కాక్రోచ్ జనతా పార్టీ (సి.జె.పి.). ప్రస్తుతం దేశ రాజకీయాలతో పాటు సోషల్ మీడియాను కుదిపివేస్తున్న పార్టీ.
సాంప్రదాయ రాజకీయాలు ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరిట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనలు చేస్తున్నది ఒక రాజకీయ పార్టీ కాదని చెబుతున్నా మద్దతు మాత్రం నిమిషాలు గంటలలో లక్షల్లోకి చేరుకుంది. కేంద్రంలోని అధికార పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి ఫాలోయర్స్ కంటే నిరసనకారుల సంఖ్య అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇది కేవలం ఎవరో సృష్టించిన ఆందోళనగా భావిస్తే పొరపాటే. ప్రస్తుత రాజకీయాలపై ప్రజల నిరసనగా భావించాలి. ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెరుగుతున్న అభద్రతా భావం, అసహనాలకు రూపంగా భావించాలి.
నానాటికీ పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అంతరాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం కూడా కారణాలని చెప్పవచ్చు. పాలకుల పట్ల, వ్యవస్థలపై యువతలో రానురానూ పెరుగుతున్న అంతులేని అభధ్రతాభావం సోషల్ మీడియా రూపంలో వెల్లడైంది. ఈ రకమైన జన్ జీ తిరుగుబాటు ఊహించనిది. ఈ అకస్మాత్తు దాడి అధికార భారతీయ జనతా పార్టీకి షాకిచ్చింది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, యువతను పట్టించుకోని ప్రభుత్వాలు, ఉద్యోగ కల్పనలపై ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ నిరసనకు సి.జె. బొద్దింక పేరుతో యువతపై చేసిన వ్యాఖ్యలే కారణం. ఒక్కసారిగా సోషల్ మీడియాను ముంచెత్తిన వ్యంగ్య నిరసనలు భారతీయ జనతా పార్టీని, అధికార వ్యవస్థలను తీవ్రంగా కలవరపెట్టాయి. ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా “కొంతమంది యువకులు ఉద్యోగాలు లేక, చేస్తున్న పనిలో గుర్తింపు రాక బొద్దింకల్లా అన్ని రంగాలకు విస్తరిస్తున్నారు. వారు మీడియా, సోషల్ మీడియా, ఆర్డీఓ కార్యకర్తలుగా మారి వ్యవస్థలపై దాడి చేస్తున్నారని” చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో సీజేపీ తిరుగుబాటుకు కారణమని భావిస్తున్నారు. అమెరికా విశ్వవిద్యాలయంలోని ఒక యువకుడు సోషల్ మీడియాలో “కాక్రోచ్ జనతా పార్టీ” (సీజేపీ)పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈయన ప్రారంభించిన పరిహాస ఉద్యమం మహా శక్తివంతమైన భారత రాజ్య వ్యవస్థను ప్రశ్నిస్తున్నది. ఒక రాజ్య వ్యవస్థ, అధికారం ఎప్పుడైతే పరిహాసం పాలవుతుందో దాని ప్రాభవం మసకబారినట్లే భావించాలి.
అణుయుగం వస్తే మానవనాశనం అయినా బతికిబట్టకట్టే ఏకైక జీవి బొద్దింక మాత్రమే. ఏదైనా సంఘటన జరిగితే ప్రపంచానికి తెలిపేది జర్నలిస్టే. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి బొద్దింకలనే పదం వాడి వుండవచ్చు. మురికి ప్రాంతాల్లో సంచరించే బొద్దింకలే చిహ్నాలుగా నిరసన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బొద్దింక తలతో మానవ శరీరం ఫ్లెక్సీలతో నిరసనలు సాగుతున్నాయి. సీజేపీ వెనుక విదేశీ హస్తం ఉందని సాధారణంగా వచ్చే విమర్శలే బీజేపీ నుంచి కూడా వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్ష ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పనిచేయడమే ఇందుకు కారణం.
వ్యంగ్యం అనేది శక్తివంతమైన ఆయుధం. ఇది పాలకులకు హెచ్చరికలాంటిది. కాక్రోచ్ జనతా పార్టీ మానిఫెస్టో కూడా పాలకుల గుండెల్లో గునపాలు దింపే విధంగా ఉంది. పాలకుల పనితీరు సాంప్రదాయ రాజకీయాలపై నమ్మకాలను కోల్పోతున్నట్లు ఈ రకమైన వేదికల వల్ల స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సాంప్రదాయ రాజకీయ పార్టీలను కాలదన్ని జన్ జడ్ గా భావించే యువత విజయ్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.
అధికారాన్ని కాపాడుకోవడం కోసం పాలకులు తమ విజయాలు ప్రచారం చేసుకుని వైఫల్యాలను ప్రస్తావించరు. ఏటా కోటీ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ గాలికి పోయింది. విద్యా వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నా, అత్యున్నత పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నా, యువత ఆశలపై నీళ్లు చల్లే విధంగా, అధ్వాన్నమైన పనితీరుకు నిదర్శనంగా మారుతున్నా భజనపరుల కథనాలతో ప్రభుత్వాలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నాయి. అధికారమే పరమావధిగా నేటి కుళ్లిపోయిన రాజకీయాలు, బంధుప్రీతి, ఉన్నవారికే అధికారం అండ వంటి అంశాలు కూడా జన్ జీ ఉద్యమం వైపు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. నిరంకుశ పాలకులకు ఇలాంటి వ్యంగ్య (పరిహాసాలు) నిరసనలు, మీమ్ సంస్కృతి తట్టుకోవడం కష్టమే. ప్రస్తుతం సోషల్ మీడియా నెటిజన్స్ లో ఉన్న అసంతృప్తి సాధారణ ప్రజల్లోకి వ్యాపిస్తే మహా ఉద్యమంగా మారుతుంది. అది నేటి రాజకీయ వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలించి వేస్తుంది. ఇది కేవలం వ్యంగం, వినోదంగా భావించకుండా ప్రజల భావోద్వేగంగా అర్థం చేసుకోవాలి. ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నదా అనేది ఈ ఉద్యమం వేస్తున్న ముఖ్యమైన ప్రశ్న. ఈ ఉద్యమం భారత ప్రజాస్వామ్యానికి అద్దం పడుతోంది. దాన్ని ఇప్పటికైనా పాలకులు గుర్తెరిగి ప్రక్షాళన చేపట్టకపోతే ఫలితాలు తమిళనాడును ప్రతిబింబిస్తాయి. భవిష్యత్ నిచ్చే నవ్యత, జవాబుదారితనం, భావోద్వేగ సంబంధాలు యువత కోరుతున్నది. ఇప్పటికైనా పాలక, ప్రతిపక్షాలు ప్రజలు వాస్తవంగా ఆశిస్తున్నది తెలుసుకుని ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించాలి. యువతలో అసహనం అభద్రతా భావం పెరిగితే తట్టుకోవడం ఎలాంటి ప్రభుత్వాలకైనా కష్టమే. ఒక విధంగా మోదీ ప్రభుత్వానికి బొద్దింకల పార్టీ భ్రష్టుపడుతున్న రాజకీయ వ్యవస్థను అద్దంలో చూపించి మంచే చేసింది. ఇది హెచ్చరికలా భావించి రాబోయే మూడేళ్లలో ప్రజలు కోరుకున్న పాలన అందించే చర్యలు చేపట్టాలి. దాన్ని సాధారణ విమర్శగా భావిస్తే చాపక్రింద నీరులా పతనానికి పునాది వేసుకున్నట్లే. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి కూడా ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలికి ఐక్యంగా ప్రజాభిమానం పొందే చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఈ కూటములు యువతను ఆకట్టుకునేలా ఉద్యోగ, ఉపాధి పెంచే పథకాలు చేపట్టాలి. విద్యావ్యవస్థ, పరీక్షా నిర్వహణ వ్యవస్థ పటిష్టం చేయాలి. తరచూ పరీక్ష పేపర్ల లీకులతో పరిహాసం అవుతూ విద్యార్థుల ఆగ్రహానికి గురైతే విశ్వాసం కోల్పోతారు. బొద్దింకల పార్టీ పరిహాస నిరసనలతో నైనా ప్రభుత్వాలు మర్చిపోయిన జవాబుదారీతనం నేర్చుకుంటే ప్రజలకు మేలు జరిగినట్లే.
కార్యాచరణలో కాక్రోచ్ పార్టీ…ఢిల్లీలో ధర్నా
కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో శనివారం కార్యాచరణకు దిగడం కొత్త మలుపు. సోషల్ మీడియాలో వ్యంగ్య నిరసనలతో ప్రారంభమైన పార్టీ 15 రోజుల్లో విద్యా వ్యవస్థపై ప్రభుత్వ జవాబుదారీతనం కోరుతూ కార్యాచరణకు దిగడం నిజంగా హర్షణీయం. జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం యువత స్వచ్ఛందంగా కాక్రోచ్ మాస్కులతో ధర్మాలో పాల్గొన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఉదయమే అమెరికా నుంచి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. నీట్ పరీక్ష లీకులతో విద్యా వ్యవస్థలో సంక్షోభానికి కారణమైన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏడు రోజుల్లో రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేసారు. లేకపోతే ఉద్యమం దేశవ్యాప్తంగా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ధర్నాకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత హాజరయ్యారు. దీనికి యువత నుంచి ఊహించని మద్దతు లభించింది. ఢిల్లీ ఎండలకు యువత తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం విశేషం. ఇతర ప్రజా సంఘాలు, సామాజికవేత్తల మద్దతు లభించింది. సీజేపీ ధర్నాని కేంద్ర ప్రభుత్వం ఒక సందేశంలా భావించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతకుముందు మూడురోజుల క్రితం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సీజేపీ ప్రతినిధులు శౌరవదాసు, విజయదహియా, అసుతోష్ దేశంలోని విద్యావ్యవస్థ అవినీతిని దుయ్యబట్టారు. ఈ వ్యవస్థ లోపాలపుట్టగా మారిందని, అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యం అంటే అధికారం ఇచ్చిన ఐదేళ్లూ వారిని ప్రశ్నించకూడదా, వారు ప్రజా ప్రతినిధులా, ప్రజా సేవకులా అని ప్రశ్నించారు. ఇలా ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలైన కేంద్ర, రాష్ట్రాలు ఏటా నీట్, సీబీఎస్ఈ వంటి అనేక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దాదాపు కోటి మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల లీకులతో వారి భవిష్యత్తు నాశనం అవుతున్నది. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇద్దరు అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకుంది. అంతమాత్రాన జరిగిన అక్రమాలు మాఫీ అయిపోతాయా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై జవాబుదారీతనం ప్రభుత్వాలకు లేదా? విద్యామంత్రికి బాధ్యత లేదా? ఆయన రాజీనామా చెయ్యడా అని ప్రశ్నించారు. అలాగే జరిగిన తప్పుకు బదిలీతో సరిపెడతారా అని నిలదీశారు. ప్రభుత్వ జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ తాము రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా నిరసన తెలుపుతామన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను ప్రభుత్వం విదేశీ కుట్ర అంటోంది. మీకు ఆర్థిక సహాయం పాకిస్తాన్ నుంచి అందుతోందా అని అపవాదులు వేస్తున్నారని ఆరోపించారు. విలేకరులు పార్టీ నిధులపై అడిగిన ప్రశ్నకు ఫ్లెక్సీలకు, ధర్నాకు రావడానికి నిధుల ప్రశ్న అవసరమా అని ఎదురు ప్రశ్నించారు.
వారి 45 నిమిషాల పత్రికా సమావేశంలో 30 నిమిషాలు విలేకరుల ప్రశ్నలకు సమాధానమే చెప్పారు. అయినా ఈ ప్రభుత్వం ఏర్పడిన 12 సంవత్సరాలలో ఒక్కసారి పత్రికా సమావేశం పెట్టకపోవడం ప్రజాస్వామ్యమా అని మరో ప్రశ్న సంధించారు. మేము 8 లక్షల మంది సంతకాలతో ప్రశ్నాపత్రాల లీక్ పై జవాబుదారీతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. విద్యా మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదూ, జరిగిన తప్పుకు జవాబుదారితనం వహించాలని ప్రశ్నించాం. దానికి సమాధానం అడుగుతున్నాం. ఈ దేశం విద్యారంగం సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుంచి కాపాడడానికి యువత నడుం బిగించింది. అసంతృప్తిని సామూహికంగా తెలపడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్ మేము ఆలోచించడం లేదు. ప్రస్తుతం విద్యావ్యవస్థ ప్రక్షాళన చేపట్టా మన్నారు.
మీ ఉద్యమం ఎన్నికల వరకూ వెళుతుందా అంటే ఇప్పుడు చెప్పలేమన్నారు. అంబేద్కర్ చెప్పిన ఆర్గనైజ్, యాజిటేజ్ సూత్రాలను పాటిస్తామన్నారు. అప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. దేశ నిర్మాణానికి కృషి చేసిన గాంధీ, భగత్ సింగ్, అంబేద్కర్, నెహ్రూలను గౌరవిస్తామన్నారు. వ్యవస్థలో ఉన్న సామూహిక అసంతృప్తి, అసమర్థత, అవినీతిని ప్రశ్నించి ప్రక్షాళన చేస్తామన్నారు. దేశంలో జవాబుదారీ సంస్కృతి రావాలన్నారు. ప్రధాన పత్రికలు పట్టించుకోని ఈ ఉద్యమం నిలుస్తుందా అన్న ప్రశ్నపై మేము ప్రశ్నలతో వారిని ఓడించామని రాసుకోండి. మాకేమీ బాధలేదు. అదే మీరు దేశం ఎదుర్కొంటున్న నిజమైన సామాజిక సమస్యల గురించి రాస్తే మేమూ ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగిన ఆందోళనలో పాల్గొన్నామని పదేళ్ళ తరువాత మా పిల్లలకు గర్వంగా చెప్పుకుంటామని వారు తొలి పత్రికా సమావేశాన్ని ముగించారు. ఏదిఏమైనా ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు జవాబుదారీతనం వచ్చేవరకూ పోరాడతామని ఖచ్చితంగా చెప్పారు.
కాక్రోచ్ జనతా పార్టీ చేసిన తొలి ప్రయత్నం రాజకీయ రంగంలో విప్లవం తీసుకొచ్చి దేశ యువతకు మేలు చేస్తే అంతకన్నా కావలసింది ఏముంది? ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే అందులో యువకుల పాత్ర చాలా కీలకం. వారి శక్తి కూడా అనంతం. వారి మేధస్సు మనదేశానికే ఉపయోగపడి, కొత్త కొత్త ఆవిష్కరణలు జరగడం అత్యవసరం. మరి యువత తల్చుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదనే విషయం ప్రభుత్వం గ్రహించి వ్యవస్థ మరమ్మతులు ప్రారంభిస్తే మంచిది.

