మినా తన ముందున్న సమాచారాన్ని ఒక్కొక్కటిగా సర్దుకుంటూ పని కొనసాగిస్తున్నది.

జోనాథన్ డైరీ.

డాక్టర్ సీవర్డ్ రికార్డింగ్స్.

ఉత్తరాలు.

వార్తాపత్రిక కథనాలు.

లూసీ గురించి సంఘటనలు.

డ్రాకులాను ఇంగ్లాండ్‌కు తీసుకు వచ్చిన ఆ విచిత్రమైన నౌక గురించి నివేదికలు.

ప్రతి పేజీ కొత్తగా ఒక చిన్న రహస్యాన్ని బయటపెడుతున్నది.

ఇప్పటి వరకు వేర్వేరు కథలుగా కనిపించిన సంఘటనలు నెమ్మదిగా ఒకటిగా కలుస్తున్నాయి.

ఆ కథ మధ్యలో ఒకే పేరు ఉన్నది. అదే

కౌంట్ డ్రాకులా.

కాని మినాకు మరో వ్యక్తి మీద కూడా చాలా ఆసక్తి పెరిగింది.

రెన్‌ఫీల్డ్.


డాక్టర్ సీవర్డ్ రాసిన అతని వివరాలు మినా ఇప్పటికే చదివింది.

మొదట రెన్‌ఫీల్డ్ ఒక తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్న రోగిలా మాత్రమే కనిపించాడు.

అతను ఈగలను పట్టుకునేవాడు.

ఆ ఈగలను సాలీడులకు ఆహారంగా ఇచ్చేవాడు.

తరువాత సాలీడులను పక్షులకు తినిపించేవాడు.

అప్పుడప్పుడు ఇంకా పెద్ద జీవులు కావాలని కోరుకునేవాడు.

జీవాన్ని తనలోకి తీసుకోవడంపై అతనికి చిత్రమైన మోజు ఉన్నట్టుగా కనిపించేది.

సీవర్డ్ నెలల తరబడి అతనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు.

కాని ఆ మొదటి రికార్డింగ్స్ చేసినప్పుడు సీవర్డ్‌కు తెలియని విషయం ఇప్పుడు మినాకు తెలుసు.

రెన్‌ఫీల్డ్ పదేపదే ఒక “మాస్టర్”గురించి మాట్లాడేవాడు.

ఆ మాస్టర్ దగ్గరకు వస్తున్నాడని అతనికి ముందుగానే తెలిసినట్టుగా ప్రవర్తించేవాడు.

ముఖ్యంగా…

డ్రాకులా ఇంగ్లాండ్‌కు వచ్చిన సమయంలోనే రెన్‌ఫీల్డ్ ప్రవర్తన కూడా మారింది.

ఇది యాదృచ్ఛికం అని చెప్పడం కష్టం.

మినాకు ఒక అనుమానం కలిగింది.

రెన్‌ఫీల్డ్‌కు డ్రాకులా నిజంగానే తెలుసా?

లేక డ్రాకులా అతని మనసుపై ఏదైనా ప్రభావం చూపుతున్నాడా?

మినా అతనిని స్వయంగా కలవాలని నిర్ణయించుకుంది.


ఆ విషయం డాక్టర్ సీవర్డ్‌కు చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు.

రెన్‌ఫీల్డ్‌ను కలవడం మంచి ఆలోచన కాదని అన్నాడు.

అతని ప్రవర్తనను ముందుగా ఊహించడం చాలా కష్టం.

కొన్నిసార్లు ప్రశాంతంగా, తెలివిగా మాట్లాడుతాడు.

మరికొన్నిసార్లు ఎలాంటి హెచ్చరిక లేకుండానే హింసాత్మకంగా మారిపోతాడు.

కాని మినాకు ఆసక్తి తగ్గలేదు.

రెన్‌ఫీల్డ్ గురించి ఎంతో చదివినందు వల్ల, అతడు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నది.

అంత కంటే ముఖ్యంగా…

వారు ఛేదించడానికి ప్రయత్నిస్తున్న ఈ రహస్యంతో అతనికి సంబంధం ఉండవచ్చునని ఆమె భావిస్తున్నది.

చివరకు సీవర్డ్ అంగీకరించాడు.

“సరే. నిన్ను అతని దగ్గరకు తీసుకు వెడతాను.”

కాని ఒక హెచ్చరిక ఇచ్చాడు.

“చాలా జాగ్రత్తగా ఉండాలి.”


ఇద్దరూ కలిసి మానసిక ఆసుపత్రిలోకి ప్రవేశించారు.

లోపలికి వెళ్లగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది.

అక్కడ నిశ్శబ్దంగా ఉన్నది.

తలుపులు అన్నీ తాళాలు వేసి ఉన్నాయి.

పొడవైన దారులలో అడుగుల శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి.

ఎక్కడో దూరంగా ఒక రోగి అరుస్తున్న శబ్దం వినిపిస్తున్నది.

మినా మాత్రం ప్రశాంతంగానే ఉన్నది.

సీవర్డ్ ఆమెను భవనం లోపలికి తీసుకు వెళ్లి చివరకు రెన్‌ఫీల్డ్ గది దగ్గరకు తీసుకు వచ్చాడు.

లోపలికి వెళ్లే ముందు అన్నీ సురక్షితంగా ఉన్నాయా అని మరోసారి చూసుకున్నాడు.

తరువాత తలుపు తెరిచాడు.

మినా మొదటిసారి రెన్‌ఫీల్డ్‌ను చూసింది.


వింతగా, క్రూరంగా కనిపించే పిచ్చివాడిని చూడబోతున్నానని మినా ఊహించింది.

కాని రెన్‌ఫీల్డ్ చూసి ఆమె ఆశ్చర్యపడింది.

అతను ప్రశాంతంగా ఉన్నాడు.

మర్యాదగా ప్రవర్తించాడు. మినాను సీవర్డ్ పరిచయం చేయగానే రెన్‌ఫీల్డ్ ప్రవర్తన మరింత మారింది.

ఆమెతో ఎంతో గౌరవంగా మాట్లాడాడు.

తన గది పరిస్థితి చూసి కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా కూడా కనిపించాడు.

సీవర్డ్ తన గురించి చెప్పి ఉండవచ్చునని అనుకుని అతను కొద్దిగా నవ్వాడు.

కొన్ని క్షణాలు మినాకు నిజంగానే అనుమానం వచ్చింది.

సీవర్డ్ డైరీలో చదివిన వ్యక్తి ఇతనేనా?

రెన్‌ఫీల్డ్ ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాడు.

ఆచితూచి మాట్లాడుతున్నాడు .

అతని ప్రవర్తనలో మూర్ఖత్వం లేదు.

పిచ్చి కనిపించడం లేదు.

తన గురించి, తన చుట్టూ ఉన్న వారి గురించి అతనికి పూర్తి అవగాహన ఉన్నట్టుగా అనిపించింది మినాకు.


తన గతం గురించి మినాకు ఏదో తెలుసునని రెన్‌ఫీల్డ్ గ్రహించాడు.

మొదట సీవర్డ్ వైపు చూశాడు.

తరువాత మినా వైపు చూసి చిన్నగా నవ్వాడు.

“అంటే డాక్టర్ గారు నా గురించి మీకు చాలానే చెప్పారన్నమాట?”

మినా నిజాయితీగా సమాధానం చెప్పింది.

“ఆయన రికార్డుల్లో కొంత చదివాను.”

రెన్‌ఫీల్డ్ కోపం తెచ్చుకోలేదు.

దానికి బదులుగా నవ్వాడు.

డాక్టర్ తన పనిలో భాగంగా తనను పరిశీలిస్తాడని అతనికి తెలుసు.

తరువాత అతనే తన ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడటం ప్రారంభించాడు.

ఈగలు.

సాలీడులు.

పక్షులు.

వాటి ద్వారా జీవాన్ని తనలోకి తీసుకోవాలనే కోరిక.

కాని ఆ విషయాలు ఇప్పుడు అతను మాట్లాడుతున్న తీరు వింతగా ఉన్నది.

అవి తన జీవితంలో జరిగిన పనులుగా కాకుండా…

మరో వ్యక్తి చేసిన మూర్ఖపు పనులను గుర్తు చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు.

మినా జాగ్రత్తగా వింటున్నది.

తాను ఊహించిన వ్యక్తి ఇతను కాదు.

రెన్‌ఫీల్డ్ లో తెలివి స్పష్టంగా కనిపిస్తున్నది .

కాని…

ఆ తెలివి వెనుక ఇంకేదో దాగి ఉన్నది.


కొద్దిసేపటికి రెన్‌ఫీల్డ్ ముఖం గంభీరంగా మారింది.

అతను జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు.

జీవం ఎంత విలువైనదో చెప్పాడు.

ఒక జీవిలోని ప్రాణాన్ని మరొకరు తనలోకి తీసుకోవాలనే విచిత్రమైన కోరిక గురించి చెప్పాడు.

సీవర్డ్ చాలా శ్రద్ధగా విన్నాడు.

ఈ మాటలు అతనికి కొత్త కావు.

రెన్‌ఫీల్డ్ ఇంతకు ముందు కూడా ఇలాంటి భావాలనే ఎన్నోసార్లు చెప్పాడు.

కాని ఈరోజు అతని మాటలు కొంచెం భిన్నంగా అనిపిస్తున్నాయి.

అవి పిచ్చివాడి అర్థంలేని మాటల్లా అనిపించడం లేదు.

అవి అతనికే పూర్తిగా అర్థమయ్యే ఒక నమ్మకంలోని చిన్న చిన్న భాగాలుగా అనిపిస్తున్నాయి.

మినా ఆసక్తిగా విన్నా…

ఆమె మనసులో ఏదో వెలితి. క్రమేపి అసంతృప్తి పెరుగుతున్నది.


అంతలోనే రెన్‌ఫీల్డ్ మళ్లీ పూర్తిగా మారిపోయాడు.

ఆ గంభీరత మాయమైంది.

మళ్లీ సంతోషంగా మాట్లాడటం ప్రారంభించాడు.

మినాతో మర్యాదగా మాట్లాడాడు.

కొన్ని సరదా మాటలు కూడా చెప్పాడు.

ఆమెకు ఎంతో ఆప్యాయంగా వీడ్కోలు చెప్పాడు.

మినా గది నుంచి బయటకు వచ్చింది.

కాని ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి .

రహదారిపైకి వచ్చిన తరువాత సీవర్డ్ వైపు చూసింది.

“అతను పిచ్చివాడిలా కనిపించడం లేదు.” అన్నది మినా.

సీవర్డ్ చిరునవ్వు నవ్వాడు.

“అతను ఎప్పుడూ అలా ఉండడు.”

అదే రెన్‌ఫీల్డ్‌ను అర్థం చేసుకోవడంలో పెద్ద సమస్య.

అతని మనసు ఎప్పుడూ ఒకలా ఉండదు. కొద్దిసేపు పూర్తిగా స్పష్టంగా ఉంటుంది.

తరువాత .

ఎలాంటి హెచ్చరిక లేకుండానే మారిపోతుంది.

అతని ఆలోచనలలో మరొకరి ప్రభావం ప్రవేశించినట్టుగా.

మినాకు వెంటనే డ్రాకులా గుర్తొచ్చాడు.

కాని ఆమె ఏమీ చెప్పలేదు.


కొద్దిసేపటికి ప్రొఫెసర్ వాన్ హెల్సింగ్ వచ్చాడు.

మినాను కలవాలని అతను ఎంతో ఆసక్తిగా ఉన్నాడు.

ఆమె చేసిన పని గురించి సీవర్డ్ ఇప్పటికే వివరించాడు.

డైరీలు.

టైప్ చేసిన రికార్డులు.

తేదీలు, సంఘటనలు క్రమబద్ధంగా అమర్చిన విధానం.

మినాను వాన్ హెల్సింగ్ మెచ్చుకోలుగా చూశాడు.

మినా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది.

శాంతంగా ఆలోచిస్తున్నది.

వారు ఎదుర్కొంటున్న ప్రమాదం ఎంత పెద్దదో ఆమెకు తెలుసు.

అయినప్పటికీ ఆమె భయం లేకుండా ఆలోచనలను కొనసాగించింది.

కొద్దిసేపటికే వాన్ హెల్సింగ్ ఒక ముఖ్యమైన విషయం గ్రహించాడు.

మినా సాధారణంగా కాగితాలు సర్దలేదు.

వారికి తెలిసిన దాదాపు మొత్తం సమాచారాన్ని ఒక చోట చేర్చింది.


మినా ఆ పత్రాలన్నీ వాన్ హెల్సింగ్‌కు ఇచ్చింది.

అతను చదవడం ప్రారంభించాడు.

మొదట కొన్ని పేజీలు వేగంగా తిప్పాడు.

కొద్దిసేపటికి

అతని వేగం తగ్గింది.

మరింత జాగ్రత్తగా చదవడం మొదలుపెట్టాడు.

గది పూర్తిగా నిశ్శబ్దంగా మారింది.

మినా అతని ముఖాన్ని గమనిస్తున్నది.

కొన్నిసార్లు అతని ముఖంలో బాధ కనిపిస్తున్నది.

కొన్నిసార్లు ఆశ్చర్యం.

మరికొన్ని క్షణాల్లో తీవ్రమైన ఆలోచనలు.

డ్రాకులా కోట గురించి జోనాథన్ రాసిన వివరాలు చదివాడు.

లూసీ గురించి సీవర్డ్ చేసిన రికార్డులు చదివాడు.

డెమీటర్ గురించి చదివాడు.

రెన్‌ఫీల్డ్ గురించి చదివాడు.

వార్తాపత్రిక కథనాలు చదివాడు.

ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న ప్రతి భాగం ఇప్పుడు ఒకే చోట ఉన్నది.

చివరకు వాన్ హెల్సింగ్ పత్రాలను కింద పెట్టాడు.

మినా వైపు ఎంతో గౌరవంగా చూశాడు.

ఆమె కేవలం వారి రికార్డులను నకలు చేయలేదు.

ఆమె వారికి ఒక ఆయుధాన్ని ఇచ్చింది.

పరిజ్ఞానం


ఇప్పుడు వాన్ హెల్సింగ్ డ్రాకులా గురించి మరింత స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించాడు.

అందరూ అతని చుట్టూ చేరారు.

మొదటిసారిగా…

పూర్తి నిజం వినడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

“డ్రాకులా కేవలం ఒక హంతకుడు కాదు,” అని వాన్ హెల్సింగ్ చెప్పాడు.

“అతను అన్‌డెడ్.”

“ఒక వాంపైర్.”

అతను జీవించి ఉన్న మనుషుల రక్తం తాగుతూ తన ఉనికిని కొనసాగిస్తాడు.

అతను శతాబ్దాల పాటు జీవించగలడు.

ఎంత ఎక్కువ కాలం బతికితే…

అంత ఎక్కువ ప్రమాదకరంగా మారగలడు.


డ్రాకులాకు సాధారణ మనుషులకు లేని ఎన్నో శక్తులు ఉన్నాయని వాన్ హెల్సింగ్ వివరించాడు.

అతనికి అసాధారణమైన బలం ఉన్నది.

సాధారణ మనిషి కంటే ఎన్నో రెట్లు బలవంతుడు.

మనుషులకు అసాధ్యంగా అనిపించే విధంగా కదలగలడు.

జోనాథన్ ఇప్పటికే అది చూశాడు.

కోట గోడపై నుంచి తల ముందుగా పెట్టి బల్లిలా దిగుతున్న డ్రాకులాను చూశాడు.

అతను కొన్ని జంతువులను కూడా అదుపు చేయగలడు.

తోడేళ్లు.

ఎలుకలు.

రాత్రివేళ తిరిగే జీవులు.

పొగమంచు, తుఫానులపై కూడా ప్రభావం చూపగలడు.

వివిధ రూపాల్లో కనిపించగలడు.

కొన్నిసార్లు గబ్బిలంలా.

కొన్నిసార్లు…

పొగమంచులా కూడా మారగలడు.

లోపలికి రావడం అసాధ్యంగా అనిపించే ప్రదేశాల్లోకి కూడా డ్రాకులా ప్రవేశించగలడు.

శబ్దం లేకుండా దగ్గరకు రాగలడు.

అలాగే…

కళ్ల ముందే దాదాపు మాయమైపోగలడు.


కాని డ్రాకులా దగ్గర ఉన్న అతి పెద్ద ఆయుధం అతని శరీర బలం కాకపోవచ్చు.

అతని మనసు.

మనుషులపై ప్రభావం చూపగలడు.

వారి ఆలోచనలను గందరగోళం చేయగలడు.

వారిని తనవైపు ఆకర్షించగలడు.

అతని బాధితులకు…

తనను ఎదిరించే శక్తే లేకపోయినట్టుగా అనిపించవచ్చు.

లూసీకి అదే జరిగింది.

పదేపదే ఆమెకు కిటికీ దగ్గరకు వెళ్లాలనిపించేది.

రాత్రివేళ ఏదో తన దగ్గరకు వస్తున్నప్పుడు ఆమె పూర్తిగా నిస్సహాయంగా మారిపోయేది.

మరణించిన తరువాత కూడా డ్రాకులా ప్రభావం ఆమె శరీరంలో మిగిలింది.

అదే లూసీని కూడా అన్‌డెడ్‌గా మార్చింది.


అందరూ మౌనంగా వింటున్నారు.

వాన్ హెల్సింగ్ ఒక్కో విషయం చెప్పే కొద్దీ…

డ్రాకులా మరింత భయంకరమైన జీవిగా కనిపిస్తున్నాడు.

వాన్ హెల్సింగ్ మరో ముఖ్యమైన విషయం చెప్పాడు.

“అతను చాలా శక్తివంతుడు.”

“కాని సర్వశక్తిమంతుడు కాదు.”

డ్రాకులాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి.

కొన్ని నియమాలకు అతను కూడా బంధించబడి ఉన్నాడు.

ఆ నియమాలనే అతనికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు.


పగటిపూట డ్రాకులా శక్తి తగ్గిపోతుంది.

అతను విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు అవసరం.

ట్రాన్సిల్వేనియా నుంచి తెచ్చిన మట్టితో నిండిన పెట్టెలు చాలా ముఖ్యమైనవి.

ఆ మట్టి అతని స్వదేశానికి చెందినది.

అతని గతానికి…

అతని సమాధికి…

అతని జీవనానికి ఏదో విధంగా అనుసంధానమై ఉన్నది.

అందుకే అంత బరువైన ఎన్నో పెట్టెలను ఇంగ్లాండ్‌కు తీసుకొచ్చాడు.

జోనాథన్‌కు వెంటనే విషయం అర్థమైంది.

డ్రాకులా కోటలో కూడా ఆ పెట్టెలను చూశాడు.

ఒకసారి ఆ పెట్టెల్లో ఒక దానిలో డ్రాకులా పడుకుని ఉండటం కూడా చూశాడు.

“అంటే…” అన్నాడు జోనాథన్.

“ఆ పెట్టెలు ఎక్కడున్నాయో కనుగొంటే… అతను ఎక్కడ దాక్కుంటున్నాడో కూడా తెలుసుకోవచ్చు.”

వాన్ హెల్సింగ్ తల ఊపాడు.

ఆ విశ్రాంతి ప్రదేశాలను నాశనం చేస్తే…

లేదా అతను వాటిని ఉపయోగించలేని విధంగా చేస్తే…

డ్రాకులాను బలహీనపరచవచ్చు.


వాన్ హెల్సింగ్ మరికొన్ని విషయాలు వివరించాడు.

కొన్ని పవిత్రమైన వస్తువులు వాంపైర్లను వెనక్కి నెట్టగలవు.

వెల్లుల్లి వారిని దూరంగా ఉంచగలదు.

శిలువ వారికి అడ్డుగా నిలవగలదు.

ఇతర పవిత్రమైన వస్తువులు కూడా కొన్ని ప్రదేశాలలోకి దుష్టశక్తి ప్రవేశించకుండా చేయగలవు.

కొన్ని నెలల క్రితం అయితే…

సీవర్డ్ ఈ మాటలు విని నవ్వేవాడు.

ఇప్పుడు అతను నవ్వలేదు.

అతనికి లూసీ గుర్తొచ్చింది.

వాన్ హెల్సింగ్ ఉపయోగించిన రక్షణలు గుర్తొచ్చాయి.

వెల్లుల్లి తొలగించిన ప్రతిసారీ…

కిటికీ తెరిచిన ప్రతిసారీ…

ఏమి జరిగిందో గుర్తొచ్చింది.

సీవర్డ్ ఒక విషయం తెలుసుకున్నాడు.

తాను అర్థం చేసుకున్న ప్రపంచం…

నిజమైన ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే.


ఆర్థర్ నిశ్శబ్దంగా వింటున్నాడు.

లూసీ పేరు వచ్చిన ప్రతిసారీ అతని మనసు బాధ పడుతున్నది.

కాని ఇప్పుడు అతని దుఃఖానికి ఒక దిశ లభించింది.

లూసీకి ఇదంతా చేసింది డ్రాకులానే.

ఆమె జీవితాన్ని లాక్కున్నాడు.

ఆమెను ఒక భయంకరమైన జీవిగా మార్చాడు.

జరిగిపోయిన దానిని ఆర్థర్ మార్చలేడు.

కాని …

ఇక మరెవరికి కూడా అలా జరగకుండా చేయగలడు.

క్విన్సీ మోరిస్ కూడా అలాగే భావిస్తున్నాడు.

డ్రాకులాను వేటాడవచ్చునని తెలిసిన క్షణం నుంచే అతను సిద్ధంగా ఉన్నాడు.

వారిలో అందరి కంటే ఎక్కువ పట్టుదల జోనాథన్‌లో కనిపిస్తున్నది.

డ్రాకులా ఆధీనంలో జీవించడం అంటే ఏమిటో అతనికి తెలుసు.

కౌంట్ గొంతు తెలుసు.

ముఖం తెలుసు.

కోట తెలుసు.

అతని క్రూరత్వం తెలుసు.

నెలల తరబడి జోనాథన్ ఆ జ్ఞాపకాల నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

ఇప్పుడు…

అవే జ్ఞాపకాలను ఆయుధంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు.


మినా అందరినీ గమనిస్తున్నది.

వారి ముఖాల్లో భయం కనిపిస్తున్నది.

కాని ఇప్పుడు మరో విషయం కూడా కనిపిస్తున్నది.

పట్టుదల.

ఇప్పటి వరకు వారంతా వేర్వేరు విషాదాల వల్ల కలిసిన వ్యక్తులు మాత్రమే.

ఇప్పుడు వారు ఒక బృందంగా మారుతున్నారు.

ఒకే లక్ష్యం ఉన్న బృందం.

డ్రాకులాను కనుగొనడం.


అయితే, శత్రువును తక్కువ అంచనా వేయకూడదని వాన్ హెల్సింగ్ హెచ్చరించాడు.

డ్రాకులా ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్నాడు.

యుద్ధాలను చూశాడు.

రాజ్యాలు మారడాన్ని చూశాడు.

తరతరాల మనుషులు పుట్టి చనిపోవడాన్ని చూశాడు.

అతనికి వయసు సమస్య లేదు.

ఎందుకంటే వృద్ధాప్యం రాని జీవికి…

సమయం అర్థమే వేరుగా ఉంటుంది.

అతను ఓపికగా ఎదురు చూడగలడు.

దాక్కోగలడు.

సరైన సమయం కోసం సంవత్సరాలైనా వేచి ఉండగలడు.

కాని వాన్ హెల్సింగ్‌కు ఒక చిన్న ఆశ కనిపిస్తున్నది.

డ్రాకులాకు ఇంగ్లాండ్ ఇంకా కొత్త దేశం.

ఇక్కడి వీధులు అతనికి పూర్తిగా తెలియవు.

ఇక్కడి పద్ధతులు తెలియవు.

వ్యాపార వ్యవస్థలు తెలియవు.

అతనికి అపారమైన తెలివి, అనుభవం ఉన్నప్పటికీ…

ఈ దేశాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు.

అదే వారి చిన్న ఆధిక్యం.

డ్రాకులా మరింత బలపడక ముందే ఏదో ఒకటి చేయాలి.


జోనాథన్ మళ్లీ ఆ మట్టి పెట్టెల గురించి మాట్లాడాడు.

అవి ఎక్కడికి తరలించాడు తెలుసుకుంటే…

డ్రాకులా ఇళ్లను కనుగొనవచ్చు.

అతను ఎక్కడ పడితే అక్కడ దాక్కోలేడు.

అతనికి తన స్వదేశపు మట్టి అవసరం.

అంటే…

అతను కొన్ని ఆనవాళ్లు ఇచ్చాడు .

బిల్లులు.

నౌకా రికార్డులు.

సరుకు పంపిన వివరాలు.

డెలివరీ రికార్డులు.

ఇళ్లు కొనుగోలు చేసిన పత్రాలు.

పెట్టెలను మోసిన కార్మికులు.

సాధారణ వ్యాపార పత్రాలు… ఇవన్నీ

ఒక అసాధారణమైన రాక్షసుడి దగ్గరకు వారిని తీసుకెళ్లవచ్చు.

ఈ ఆలోచన జోనాథన్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చింది.

మొదటిసారిగా డ్రాకులా ఒక ఆపలేని పీడకలలా కనిపించడం తగ్గింది.

అతను ఆనవాళ్లు వదిలాడు. తద్వారా

అతనిని వెతికి పట్టుకోవచ్చు.


అయితే సీవర్డ్ మనసులో మాత్రం రెన్‌ఫీల్డ్ గురించిన ఆలోచన ఆగడం లేదు.

ఆ మానసిక ఆసుపత్రిలోనే నివసిస్తున్న ఆ వ్యక్తికి ఈ సంఘటనలతో ఏదో సంబంధం ఉన్నది.

డ్రాకులా వచ్చినప్పుడు అతని ప్రవర్తన మారింది.

ఒక “మాస్టర్” గురించి మాట్లాడాడు.

ఇతరులకు తెలియక ముందే ఏదో జరగబోతున్నదని అతనికి తెలిసినట్టుగా ప్రవర్తించాడు.

అసలు సంబంధం ఏమిటి?

సీవర్డ్‌కు సమాధానం లేదు.

కాని ఇప్పుడు రెన్‌ఫీల్డ్ మాటలను కేవలం పిచ్చివాడి మాటలుగా విస్మరించలేడు.

బహుశా…

రెన్‌ఫీల్డ్ చాలా రోజుల నుంచే వారిని హెచ్చరిస్తున్నాడేమో.

వారికే అతని మాటలు ఎలా వినాలో తెలియలేదేమో.


కొద్దిసేపటి తరువాత మినా మళ్లీ రెన్‌ఫీల్డ్‌ను చూడటానికి వెళ్లింది.

ఈసారి కూడా అతను మర్యాదగానే ప్రవర్తించాడు.

కాని ఏదో జరిగింది.

మినాను మరింత జాగ్రత్తగా గమనిస్తున్నాడు రెన్ ఫీల్డ్.

కొన్ని క్షణాలు అతని ముఖంలో ఆందోళన కనిపించింది.

అతను కొన్ని ప్రశ్నలు అడిగాడు.

“మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?”

మినా సమాధానం చెప్పింది.

రెన్‌ఫీల్డ్ ఒక్కసారిగా కిటికీ వైపు చూశాడు.

తరువాత మళ్లీ మినా వైపు.

అతని ముఖం ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది.

మినా వెంటనే గమనించింది.

“ఏమైంది? ఏదైనా సమస్యా?”

రెన్‌ఫీల్డ్ నేరుగా సమాధానం చెప్పలేదు.

మళ్లీ కిటికీ వైపు చూశాడు.

కొద్దిసేపటి క్రితం అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా మాయమైంది.

అతని కళ్లలో భయం కనిపించింది.

బలవంతంగా చిరునవ్వు నవ్వాడు.

మాటలు కొనసాగాయి.

కాని …

అతని ముఖంలో కనిపించిన ఆ ఒక్క క్షణపు భయాన్ని మినా మర్చిపోలేకపోయింది.


మినా వెళ్లిన తరువాత రెన్‌ఫీల్డ్ కిటికీ దగ్గరే నిలబడ్డాడు. ఇంతలో సాయంత్రం అయింది.

వెలుగు నెమ్మదిగా కనుమరుగవుతున్నది.

నీడలు పొడవుగా మారుతున్నాయి.

అదే సమయంలో రెన్‌ఫీల్డ్‌లో కూడా మార్పు ప్రారంభమైనది.

మినా కలిసిన ఆ ప్రశాంతమైన, మర్యాద గల మనిషి నెమ్మదిగా మారుతున్నాడు.

అతను అసహనంగా మారాడు.

ఏదో వినడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఎదురు చూస్తున్నాడు.

ఏదో తన దగ్గరకు వస్తున్నదనే అనుభూతి చెందుతున్నట్టుగా.

భయపడుతున్నట్టుగా కూడా.


ఇదే సమయంలో మినా మిగతావారి దగ్గరకు తిరిగి వచ్చింది.

టేబుళ్లన్నీ పత్రాలతో నిండిపోయాయి.

మ్యాపులు తెరిచి ఉన్నాయి.

పేర్లు.

చిరునామాలు.

ప్రదేశాలు.

డెలివరీ వివరాలు.

అన్నీ పరిశీలిస్తున్నారు.

డ్రాకులా వేట ఇప్పుడు నిజంగా ప్రారంభమైంది.

మొదటిసారిగా కౌంట్ శత్రువులకు అతని శక్తుల గురించి తెలుసు.

కొన్ని బలహీనతలు కూడా తెలుసు .

మట్టి పెట్టెల గురించి తెలుసు.

ఇంగ్లాండ్‌లో అతనికి రహస్యమైన విశ్రాంతి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని తెలుసు.

వారితో జోనాథన్ హార్కర్ ఉన్నాడు.

డ్రాకులా కోటలో జీవించి…

అక్కడి నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి.

వారికి వాన్ హెల్సింగ్ సహాయం ఉన్నది.

సీవర్డ్ రికార్డులు ఉన్నాయి.

ఆర్థర్, క్విన్సీల ధైర్యం ఉన్నది.

ముఖ్యంగా…

అన్నింటినీ ఒకే కథగా కలిపే మినా తెలివి ఉన్నది.

మొదటిసారిగా…

వారికి ఆశ కలిగింది.


కాని పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో వారు ఇంకా అవగాహనకు రాలేదు .

డ్రాకులాను ఎలా వేటాడాలో వారు చర్చిస్తున్నది డాక్టర్ సీవర్డ్ మానసిక ఆసుపత్రిలో.

అదే భవనంలో…

డ్రాకులాతో ఏదో సంబంధం ఉన్నట్టు కనిపిస్తున్న ఒక వ్యక్తి కూడా నివసిస్తున్నాడు.

రెన్‌ఫీల్డ్.

చీకటి పూర్తిగా కమ్ముకుంటున్నప్పుడు అతను తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు.

అతని కళ్లు కిటికీపైనే ఉన్నాయి.

చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.

అప్పుడు…

అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

అతను ఏదో అనుభూతి చెందాడు.

ఏదో దగ్గరపడుతున్నది.

తనకు బాగా తెలిసిన ఏదో.

అతని 'మాస్టర్ ’ దగ్గరలో ఉన్నాడు.

మరోవైపు…

డ్రాకులాను వేటాడటం మొదలుపెట్టామని మిగతా వారు అనుకుంటున్నారు.

కాని వారికి ఇంకా తెలియని నిజం ఒకటి ఉన్నది.

వారు వెతుకుతున్న కౌంట్ డ్రాకులా… ఇప్పటికే వారు ఊహించిన దాని కంటే చాలా దగ్గరలో ఉండవచ్చు.