నాలుగు రాష్ట్రాలలోను, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోను, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మన రాజకీయ పార్టీలకు అనేక పాఠాలు నేర్పేలా ఉన్నాయి. బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అధికార పార్టీ పరాజయం పాలయింది. అస్సాంలోను, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోను అధికార పార్టీలు తిరిగి విజయం సాధించాయి. ప్రజలు మార్పు కోరడం సహజం కనుక అధికార పార్టీలు పరాజయం పాలయ్యాయని వాదించేవారు చాలామంది ఉంటారు. అదే నిజమైతే అస్సాం, పుదుచ్చేరిలో అటువంటి మార్పు ఎందుకు జరగలేదన్న ప్రశ్న ఉదయిస్తుంది.
ఆయా రాష్ట్రాలలో ప్రజలు ఎందుకు మార్పు కోరుకున్నారు? అన్న విషయం ఆలోచించదగినది. ఇన్నాళ్ళు తమ పాలన చూసిన ప్రజలు మరొక పార్టీకి అవకాశం ఇవ్వాలనుకున్నారు కనుకనే ఈ మార్పు జరిగిందని అధికార పార్టీలు చెబుతుంటాయి. కానీ ప్రజలు ఈ మార్పు ఎందుకు కోరుకున్నారు? ఇన్నాళ్ళు తమ పార్టీని ఆదరించిన ప్రజలు ఇప్పుడు భిన్నంగా ఎందుకు ఓటు వేశారు? అనే విషయాలను అధికార పార్టీలు ఆలోచించవు. ఎందుకంటే తన పార్టీ పరాజయం స్వయంకృతాపరాధమని, తమ పార్టీకి ఇతరులు కారణం కాదని అంగీకరించడానికి ఆయా పార్టీలు సిద్ధంగా లేవు. పరనిందకు మాత్రమే అలవాటు పడిన రాజకీయ పార్టీలకు ఆత్మవిమర్శ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఆత్మస్తుతి ఒక్కటే విజయాన్ని సాధించడానికి తోడ్పడుతుందని నమ్మే మన నాయకులు తమ లోపాలను, ప్రత్యర్థుల సుగుణాలను గుర్తించడానికి ఇష్టపడరు. ఈ రకమైన లోపాలను సవరించుకున్నప్పుడే మన నాయకులు సమర్థవంతమైన పాలన అందించగలుగుతారు.
అధికార పార్టీల లోపాలు ప్రస్తుత ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేశాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
వరుసగా మూడుసార్లు విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ (టి.ఎం.సి.) ఈ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 15 ఏళ్ళు బెంగాల్ ను మకుటం లేని మహారాణిగా పరిపాలించిన టి.ఎం.సి. అధినేత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికలలో ఓటమిపాలు కావడం విశేషం. మహిళలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లు పెరగడం, టి.ఎం.సి. నేతలు కుంభకోణాలలో చిక్కుకోవడం, అవినీతి ఆరోపణలకి గురికావడం, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆధార్ కార్డులు ఇచ్చి ఓటు బ్యాంకుగా మలచుకోవడానికి యత్నించడం తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి ముఖ్య కారణాలు. అధికార పార్టీ చేసిన ఈ తప్పులను ఎత్తి చూపి ఓటు బ్యాంకులను తమకి అనుకూలంగా మార్చుకోవడంతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కనుక ఓటు బ్యాంకులు స్థిరంగా ఉంటాయనుకోవడం, తాము ఏం చేసినా ప్రజలు ఊరకుంటారనుకోవడం ఎంత పొరపాటో బెంగాల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కేవలం జనాకర్షణ కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు ఓట్ల వర్షం కురిపించవని ఈ ఎన్నికలు నేర్పిన మరొక పాఠం
తమిళనాడులో అధికార పార్టీ ఓటమి చవిచూసింది. కంచుకోట వంటి కొళత్తూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, డి.ఎం.కె. నేత స్టాలిన్ పరాజయం పాలయ్యారు. బెంగాల్ లో అధికార పార్టీ చేసిన తప్పులనే తమిళనాడులో అధికార పార్టీ చేసింది. ఉచిత పథకాలపై హామీలను గుప్పించడం. ఇబ్బడిముబ్బడిగా నగదు పంపిణీ చేయడం విజయానికి రాజబాట వేయలేవని ఇక్కడ డి.ఎం.కె. ఓటమి నిరూపించింది. అధికార పార్టీకే ఈ చిట్కాలు ఫలించనప్పుడు మిగిలిన పార్టీలకు ఫలిస్తాయా? ఈ ఫలితాలు నేర్పిన పాఠం ఇదే.

