జోడీ మొదటి వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో పాటు 405 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించగలిగారు. రెండు జట్లూ కలసి 811 పరుగులు సాధిస్తే…వెస్టిండీస్ జట్టులోని ముగ్గురు బ్యాటర్లు శతకాలు నమోదు చేశారు. భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ అజేయ ద్విశతకం, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు శతకంతో చరిత్ర సృష్టించారు. ఒక్క వన్డే మ్యాచ్ లో ఐదు శతకాలు నమోదు కావడం ఓ అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండు వన్డేలు నెగ్గడం ద్వారా వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్ 14వ ద్వైపాక్షిక సిరీస్ ను గెలుచుకోడం ద్వారా మరో రికార్డు సొంతం చేసుకొంది. స్వదేశీ గడ్డపై 200 వన్డే సిక్సర్లు సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 12వేల వన్డే పరుగుల మైలురాయిని సైతం చేరాడు. వన్డే కింగ్ విరాట్ కొహ్లీ 55 శతకాలతో పాటు అత్యంత వేగంగా 15వేల పరుగులు సాధించిన ప్రపంచ రికార్డులను సైతం తన పేరుతో లిఖించుకొన్నాడు.

ఆసియాడ్ లో పతకాలను మించిన భారత రికార్డుల!

జపాన్ వేదికగా ముగిసిన 20వ ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట ఆశించిన స్థాయిలో సాగకపోయినా పలు అరుదైన విజయాలు, రికార్డులతో …భారత అథ్లెట్లు పలు అరుదైన రికార్డులతో మెరిసి మురిశారు… గత ఆసియా క్రీడల్లో తాను సాధించిన అత్యుత్తమ (28 స్వర్ణాలతో సహా మొత్తం 107) పతకాల రికార్డును భారత్ అందుకోలేకపోయింది. పతకాల పట్టిక మొదటి నాలుగు స్థానాలలో సైతం చోటును భారత్ చేజార్చుకుంది. మొత్తం 492 మంది అథ్లెట్ల భారీ బృందంతో 35 రకాల క్రీడాంశాలలో పోటీకి దిగిన భారత పతకాల వేట రజతాల జోరుతో పాటు కంచు మోతతో ముగిసింది. గత క్రీడల ప్రమాణాలను అందుకోడంలో సఫలం కాలేకపోయింది.

అంచనాలను మించి రాణించిన విలువిద్య జట్టు…

పురుషుల, మహిళల విభాగాలలో కాంపౌండ్, రికర్వ్ అంశాల టీమ్, వ్యక్తిగత అంశాలలో పోటీకి దిగిన భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా 5 స్వర్ణ 2 రజత, 2 కాంస్య పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 19కి పైగా పతకాలతో అథ్లెట్లు భారత్ కు బాసటగా నిలిచారు.

హాకీ, కబడ్డీ, క్రికెట్ ల్లో డబుల్ ధమాకా…

టీమ్ అంశాలలో భారత్ కు కచ్చితంగా బంగారు పతకాలను అందించే అతికొద్ది క్రీడలుగా ఉన్న హాకీ, క్రికెట్, కబడ్డీ అంశాలలో (పురుషుల, మహిళల విభాగాలలో) జంట స్వర్ణాలతో భారత్ సత్తా చాటుకొంది. కబడ్డీ ఫైనల్స్ లో ఇరాన్ జట్ల పైనే భారత్ విజయాలు సాధిస్తే…హాకీ పురుషుల ఫైనల్లో మలేషియాను, మహిళల ఫైనల్లో చైనాను , క్రికెట్ పురుషుల ఫైనల్లో పాకిస్థాన్, మహిళల ఫైనల్స్ లో శ్రీలంకను చిత్తు చేయడం ద్వారా భారత్ బంగారు పతకాలు అందుకుంది. 1990 ఆసియా క్రీడల నుంచి నిర్వహిస్తూ వస్తున్న కబడ్డీ పురుషుల విభాగంలో భారత్ బంగారు పతకం గెలుచుకోవడం ఇది తొమ్మిదవసారి. 2018లో మాత్రమే ఇరాన్ చేతిలో ఓటమితో భారత్ స్వర్ణాన్ని చేజార్చుకుంది. 1990, 1994, 98, 2002, 2006, 2010, 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన భారత్ తిరిగి 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని చేజిక్కించుకోగలిగింది. ప్రస్తుత ఆసియా క్రీడల ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇరాన్ ను 40- 34తో అధిగమించడం ద్వారా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బంగారు పతకం అందుకుంది. మహిళల విభాగంలో 2010 ఆసియా క్రీడల నుంచే కబడ్డీని ప్రవేశపెట్టారు. భారత మహిళా జట్టు 37- 34 పాయింట్ల తేడాతో ఇరాన్ పై విజయం సాధించింది. 2014, 2022 క్రీడల్లో స్వర్ణాలను నెగ్గిన భారత్ 2018 క్రీడల్లో మాత్రం ఇరాన్ చేతిలో ఓటమితో బంగారు పతకం చేజార్చుకొంది. మహిళల విభాగంలో భారత్ కబడ్డీ స్వర్ణాన్ని అందుకోవడం ఇది నాలుగోసారి. మహిళా క్రికెట్లో సైతం హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ వరుసగా రెండోసారి స్వర్ణపతకంతో సత్తా చాటుకొంది.

షాట్ పుట్ లో తజిందర్ పాల్ సింగ్ హ్యాట్రిక్…

పురుషుల షాట్ పుట్ లో భారత అథ్లెట్ తజిందర్ పాల్ సింగ్ తూర్ రజత పతకం సాధించడం ద్వారా ఓ అరుదైన ఘనత. 2018 ఆసియా క్రీడల నుంచి వరుసగా మూడు వేర్వేరు ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గిన భారత షాట్ పుట్టర్ గా నిలిచాడు. 2018, 2022 ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన తజిందర్ గాయం కారణంగా ప్రస్తుత క్రీడల్లో రజత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తజిందర్ 20. 64 మీటర్ల దూరం మాత్రమే విసరగలిగాడు.

56 ఏళ్ల తర్వాత హైజంప్ పతకం…

పురుషుల హైజంప్ లో భారత్ కు 56 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఓ పతకం దక్కింది. జాతీయ రికార్డు హోల్డర్ సర్వేశ్ అనీల్ కుశారే 2.25 మీటర్ల రికార్డుతో రజత పతకం అందుకున్నాడు. ఆసియా క్రీడల చరిత్రలో హైజంప్ స్వర్ణం సాధించిన భారత నాలుగో జంపర్ గా రికార్డుల్లో చేరాడు. 1970 ఆసియా క్రీడల్లో భీమ్ సింగ్ కాంస్య పతకం తరువాత భారత్ కు మరో హైజంప్ పతకం దక్కడం ఇదే మొదటిసారి. గతంలో 1954 క్రీడల్లో అజిత్ సింగ్ భల్లా, 1966 గేమ్స్ లో భీమ్ సింగ్ బంగారు పతకాలు సాధించారు. బహుముఖ అంశాలున్న డెకాత్లాన్ లో రెండు ఆసియా క్రీడల పతకాలు సాధించిన భారత తొలి అథ్లెట్ గా తేజస్వినీ శంకర్ నిలిచాడు.

షూటింగ్ లో ఈషా సింగ్ రెండో పతకం…

మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో గత ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన భారత షూటర్ ఈషాసింగ్ ప్రస్తుత క్రీడల్లో సైతం రజత పతకమే సాధించింది. వరుసగా రెండు వేర్వేరు ఆసియా క్రీడల్లో రజత పతకాలు సాధించిన భారత మహిళా పిస్టల్ షూటర్ గా నిలిచింది. ప్రపంచకప్ లో బంగారు పతకం నెగ్గిన ఈషా ఆసియా క్రీడల్లో మాత్రం రజత పతకాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

మారథాన్ లో ఎన్నాళ్లకెన్నాళ్లకు…

పురుషుల మారథాన్ ( 42. 195 కిలోమీటర్ల) పరుగులో 44 సంవత్సరాల విరామం తర్వాత భారత్ కు సవాన్‌ బార్వాల్ రజత పతకం సాధించి పెట్టాడు. 28 సంవత్సరాల సవాన్ 2 గంటల 11 నిముషాల 37 సెకన్ల టైమింగ్ రికార్డుతో రజత విజేతగా నిలిచాడు. భారత వెలుపల జరిగిన ఆసియా క్రీడల్లో మారథాన్ రజతం సాధించిన తొలిరన్నర్ గా రికార్డుల్లో చేరాడు. మహిళల వెయింట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో పతకం సాధించాలన్న తన చిరకాల లక్ష్యాన్నిఎట్టకేలకు నెరవేర్చుకోగలిగింది. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మీరాను ఆసియా క్రీడల పతకం మాత్రం గత కొద్ది క్రీడలుగా ఊరించి, ఉడికిస్తూ వస్తోంది. మహిళల 49 కిలోల విభాగంలో మీరా మొత్తం 198 కిలోల బరువెత్తి 28 సంవత్సరాల విరామం తర్వాత భారత్ కు పతకం అందించిన లిఫ్టర్ గా నిలిచింది. ప్రపంచ టైటిల్ తో పాటు కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన మీరాబాయి చివరకు ఆసియా క్రీడల్లో సైతం రజత పతకంతో తన జీవిత లక్ష్యాన్ని సాధించగలిగింది. స్క్వాష్ పురుషుల, మహిళల సింగిల్స్ లోనూ భారత్ రజత పతకాలతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. పురుషుల విభాగంలో అభయ్ సింగ్, మహిళల విభాగంలో అనాహత్ సింగ్ ఫైనల్స్ చేరినా రజతాలు మాత్రమే సాధించగలిగారు. మహిళల గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో ప్రణవీ ఉర్స్ బంగారు పతకంతో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల గోల్ఫ్ల్ లో స్వర్ణం నెగ్గిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది. భారీగా పతకాలు అందించగలదనుకున్న బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో మాత్రమే భారత్ కాంస్య గెలుచుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో భారత క్రీడాకారులు దారుణంగా విఫలమయ్యారు. మొత్తం మీద…2026 ఆసియా క్రీడలు భారత్ కు మిశ్రమ ఫలితాల అనుభూతిని మిగిల్చాయి.