భారత ఉప ప్రధాని - ఈ పేరు ప్రస్తుత కాలంలో చాలా మందికి కొత్తగా వినిపించవచ్చు. భారతదేశంలో ఎప్పుడైనా ఉప ప్రధానమంత్రి పదవి ఉండేదా? ఉంటే దానిని నిర్వహించిన వారెవరు? ఎంత కాలం నిర్వహించారు. ప్రస్తుతం ఆ పదవి ఎందుకు లేదు? అసలు ఆ పదవి గురించి రాజ్యాంగం ఏమి చెబుతోంది ? మొదలైన సందేహాలు ఈ తరంలో చాలా మందికి కలుగవచ్చు. కాని సీనియర్ సిటిజన్లకు, చాలా కాలంగా రాజకీయాలను గమనిస్తున్న వారికి ఉప ప్రధాన మంత్రి పదవి గురించి కొంత అవగాహన ఉండవచ్చు.

భారత రాజ్యాంగం ఉప ప్రధాన మంత్రి పదవిని ప్రత్యేకంగా నిర్వచించలేదు. కాని ఉప ప్రధానమంత్రి పదవిని రాజ్యాంగేతర అనధికారిక పదవిగా రాజ్యాంగంలోని 75వ ఆర్టికల్ పేర్కొంది. ఉప ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక హోదా కానీ, అధికారం కానీ ఉండవు. పరిపాలనలో తనకు సహకరించడానికి మంత్రివర్గ సభ్యులలో ఒకరిని ఉప ప్రధానిగా ప్రధానమంత్రి ఎంచుకోవచ్చు. ప్రధానమంత్రి సూచించిన (సిఫార్సు చేసిన) వ్యక్తిని ఉప ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తారు. కాని ఉప ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం ఉండదు. ఉప ప్రధానమంత్రికి ఏదైనా ప్రముఖ శాఖ బాధ్యతలను అప్పగించవచ్చు.

ఉప ప్రధానమంత్రికి కొన్ని విధులు ఉంటాయి.

  1. పరిపాలనా వ్యవహారాలలో ప్రధానమంత్రి కి సహాయపడటం .

  2. వివిధ మంత్రిత్వ శాఖలను సమన్వయ పరచడం.

  3. ప్రధానమంత్రి అందుబాటులో లేనప్పుడు ఆ బాధ్యతలు నిర్వహించడం.

ఇవి ఉప ప్రధాని ప్రధాన విధులు.

సిద్ధాంతపరంగా ఉప ప్రధాన మంత్రి స్థానం ఇది. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఉప ప్రధాన మంత్రి పదవి ఎలా కొనసాగిందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వతంత్ర భారతంలో ఇంతవరకు రెండు సందర్భాలలో మాత్రమే ప్రధానమంత్రికి దీటైన వ్యక్తిని ఉప ప్రధాన మంత్రిగా నియమించడం జరిగింది. చాలా సందర్భాలలో ఉప ప్రధాన మంత్రి పదవి రాజకీయ చదరంగంలో పావుగా ఉపయోగపడింది. అంటే రాజకీయ కారణాల వల్ల ఆ పదవిని సృష్టించిన సందర్భాలు అనేకం. ఆ పదవి చాలా కాలం ఖాళీగా ఉండిపోయింది. ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఉప ప్రధానులు ఇంత వరకు ఎవరూ లేరు.

స్వతంత్ర భారతంలో ఇంత వరకు ఆరు సందర్భాలలో మాత్రమే ఉప ప్రధానమంత్రి పదవిని ఏర్పాటు చేశారు. ఏడుగురు వ్యక్తులు మాత్రమే ఆ పదవిని నిర్వహించారు. కొన్ని ప్రభుత్వాలు కొన్ని సందర్భాలలో మాత్రమే ఉప ప్రధానమంత్రి పదవిని సృష్టించటం జరిగింది. అవసరం తీరగానే ఆ పదవి కనుమరుగైంది. స్వతంత్ర భారతంలో ఉప ప్రధానుల చరిత్రను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సర్దార్ వల్లభాయ్ పటేల్

స్వతంత్రం సిద్ధించిన వెంటనే జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఏర్పాటు అయిన తొలి ప్రభుత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా నియమితులయ్యారు. భారత తొలి ఉప ప్రధానిగా ఆయన చరిత్ర కెక్కారు. ఆయనకు హోం మంత్రిత్వ శాఖను కూడా అప్పగించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో అతి ప్రధానమైన సహాయ నిరాకరణ ఉద్యమం, బార్దోలి సత్యాగ్రహం, వ్యక్తి సత్యాగ్రహం మొదలైన ముఖ్య ఘట్టాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆనాటి నాయకులలో గాంధీ, నెహ్రూలతో సమాన గౌరవం ఆయనకు దక్కిందనడం అతిశయోక్తి కాదు. సర్దార్, ఉక్కుమనిషి (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా) వంటి బిరుదులు ఆయన పోరాట పటిమకు ప్రతీకలు. భారత రాజ్యాంగ సభలో పౌర హక్కుల కమిటీకి అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు. ఉప ప్రధానిగా, హోం మంత్రిగా హైదరాబాద్, తదితర సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేయడంలో ఆయన చూపిన సాహసం అనితర సాధ్యం.

1950 డిసెంబర్ 15వ తేదీన మరణించే వరకు పటేల్ ఉప ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా కొనసాగారు. మొత్తం మూడు సంవత్సరాల 122 రోజులు ఆయన ఉప ప్రధానిగా వ్యవహరించారు. మరణం కారణంగా ఆయన ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. పటేల్ మరణానంతరం నెహ్రూ మంత్రివర్గంలో మరో హోం మంత్రి నియమితులయ్యారు. కాని మరో ఉప ప్రధానమంత్రి నియామకం జరగలేదు. పటేల్ కి దీటైన నాయకులు లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు.

పటేల్ మరణానంతరం సుమారు 16 సంవత్సరాలు భారత ఉప ప్రధానమంత్రి పదవి ఖాళీగా ఉంది. ఇన్నాళ్లు ఈ పదవిని భర్తీ చేయకపోవడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు లభించదు.

మొరార్జీ దేశాయ్

ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1967 మార్చి 13వ తేదీన మొరార్జీ దేశాయ్ భారత రెండవ ఉప ప్రధానిగా నియమితులయ్యారు ఈ నియామకం వెనుక అనేక రాజకీయాలు ఉన్నాయని పరిశీలకుల అభిప్రాయం. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

స్వాతంత్రం సిద్ధించిన తొలి రోజులలో మొరార్జీ దేశాయ్ బొంబాయి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పట్లో నెహ్రూ తర్వాత కాబోయే ప్రధానిగా మొరార్జీ దేశాయ్ పేరు వినబడేది. ఆ తర్వాత కొంత కాలానికి మొరార్జీ కేంద్రంలో ఆర్థిక మంత్రి అయ్యారు. ఆ కాలంలో హోం మంత్రిగా ఉన్న పండిత గోవింద వల్లభ పంత్ మృతి చెందడంతో ఆ పదవి మొరార్జీకి దక్కుతుందని చాలామంది ఆశించారు. కాని ఆ పదవి లాల్ బహుదూర్ శాస్త్రి ని వరించింది.

నెహ్రూ మరణానంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాగలరని చాలా మంది భావించారు. కాని అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్న కామరాజ్ నాడార్ తదితర సిండికేట్ నాయకులు లాల్ బహుదూర్ శాస్త్రికి మద్దతు పలికారు. ఫలితంగా లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు.

శాస్త్రి మరణానంతరం 1966 లో మొరార్జీ ప్రధానమంత్రి పదవికి ప్రయత్నించారు. కాని కాంగ్రెస్ సిండికేట్ నాయకులు ఇందిరాగాంధీ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. వృద్ధుడు, మొండివాడు అయినా మొరార్జీ దేశాయ్ తమ మాట వినడని, రాజకీయ అనుభవం లేని ఇందిరా గాంధీ తమ చెప్పు చేతల్లో ఉంటారని భావించి కాంగ్రెస్ సిండికేట్ నాయకులు ఇందిర పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా ఇందిరకు ప్రధానమంత్రి పదవి దక్కింది. మొరార్జీకి మళ్లీ నిరాశ మిగిలింది.

1967 నాటి లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజారిటీ తగ్గింది. కాని విజయం దక్కింది. ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు. ప్రధానమంత్రి పదవికి పోటీ పడి భంగపడిన మొరార్జీ దేశాయ్ లో అసంతృప్తి జ్వాలలు చెలరేగితే ప్రభుత్వానికి ముప్పు రావచ్చుననే భయంతో మొరార్జీని ఉప ప్రధానిగా నియమించారు. మొరార్జీ అనుభవం, సేవా కంటే రాజకీయ కారణాలే ఇక్కడ ప్రధాన పాత్ర వహించాయి.

1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని ఎంపిక చేశారు సిండికేట్ నాయకులు. రాష్ట్రపతి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా వి.వి .గిరిని నిలబెట్టారు ఇందిరాగాంధీ. అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు చేయవలసిందిగా ఇందిర తన అనుయాయులను ఆదేశించారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి పరాజయం పాలయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి వి.వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ కుటిల రాజకీయాలు చేస్తున్నారని నిరసిస్తూ చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు సంవత్సరాల 128 రోజులు మాత్రమే ఆయన ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నాయకులు సంస్థా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. మొరార్జీ ఉప ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకున్న అనంతరం సుమారు తొమ్మిది సంవత్సరాలు ఆ పదవి భర్తీ కాలేదు.

చరణ్ సింగ్, జగజ్జీవన్ రామ్

ఎమర్జెన్సీ ని తొలగించిన అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో సుమారు రెండు సంవత్సరాల వరకు ఉప ప్రధానమంత్రి పదవి ఏర్పాటు కాలేదు 1978 జనవరిలో అప్పటి హోంమంత్రి చరణ్ సింగ్ ,రక్షణ మంత్రి జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానులుగా నియమితులయ్యారు. ఒకేసారి ఇద్దరు ఉప ప్రధానుల నియామకం జరిగిన సంఘటన భారత చరిత్రలో ఇదొక్కటే. పటేల్, మొరార్జీలతో పోల్చి చూస్తే చరణ్ సింగ్, జగజ్జీవన్ రామ్ చరిత్ర అంత ఉదాత్తమైనది కాదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో ఆనాటి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించడం అవసరం.

ఎమర్జెన్సీ లో జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా ఐదు పార్టీలు ఏకమై జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎమర్జెన్సీ నాటి నిరంకుశ పాలన ఫలితంగా 1977 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఆ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. జనతా పార్టీ తరపున మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. కేంద్రంలో ఏర్పాటైన తొలి కాంగ్రెసే తర ప్రభుత్వం ఇదే. కొంతకాలం జనతా ప్రభుత్వం సజావుగానే సాగింది. జనతా పార్టీ భాగస్వామ్య పార్టీల నాయకులకలో అసంతృప్తి బయలుదేరింది. దానిని చల్లార్చడానికి 1979లో ఇద్దరు ఉప ప్రధానుల నియామకం జరిగింది. జనతా పార్టీ భాగస్వామ్య పక్షాలలో అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతటి తీవ్ర రాజకీయాల కారణంగా ఏర్పడిన ఆ పదవులు ఎంతో కాలం నిలవలేదు. అదీ ఒక రాజకీయమే .సుమారు ఆరు నెలల తరువాత ఇద్దరు ఉప ప్రధానులు తమ పదవులకు రాజీనామా చేశారు. జనతా పార్టీలో చీలిక తెచ్చి తన మద్దతుదారుల సహాయంతో చరణ్ సింగ్ జనతా పార్టీ (సెక్యులర్) తరఫున ప్రధాన మంత్రి అయ్యారు. 30 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ను చిత్తు చేసిన జనతా పార్టీ రెండున్నర సంవత్సరాలలోనే ముక్కలు కావడం ఆనాటి స్వార్ధ రాజకీయాలకు దర్పణం పడుతుంది.

యశ్వంతరావు చవాన్

జనతా పార్టీని చీల్చిన చరణ్ సింగ్ కొన్ని ఇతర పార్టీల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఐ) ఈ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ప్రకటించింది. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి సహకరించిన ఉర్సు కాంగ్రెస్ నాయకుడు యశ్వంతరావు చవాన్ కు ఉప ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టారు చరణ్ సింగ్. హోం మంత్రి పదవిని కూడా చవాన్ కే అప్పగించారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి చరణ్ సింగ్ ప్రభుత్వంలో అత్యంత స్థిరమైన ఉప ప్రధానమంత్రి పదవిని సృష్టించడం విడ్డూరం. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆరు నెలల్లో చరణ్ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. చవాన్ ఉప ప్రధాని పదవి కూడా అదృశ్యమైంది. 1979 జనవరి 14వ తేదీ వరకు మాత్రమే చవాన్ ఉప ప్రధాన మంత్రి పదవిలో ఉన్నారు. ఈ ప్రహసనాలలో ఉప ప్రధానమంత్రి, హోం మంత్రి పదవులు అపహాస్యం పాలయ్యాయి. ఒక సంవత్సర కాలంలో ముగ్గురు ఉప ప్రధానులు ఆవిర్భవించి తెర మరుగు కావటం అప్పటి రాజకీయ అస్తవ్యస్త పరిస్థితులకు దర్పణం.

ఇంతటి రాజకీయ ప్రహసనాల అనంతరం సుమారు తొమ్మిది సంవత్సరాలు ఉప ప్రధానమంత్రి పదవికి విరామం లభించింది.

దేవీలాల్

1989 పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో వి.పి.సింగ్ నాయకత్వంలో జనతా పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ ఈ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. కాని భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆగస్టు 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం కుప్పకూలింది. దానితో పాటు దేవీలాల్ ఉప ప్రధానమంత్రి పదవి కూడా హూష్ కాకి అయింది.

కాని విచిత్రమేమిటంటే పోయిన ఉప ప్రధానమంత్రి పదవి మళ్లీ 100 రోజులలోనే దేవీలాల్ ను వరించింది. ఈసారి సమాజ్ వాది జనతా పార్టీ నాయకులు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వంలో దేవీలాల్ కు ఉప ప్రధాన మంత్రి పదవి లభించింది .ఈసారి జనతా దళ్ రాష్ట్రీయ పార్టీ తరపున దేవీలాల్ కు దక్కింది. ఇలా 100 రోజుల వ్యవధిలో ఇద్దరి ప్రధాన మంత్రుల ఆధ్వర్యంలో రెండు వేరు వేరు పార్టీల తరపున ఏర్పాటైన రెండు ప్రభుత్వాలలో ఉప ప్రధానిగా పని చేసిన ఘనత దేవిలాల్ కు మాత్రమే దక్కింది. ఈ రెండు ప్రభుత్వాలలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా దేవీలాల్ వ్యవహరించటం మరొక విశేషం. కాని సుమారు ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయింది. దేవీలాల్ రెండవ సారి ఉప ప్రధానమంత్రి పదవి కూడా ఊడిపోయింది

ఎల్ కె అద్వానీ

చంద్రశేఖర్ ప్రభుత్వం పతనానంతరం 11 సంవత్సరాల వరకు కేంద్రంలో ఉప ప్రధాన మంత్రి పదవి అవతరించలేదు. 1999లో అటల్ బిహారీ వాజ్ పేయ్ సారథ్యంలో ఏర్పడిన ఎన్ డి ఏ ప్రభుత్వంలో ఎల్ కె అద్వానీ ఉప ప్రధానిగా నియమితులయ్యారు. 2002 నుండి 2004 వరకు అంటే రెండేళ్లు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. వాజ్ పేయ్, అద్వానీల జోడిని నెహ్రూ, పటేల్ జోడి తో పోల్చారు కొందరు పరిశీలకులు. ఆ కాలంలో నెహ్రూ ఎటు వంటి వారో వాజ్ పేయ్ అటువంటి వారని, పటేల్ ఎటు వంటి వారు అద్వానీ అటు వంటి వారిని పరిశీలకుల అభిప్రాయం. ఆ రోజులలో ప్రధాని నెహ్రూకు దీటైన గొప్ప ప్రధానిగా పటేల్ గుర్తింపు పొందారు.

వాజ్ పేయి నాయకత్వంలో కంటే అద్వానీ సారథ్యంలోనే భారతీయ జనతా పార్టీ బలపడిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. 1984లో రెండు పార్లమెంట్ సీట్లు మాత్రమే గెలుచుకున్న బిజెపి 1990 వ దశకంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితికి చేరుకుంది.

1996లో 13 రోజుల ప్రభుత్వాన్ని, 1998లో 13 నెలల ప్రభుత్వాన్ని, 1999లో ఐదేళ్లు కొనసాగిన ప్రభుత్వాన్ని బిజెపి సారధ్యంలోని ఎన్ డి ఏ ఏర్పాటు చేయగలిగింది. బి.జె.పి. ఈ స్థాయికి ఎదగడంలో అద్వానీ నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. బి.జె.పి .ని ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో అద్వానీ కృషి గణనీయమైనది. ఇంతటి ప్రముఖ పాత్ర పోషించినందు వల్ల అద్వానీకి ఉప ప్రధాన మంత్రి పదవి లభించిందని అనడంలో సందేహం లేదు.

2004వ సంవత్సరం తరువాత ఇప్పటి వరకు కేంద్రంలో ఉప ప్రధాన మంత్రి పదవి ఏర్పాటు జరగలేదు. భవిష్యత్తులో ఆ పదవి మళ్లీ ఆవిర్భవిస్తుందో లేదో తెలియదు. కాని ఇంతవరకు జరిగిన అనుభవాలను బట్టి ఎటువంటి వ్యక్తిని ఉప ప్రధానిగా నియమిస్తే మేలు జరుగుతుంది, ప్రధాన మంత్రి కావడానికి అర్హత కలిగిన వ్యక్తిని, ప్రధానమంత్రికి కుడి భుజంగా పని చేయగలిగిన వ్యక్తిని, దేశంలో అరాచక శక్తులను అణచి వేయగల శక్తి కలిగిన వారిని మాత్రమే ఉప ప్రధాన మంత్రిగా నియమించాలని మన రాజకీయ పార్టీల నాయకులంతా గుర్తుంచుకోవాలి.